Song of the week - శివ పూజకు చివురించిన (Siva poojaku Chivurinchina)
ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)
Movie Name: స్వర్ణ కమలం
Song Name : శివ పూజకు చివురించిన
Music Director: ఇళయరాజా
Singer(s): SP బాలసుబ్రహ్మణ్యం , సుశీలమ్మ
Lyrics: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి
Director: K . విశ్వనాథ్
Producer : K.S . రామారావు (క్రియేటివ్ కమర్షల్స్)
Year of Release: 1988
Music Director: ఇళయరాజా
Singer(s): SP బాలసుబ్రహ్మణ్యం , సుశీలమ్మ
Lyrics: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి
Director: K . విశ్వనాథ్
Producer : K.S . రామారావు (క్రియేటివ్ కమర్షల్స్)
Year of Release: 1988
సిరివెన్నెల గారు స్వర్ణ కమలం సినిమాలో మనకి వజ్రాల్లాంటి పాటలు ఇచ్చారు. ఒక్కో పాట ఒక్కో అనుభూతి మిగులుస్తుంది. అందులో ఈసినిమా ఆయన సినీ జీవితం లో అత్యంత ఉన్నతమైన పాటలు కలిగిన సినిమాగా మిగిలిపోతుంది. ఈ పాట అయన రాసిన అన్ని పాటల్లో మొదటి పది వరుస క్రమం లో తప్పకుండ ఉండే పాట. ఇలాంటి పాట వింటుంటే అనిపిస్తుంది, ఒక పాటలో ఇంతో లోతైన భావం, సినిమాలోని పాత్రల ఆలోచనా సరళి, సందర్భోచితమైన సంఘర్షణ, నిగూఢమైన వేదాంతం, అనంత పద సౌందర్యం, అనిర్వచనీయమైన అనుభూతి మరల ఇంక తెలుగు శ్రోతకి ఉండవేమోఅని. శ్రోత మనసుకి, హృదయానికి, మెదడుకి పని కల్పించే పాట సిరివెన్నెల గారి తో అంతమైపోతుందేమో అని కూడా అనిపించటం సహజం.
విశ్వనాథ్ గారు కళా తపస్వి బిరుదుకి పూర్తి న్యాయం చేసిన సినిమాలలో ఇది ఒకటి అంటే మనకి ఆయన గురించి అర్థం అవ్వనట్టే. ఎంత ఐశ్వర్యం సంపాదించినా మనసు లగ్నం చేసి ఒక కళని నేర్చుకొని ఆస్వాదించి అనుభవిస్తే వచ్చిన ఆనందం,సంతృప్తి ఇంక ఎందులోనూ లభించదు అని నిరూపించిన చిత్రం. ఈ సినిమా కథ మనకి అర్థం అవ్వాలంటే కథానాయకుని మనసు ద్వారా ఆలోచిస్తే మాత్రమే ఈ కథ అర్థం అవుతుంది. లేదంటే ఈ కథ ఒక సాధారణ కథగా మిగిలి పోతుంది. అలాగే కథానాయిక పొందిన అనుభవం, ఆలోచనలో మార్పు మనం లీనమైతే కాని అర్థం అవ్వదు. చాల మందికి ఈ సినిమాలో విదేశి వనిత (Sharon Lowen) ఉన్న సన్నివేశాలు కొంచెం అసహనానికి గురి చేస్తాయి అవి అర్థం కాకే అని అనుకోవచ్చు. కాని ఆమె ఈ సినిమాకి ప్రాణం, ఎందుకంటే దర్శకుడు ఆమె ద్వారా తను చెప్పదల్చుకున్నది చెప్పించారు.
ఈ సందేశం కూడా ప్రతి మనిషి తను అనుభవిస్తే కాని అర్థం కాని విషయం. ప్రేక్షకులకి తేర మీద అర్థం అయ్యేలాగ చెప్పటం చాల చాల కష్టం. అది చెప్పటంలో సఫలీకృతం అవ్వటం విశ్వనాథ్ గారు దానికి పడ్డ తపన కష్టానికి తార్కాణం. అందుకనేనేమో ఈ సినిమా సినీ జీవిత చరిత్రలో చిరకాలం నిలచిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాకి కళాభిరుచి కలిగిన నిర్మాత దొరకటం చాల అరుదు. సినిమా ని వ్యాపారం గా చూసే నిర్మతలున్న రోజుల్లో. కమర్షియల్ సినిమాలు తీసే కె ఎస్ రామారావు గారికి ఈ అవకాశం దొరకటం ఆయన చేసుకున్న అదృష్టం.
ఇళయరాజా సంగీతం ఈ సినిమాని ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లిందో మనం ప్రత్యక్షంగా చూస్తాము. ప్రతి పాటలో సంగీతం పాత్రలకి అనుగుణంగా ఉంటుంది. సిరివెన్నెల గారి ప్రతి పదానికి సరి అయిన న్యాయం చేకూర్చారు ఇళయరాజా. అందులో ఈ "శివ పూజకు" పాటని "కళావతి" రాగం లో సమకూర్చారు. ఇంతకన్నా సందర్భోచితం ఇంకేదైనా ఉంటుందా? ప్రతి సన్నివేశంకి అనుగుణంగా సంగీతం సమకూర్చటం ఇళయరాజా గారికే సాధ్యమేమో అనిపిస్తుంది. పాటలు మాత్రమే కాదు నేపధ్య సంగీతం కూడా అత్యంత ఉన్నతం గా ఉంటుంది. ఉదాహరణకి సావిత్రి అప్పడాలు ఎండ పెడ్తున్నప్పుడు ఆమె ప్రేమికుడు వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, పని మనిషి చేసే సరసమైన సంభాషణలు జరుగుతున్న నేపధ్యం లో వచ్చే సంగీతం ప్రణయాన్ని సూచిస్తుంది ఆ తరువాత మీనాక్షి ( భానుప్రియ ) స్నానం ముగించి తన గది లోకి వచ్చినప్పుడు చేసే పనుల మీదకి కెమెరా మారుతున్నప్పుడు సంగీతం అలా చక్కగా మారిపోతుంది. ఒక సంగీత దర్శకుడుకి ఉన్న పట్టు మనకి స్పష్టం గా కనపడుతుంది. ఇంక ఇలాంటి సన్నివేశాలు అనేకం ఈ సినిమాలో, తన సంగీతం తో మనకి ఆ అనుభూతి కలుగచేస్తారు ఇళయరాజా గారు
ఇంక సిరివెన్నెల గారి పదవిన్యాసం అత్యంత ఉన్నతం. ఆయన గురించి ఎలాగో మనము పాటలోమాట్లాడుకుంటాం. ఈ పాటకి, సంగీతానికి బాలు గారి గళం, ఆ గళం గురించి చెప్పాలనుకోవటం సముద్రం లోతు తెల్సుకోవాలని అనుకోవటమే. ఇలాగ ఈ నలుగురు బ్రహ్మ నాలుగు తలలుగా మారి సుశీల అమ్మవారితో కలిసి సృష్టించిన అద్బుతమే ఈ పాట.
విశ్వనాద్ గారు ఈ సినిమాలో కొన్ని శ్లోకాలు అర్థవంతంగా చొప్పిస్తారు సన్నివేశానికి అనుగుణంగా. విశ్వనాథ్ గారి దర్సకత్వ ప్రతిభ చెప్పే సన్నివేశాలు చాల ఉన్నా, ఈ సన్నివేశంలో ఆయన ఉపయోగించుకున్న శ్లోకం మనల్ని అలోచింపచేసి ఆనందపరుస్తుంది.
ప్రతి రోజు రాత్రి ఒక పాట పాడటం సావిత్రి ( కధానాయకురాలి అక్క ) అలవాటు. పక్కింటి ఆయన ఆ పాట వినటం కోసం రావటం ఆ పాట గొప్పతనం చెప్పిస్తారు. విశ్వనాథ్ గారు. అక్కడ ఆయన ఎన్నుకున్న శ్లోకం దర్శకుని పరిణితి కి నిదర్సనం. ఆది శంకరాచార్య విరచితమైన ఈ శివ మానస పూజ నుంచి తీసుకున్న శ్లోకం, ఈ శ్లోకం అర్థం తెలిస్తే ఆ సన్నివేశానికి ఎంత ఉన్నతమైన ఎంపిక అనేది మనకి అర్థం అవుతుంది. సావిత్రి పాత్ర ఎంత చక్కగా రచించారో విశ్వనాథ్ గారు మనం సినిమా లో చూస్తాం.
ఆత్మా త్వం గిరిజా మతిహ్ పరిజనాహ్ ప్రాణాహ్ శరీరం గౄహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితిహ్
సంచారహ్ పదయోహ్ ప్రదక్షిణ విధిహ్ స్తోత్రాణి సర్వా గిరహ్
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
ఇంకో శ్లోకం శివపూజకు పాట చివర్లో వస్తుంది
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!!
భగవద్గీత లోని శ్లోకం ఆధారం గా సినిమా వచ్చిందా లేక సినిమా కి ఈ శ్లోకం సరిగ్గా సరిపోయిందా అన్నది సగటు ప్రేక్షకునికి ప్రశ్నగా మిగులుతున్ది. సినిమాలోని కథ నాయికకి, కథా నాయకుడు ఈ సందేశం అడుగడుగునా ఇస్తాడు. అసలు ఈ శ్లోకం ఒకటి ఉందనీ అది ఈ పాట ద్వారా రెండు పాత్రల మధ్య కలిగే ఆలోచనల సంఘర్షణ కి అన్వయించవచ్చు అని తట్టడం దర్శకుని ఆలోచనా ప్రతిభకి తార్కాణం. అదే సమయంలో ఇలాంటి సినిమాలు మనకి ఎందుకు కరువు అవుతున్నాయో అర్థం కాని ప్రశ్న ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఇప్పటికి 26 సంవత్సరాలు మరి.
ఈ శ్లోకానికి అర్థం కొన్ని వందల రకాలుగా చెప్తారు వేదాంత పండితులు. అంతటి అర్థవంతమైన శ్లోకాన్ని ఒక పాటలో తద్వారా సినిమాలో చొప్పించడం ఇంక మన తెలుగు సినిమాలో చూడలేమేమో. ఈ శ్లోకం గురించి విశ్లేషణ పాటలోకి వెళ్ళినప్పుడు చూద్దాం.
అలాగే విశ్వనాధ్ గారి సినిమాల్లో మాటలు అత్యంత అర్థవంతంగా ఉంటాయో ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం నిరూపిస్తుంది. మాటలు రాసిన సాయినాధ్ గారి జన్మ ధన్యం. పాత్ర గొప్పతనం మాటల్లోంచి వస్తుంది వాళ్ళ హావ భావల్లోంచి వస్తుంది, నేపధ్య సంగీతం లో వస్తుంది, ఇంకా అలా చెప్తూ ఉంటె అంతం కాని గొప్పతనం కలిగిన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి.
ఈ పాట గురించి మాట్లాడుకునే ముందర అక్కడి వరకు జరిగిన కథ, సన్నివేశాలు స్పర్సించుకోవటం సమంజసం. ఈ సినిమా అందరు చూసినదే అయినా ఒక సారి ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకుంటే ఈ పాట వివరణకి సహాయ పడతాయి. కథానాయకుడు ఒక అనాధ చిత్రకారుడు. ఇంకో చిన్న కుర్రాడి తో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి మీనాక్షి అనుకోని విధం గా కలవటం, అతను ఆమె ఇంటి పక్కనే అద్దెకు రావటము, ఆమెలో నిక్షిప్తమైన సజీవ కళని గుర్తించి ఆరాధించటం, తరువాత అవకాశం దొరికినప్పుడు ప్రోత్సహించటం జరుగుతుంది. అలాగే ఆమె కుటుంబానికి దగ్గర అవ్వటం జరుగుతుంది. అలా ఆమెకి ఇష్టం లేకపోయినా ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చెయ్యటం. ఇష్టం లేని పని చేసాడని కోపం తో గజ్జెలు తెమ్పటం, అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక చాల కాలం తరువాత శర్మ గారు నాట్యం చేస్తూ హఠాత్తు గా ప్రాణం విడవటం జరుగుతుంది. ఆ తరువాత మీనాక్షి బాధ పడుతుంటే అక్క సావిత్రి మీనాక్షి కి నచ్చ చెప్తూ ఇంక ఎవరు నాట్యం చెయ్యమని అడగం కాబట్టి ఎవరో గజ్జెలు కావలి అన్నారు ఇచ్చేసి రా అని పంపుతుంది. మీనాక్షి అక్కడికి వెళ్ళకుండా చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుంది హోరు వానలో తడుస్తూ. చందు అప్పుడు ఏదో గీస్తూ ఉంటాడు మీనాక్షి వచ్చిన విషయం గమనించడు. అతను తన వైపు చూడటం కోసం ఒక్కో మువ్వ తెంపి విసిరేస్తుంది. అయినా చంద్రం ఒక్క మాట కూడా అనకుండా, తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి టీ తాగుతారా అని కప్పు లో టీ పోస్తాడు అన్ని వద్దు అంటూ, "ఈ మర్యాదలు కాదండి కావాల్సింది, ఒక మనిషిని మనిషి గా గౌరవించటం కావలి, వాళ్ళ ఇష్టా ఇష్టాలు తెలియాలి" అని అంటూ వెళ్ళ బోతుంది. చంద్రం ఆగమని తన రైన్ కోటు కప్పుతాడు, అప్పటి వరకు అన్ని విసిరి కసిరిన మనిషి ఆ కోటుని ఉంచుకొని మౌనం గా వెళ్ళటం రాబోయే రోజులకి, జరిగే పరిణామాలకి చిహ్నమా?? అవుననే చెప్తారు విశ్వనాధ్ గారు తన సినెమా ద్వారా.
ఇంక పాటలోకి వెళ్దాము
ఇంక పాటలోకి వెళ్దాము
అతడు: శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ.. (2)
సిరి సిరి మువ్వ..(2)
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా..
సిరి సిరి మువ్వ..(2)
సిరివెన్నెల గారు చాల సార్లు తన సినీ జీవితం లో అత్యంత కష్టపడి రాసిన పాట ఏది అంటే ఈ పాటే అని చెప్తారు. ఈ పల్లవి వింటేనే మనకి అర్థం అవుతుంది. ఇంతటి భావుకత ఉన్న పాట అత్యంత అరుదుగా ఉంటాయి. సినెమా లోని సన్నివేశం చూస్తె ఈ పాట పల్లవి ఎంత అద్బుతమో మనకి అర్థం అవుతుంది. అది ఎందుకో ఎందుకో చూద్దాం. మీనాక్షి గజ్జెలు తెంపి వాటిని విసిరేసి వెళ్ళిపోయినప్పుడు అవి అన్ని ఏరి గజ్జలు చేతిలో పట్టుకొని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు విశ్వనాధ్ గారు చంద్రశేఖర్ మనసులోని భావాల్ని పాట రూపం లో మనకి అందిస్తారు. ఇటువంటి సందర్భాన్ని ఇచ్చి ఎటువంటి హద్దులు లేకుండా కవికి పాట రాయమంటే ఆ కవి ఎలా చెలరేగి పోతాడో ఈ పల్లవి మనకి నిదర్సనం. ఈ చరణం కాని పాట కాని చాల రకాలుగా రచన చెయ్యొచ్చు. కాని మనకు చరణం విన్నప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఒక్కో పదం ఒక్కో నిర్దిష్ట మైన భావం, అర్థం కలిగి ఉన్నాయి.
చంద్రశేఖర్చే చేతిలో గజ్జెల మువ్వలు ఉన్నాయి, ఆ మువ్వలు దేనికోసం, నాట్యం కోసం. ఆ నాట్యం ఎవరికీ అంటే అత్యంత ప్రీతి శివునికంటే వేరే వారు లెరు. శివుణ్ణి ఎలాగ పూజించటం అంటే నాట్యం తోనే, ఆ నాట్యానికి గజ్జెలు ఆ గజ్జేలకి మువ్వలు తప్పక ఉండాలిగా. ఇక్కడ గజ్జెల మువ్వలు అని అన్నా నిజానికి ఆ మువ్వ మీనాక్షి. తన నాట్యం తో నటరాజుని పూజించటానికి పుట్టిన మువ్వ మీనాక్షి అని. అటువంటి మీనాక్షి నాట్యం ఎలా ఉంటుంది అంది చంద్రశేఖర్ భావం? మృదువు గా అత్యంత అందంగా పాదాల కలయిక ఒక అందమైన పువ్వు గా ఉంటుంది. పదం అంటే అడుగు లేదా మాట. మంజరి అంటే కూడిక, లేక పువ్వు. పువ్వు వాఖ్యం చివరన ఉంది కాబట్టి మీనాక్షి పాదాలతో చేసే నాట్యం మృదువైన అందమైన పువ్వు లాగ ఉంటుంది అని. ఆ పువ్వు ఇందుకోసం అంటే శివుని పూజ కోసం అని ఎంత అందం గా చెప్పారో సిరివెన్నెల గారు. అదే మాట విశ్వనాథ్ గారు సినిమా మొదట్లో చెప్తారు " ఈ కళలన్నీ ఆ పరమేశ్వరుని పాదాలని అలంకరించిన స్వర్ణ కమలాలు"
మీనాక్షి నాట్యం కోసమే పుట్టింది అన్న నమ్మకం చంద్రశేఖర్ కి కలిగి ఉండటం అడుగు అడుగునా చూస్తాం సినిమాలో అదే భావం పాట లోని మొదటి రెండు పంక్తులలో చెప్తారు సిరివెన్నెల గారు. ఎంత చక్కని వివరణ??
మీనాక్షి నాట్యం కోసమే పుట్టింది అన్న నమ్మకం చంద్రశేఖర్ కి కలిగి ఉండటం అడుగు అడుగునా చూస్తాం సినిమాలో అదే భావం పాట లోని మొదటి రెండు పంక్తులలో చెప్తారు సిరివెన్నెల గారు. ఎంత చక్కని వివరణ??
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా..
సిరి సిరి మువ్వ..(2)
నటనాంజలితో బ్రతుకును తరించనీవా..
సిరి సిరి మువ్వ..(2)
యతి రాజు అంటే శివుడే. శివుడు నిర్వ్యామోహి, దేని మీద వ్యామోహం లేని వాడు. సన్యాసుల లో రారాజు శివుడు. వైరాగ్యానికి మారు పేరు శివుడు. బూడిద పూసుకొని స్మశానం లో తపస్సు చేసే అటువంటి శివుడికి దేని మీద ఇష్టం అంటే అది నాట్యమే. ఇక్కడ యతిరాజు అనే పదం వాడటం వల్ల ఎంత అందం వచ్చిందో ఈ వాఖ్యానికి మనం చెప్పలేం. ఏ పరిమళాలకి లొంగని శివుడు లొంగేది జతి స్వరాల తో కూడిన నాట్యానికే అని ఎంత అందం గా చెప్పారో కదా. ఓ మీనాక్షి నీకు సహజ సిద్దం గా వచ్చిన నాట్య ప్రతిభ తో, మీ తండ్రి గారి అత్యంత ప్రతిభ తో కూడిన విద్య నీకు నేర్పారు, భగవంతుడు నీకు అత్యంత అరుదైన అవయవ సౌష్టం ఇచ్చాడు, అటువంటి ఎవరికీ దక్కని వరం పొందిన నీవు నీ నాట్యం తో భగవంతుడికి పూజించి నీ బ్రతుకును తరింప చేసుకోవచ్చు కదా, అని అనుకుంటాడు చంద్రశేఖర్. బ్రతుకు తరించటం అని ఎందుకు అన్నారంటే, కళలు భగవంతుడిని ఆరాధించటానికి ఉపయోగించాలి, అది మనిషి ముక్తి పొందటానికి ఒక మార్గం అని మనకి చాల ఉదాహరణాలు ఉన్నాయి.
అదే మాట విశ్వనాథ్ గారు ఈ సినిమాలో త్యాగరాజ అరాధనోత్సవానికి ఎడ్ల బండి లో వెళ్తుంటే మీనాక్షి సావిత్రి తో మన తోటి వాళ్ళందరూ BA లు , MAలు చదువుకొని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటి అక్క కూపస్థ మండూకాల్ల లాగ" అంటే అప్పుడు సావిత్రి " నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా" అని జవాబిస్తుంది, అప్పుడు శర్మ గారిని "ఈ కళ నే నమ్ముకొని జీవితాన్ని ధారా పోస్తున్నావు కదా, తిరిగి ఈ కళ నీకేమి ఇచ్చింది నాన్న" అని అడిగితె ఆయన "ఈ కళలన్నీ ఇహం లోనే మోక్షం ప్రసాదించే సాధనాలమ్మా " అని క్లుప్తం గా ఈ సినిమా సారంశాన్ని చెప్తారు. సిరివెన్నెల గారు ఆ సందేశం ఇక్కడ నొక్కి వక్కాణిస్తారు.
ఈ పాట లో సిరివెన్నెల గారు మనకి మీనాక్షి, చంద్రశేఖర్ ఏమి అనుకుంటున్నారో చంద్రశేఖర్ మనస్సు లోంచి చెప్తారు. ఇద్దరి వాదనలు విన్న ప్రేక్షకుడు నిజమే కదా ఇద్దరు చెప్పేది అనుకుంటాం. ఇక్కడ ఒకరి ఆలోచన సరి ఇంకొకరి ఆలోచన తప్పు అనే భావం కలుగ నివ్వరు. చివరి నిర్ణయం మనకి తద్వారా దర్శకునికి వదిలేస్తారు, అదే సిరివెన్నెల గారి ప్రతిభ.
ఆమె: పరుగాపక పయనించవె తలపుల నావ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!
పరుగాపక పయనించవె తలపుల నావ ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
చంద్రశేఖర్ మీనాక్షి గురించి ఏమి అనుకుంటున్నాడో విన్నాం ఇంక అతని ద్వారా మీనాక్షి భావాలలోకి వెళ్దాము. అనేక సందర్భాల్లో అనేక పాత్రల ద్వారా మనకి చెప్తారు విస్వనాధ్ గారు. మీనాక్షి ఈ కళలు ఇహం లో ఎందుకు పనికి రావు. కడుపుకి ఇంత అన్నం కూడా పెట్టలేని ఈ కళల మీద సమయం ఎందుకు వృధా చెయ్యటం అని. మీనాక్షి కి ఏదో ఇష్టమో, దేనికి గంతులు వేస్తుందో, అని ఆమె స్నేహితురాలి ద్వారా చెప్పిస్తారు కూడా. అలాగే ఆమె కోరికలు ఎలాంటివో అనేక సందర్భాల్లో చెప్తారు. మీనాక్షి గురించి ఈపాటికి మనకి తెలిసి పోతుంది.
చంద్రశేఖర్ చెప్పినదానికి పాటలో మీనాక్షి ఏమి అనుకుంటుందో ఆమె మనసు ద్వార చూస్తాం. ఆలోచనల్ని నావ తో పోల్చటం చాల సార్లు చూస్తాం. ఆలోచనలు ఎప్పుడు ఆపినా ఆగవు, అవి ఆలోచన యొక్క ధర్మము. అవి అలా పరిగెడుతూనే ఉంటాయి. మీనాక్షి తనలో తాను అనుకుంటోంది అదే. తనకి తానూ నచ్చ చెప్పుకుంటోంది అదే. ఆమె ఆలోచన అంతా తన జీవితం ఎలా సుఖంగా ఉండాలా, తను ఎలా గొప్పగా జీవించాలి అనే. ఏమి చేస్తే జీవితం చక్కగా ఉంటుందో తెలియక పోయినా తన జీవితం ఎలా ఉండాలో నిర్దిష్టం గా తెలుసు, తన సోదరి, స్నేహితురాళ్ళతో చాల సార్లు చెప్తుంది. నావ ప్రయాణం ముందుకి జరగాలి అంటే ఎన్నో ఆటు పోట్లని జయించాలి, వచ్చే ప్రతి కెరటం నావ ప్రయాణానికి అడ్డే . వచ్చే అడ్డంకులకి తల ఒగ్గితే ప్రయాణం సంగతి సరే, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మీనాక్షి జీవితం కూడా నాట్యం చెయ్యాలి అనే అడ్డంకి తన ప్రతి కలకి అడ్డమే. తన తండ్రి కాని, సోదరి కాని, చుట్టు పక్కల వాళ్ళు కాని, ఆఖరికి చంద్రశేఖర్ కాని, ప్రతి ఒక్కళ్ళు సూచించేది నాట్యం గురించె. కాబట్టి ఇలాంటి అడ్డంకుల్ని దాటుకుంటూ తనకి కావాల్సింది దక్కించుకోవాలి అనుకోవటం మీనాక్షి ఆంతర్యం
సిరివెన్నెల గారు మీనాక్షి కి కంటే చంద్రశేఖర్ కి వాడిన గంభీరమైన పదాలు, భాష లోతు, వాళ్ళ ఆలోచన అంతర్యానికి చిహ్నాలు. అందుకనే ఈ పాట అంత ప్రాచుర్యం పొందింది
అతడు: పడమర పడగలపై మెరిసే తారలకై.. (2)
రాత్రిని వరించకే సంధ్యా సుందరి!!
తూరుపు వేదికపై, వేకువ నర్తకివై, (2)
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ!!
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ..(2)
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ!! || శివపూజకు ||
మీనాక్షికి అమెరికా లాంటి పరాయి దేశాలు వెళ్ళాలి అని కోరిక. అందుకేనేమో సిరివెన్నెల గారు, భారత దేశం తూర్పు వైపు ఉంటె అమెరికా పడమరన ఉంటుంది కాబట్టి పడమర పదం వచ్చే విధం గా రాసారేమో. అలాగ తూర్పు వేదిక అనే ప్రయోగం కూడా. అసలు ఈ చరణం వింటే ఒళ్ళు పులకరించ మానదు ఎంత గొప్ప పదాలు వాడారు సిరివెన్నెల గారు. అందులో ఎంత లోతైన భావం ఉంది, నిఘూడమైన సందేశం ఉంది, వేదాంతం ఉంది, ఒక మనిషి కిఇంత కన్నా గొప్ప సందేశం ఉంటుందా?
ఓ మీనాక్షి నువ్వు పైపైన కనిపించే తలుక్కు లను, మెరుపులను చూసి మోహించి నక్షత్రాల కోసం ఎందుకు వెంట పడతావు? నువ్వే స్వయం గా ఆ నక్షత్రాలకి వెలుగునిచ్చే సూర్యుడి లాంటి దానివి. తూర్పున ఉదయించే సూర్యుడి కాంతి భూమి ని ఎలా మురిపిస్తుందో, ప్రతి సూర్య కిరణం ఒక్కో చైతన్యానికి ఎలాగ స్ఫూర్తి ఇస్తుందో, నిద్రించిన జీవ కోటికి ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుందో, అలాంటి సూర్య కాంతి లాంటి నీ నాట్యాన్ని వదిలేసి, చీకటి పడేటప్పుడు వచ్చే నక్షత్రాల కోసం రాత్రిని ఎందుకు ఎన్నుకుంటావు? శివుడి నాట్యానికి పరవసించని ప్రాణి ఉంటుందా? అలాగే నువ్వు ఎన్నుకునే దారి అంతా, నీ కోరికలన్నీ పై పైన ఆనందం, క్షణిక ఆనందాన్ని ఇచ్చేవే కాని, శాశ్వత ఆనందాన్నిచ్చేవి కావు. నువ్వు చెయ్యల్సింది నీ జన్మ సార్ధకత చేస్కోవటం. నీలోని అత్యంత అమితమైన విద్యని నిరుపయోగం చెయ్యకు. ఎంత గొప్ప భావం ఇది? ఇటువంటి నిష్కల్మషమైన భావం ఒక మనిషికి కలగటం విశ్వనాథ్ గారి సినిమాల లోనే చూస్తాం. అందుకనేనేమో మీనాక్షి తండ్రి, తనకు కళ్ళు వచ్చిన తరువాత మీనాక్షి posters చూసి ఆనందం తో చంద్రశేఖర్ ని చూసి అంటాడు " అందరి లాగానే నువ్వు కూడా మా మీనాక్షి లోని చిలిపితనాన్నే చూస్తావనుకున్నాను కాని చాల అందంగా చూపించవయ్య ఆమెలోని నాట్య కళని " అని.
ఓ మీనాక్షి నువ్వు పైపైన కనిపించే తలుక్కు లను, మెరుపులను చూసి మోహించి నక్షత్రాల కోసం ఎందుకు వెంట పడతావు? నువ్వే స్వయం గా ఆ నక్షత్రాలకి వెలుగునిచ్చే సూర్యుడి లాంటి దానివి. తూర్పున ఉదయించే సూర్యుడి కాంతి భూమి ని ఎలా మురిపిస్తుందో, ప్రతి సూర్య కిరణం ఒక్కో చైతన్యానికి ఎలాగ స్ఫూర్తి ఇస్తుందో, నిద్రించిన జీవ కోటికి ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుందో, అలాంటి సూర్య కాంతి లాంటి నీ నాట్యాన్ని వదిలేసి, చీకటి పడేటప్పుడు వచ్చే నక్షత్రాల కోసం రాత్రిని ఎందుకు ఎన్నుకుంటావు? శివుడి నాట్యానికి పరవసించని ప్రాణి ఉంటుందా? అలాగే నువ్వు ఎన్నుకునే దారి అంతా, నీ కోరికలన్నీ పై పైన ఆనందం, క్షణిక ఆనందాన్ని ఇచ్చేవే కాని, శాశ్వత ఆనందాన్నిచ్చేవి కావు. నువ్వు చెయ్యల్సింది నీ జన్మ సార్ధకత చేస్కోవటం. నీలోని అత్యంత అమితమైన విద్యని నిరుపయోగం చెయ్యకు. ఎంత గొప్ప భావం ఇది? ఇటువంటి నిష్కల్మషమైన భావం ఒక మనిషికి కలగటం విశ్వనాథ్ గారి సినిమాల లోనే చూస్తాం. అందుకనేనేమో మీనాక్షి తండ్రి, తనకు కళ్ళు వచ్చిన తరువాత మీనాక్షి posters చూసి ఆనందం తో చంద్రశేఖర్ ని చూసి అంటాడు " అందరి లాగానే నువ్వు కూడా మా మీనాక్షి లోని చిలిపితనాన్నే చూస్తావనుకున్నాను కాని చాల అందంగా చూపించవయ్య ఆమెలోని నాట్య కళని " అని.
ఆమె: తన వ్రెళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా..
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా..
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా..
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా..
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా..
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా!! || పరుగాపక పయనించవె ||
ఇప్పటి వరకు చూసింది చాలా ఉన్నా సిరివెన్నెల గారు మనల్ని తన పదాలతో ఆనంద పరవశులని చేసే పని ఆపరు. అప్పుడేనా ఇంకా చాల ఉంది అన్నట్టు ఈ చరణం లోని ఒక్కో పదం ఒక్కో అనుభూతి ఇస్తుంది. యతి ప్రాసలు ఇష్టం వచ్చినట్టు వాడుతున్న ఈ కాలం లో ఇటువంటి పద ప్రయోగం అరుదుగా చూస్తూ ఉంటాము. "తన వ్రేళ్లు సంకెళ్ళు" , "అవధి లేని అందము ", "అవనికి నలుదిక్కులా", "ఆనందపు గాలి వాలు", "వెన్నెల కిన్నెర గానం" అనేవి అత్యంత అద్భుతమైన ప్రయోగాలు.
ఒక మొక్క ఎందుకు కదల లేదు అన్న విషయం వేరే విధం గా ఎలా చెప్పారో ఇక్కడ చూస్తాము. వ్రేళ్లు సంకెళ్ళ గా మారితే ఇంక ఎక్కడకి వెళ్తుంది మొక్క, అయినా కాని ఎదగటం మానుతుందా? మానదు. అలాగే ఆమని ( ఆకులు చిగుర్చే కాలం) కోసం ఆగదు కదా. మనము చూడాలి కాని సరి అయిన కళ్ళతో చూస్తే ప్రక్రుతిలో అణువు అణువునా అందమే. ఆ అందానికి పరిధి పరిమితి లేదు, ఈ భూమి మీద అందం అనంతం. అట్లాంటి అందాల నుంచి వచ్చే ఆనందం మనిషి లో ఎంత ఉత్తేజం ఇస్తుందో చెప్పలేము,ఆ ఆనందపు ఆలోచనలు నడుపుతూ ఉంటె ప్రతి రోజు ఒక నవ చైతన్య వంతమైన రోజు కాదా, వెన్నెల్లో కిన్నేరుల గానం వింటే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి జీవితం కోసం నీ ప్రయాణం ఆపకుండా చూసుకో అని మీనాక్షి ద్వారా చెప్తారు.
ఈ చరణం మళ్లీ మళ్లీ వినాలనుకోవటం లో తప్పులేదు.
అతడు: చలిత చరణ జనితం నీ సహజ విలాసం!!
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం..
నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం.. (2)
గగన సరసి హృదయంలో..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం!!
ఇంక సిరివెన్నెల గారు పతాకానికి చెరుతారు. ఈ చరణం ఈ పాటని ముగించటానికి ఆయన ఎన్నుకున్న పదాలు మనల్ని అబ్బుర పరుస్తుంది. చంద్రశేఖర్ ఇంక మీనాక్షి గురించి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆమె కళ గురించి ఊహించుకోవటంలొ. ఆమె నాట్యం ఎటువంటిదంటే చలించే చరణాలు ( పాదాలు) నుంచి ఉద్భవించిన, సహజసిద్ధమైనటువంటిది ఆమె నాట్య విలాసం. ఇంక ఆమె సౌందర్య వికాసం జ్వలించే కిరణాలతో కూడినటు వంటిది, ఆమె అభినయం ఉషోదయం లాంటిది. అలాంటి నాట్యం చూసిన సూర్యుడి కన్నుల నుంచి వచ్చిన కాంతి తో ఆకాశం లోని సరస్సు హృదయం లో వికసించిన నూరు దళాలున్న స్వర్ణ మయమైన కమలం అని. ఇది పైకి చూసే అర్థం అయినా, ఇందులో నిఘూడమైన అర్థం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి కళ పరమేశ్వరుని పాదాలు అలంకరించటానికి అందించే స్వర్ణకమలాలే. ఇక్కడ మీనాక్షి తన నాట్యాన్ని రవి చూస్తె ఆ ఉత్తేజిత సూర్య కిరణాల నుంచి మరల గగన సరస్సులో కమలం వికసిస్తుంది అనేది అధ్బుతమైన ఊహ.
ఈ చరణం లో భానుప్రియ అభినయం అత్యంత అద్భుతం. ఆమె ప్రదర్శించిన హావ భావాలు, అభినయ సౌందర్యం, నాట్య ముద్రలు, ఇవన్ని చూడ చక్కగా ఉండటమే గాక చరణం లోని ప్రతి పదం అభినయించి చూపారు. వేరు వేరు రకాల ఆహార్యం దరించటం కూడా అభినందనీయం ( కూచిపూడి, ఒడిస్సీ, మోహిని ఆట్టం నాట్య శాస్త్రానికి సరిపడా దుస్తులు వాడటం ). ఈ నాట్యాన్ని రచించటానికి కారకులైన వాళ్ళు అభినందనీయులు. ఈ పాట లోని దృశ్యాలు తీసిన ప్రదేశాలు కూడా చాల హృదయం గా ఉంటాయి. ఒరిస్సా లో ఈ పాట చిత్రీకరణం ఎక్కువగా జరిగింది.
పరుగాపక పయనించవె తలపుల నాన..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!
ఇలా మీనాక్షి పాడుతుంటే ఈ క్రింది శ్లోకం వస్తుంది ఈ శ్లోకం ముగియటం తో పాట కూడా ముగిస్తుంది. చంద్రశేఖర్, మీనాక్షి ని తన దారి వైపు తీసుకు వెళదామనుకుంటే మీనాక్షి చెయ్యి విడిపించుకొని తనకు నచ్చిన దారిలో వెళ్ళిపోతుంది. ఇది విశ్వనాథ్ గారు అద్భుతం గా చూపించారు. చూడటానికి మామూలు గా ఉన్నా ఎంతో నిగూఢమైన అర్థం చూపిస్తుంది.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!!
భగవద్గీత లోని ఈ శ్లోకం ముఖ్య సారంశం ఏమిటంటే ప్రతి మనిషి తన కోసం విదించిన ధర్మమే చెయ్యటం ఉత్తమం. ఎంతటి చిన్నదైన తన ధర్మమే ( కర్మ) చెయ్యటమే శ్రేయస్సు కరం. ఎంతటి గొప్పదైన పరుల ధర్మం వైపు వెళ్ళటం హానికరం. ఈ శ్లోకం క్షత్రియుడైన అర్జునుడు తను చెయ్యవలసిన పని వదిలేసి నేను ప్రశాంతము గా అడవిలో బ్రాహ్మణుని వలె జీవిస్తాను అని శ్రీ కృష్ణుని తో అంటే అతనికి ఉపదేశించిన శ్లోకం. ఇక్కడ కృష్ణుడు చెప్పింది క్షత్రియ ధర్మం యుద్ధం చెయ్యటం, ధర్మాన్ని కాపాడటం అది వదిలేసి వేరే వాళ్ళ పని చెయ్యటం చాల హాని కరం. ఎంత కష్టమైనా, ప్రాణ హాని అయినా స్వధర్మం వీడకూడదు. పరాయి ధర్మం ఎంత ఆకర్షించినా అది భయొత్పాతమైనది . ఇక్కడ మీనాక్షికి కూడా సహజ సిద్దమైన ధర్మం నాట్యం, అది వదిలేసి బయట ప్రపంచం లోని ఆకర్షణలకు లోనయ్యి నాట్యం వదిలెయ్యటం ఎంత హాని కరమో అని చెప్పటం చంద్రశేఖర్ ద్వారా ఈ పాట ద్వారా, దర్శకులు మనకి తెలియ చేస్తారు.
కొసమెరుపు:
ఈ సినిమా లో ప్రసిద్ధి పొందిన "అర్థం చేసుకోరు" అన్న డైలాగ్ అప్పటికి అప్పుడు మీనాక్షి సినిమా కోసం క్యూ లో నిల్చొని స్నేహితురాలితో మాట్లాడేటప్పుడు యాదృచ్చికం గా కుదిరినది అని విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు . మీనాక్షి తండ్రి గా వేసిన నటుడు స్వతహా గా నాట్యాచార్యులు, అలాగే మీనాక్షి బావగా వేసిన అయన కూడా వయోలిన్ వాద్యకారుడే. అందుకే వాళ్ళిద్దరూ సరిగ్గా సరిపోయారేమో. ఇంక మీనాక్షి అక్క సావిత్రికి గాత్ర సహాయం అందించింది SP శైలజ, మీనాక్షి బావగారికి గాత్రం అందించింది శుభలేఖ సుధాకర్. అప్పటికి సుధాకర్ కి శైలజకి వివాహం కాలేదు. బావి లో గజ్జెలు పడిపోయే సీన్ లోని బావి సహజమైన బావి కాదు, అది సినిమా కోసం చేసింది. అలాగే తొండం, కాదు తోక అన్న సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంకా ఇలాంటివి అనేకం.ఏది ఏమైనా ఈ సినిమా చూసిన ప్రతి సారి ప్రేక్షకుడిని కట్టి పడేసి చివరి వరకు లీనం చేసే సినిమా. ఇది చదివిన తరువాత సినిమా కాని పాట కాని చూడాలనిపిస్తే రాసిన రాతకి సార్ధకం చేకురినట్టే. :)
సిరివెన్నెలగారు చెప్పినట్టే ఈ మధ్య కాలంలో పాటలలో సాహిత్యం ఒక సంగీత వాయిద్యం గా మారిపోయింది. ఎందుకంటే పాట సమకూర్చే వాళ్ళు పదాలు కూరుస్తున్నారు కాని అర్థం మర్చి పోతున్నారు. పాట పదాల అల్లిక అవుతోందే తప్ప అర్థవంతమైన హారం అవ్వటం లేదు. పాట ఆలోచనలు మాత్రమె కాదు భావాల్ని కూడా తెలియచెయ్యాలి. ఎందుకో ఇవి అన్ని లేని పాటలు వింటున్నాం. పాట బ్రతకాలి అంటే పాట జీవితం అవ్వాలి. విన్న ప్రతి శ్రోత తనకి అన్వయించుకోవాలి. అప్పుడే పాట జీవిస్తుంది, లేక పొతే ధ్వని లో తన ఉనికి కోల్పోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
PS: నేను విన్న అనేక సంఖ్య లోని పాటలలో ఎక్కువసార్లు విన్న పాట ఇదేనేమో. విన్న ప్రతి సారి ఒక్కో అనుభూతి ఒక్కో అర్థం స్పురించటం ఈ పాట గొప్పతనం. అందుకేనేమో అన్ని సార్లు వినగలగటము. విన్నప్పుడు తట్టిన భావాల్ని అక్షర రూపం కలిగించటమే నా ఈ రాత ఒక్క లక్ష్యం. అంతే కాని దీన్ని అర్థం చెప్పాలనో, ఈ పాటని విశ్లేషించాలనో తాపత్రయం కాదు. ఎందుకంటే ఆ శక్తి నాకు లేదు అనే భావన. ఇందులో తప్పులు దొర్లితే పెద్ద మనస్సుతో సరిదిద్ద వలసినది వినమ్ర ప్రార్ధన.