Movie Name: ఎలా చెప్పను
Producer: స్రవంతి రవి కిషోర్
Director: BV రమణ
Music Director: కోటి
Singer(s): KS చిత్ర
Lyrics: సిరివెన్నెల సీతారామశాస్త్రి
Year of Release: 2003
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంద
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం ||
ప్రతి మనిషి జీవితం లో మాటకు అందని భావోద్వేగాలు అనేకం. తను పడుతున్న ఉద్వేగం,ఆరాటం, తపన కష్టం ఇవన్ని ఇతరులకి తెలియచేయటం చాల కష్టం. అటువంటి భాషకు అందని భావాలు సినిమాలో చూపించటం అసాధ్యమైన పని. ఇలాంటప్పుడే సాహిత్యం పాట రూపంలో తోడు అవుతుంది. అందుకే అంటారు మాట కరువయినప్పుడు పాట ఆరంభం అవుతుంది అని. కాని ఒక్కోసారి పాట కూడా సరి అయిన భావం తెలియచేయ్యలేక పోవచ్చు, అటువంటి అప్పుడు సంగీతం ఆ భావాన్ని అంద చేస్తుంది. ఈ రెండు తోడయినప్పుడు ప్రేక్షకుడి హృదయం కరిగితే, సంగీతం, సాహిత్యం సఫలీకృతం అయినట్లే. అటువంటి సందర్భానుసారమైన పాటలలో ఈ పాట ఒకటి. పది సరళమైన వాఖ్యలతో మనిషిని అంతులేని భావోద్వేకనికి గురిచెయ్య గలిగిన ఈ పాట విన్నప్పుడు తెలుగు ప్రేక్షకుడి కంట ఒక్క చుక్క కన్నీరు కారక మానదు.
సిరివెన్నెల గారు నిశీధి వేళలో పాటలు రాస్తారు అని చాల మందికి తెలుసు, అందుకనేనేమో సిరివెన్నెల అయ్యారు. చీకటి వేల వచ్చే చందమామ కురిసేది వెన్నెలే, అందులో పండు వెన్నెల కాంతి బంగారం. ఇటువంటి పాటల సిరులు వెన్నెల రూపం లో రాత్రి వేల కురిపించే సీతారామ శాస్త్రి గారికి సిరివెన్నెల ఇంటి పేరు అవటం చాల సమంజసం. ఎంతో అర్థత నిండిన సాహిత్యానికి కోటి స్వరాల కోటి, సందర్భానికి ఆ సాహిత్యం అర్థం అయ్యి ఆ అర్థం ప్రేక్షకుడికి చేరేలా సంగీతం సమకూర్చటం ఈ పాటతో తెలుగు ప్రేక్షకుడికి లభించిన వరాలు కోటి. ఇంక చిత్ర గారి స్వరం లో పలికిన భావం అనితర సాధ్యం అనిపిస్తుంది. పాత్రకి ఒదిగి పోయిన స్వరం అందరిని ఆకట్టుకుంటుంది అనటం లో సందేహం లేదు.
ఈ సినిమా కి వస్తే శేఖర్ ( కథానాయకుడు ) IIM లో చదివి అవార్డు విన్నింగ్ బిసినెస్ మాన్. తక్కువ సమయం లో ఎంతో ఉన్నతమైన స్తితికి ఎదిగిన ప్రతిభావంతుడు. అతనికి అమర్ వర్మ అనే NRI (జర్మనీ లో వర్మ ఇండస్ట్రీస్ అధిపతి ) పరిచయం అవుతాడు. అమర్ శేఖర్ కి తన కంపెనీ లో ఉద్యోగానికి అవకాశం ఇస్తానని మాట ఇస్తాడు. కాని విధి వైపరీత్యం వల్ల, అనుకోని సంఘటనలో శేఖర్ చేసిన కారు ప్రమాదం లో అమర్ వర్మ చనిపోతాడు. శేఖర్ స్నేహితుడు సునీల్ చేసిన సహాయం వల్ల శిక్ష లేకుండా బయట పడినా పశ్చాత్తాపం తో కుమిలి పోతాడు శేఖర్. ఇంక తన వల్ల కాక సునీల్ తో పాటు జర్మనీ బయలు దేరతాడు. అక్కడ అమర్ వర్మ ఇండస్ట్రీస్ అప్పుల్ల్లో కూరుకు పోయి మూట పడే స్తితి కి వస్తుంది. వర్మ ప్రేమించిన ప్రియ అమర్ ఇండస్ట్రీస్ నడుపుతూ అటు ప్రియుణ్ణి కోల్పోయి, ఇటు కంపనీ మూత పడే స్తితి లో నిస్సహాయమైన స్తితిలో చూసి శేఖర్ ఏమి చేస్తాడు, చివరికి కంపనీ, ప్రియ ఏమి అవుతారు అనేది కథ. ఆ ప్రమాదం విషయం ఎలా చప్పుడు అన్నది తేరా మీద అంశం.
BV రమణ ఈ పాట ద్వారా అమర్-ప్రియల ప్రేమని సినిమాలో తెలియ చేస్తారు, ఆ తరువాత ప్రియ పడే తపన, ఎడబాటు వల్ల ప్రియ లో కలిగిన ఆవేదన చూపించటానికి వాడుకున్నారు సినిమాలో. శేఖర్ జర్మనీ వెళ్లి అమర్ కంపనీ లో చేరిన తరువాత ఒక టెండర్ విషయం లో చొరవ తీసుకొని వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసేలా చేస్తాడు. ఆ సంతోష సమయం లో అమర్ గుర్తుకు వస్తాడు ప్రియకి, అప్పుడు అమర్ ఫోన్ నుంచి తనకు ఫోన్ చేసుకొని అమర్ ఫోటో చూస్తూ ఆ ఫోన్ రింగ్ కి అమర్ ని తలచుకుంటూ పాట ఆరంభిస్తుంది ప్రియ...
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా
తను అత్యంత ఇష్టం గా ప్రేమించిన మనిషి తాత్కాలికంగా దూరం అయిన ఎడబాటే అత్యంత కఠినం. అటువంటిది శాశ్వతం గా దూరం అయితే ఒక స్త్రీ పడే వేదన ఎంత కష్టమైనదో చూసే వాళ్ళకి అంత తొందరగా అర్థం అవ్వదు స్వయం గా అనుభవిస్తే తప్ప. అటువంటి మానసిక స్తితిని వేరే వాళ్ళకి తెలియ చెప్పటం చాల కష్టం. ఈ పాట చూస్తె సిరివెన్నెల గారు కఠినమైన పదాలు ఎక్కడ వాడలేదు. కాని ఆ భావం అద్బుతం కళ్ళకి కట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ప్రియకి తెలుసు అమర్ ఇంక ఈ ప్రపంచంలో లేడు అని, కాని జ్ఞాపకాలు మరచి పోయటం చాల కష్తమైన పని. ఎవరికైనా సంతోషం కాని దుఖం కాని వచినప్పుడు తనకు ప్రియమైన వాళ్ళని తలచుకోవటం సాధారణం గా చేసే పని. అలాగే కంపనీకి జరిగిన మంచి అమర్ కి చెప్తూ అతని నుంచి ఏదో వినాలని ప్రియ అనుకోవటం ఈ పాట ఆరంభం. అమర్ తిరిగి రావాలని అనుకోవటం అనే విషయం తరువాత అయిన ఇప్పుడు మాత్రం నీ తీయటి గొంతు వినాలని తప్ప వేరే ఏ కోరిక లేదు నాకు అని "ప్రియ" అనటం ఆ వాఖ్యానికి కోటి గారు, చిత్ర గారు అద్దిన సుందరమైన స్వరాల సుమాంజలి హృదయాలని కరిగించక మానవు. అనంత తీరాలకి వెళ్ళిన అమర్ ఎంత దూరం లో ఉన్నాడో తెలియదు. అయినా ఆ దారి తెలిస్తే అందరు తన వాళ్ళని వెతుక్కొని రావచ్చు వాళ్ళని కలవచ్చు అందుకనే భగవంతుడు ప్రపంచం నుంచి తీసుకెళ్ళే వాళ్ళని మనకి తెలియని చోటికి తీసుకొని వెళ్తాడు, తెలిస్తే మనం వెళ్లి తెచ్చేసుకుంటాము అని. ఆ తెలియని దారులలో ఎంత దూరం వెళ్తే, వెళ్తే దూరం తరుగుతుంది? ఇది తెల్సిన "ప్రియ" మనసు ఆశగా ఎక్కడున్నాడో తన అమర్ అనుకుంటుంది. ఎంత అద్భుతమైన భావం?
ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||
ఎడబాటు తెల్సిన వారికి తెల్సు నిమిషం గడవటం ఎంత కష్టమో, ఒక్కో క్షణం ఒక యుగం అవుతుంది. కలిసే వరకు నిమిషాలు లెక్క పెట్టుకోవటం మామూలే, కాని ఇలా తిరిగి రాని లోకాలకి వేల్లోపోయిన అమర్ కోసం ప్రియ పడుతున్న మానసిక సంఘర్షణని అడుగడున తెలియచేస్తారు సిరివెన్నెల. రాదు అని తెల్సిన మనసు పడే ఆవేదన, తనని కలవచ్చు అనే ఆశ ఈ చరణం. తనను ఒంటరి గా వదిలి వెళ్లి పోయాడు అని అంగీకరించని మనసు, అతను తిరిగి వస్తాడు అని వేచి చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటోంది. కాని అది ఎంతసేపు అని చెప్పవేంటి? అయిన నువ్వు నన్ను వదిలేసి వెళ్లి ఏంటో సేపు అవ్వలేదు గా, ఆరు నెలలు అయిన అది నిన్ననే జరిగినట్లు ఉంది, నిన్ను చూసే దాక నా మనసు స్తిమితం లేక ఆరాటం తో అటు ఇటు పరిగెడుతోంది, అందుకనే నీ స్వరం ఒక్కసారి వినిపించవు అని దీనం గా కోరుకోవటం చాల ఉదాత్తం గా ఉంటుంది. దర్శకుడు కూడా అమర్ తో ప్రియ గడిపిన క్షణాలని చూపించి ఆమె పడుతున్న సంగర్షణ ఆవేదన చూపిస్తారు సినిమాలో.
రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం ||
ఇంకా అదే ఆలోచనలతో కొనసాగుతుంది ఈ పాట. మరల తన మనసు ఏమను కుంటుందో అమర్ కి తెలియ చెప్పే తపన. మనసు పడే ఆవేదన, ఆ ఆరాటాన్ని తగ్గించటం చాల కష్టమే. కలిసిన తీపి క్షణాలు, చిలిపి చేష్టలు, ఇవన్ని గురుతుకు వచ్చి మనసులోని ఆలోచనలు తగ్గటం లేదు, ఒక్క క్షణం కూడా తగ్గటం లేదు, నిద్ర పొతే ఆలోచనలు తగ్గుతాయి, కాని ఆలోచనలే ఆగనప్పుడు నిద్ర ఎలా పడుతుంది, అందులో ఏదో చేసెయ్యాలి అన్నప్పుడు నిద్ర దరిదాపుల్లోకి రాదు. అందుకనే ఈ దూరం వాళ్ళ కలిగిన ఎడబాటు లో ఏదో అమర్ వస్తే ఏదో చెప్పాలి, ఏదో పంచుకోవాలి అని ఆతర పడే మనసుకి విరామం ఒక్క అతను వచినప్పుడే కలుగుతుంది. అందుకని వచ్చిన తరువాత నచ్చ చెప్తే, ఆ తరువాత మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తే కాని మనసు తేలిక పడదు, కాబట్టి నువ్వు వచ్చి నీ తీయని స్వరం వినిపించమని వేడుకుంటుంది "ప్రియ".
అద్బుతమైన భావం తో పాట రాసిన సిరివెన్నెల గారు, అత్యంత మధురం గా స్వరపరచిన కోటి గారు, ఈ పాటకి అంతే న్యాయం చేకూర్చిన చిత్ర, వీళ్ళు సిని చరిత్రలో ఈ పాటతో చిరాయువు ని పొందారు.
కొసమెరుపు: ఈ సినిమా మాతృక హిందీ సినిమా "तुम बिन". ఈ సినిమాకి బలం సంగీతం, మనసు కదిలించే పాటలు. సిరివెన్నెల, కోటి ఈ సినిమాకి గొప్ప వరం, పెద్ద బలం. ఈ సినిమాలో ఇంకో పాట అప్పుడప్పుడు కదిలించి వెళ్ళిపోయే పాట "మంచు తాకిన ఈ వనం".
chaala bagundi rao garu
ReplyDelete