ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
పని భారం వల్ల కలిగిన ఒత్తిడిలో సమయం కుదరక చిన్న విరామము కలిగింది. విరామానికి క్షమార్హుణ్ణి. యదావిధిగా ఈ వారం మరల మీ ముందుకి రావటం జరుగుతోంది. ఇటువంటి విరామాలు కలుగకుండా ప్రయత్నిస్తాను.
పని భారం వల్ల కలిగిన ఒత్తిడిలో సమయం కుదరక చిన్న విరామము కలిగింది. విరామానికి క్షమార్హుణ్ణి. యదావిధిగా ఈ వారం మరల మీ ముందుకి రావటం జరుగుతోంది. ఇటువంటి విరామాలు కలుగకుండా ప్రయత్నిస్తాను.
Movie Name: ప్రియమైన నీకు
Producer: RB Choudhary
Director: Bala Sekharan
Music Director: SA Rajkumar
Singer(s): KS చిత్ర (Female version), SP బాలు (Male Version)
Lyrics: సిరివెన్నెల సీతారామశాస్త్రి
Year of Release: 2001
ఒక పాట వింటే సినిమా కధ అర్థం అయ్యే పాటలు చాల తక్కువగా చూస్తాము. అటువంటి అరుదైన పాటల కోవలోకి చెందినదే ఈ పాట. సిరివెన్నెల గారు తనకంటూ ఒక స్థాయి నిర్ణయించుకొని ఆ స్థాయి తగ్గకుండా సినీ జీవితం లో పాటలు రాయ గలగటం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆ పరిధిలోనే పాటలు రాయటం మన అదృష్టం. ఈ పాట కి రెండు వెర్షన్స్ ( అంతరాలు ). ఒకటి కథా నాయిక తన మనసులోని భావం తెలియ చెప్పలేక పాట ద్వారా తెలియ చెప్పటం. అదే విధంగా కథానాయకుడు కూడా. ఇద్దరి భావాలు వేరు కాని ఇతివృత్తం ఒకటే. ఎలా చెప్పటం, చెప్పకపోవటం. ఈ పాటలను సందర్భోచితం గా చక్కగా వాడుకున్నారు చిత్ర దర్శకులు. సినిమా లోని రెండు భాగాలు విరామం ముందు, తరువాత ఈ పాటలు వస్తాయి, పాట యొక్క ఈ రెండు అంతరాలు వింటే సినిమాలో ఏమి జరిగి ఉంటుందో మనం సులభం గా ఊహించుకోవచ్చు. అలాగా అతి సుందరం గా అత్యంత అద్బుతం గా తెలియ చెప్పటం అంటే మనోహరం గా రాయటం సిరివెన్నెల గారి గొప్పతనం. ఈ రెండు పాటలు రాయటానికి ఎంత ప్రయాస పడ్డారో ఆయనకే తెలియాలి. ఈ పాట విన్న ప్రతి సారి ఒక్కో కొత్త అనుభూతికి ప్రేక్షకుడు లోనవుతాడు అని అనటం లో అసలు సందేహం లేదు.
ప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభవం. మాటల్లో వర్ణించలేని భావం అని అందరికి తెలుసు. కాని ఆ భావాన్ని తన సొంతం చేసుకొని ఎంతో అద్బుతం గా వివరించి, ప్రేమ లో పడితే కలిగే భావాలు ఇలాగే ఉంటాయ అన్నంత అనుభవం తో చెప్తున్నట్టు ఉంటాయి కవుల కవిత్వాలు, పాటలు. అది వారి ఊహా శక్తి, కల్పనా శక్తి, పాండిత్యానికి నిదర్సనం. అంతే కాకుండా, సినిమా లోని పాత్రల మనస్తత్వాలు అర్థం చేసుకొని వాళ్ళ భావాలు తెలియచెప్పటం కొంత మంది కే సాధ్యం. దీని వల్ల కథకి ఎంత బలం చేకూరుస్తుందో ఈ చిత్రం మనకి చక్కటి ఉదాహరణ. చాల సార్లు చెప్పినట్టు, సాహిత్యం చక్కగా ఉంటె, దానికి ఆభరణాలు అవే కుదురుతాయి. ఆ ఆభరణాలు బాలు, చిత్ర మరియు రాజకుమార్. బాలు గారి గురించి పొగడాలంటే అర్హత ఉండాలి. ఇంక గాయనీ మణులలో మనకి ఒక పాటకి న్యాయం చేకూర్చే వాళ్ళలో చిత్ర గారు ఆఖరేమో ఆవిడ తరువాత మనకి ఇంక ఉండరేమో అని అనిపించటం సహజం.
ఇంక ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే, గణేష్ ఆడుతూ పాడుతూ గాలికి తిరిగే యువకుడు. చదువు సంధ్య లేకుండా స్నేహితుల
తో తిరిగుతూ ఉండి తండ్రి చేత తిట్లు తింటూ ఉంటాడు. ఒక రోజు తండ్రి ఊరు
వెళ్తూ షాపు చూసుకోమంటాడు. తప్పక ఒప్పుకొని వెళ్తే అక్కడ ఒక బీరువా లో డైరీ
దొరకటం, ఆ డైరీ లో సంధ్య అనే అమ్మాయి తన గురించే రాయటం, ఆ డైరీ విషయాలు
సినిమా లోని మొదటి భాగం. తన ఇంటి ఎదురుగా ఉన్న సంధ్య గణేష్ ని
ప్రేమిస్తుంది, కాని ఆ విషయం చెప్పలేక పోతుంది. తన చెల్లెలు ద్వారా
చెప్పించటానికి ప్రయత్నిస్తే చెల్లెలు ఆ విషయం అక్క గురించి కాకుండా తన
గురించి చెప్తే గణేష్ తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన జరిగిన తరువాత
సంధ్య వాళ్ళు హైదరాబాద్ బదిలీ అవ్వటం తో సినిమా మొదటి భాగం అవుతుంది. ఇంక
గణేష్ సంధ్యని వెతకటానికి వెళ్తే, తన స్నేహితుడికి సంధ్య తో పెళ్లి కుదరటం,
గణేష్ తన మనసులోని మాట సంధ్య కి చెప్పా లేక పోతాడు. ఇంక ఇద్దరు ఎలా
కలుస్తారు అన్నది సినిమా.
ఈ నేపధ్యం లో కథ నాయిక కథ నాయకుడుకి రాసిన పాట వాళ్ళ మనసులో ఏముందో అని
రాయటం, రెండు ఒకే లాగ ఉన్నట్టు ఉండి, అర్థం వేరు గా ఆ సందర్భాలకి సరిపడా
రాసిన సిరివెన్నెల గారు రాసి ప్రేక్షకులని ఆశ్చర్య ఆనందాలకి లోను చేస్తారు.
ఇంక మొదటి పాటలోకి వెళ్దాము.
సంధ్య ఒక రోజు గణేష్ గిటార్ వాయించటం చూసి అతని సంగీతం మీదనే కాకుండా అతని
మీద మనసు పారేసుకుంటుంది. అప్పటినుంచి అతనినే చూడటం మొదలు పెట్టి మనసులోని
విషయం ఎలా చెప్పాలా అని ఆలోచనలో ఉంటుంది. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం
గణేష్ స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి తన ఇంట్లో పడటం ఆ బంతి
కోసం గణేష్ ఇంటికి రావటం. క్రికెట్ బంతి మీద ఐ లవ్ యు అని రాసి బంతి గణేష్
చేతిలో పెడ్తుంది. కాని అది చూడకుండా హలో హలో అనుకుంటూ బంతి తీసుకొని
క్రికెట్ లో బంతి ప్యాంటు కు రుద్ది చేరిపేస్తాడు. కొంచెం బాధ పడినా అతని
గురించి తన మనసులో ఉన్న మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన
సందర్భం లోని పాట ఇది.
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదేలా
ఒక్కసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||
ఈ నేపధ్యం లో సీతారామ శాస్త్రి గారు రాసినట్టు అద్బుతం గా ఎవరు రాయలేరేమో
అని మనకి అనిపించటం అత్యంత సహజం. సంధ్య మనసులో ఉన్నది చెప్పాలి కాని అతనిని
చూసేసరికి మాటలు తడబడి ఏమి మాట్లాడ లేక పోవటం, ఇలా అయితే ఎలా అని మనసు తో
సంభాషించుకోవటం సిరివెన్నెల గారి ఆలోచన శక్తికి నిదర్సనం. మాటలు కరువైతే
అందరికి మనసే తోడు. అందుకనే అత్యంత సుందరం గా వాడుకుంటారు. సంధ్య పడే
సంఘర్షణకి ఇది తార్కాణం. తనలోని సంగతి మంచిదే కాని ఆ సంగతి చెప్పే తప్పుడు
ఉన్న బిడియం ఆగక పొతే చెప్పటం ఎలా కుదురుతుంది? బిదియ పడే స్త్రీ కన్నులు
వాటంతట అవే రెప రెపలాడతాయి. దానికి సిగ్గు తోడయితే రెప్పలు వలిపోవటం సహజం.
ఇవన్ని స్త్రీ కి సహజమైన లక్షణాలు, అవే సినిమాలో సంధ్య పాత్రలో చూస్తాము,
శాస్త్రి గారి పాటలో వింటాం. ఇది ఒక రకం గా పాత తరం స్త్రీ గురించి
చెప్పినవే అనుకోవాలి, అన్వయించుకోవాలి. ఎందుకంటే మారుతున్న కాలం లో స్త్రీ
లక్షణాలు మారుతున్నాయి, వాళ్ళ పద్దతులు మారుతున్నాయి. ఇంక గణేష్ తన ఎదురుగా
వచ్చాడు, అతనికి తనలోని అతని గురించిన ఆలోచనలు, జ్ఞాపకాలు తెలియచెప్పటం
ఎలా? అది సరే ఒక్క సరి తన మనసులోని మాట, ఎద చేస్తున్న సందడి తెలుపకపోతే
అతనికి తన ప్రేమ విషయం ఎలా తెలుస్తుంది? ఇంతకీ సంధ్య పడే తపన అదే, తన మనసు
లో ఉన్నది చెప్పాలని ఉన్నా కాని మాటలు రావటం లేదు, ఏమి చెయ్యాలి? సంధ్యకి
ఇటువంటి సంక్లిష్ట మైన పరిస్తితి రావటం సినిమా లోని ఆ పాత్ర పట్ల అందరికి
సానుభూతి కలగటం సహజం. ఆ తరువాత జరిగిన సంఘటనలే కథకి మూలం. సరే ఈ పరిస్తితి
ఇలా ఉంటె తరువాత శాస్త్రి గారు ఏమి చేసారో చరణం లో చూద్దాం.
చరణం - 1
చింత నిప్పల్లే చల్లగా వుందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదకోత అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని
తెలపకపోతే ఎలా || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||
కవులందరూ ఏకగ్రీవం గా అంగీకరించే విషయం విరహం వల్ల కలిగే నిట్టుర్పుల వేడి
రోహిణి కార్తె వేడి కంటే ఎక్కువ ఉంటుంది అని. ఆ వేడికి రాళ్ళే బద్దలు
అవుతాయి అంటే అతిశయోక్తి కాదు. చింత నిప్పు , ఎంత నొప్పి అనే ప్రయోగం
సరికొత్త అందాన్ని తెచ్చింది ఈ చరణానికి. అతనిని తలచుకోవటం వల్ల కలిగిన
విరహ నిట్టూర్పుల వేడిలో అతని గురించిన ఆలోచనలో కలిగిన వేడి కూడా, ఎటువంటి
నొప్పి కూడా తెలియటం లేదంటే అది అతని గురించిన ఆలోచన కాబట్టి. ప్రేమ అంటే
బాధే ఎందుకంటే అది దొరికేంత వరకు బాదిస్తూనే ఉంటుంది కాని ప్రేమ లభిస్తుంది
అనే ఆలోచన అతని చెంతన కలిగే ఆనందం ఆ బాధని అధిగామించేలాగా చేస్తుంది.
అందుకనే ప్రేమ తీయని బాధే. ఆ భాద ఎంత బరువుగా ఉంటుందో లేత గుండెకే తెలసు. ఆ
అనుభవం మొదటి సారి ప్రేమలో పడిన వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి స్త్రీ
గుండె లేత గుండె అనటం శాస్త్రి గారి పద విన్యాసానికి హద్దులు లేవు అని మనకి
నిరూపించటం. ఇంకా ప్రేమ సఫలీకృతం కాని వాళ్ళు పడే గుండె కోత గురించి
చెప్పాలంటే కష్టం, అది అవతలి వాళ్ళకి చెప్పటం ఇంకా కష్టం, అటువంటి బాధ తనకి
ప్రియమైన గణేష్ కి కనిపిస్తోందా అని అడగటం, తన మనసు అతని చుట్టూనే పరి పరి
విధాలు గా తిరుగుతోంది, ఈ మనసు లోని విషయం నీకు తెలియచేప్పక పొతే ఎలా?
చరణం - 2
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని
నిద్దరే కసురుకునే రేయిలో
మేలుకున్న ఇదే వింత కైపని వేల ఊహలో ఊరేగే చూపుని
కలలే ముసురుకొనే హాయిలో
వినపడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని
తెలపకపోతే ఎలా || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||
ఈ చరణం లో శాస్త్రి గారి కవితా విశ్వరూపం చూస్తాం. అయినా దీనికే ఇంతలా
ఆశ్చర్యపోతే యింక ఆయన రాసిన అనేక పాటలకి ఏమయిపోవాలో? ఆయనకి వచ్చిన
అద్బుతమైన భావనకి శతకోటి పాదాభి వందనాలు చెప్పటం తప్ప? సంధ్య నీలి
కన్నుల్లో అంతటా అతని రూపం నిండిపోయి ఉంది. ఆ ఆలోచనలతో నిండా
మునిగిపోయింది. నిద్ర కనుమరుగై పోయింది. అప్పుడు నిద్ర సంధ్యని నీ కళ్ళలో
గణేష్ రూపం ఉంటె, నేను ఎలా నిద్రపోతాను అని అడగటం, నిద్ర రాత్రిలో సంధ్యని
కసురుకున్తోంది అనటం అత్యంత అద్బుతమైన భావనని నింపుతుంది, రస హృదయుల
మనసులో. ఈ పాట విన్న ప్రేక్షకుడు శాస్త్రి గారిని చూస్తె ఇదే పాట
పాడుకోవచ్చేమో? అలాగే ఈ చరణం లో నిద్ర కసురుకునే రేయిలో, కలలే ముసురుకునే
హాయిలో అని మనకి హాయి కలిగిస్తారు. సంధ్యకి ఎలాగో నిద్ర రాదు, అలాగే అతని
గురించి ఆలోచనలు అనేకం ముసురుకుంటున్నాయి. ఆ కంటికి అనేకం ఊహలు, ఆలోచనలు
కలలు ఇవన్ని హాయిని కలిగించేవే. అతని తలపులలో నిద్ర పట్టని వాళ్ళకి కాలం
ఏమి తెలుస్తుంది, తిథి వార నక్షత్రాలు, చీకటి పగలు ఇవేవి తెలియవు. ఇన్ని
ఆలోచనలు ఉన్నవి, అతనిని కలిసి తన మనసు లోని మాటని చెప్తాను అన్న ఆశ ఉంది, ఆ
ఆశని రాగం అనటం చాల సార్లు చూస్తాం. నా ప్రియమైన నీకు ఇవన్ని వినపడుతోందా?
నా మనసున ఒక మంచి మాటని నీకు చెప్పాలని ఉంది అది ఎలాగ అనటం ఎంతైనా సమంజసం.
కొసమెరుపు: ఈ సినిమాలో సంగీతం సాహిత్యం చాల ప్రాధాన్యత కూడుకొని ఉంటాయి. స్నేహ కి తెలుగులో మొదటి సినిమా. దర్శకుడు ఈ పాటతో సినిమా లో మొదటి భాగం కథ నడిపిస్తే రెండో భాగం వేరే పాటతో నడిపిస్తారు. ఆ పాట (మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదేలా) గురించి వచ్చే వారం చూద్దాం.
ఈ రోజు మే 20 సిరివెన్నెల గారి జన్మ దినం. ప్రతి పాటతో కొత్త జీవం పోసుకునే ఆయనకీ ప్రతి పాట ఒక జన్మదినమే. ఇటువంటి జన్మ దినాలు కొన్ని వేలు మనకి ప్రసాదించే వరం భగవంతుడు ఆయనకి ప్రసాదించాలి అని కోరుకుందాం.
Great analysis!
ReplyDeleteThough it sounds a lot like SA Rajkumar, music for this movie was composed by Shiva Shankar :)