Friday, February 24, 2012

Song of the week - Pandu Vennello ee venugaanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:        జానకి weds శ్రీరామ్
Producer:                  S. రమేష్ బాబు
Director:                    అంజి శ్రీను
Music Director:     ఘంటాడి కృష్ణ
Singer(s):                  టిన కునాల్
Lyrics:                       సిరివెన్నెల సీతారామశాస్త్రి

Year of Release:       2003

పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను  నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక      || పండు వెన్నెల్లో ||
కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి కరిగేలా
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా                                                                         || పండు వెన్నెల్లో ||

జానకి వెడ్స్ శ్రీరామ్, సినిమా లోని ఈ పాట సిరివెన్నెల గారు రాసిన సందర్భోచితమైన మరొక్క పాట. ఆయన ఏ పాట రాసిన సందర్భానికి సరిగ్గా సరిపోతుంది, అది ఆయన ప్రజ్ఞ. ఇంతకు ముందు ఇలాంటి కథలతో చాల సినిమాలు చూసి ఉంటాము. కథ క్లుప్తం గా చూస్తె, శ్రీరామ్, జానకి బావ మరదళ్ళు. ఉమ్మడి కుటుంబం లో ఉన్న వాళ్ళు కొన్ని కుటుంబ కారణాల వలన రెండు కుటుంబాలు విడిపోతాయి. విడి విడిగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాని వాళ్ళ మదిలో ఉన్న ప్రేమ అలా ఉంది పోతుంది. మిగిలిపోతుంది. అది తెలియటానికి కూడా వాళ్ళకి చాల సేపు పడుతుంది. ఈ లోపల వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు రావటం కథ అటు ఇటు అయ్యి చివరికి వాళ్ళు ఎలా ఒకటి అవుతారు అనేది సినిమా కథ.
సాధారణం గా మనం కోరుకునే వాళ్ళు చాల ఏళ్ళ తరువాత మనల్ని చూడటానికి వస్తుంటే మనసు వాళ్ళని ఎప్పుడు కలుస్తామా అని ఉవ్విల్లూరుతుంది. ఇంకా వాళ్లతో కలయిక ఎలా ఉండాలా అనే ఆలోచన తో సతమతం అవుతుంది. ఇదే ఇద్దరు ప్రియుల మధ్య ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. మది కలవరం చెందుతుంది, కంటికి  కునుకు ఉండదు, ఆలోచనలు అలలు పొంగినట్లు పొంగుతాయి, జలపాతలలా జారుతుంటాయి, అలాగే మది కూడా ఎక్కడికెక్కడో తిరిగి అలసి పోతుంది, క్షణం యుగం లాగ నడుస్తుంది, ఎవరు కనిపించిన ప్రియుడి లాగ కనిపించటం, ఊహల్లో కలల్లో వాళ్ళ తలపులు కలుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలు చాల చూసి ఉంటాము, ఇలాగ వాళ్ళలో కలిగే ఇన్ని భావాలని ఒక పాట లో రాయటం కష్టమే. ఇలాంటి పాటలు చాల చూసాం, కాని ఈ పాట విశిష్టత ఈ పాటదే  అలాగ రాయగలటం సిరివెన్నెల గారి ఆలోచన ద్రుక్పదానికి చిహ్నం. సాధారణంగా  సినిమాలలో ఎందుకనో ప్రేయసి ప్రియుడి కోసం పాడటం చూస్తాం కాని ఎప్పుడు ప్రియుడు ప్రేయసి కోసం వేచి చూస్తూ పాట పాడటం చూడం.
ఈ పాట మాధుర్య ప్రధానంగా అద్భుతంగా చేసారు ఘంటాడి కృష్ణ, అలాగే వింటూ ఉండిపోయే పాటకి అందమైన మాటల కూర్పు చేసారు సిరివెన్నెల. జానకి ఈ సినిమాలో రాజమండ్రిలో ఉండటం, తెలుగు ఆహార్యం ఎక్కువగా ధరించటం వలన తెలుగు తనం ఉట్టి పడుతుంది. సిరివెన్నెల పదాల అందాలు, గోదావరి జిల్లా అందాలు ఒకటికి ఒకటి పోటీ పడతాయి అంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు జానకి పాత్ర వేసిన గజాల ముఖంలోని అమాయకత్వం పాటకి సరికొత్త అందం తీసుకొని వస్తుంది. దర్శకుడు ఈ పాట చిత్రీకరణకి జన రంజనం కోసం కావాల్సిన హంగులు అన్ని సమకూర్చారు. పాట పాడిన టినా కునాల్, గొంతులో మాధుర్యంతో పాటకి న్యాయం చేసిన, అక్కడక్కడ తెలుగు మాటలు పలుకటంలో స్పష్టత కనిపించకపోవటం(నేస్తం,అన్నప్పుడు), ఉచ్చ స్థాయి లో పాడినప్పుడు కష్టపడినట్లు అనిపించినా, ఈ  పాట మల్లి మల్లి వినాలి అనుకున్నప్పుడు మనల్నిపెద్దగా ఇబ్బంది పెట్టవు.   ప్రియరాలు తన ప్రియున్ని పదే పదే తలచుకొని పాడే పాట ఇది. ఇంక పాటలోకి వెళ్దాం.
పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం

ప్రేమికులకి వెన్నెలకి విడతీయలేని అనుభంధం ఉంటుంది. ఆ వెన్నెల రాత్రుల్లో ఏకాంతం గా వాళ్ళిద్దరూ చేసే చిలిపి ముచ్చట్లు, ఆడే చిలిపి చేష్టలు, ఒకరికొకరు చెప్పుకునే కబుర్లు, సేద తీరుతూ చేసే సరసమైన సంబాషణలు ఇవన్ని వాళ్లకు తరువాత మిగిలే తీపి జ్ఞాపకాలు. అలాంటి వెన్నెల రాత్రుల్లో తన ప్రియుని మాట వేణు గానం లాగ హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారి మాటలు తీయగానే వినిపిస్తాయి ఎప్పుడైనా. అందుకనే అనేకమైన తియ్యనైన జ్ఞాపకాలు తిరిగి నెమరు వేసుకుంటే ఆ జ్ఞాపకాలు తీయ్యదనం నింపుకున్న జలపాతల్లా మదిలో జారుతూనే ఉంటాయి. మౌనంగా ఎదురు చూస్తున్న ఆమె మనసు చేసే సంగీతం ఎలా ఉంటుంది అంటే తన ప్రియమైన అతని పేరు వినిపించే కమ్మని వేణుగానం లాగ, ఆ వేణు గాన సంగీతం ఏమిటి అంటే అది అతని మాట అతని జ్ఞాపకం. అవి ఒక జలపాతం లాగ పారుతూ ఉంటె నీ కోసం నా తనువూ మనసు వేచి చూస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాయి ఓ ప్రియ నేస్తం అనే అద్బుతమైన భావం తో పాటని ఆరంభిస్తారు సిరివెన్నెల. ఈ మాటలకు అదే భావం కలిగేలాగా స్వరం నింపుతారు ఘంటాడి కృష్ణ.

ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక || పండు వెన్నెల్లో ||

కవులకు ప్రియమైన జంటలు చిలుకా గోరింకలే. ఇక్కడ కూడా కథ నాయకుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనిని తన దగ్గరకు తీసుకొని రావాలి, ఆ భావం అద్భుతం గా చెప్తారు సిరివెన్నెల. ఏ పక్షి అయినా ఎప్పటికి ఎగిరి పోలేదు గా, ఎగిరి ఎగిరి అలసి పోయి ఎక్కడో అక్కడ వాలి పోవాలి. తన గూటికి చేరలేకపోతే. కాని అన్ని పక్షులు తిరిగి గూటికే చేరాలి. ఇక్కడ కూడా కథ నాయిక భావం అతని గూడు తన మనసే కదా, ఎక్కడ తిరిగిన తన దగ్గరకే రావాలి అనే భావం తో ఈ పల్లవి సుందరం గా చెప్తారు. ఒకవేళ దూరం గా వెళ్ళిపోయినా, నేను నిన్ను నా దగ్గరకు రాప్పించుకుంటాను, అది ఎలా చెయ్యాలో నాకు తెలుసు, నిన్ను ప్రేమిస్తున్ననేను నిన్ను ఎలా వదులుకుంటాను అన్న విషయం ఎంత అద్భుతం గా వివరిస్తారో ఈ చరణం చూస్తె తెలుస్తుంది. ఓ గోరింకా నువ్వు ఎగిరిపోయవు సరే, కాని అలా ఎగిరి ఎంతసేపు ఉంటావు ఎంత దూరం పోతావు, ఎగిరి ఎగిరి నీ రెక్కలు అలసి పోయి గూడు చేరుకొనే సమయం దగ్గర పాడినప్పుడు నా గుండె కదా నీ గూడు అది పోల్చుకొని తిరిగి వస్తావు కదా. ఇక్కడ ఆమె లో ధీమా కనిపిస్తుంది, అతని మీద తనకున్న విశ్వాసం కూడా కనపడుతుంది. అతనికి ఈమె ప్రేమ విషయం తెలియకపోయినా అది తెల్సుకొని వస్తాడు లే అనే విశ్వాసం కనిపిస్తుంది ఈ పదాలలో.అంటే కాదు ఒకవేళ నీకు తెలియక పోయిన, అది గుర్తించటానికి గుర్తులు లేకపోయినా నేను నీకు నా ప్రేమ కు దారి చూపి నిన్నునా దగ్గరకు రాప్పించుకోనా అన్న ఆమె భావాన్ని, గోరింక తో పోల్చి మనకి అందమైన భావం మిగులుస్తారు సిరివెన్నెల. అందుకే ఓ గోరింకా నీ గూడు ( తన మనస్సు ) కి తిరిగి వచ్చే దారి మర్చి పొతే, నేను దగ్గర ఉంది దారి చూపిస్తూ నా దగ్గరకు రప్పించు కోనా అని మొదటి చరణం అద్బుతం ముగిస్తారు సిరివెన్నెల.

కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
ఇంక రెండవ చరణం లోకి వస్తే సినిమా లో జానకి శ్రీరాం అనేవి పాత్రల పేర్లు, అది కాక అందరికి  ఆదర్శం అయిన సీతారాములే కవుల వర్ణనలకి ఆదర్శం. సీతారాముల కథని అందం గా సినిమా కి అల్లుకోవటం, వర్ణించటం మనకి అంతులేని మధురమైన భావనని మిగులుస్తుంది. సీతమ్మ వారి పెళ్లి కథ ఒక రమణీయమైన గాధ. అలవోకగా శివధనుస్సు కదిపిన సీతమ్మ వారికి అది ఎత్తిన వారికి సీతమ్మ వారితో పెళ్లి అన్న చాటింపు ఏడు లోకాలకి వెళ్తుంది. అదే సందర్భాన్ని తన చరణం లో వాడుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయిస్తారు అవి భూలోకం లో జరుగుతాయి అంటారు, అలాగే సీత తనకోసమే పుట్టింది అని శ్రీరామునికి తెలియదా? సినిమా కథ లో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ జానకి ఆ శ్రీరాం కోసమే పుట్టింది అని అతనికి తెలియదా అని ఆమె అనుకోవటం సమంజసమే. 

వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి విరిగేల
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా
ఈ రెండు వాఖ్యాలు రాసిన సిరివెన్నెల ఊహ శక్తికి, పదాల పొందికకు ఆయనలోని సరస్వతికి శత కోటి నమస్సుమాంజలులు. ఇద్దరి మధ్య ఎడబాటు వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం వల్ల ఇద్దరికీ విరహం కలిగితే ఆ విరహమే శివధనుస్సు అయ్యింది. వాళ్ళిద్దరూ కలవాలి అంటే ఆ విరహం కరగాలి అది ఎలా అంటే ఆ విరహం విల్లువై విరిగితే కాని వరమాల సీతమ్మ వారి మెడలో పడదు. ప్రాయాన్ని పాలతో పోలుస్తారు ఎందుకంటే ఆ పొంగుని ఆపటం కష్టమే. పొంగటం ఆరంబిస్తే ఆగవు, అలాగే కడలి అలలు అవి వస్తూనే ఉంటాయి. ఆ రెండిటికి ముడి వెయ్యటం సిరివెన్నెల గొప్పతనం. ఇంక సినిమా లో కథ నాయికా, నాయకులు శారీరికంగా ఇద్దరు దూరమైనా వాళ్ళ మనస్సులు, ఆలోచనలతో ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు, అది చెప్పటానికే విడిపోని బంధం అంటారు. ఇంతకన్నా గొప్పగా ఎవరైనా ఆలోచించగలరా ??? శివధనస్సు విరిగి సీతమ్మ వారి మేడలో వరమాల పడితే వారి విడిపోని బంధం కలిసి, వయసు లో ఉన్న వాళ్ళిద్దరి కలయిక పాల సముద్రం అలల లాగ పొంగుతాయి కదా. ఈ ఊహ కథానాయిక ద్వారా మనకి కలుగ చేయటం అయన తో పాటు మన జన్మ ధన్యం.

కొసమెరుపు: ఘంటాడి కృష్ణ, ఇంజనీరింగ్ చదివినా, సంగీతాన్ని తన వ్రుత్తి గా మార్చుకొని సినిమా రంగం లోకి అడుగు పెట్టిన తెలుగు సంగీత దర్శకుడు. సిని పరిశ్రమలో ఎంతో ఎత్తు ఎదగలేక పోయిన, తనకంటూ ఒక ముద్ర తో సిని రంగం లో గుర్తింపు పొందాడు. ఈ మధ్య టీవీకి పరిమితం అయిపోయిన, ఇటువంటి కొన్ని మంచి పాటలు అందించాడు మంచి అభిరుచి గల సంగీత దర్శకుడిగా మిగిలిపోయాడు . ఇతను చేసిన పాటలలో 6teens నుంచి "దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే" బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట కుమార్ షాను తో పాడించాడు ఎందుకో మరి.

No comments:

Post a Comment