Saturday, April 7, 2012

Song of the week - Karige loga ee kshanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:     ఆర్య 2
Producer:                 Aditya Babu & BVSN Prasad
Director:                   Sukumar
Music Director:        Devi Sri Prasad
Singer(s):                 Kunal Ganjawala, Megha
Lyrics:                       Vanamali
Year of Release:      2009



కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ    (2)

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 

ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .

మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..                                || కరిగే లోగా ||

ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యి విజయవంతం అయితే అటువంటి ఇంకో సినిమా తీయటం చూస్తూ ఉంటాము. అటువంటి "సీక్వెల్" కోవకు వచ్చేదే ఆర్య - 2. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆర్య, అజయ్ చిన్న నాటి స్నేహితులు అనేకంటే ఆర్యని అజయ్ శత్రువుగా భావిస్తే, ఆర్య మటుకు అజయ్ కి ప్రాణం పెట్టే స్నేహితుడు. అనాధలైన ఇద్దరు ఒకే చోట పెరుగుతూ ఉంటే స్నేహితుడు కావాల్సి రావటం వాళ్ళ అజయ్ స్నేహితుడు అవుతాడు కాని అజయ్ మటుకు ఆర్యని శత్రువు గా నే చూస్తాడు. ఒక జంట వీరిలో ఒకరిని పెంచుకుందామని వస్తే, అజయ్ ని పంపిస్తాడు ఆర్య. కాలక్రమేనా అజయ్ మంచి స్తితిమంతుడిగా స్థిరపడి తనకంటూ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. ఆర్య అదే అజయ్ కంపెనీ లో ఒక ఒప్పందం మీద ఉద్యోగి గా స్థిరపడతాడు. అక్కడ పనిచేస్తున్న గీతని  ఇద్దరు ప్రేమిస్తారు. అజయ్ ఆడిన నాటకం వల్ల గీత అజయ్ ని ప్రేమిస్తుంది, కాని ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి చివరికి అజయ్ ఆర్య ల స్నేహం ఏమవుతుంది, ఆర్య గీతల  ప్రేమ కథ ఏమవుతుంది అన్నది సినిమా.

ఈ సినిమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. సినిమాలో మొత్తం పాటలు అన్ని జనాలని ఉర్రూతలు ఊగించింది. ఈ సినిమా తరువాత ఒకే సినిమాలో మొత్తం అన్ని పాటలు జనాదరణ పొందిన సినిమా ఇప్పటివరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. "రింగ రింగా" అనే పాట అయితే ఉత్తర భారత దేశం లో పండుగలప్పుడు విశేషాదరణ లభించింది. అంతే కాదు క్రికెట్ మాచ్ లోను, ఎక్కడ పడితే అక్కడ .  బాష తో సంబందం లేకుండా ప్రజా దరణ పొందింది. ఇటువంటి పాటలని అందించిన దేవి శ్రీ ప్రసాద్ మనకున్న ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు. అన్ని రకాల పాటలు అందరిని అలరించేలాగా అందించగల సమర్ధుడు. అందుకనేనేమో అందరి కథా నాయకుల తోనూ పనిచేసే అవకాశం లభించటం ఒక ఎత్తు అయితే అవి సద్వినియోగ పరచుకోగలటం దేవిశ్రీ  ప్రతిభకి నిదర్శనం.

కరిగేలోగా ఈ క్షణం పాట నేపధ్యం సినిమాలో ఆర్య తన ప్రేమని స్నేహితుడి కోసం వదులుకొని వాళ్ళని విదేశం పంపించాలని అనుకోవటం, వాళ్ళని ఒప్పించి స్నేహితుడి గా మిగిలి పోతున్న క్షణం లో వచ్చే పాట ఇది. తన ప్రాణమైన గీతని, అత్యంత ప్రాణం గా స్నేహించే అజయ్ కోసం ఒప్ప చెప్పటం ఆ ఆవేదన భరిత ఆలోచనలో సాగిన పాట ఇది.  వైవిద్యం ఏమిటంటే ఈ పాట ట్యూన్ కంపోసే చేసిన రీతి, వనమాలి గారు రాసిన విలక్షణ సాహిత్యం హృదయాన్ని స్పర్సిస్తుంది. ఆర్య ఈ సినిమా మొత్తం లో ఎవరికీ అర్థం కాక పోయినా, ఈ పాట అతని మనస్తత్వం తెలియచేస్తుంది, అతను  పడే సంఘర్షణ తెలియచేస్తుంది. 


అలాగే దేవి శ్రీ చేసిన ఒక విలక్షణ ప్రయోగం ఈ పాట. ఈ పాట మొత్తం సముద్రం, నది, అలలు అంటూ ఎలా సాగుతుందో, పాట కూడా అలాగే సాగుతుంది. ఇంక మొదలు ఎలా సాగుతుంది అంటే, ఒక అల ఒడ్డుని తాకేటప్పుడు ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది. ఆ వయోలిన్ సంగీతం. ఆ హెచ్చు తగ్గులు అలల్లాగా ప్రవహించి వేగం పెంచుతూ, శబ్దం హోరు పెరుగుతూ తగ్గుతూ కోరస్ తో పోటి గా సాగుతూ చివరికి అల ఒడ్డుకోచ్చేసరికి ఎలా వేగం పెరిగి పెరిగి ఒడ్డుని తాకుతుందో అలాగా సాగి ముగుస్తుంది. అప్పుడు పాట మొదలు అవుతుంది. ఈ పాటలో ఇంకో విలక్షణమైన ప్రయోగం ఏమిటంటే, అందమైన విరుపులు, ఒక రకమైన "different intrumentation" , పదాల తరువాత  సరళమైన  నిశ్శబ్దం సరికొత్త పరిమళం అందిస్తాయి. ఈ పాటకి రిథం కూడా సరికొత్తగా ఉంటుంది, ఇవ్వన్ని సరిగ్గా సమకూడి పాట విన్న తరువాత ఒక రకమైన మధురమైన  అనుభూతి కలిగించి మరల  మరల వినేలా చేస్తుంది.  ఇంతంటి అందమైన ప్రయోగం చేసిన దేవి శ్రీ ప్రసాద్ అభినందనీయుడు. ఇంక పాట సాహిత్యానికి వస్తే ఈ సినిమా లో కొన్ని పాటలు సినిమాలోని సందర్భానికి సరిపోయే లాగ సరిగ్గా సరిపోయాయి. కాని ఈ పాట మొత్తం సినిమాలో అన్ని పాటలకన్న శ్రేష్టమైనది. అది ఎందుకో చూద్దాం.

కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ (2)

మనిషి మనస్తత్వం ఎలాగా ఉంటుంది అంటే, ఏదైనా ఇష్టమైనది ఆనందం కలుగ చేసే సమయం ఉంటే, అది ఎప్పటికి తరగ కుండ ఉండాలని, ఆ సమయం అలాగే నిల్చి పోవాలి కలకాలం అని కోరుతుంది. అదే ఏదైనా దుఖం కాని, మనసుకి నచ్చనిది రాబోతోంది అంటే, ఆ క్షణం రాకుండా ఉండేలాగా వేయి విధాలుగా కోరుతుంది. ఈ పాట ఆరంభం లో ఆర్య మనసులోని ఆలోచన, ఈ పాట రూపం లో రాసారు వనమాలి గారు. తను ప్రేమించే గీత, తను విడిచి ఉండలేని స్నేహితుడు ఇద్దరు ఇంక తనకి కనపడరు అన్న చేదు నిజం ఒక వైపు, తను అమితం గా ప్రేమించే గీత ఇంక తనకి దక్కదు అన్న విషయం తెల్సిన తరువాత తన హృదయం స్పందించకుండా మిగిలిపోతుంది అనే సత్యం సాక్షిగా అజయ్, గీత చేతులు కలిపిన క్షణం లో ఇలాగే తన జీవితం గడిపేయాలి అన్న ఆలోచన ఆర్య కి కలగటం ఎంతైనా సమంజసం. ఇంక ఓటమి అనేది రెండు సార్లు కలిగితే ఆ ఆలోచనతో కలిగిన దుఖం కలుగుతుంది ఆర్య కి. ఒక మనిషికి కలిగే దుఖం పోల్చటానికి కన్నీరు కొలత ఐతే ఆ కన్నీరు సముద్రం అంత పొంగితే మనిషి లోని దుఖం ఎంతో మనం ఊహించుకోవచ్చు.  ఈ మానసిక స్థితిని ఎంతో అద్బుతం గా వర్ణిస్తారు. కన్నులలోంచి జారే కన్నీరు, సముద్రం అంత అయితే ఆ సముద్రం లోంచి వచ్చే అలలు, తన జ్ఞాపకాలు. గడచిన ప్రతి నిమిషం గాయం గా మిగిలిపోతే, ఆ గాయం గమ్యం అయితే ప్రతి గమ్యం గీత పట్ల తనకున్న ప్రేమ కి గుర్తుగా మిగిలిపోతుంది, అటువంటి ప్రయాణం, ఈ క్షణం మిగిలిన జీవితం అంత గడిపేయాలి అనుకుంటాడు ఆర్య. ఇంతటి మధురానుభూతి మిగిల్చిన వనమాలి గారు అక్కడితో ఆగకుండా పదాలతో తన ప్రయాణం చరణాల్లో కొనసాగిస్తారు.



పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||


వనమాలి గారు ఈ చరణం తో ఈ పాట విన్న వారిని ఆకట్టుకుంటారు అనటం లో సందేహం లేదు, ఆర్యకి తన జీవితం లో మిగిలనిది ఇద్దరు, ఒకడు తన ప్రాణం అయిన స్నేహితుడు అజయ్ ఒక వైపు, మరో వైపు ప్రేమించిన గీత. ఈ సంఘర్షణ ఈ చరణం. అదే అత్యంత అద్బుతమైన పోలిక తో వివరిస్తారు. నది ప్రవహిస్తూ ఉంటే నదికి రెండు వైపులా తీరం ఉంటుంది. ఆ నదికి ఏ తీరం కి దగ్గర అవుతుంది ఆంటే జవాబు దొరకదు, అలాగే ఆర్య కి అజయ్, గీతాలలో ఎవరికీ దగ్గర ఆంటే ఎలా చెప్తాడు, నదికి రెండు తీరాలు ఎలాగో ఆర్య కి అలాగే. ఇంక ఆర్య జీవితం కూడా ఒక కలే. అతనికి అజయ్, గీత తన జీవితం లో ప్రవేశించటం ఒక కల. నిద్ర దాటి వచ్చే కల మెలుకువగా ఉన్నప్పుడు ఏ కంటి లోంచి వచ్చిందో ఆ కంటి కి సొంతం అవుతాము ఆంటే జవాబు దొరకదు, ఎందుకంటే రెండు కళ్ళు మూసుకుంటేనే నిద్ర,. ఆ నిద్ర లో వచ్చేదే కల. ఇంక మెలుకువ వచ్చిన తరువాత ఈ కన్ను నాది ఆంటే ఏమని చెప్తాం? ఇంక తరువాత వాఖ్యాలు విన్న తరువాత వనమాలి పద సౌందర్యానికి అచ్చెరువు పొందాల్సిందే. ప్రేమ నేస్తం అవుతుంటే, తనలోని సగం  ప్రశ్న గానే మిగిలి పోతుంది కదా, ఆంటే ప్రేమ సఫలీకృతం అయితే ఆ ప్రేమ తనలో సగం అయ్యేది, అది అవ్వకుండా ప్రశ్న గా మిగిలిపోతుంది. అప్పుడు ఆ బంధం విడిపోకుండా ఉండటానికి వీలు లేకుండా ఉంటుందా అని ఆర్య అనుకోవటం సినిమా లో అతని పాత్ర గురించి ఇంత కన్నా చక్కని వివరణ ఉండదు.

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .
మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..      || కరిగే లోగా ||

ఇంక ఈ పాట కొనసాగుతూ చివరి చరణం లో పతాకానికి చేరుకుంటుంది. ఆర్య తన స్నేహితుని కోసం అన్ని చేస్తాడు, కాని తను అడుగడుగునా అతనికి బాధ కలిగే విషయాలే జరుగుతూ ఉంటాయి. పెదవుల పై నవ్వుని, పువ్వు తో పోల్చటం కవి ఆలోచన శక్తి కి నిదర్సనం. వికసించిన పువ్వులు ఎంత అందం గా ఉంటాయో ఆ చిరు నవ్వు కూడా అంతే అందం గా ఉంటుంది కాని కన్నీటి తో ఆ పువ్వులని పెంచటం అన్నది ఏందో అందమైన వర్ణన ఆర్య పాత్ర కి.  గీత మనసులో ఆర్య పట్ల కలిగే సానుభూతి కి జరిగే పరిణామాలకి ఈ వాఖ్యం నిదర్సనం. ఇక్కడ ఆలోచిస్తే గీతకే కాదు ప్రేక్షకుడికి కూడా ఆర్య పట్ల సానుభూతి కలుగుతుంది. ఇక్కడ వరకు గీత గురించి చెప్తే మరల ఆర్య దగ్గరకి, ఆ సన్నివేశానికి వచ్చేస్తారు వనమాలి,. గీత అజయ్ వెళ్లిపోతుంటే, ఆ దృశ్యం ఆర్య లో కలిగే ఆవేదన తో పోల్చటం ఆ తరువాత ఆ క్షణం అలాగ తన జీవితం అంతా ఉండిపోతే, ఎన్ని జన్మలైన ఇలాంటి క్షణాలు ఉండిపోతాయి అనటం అక్కడే పాట అంతం అయిపోవటం, అందరిలోనూ ఒక అందమైన అనుభూతి మిగిలి పోతుంది.

కొసమెరుపు:  ఆర్య -2 ఆడియో లో ఇదే పాట దేవి శ్రీ సోదరుడు సాగర్ ఇంకో వెర్షన్ పాడతాడు (D-Plugged). ఈ పాటకి సాగర్ గళానికి తోడుగా గిటార్ మాత్రమే ఉంటుంది.  ఈ పాట సినిమాలో వచ్చే పాట అంత వేగం గా, ఉండకపోయినా కొంచెం సున్నితం గా సాఫ్ట్ గా ఉండి విన్న వాళ్ళకి ఏమాత్రం తగ్గని అదే అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా లో ఎన్ని పాటలు జనాదరణ పొందినా, ఇటువంటి పాటలు హృదయానికి హత్తుకు పోతాయి. ఈ సినిమా లో మిగితా పాటలు ప్రాచుర్యం పొందినంత గా ఈ పాత కి గుర్తింపు లభించలేదేమో అనిపిస్తుంది . ఈ పాటకి తగ్గ గుర్తింపు లభిస్తే, వనమాలి, దేవిశ్రీ, గాయకులు పడిన శ్రమ కి ఫలితం దక్కినట్టే.


1 comment:

  1. Excellent song and beautifully written keep up the good work! !

    ReplyDelete