Friday, May 9, 2014

Song of the Week - Ramachakkani Seetaki

ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)

Movie Name:         గోదావరి 
Song Name :         రామ చక్కని సీతకి
Music Director:      K. M. రాధాకృష్ణన్
Singer(s):             గాయత్రి  
Lyrics:                  వేటూరి సుందర రామమూర్తి
Director:               శేఖర్ కమ్ముల
Producer :             G.V.G. రాజు
Year of Release:    2006

ఈ పాట తెలుగు సినీ చరిత్రలోని ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట. ఆ అధ్యయమే వేటూరి సుందర రామ మూర్తి గారు. ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి గారు, ఆయన రాసిన ఈ పాట. ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత తాదత్యం చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోత తో ఆనంద భాష్పాలు రాల్చే పాట.

ఇంకో పక్క చూస్తె, అర్థ వంతమైన పాటని అంతే అర్థవంతంగా సినిమాలో సందర్భం ప్రకారం ఉపయోగించుకొనే దర్శకులు మనకి బాపు విశ్వనాథ్ గార్లతో అంతమై పోయిందా అనిపించే పాట. అర్థవంతమైన పాటని ఎంతో  అందం గా చూపించ గలిగిన దర్శకులు జంద్యాల, వంశీ గార్లతోనే ముగిసిందా అనిపించే పాట  ఇది. ఎందుకంటే ఇంత అందమైన, అర్థవంతమైన పాట సినిమాలో నేపధ్యం లో వినపడి వినపడనట్టు వచ్చి వెళ్ళిపోతుంది. పాత్రల సంభాషణల్లో ఈ పాట  కొట్టుకుపోతుంది. ఇంకో పక్క దర్శకుడు ఈ పాటని సినిమాలో ప్రవేశ పెట్టినందుకు ఆనందం కూడా కలుగుతుంది, ఇందుకోసమైనా దర్శకుడు శేఖర్ కమ్ములని అభినందించక తప్పదు. సంగీతం అందించిన K.M . రాధాకృష్ణన్ మనకి వంద, యాభై సినిమాలకి సంగీతం అందించి శ్రోతల చేత తిట్టించుకునే కన్నా, ఇటువంటి చిరాయువు కలిగిన పాట చేస్తే సినిమా చరిత్ర లో చిరంజీవిగా నిలబడి పోగలుగుతాడు అని నిరూపిస్తాడు 

సీతారాముల మీద కవిత్వం రాయని కవి ఉండడు.అలాగే సీత రామ కథలని చెప్పని రచయిత ఉండడు. ఈ రెండు పాత్రలు భారతీయ సంస్కృతి లో ఎంతగా ఇమిడి పోయాయో చెప్పనలవి కాదు. రామ నామం వినగానే పరవసించని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రాముడు దేవుడయ్యింది అవతార పురుషుడు కాబట్టి అనే కంటే, అటువంటి పరిపూర్ణమైన పురుషుణ్ణి మనం ఇప్పటి వరకు చూడలేదు అంటే సరిపోతుంది ఏమో. అందుకనే ఏ పోలికైన రాముడి వైపు వెళ్తుంది, ఏ వర్ణన అయినా రాముడి వైపు వెళ్తుంది. అన్ని రకాలుగా అందరిని మెప్పించిన రాముడు దేవుడు అయ్యాడు. ఒక రాజు గా, ఒక కొడుకు గా, ఒక శిష్యుడి గా, ఒక స్నేహితుడిగా ఒక భర్త గా, ఒక అన్న గా, ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని విధాలా పరిపూర్ణమైన వాడు రాముడు. సీతా రామ జంట ఎంత కన్నుల పండుగా ఉంటుందో కవి ఊహా శక్తికి అందనటువంటి జంట. అందుకనే ప్రతి కల్యాణం సీతారామ కళ్యాణమే, అది తలచుకొంటే మనకి కలిగే ఆనందం అంతు లేనిది. వేటూరి గారు సినెమా లోని సీతా మహాలక్ష్మి ( సీత ), రామ్ ల జంట కోసం ఆ సీతారాముల మీద సరసం గా, సీతమ్మ వారి వేదనగా, విరహంగా, ఒక్కో వాక్యంతో రామకథని మనకి చెప్తారు. ఆ సమకూర్చిన సాహిత్యానికి అత్యద్భుతమైన సంగీతంతో  చక్కని తెలుగు తనం అడుగడునా ఉట్టిపడే పాటని అందించారు వేటూరి, రాధాకృష్ణన్ కలిసి. ఉడతా భక్తి గా తనవంతు సహకారం అందిస్తారు శేఖర్ కమ్ముల ఈ పాటని సినిమా ద్వారా అందించటంతో.

 అందించటంతో  సినిమా విషయానికి ఈ పాట సందర్భానికి వస్తే, శ్రీ రామ్ చాల నియమాలు కలిగి అవి పాటించి అందరి చేతా చులకలన పొందే వ్యక్తి. తన మరదలు తో పెళ్లి కోసం ఆశ పడతాడు కాని ఆమె తల్లి తండ్రులు రామ్ దగ్గర ఏమి లేదని ఒక ఐ పి ఎస్ ఆఫీసర్ కి ఇచ్చి భద్రాచలం లో పెళ్లి చెయ్యటానికి నిశ్చయిస్తారు. నిరాశ  తో ఆ పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక పోయిన తప్పని సరి అయి రాజమండ్రి నుంచి లాంచి లో వెళ్ళటానికి సిద్దమవుతాడు. ఇంకో పక్క సీతా మహాలక్ష్మి ( సీత ) జీవితం లో కలిగిన వైఫల్యాలతో విసిగి ( పెళ్లి కొడుకు సీతని తిరస్కరించటం, చేసే వ్యాపారం ముందుకు వెళ్లకపోవటం) విరామం కోసం అదే లాంచి లో భద్రాచలానికి వెళ్తుంది. ఆ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ ఆడ వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవటానికి లాంచి ఒక చోట ఆగుతుంది, అప్పుడు అందరి మధ్య జరిగే సంభాషణల నేపధ్యం లో వచ్చే పాట ఇది. అందరు బామ్మల లాగానే ఒక జంట పెళ్ళికి సిద్దం గా ఉన్నారంటే వాళ్ళ దృష్టి ఆ జంట మీదే ఉంటుంది. అందులో తనవాళ్ళు అయితే ఇంక వాళ్ళకి అడ్డే ఉండదు. ఈ సినెమా లో బామ్మ ,కూడా అంతే , మన ఇంట్లో బామ్మ/అమ్మమ్మ లాగ :)

ఈ పాటలోనే కాదు సినెమా మొత్తం గోదావరి అందాలు చెప్పనలవి కానివి. గోదావరితో  పరిచయం ఉన్నవాళ్ళకి అర్థం అవుతుంది ఇది మాటల్లో వివరించలేనిది అని. ఆ లాంచీ రేవు గోదావరి గట్టు, గోదావరి ప్రవాహం, నది మధ్యలో లంకలు, తెర చాపలు, చుట్టూ ఉండే పచ్చదనం, నది ఒడ్డులో పిల్లల ఈతలు, పాపి కొండల మెరుపులు, ఇవన్ని గోదావరి తో జీవితం ముడిపడి ఉన్న వాళ్ళ మధురానుభూతులు. వేదంలా ఘోషిస్తుంది, ఉప్పొంగి చేలల్లో పచ్చదనం తెచ్చి అందరిని అలరిస్తుంది, అందరి కష్టాలు తీరుస్తుంది, బ్రతుకు తెరువు కలిగిస్తుంది, అటువంటి గోదావరి తలచుకున్నప్పుడల్లా అనుభందం ఉన్న వాళ్ళ కళ్ళలో మెరుపు తప్పకుండా ఉంటుంది. ఇంక వేటూరి గారి పాటలోకి వెళ్దాము 

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

KM రాధాకృష్ణన్ ఈ పాటకి అడుగడునా న్యాయం చేకూర్చారు. గాయని, వాయిద్యం, నేపధ్యం అన్ని సరిగ్గా సమకూరాయి ఈ పాటలో. ప్రతి చరణం ముగించిన తీరు చాల బాగుంటుంది. ప్రశాంతం గా ఉండే గోదావరి లాగ ప్రారంభించి  మనసు తట్టి లేపి ఉప్పొంగిన గోదావరి లాగ కదిల్చి వేస్తుంది. నెమ్మది గా ప్రసాంతం గా సాగుతున్న నావ ఒక్క సారి జోరు అందుకున్నట్టు ప్రతి చరణం సాగుతుంది. మధ్యలో వచ్చే సంగీతం అలల్లాగా పలకరించి వెళ్లి పోతుంది.

సీతమ్మ వారి వర్ణన వింటాము పల్లవి లోని మొదటి రెండు వాఖ్యాలతో. నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన ( రమ ) ఘన విచలన అంటే నెమ్మది గా/ భారం గా నడిచేది అని, ఇక్కడ నెమ్మది  గా అంటే సున్నితంగా, వయ్యారంగా, దీన్నే మార్చి మంద గమన అంటారు చివర్లో. ధరణిజ అంటే భూదేవి కి కూతురు, మధుర వదన, ఇందు వదన అన్ని సీతమ్మ వారికి ఉపమానలే. నలిన నయన అంటే పద్మము వంటి కనులు కలదానా అని. సీతమ్మ వారి గురించి ఇంత వివరించి, అటువంటి మా సీతమ్మ సీత మనవి వినవా రామ అని పాట ప్రారంభిస్తారు వేటూరి గారు. సీతమ్మ మనవి ఏంటి అనేది మనకి తెల్సిందే రాముడిని కలవాలని, చూడాలని.

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట  || రామచక్కని సీతకి ||

తెలుగు నాట గోరింటాకు పెట్టుకోవటం ఒక చెప్పలేని అనుభూతి. ప్రతి వనిత ఎంతో కష్టపడి ఆకులు కోసి ఆ ఆకులని రుబ్బి, ఇష్టపడి చేతికి పెట్టుకొనేది గోరింటాకు. ఇది పెట్టుకోనని మారాము చేసిన కన్యల కోసమే అన్నట్టు గోరింటాకు పండిన విధానంకి ఆ కన్యకి రాబోయే వరుడికి ముడి పెట్టి ప్రోత్సహిస్తారు పెద్దలు. ఆ కన్య తన ఊహల్లో తనకి వచ్చే రాకుమారుడిని ఊహించుకుంటూ పండిన చెయ్యిని చూస్తూ మురిసిపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడ, గన్నేరు లా పూస్తే కలవాడు వస్తాడు, సింధూరం లా పూస్తే చిట్టి చేయ్యంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు అన్నారు. వేటూరి గారిక్కడ రాముడు మెచ్చిన, రాముడికి నచ్చిన సీతకి అరచేత గోరింటాకు పెడితే ఆ గోరింటాకు పండిన చెయ్యి మెరిసిపోతే చక్కని సీతకి మొగుడు గా ఎవరు వస్తారో అని అడుగుతూనే  రాముడు కాక ఇంకా ఎవరు వస్తారు అని చెప్పకనే చెప్తారు రామచక్కని సీత అంటూ. ఈ రెండు వాక్యాలతో సీత కళ్యాణం ముందు ఉన్న ఘట్టాలన్నీ అలాగే కల్యాణం ముందు సీత ఏమి ఊహించుకొని ఉంటుందో అన్న ఊహ లోకి తీసుకెళ్తారు వేటూరి గారు. ఈ పాట పాడిన గాయత్రి మొత్తం పాట అద్బుతం గా పాడినా అరచేత గోరింట అన్నప్పుడు గోరింట అన్నప్పుడు స్పష్టం గా ఉండదు. ఇంత చక్కని కవిత్వానికి చెయ్యగలిగిన న్యాయం ప్రతి మాట స్పష్టం గా వినపడేలా పాడటమే.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో           || రామచక్కని సీతకి ||

వేటూరి గారి కల్పనా శక్తి కి హద్దు అంటూ ఉండదా? ఈ మూడు వాఖ్యాలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రాముడు అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అని అందరికి తెల్సిందే. ఆ శక్తి ఎటువంటిదంటే సీతా స్వయంవరం అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరు ఎత్తలేని శివ ధనుస్సుని  ఎడమ చేత్తో ఎత్తటం రాముని ప్రతాపానికి ప్రతీక. ఇంక రాముడు సీత కోసం లంక కి వెళ్ళేటప్పుడు సముద్రం మీద వంతెన కడ్తున్నప్పుడు అందరూ శక్తి వంచన లేకుండా రామకార్యం అని తలచి చేతనైన సహాయం చేసారు. ఆ క్రమంలో ఒక ఉడత కూడా సహాయం చెయ్యటం చూసి సంతోషంతో ఉప్పొంగిన రాముడు ఆ ఉడతని ఆప్యాయంగా చేత్తో తీసుకొని వీపు మీద వేళ్ళతో నిమురుతాడు. అప్పుడు పడిన గీతలు ఉడత జాతి మీద ఉండి పోతాయి. ఈ రెండు ఉదంతాలు ఎంత అద్బుతమైన పదాలతో చెప్తారో వేటూరి గారు. ఈ రెండు వాఖ్యాలకే కళ్ళు చమ్మగిల్లితే ముగింపు వింటే ఆయన కవితా పటిమకి అబ్బుర పడవలసిందే. శక్తి వంతమైన రాముని చెయ్యి ఎడమ చేత్తో శివధనస్సు ఎత్తుతాడు, ఉడత వీపున వేలు విడుస్తాడు, అటువంటి రాముడు సీతని పెళ్లాడతాడు అన్న అర్థం వచ్చేలా చెప్తారు పుడమి అల్లుడు రాముడే అని. సీత అమ్మ వారు భూదేవి కూతురు, భూమి నుంచి పుడ్తుంది కాబత్తి. సీతకి భర్త అయితే భూమాతకి అల్లుడే గా. కాని ఎడమ చేత్తో సీత జడను ఎత్తగలడా అన్న ప్రశ్న  సంధిస్తారు ఇదే అయన ఊహ శక్తికి నిదర్సనం. ఎందుకంటే తాళి కట్టటానికి రెండు చేతులు కావాలి, మరి తాళి కట్టేటప్పుడు తనంతట తానే జడని ఎత్తటం ఎవరికీ కుదరదు ఎంతటి బలవంతుడి కైనా శక్తిమంతుడి కైనా. ఉన్న రెండు చేతుల తో తాళి కడతే జడ ఎత్తటం ఎలా సాధ్యం? ఇటువంటి అద్భుతమైన ధర్మ సందేహం కలగటం వేటూరి గారి చమత్కారం అది కూడా నిఘూడం గా.

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపోశైనాడు దేవుడు నల్లని రఘురాముడు    || రామచక్కని సీతకి ||

ఇప్పుడు లంకకి ఇటువైపు రాముడు ఉంటె, అటువైపు సీతమ్మ వారు. రాముడి జాడ తెల్సినా ఎప్పుడు వస్తాడో తెలియదు, కాని వస్తాడని నమ్మకం. సీతమ్మ వారిని ఎర్ర జాబిలీ తో పోలుస్తారు, ఇది ఇంకో చమత్కారం. ఎర్ర జాబిలి  చెయ్యి గిల్లటం ఏమిటి అని అనిపించక మానదు. బాద తో కూడిన ఉక్రోషం తో కూడి ఎర్రగా కందిపోయిన ముఖం ఎరుపు గానే ఉంటుంది. జాబిలి లాంటి సీతమ్మని రాముడు ఏడి అని అడుగుతుంటే మాట ఒకటి అంటే కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. మనం ఏదైనా చెప్పొచ్చు కాని కళ్ళు అబద్దాన్ని దాచవు అంటారు. కళ్ళు ఏమి చెప్తున్నాయో చెప్తే మనం గమనించొచ్చు. ఇక్కడ రాముడి జాడ లేదు కనపడకుండా పోయాడు, ఆ మాట పెదవితో చూడలేదు అని చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తాయి రాముడు ఎక్కడున్నాడో తెలియదు అని. నల్ల పూసై నాడు దేవుడు నల్లని రఘు రాముడే. నీల మేఘ శ్యాముడు రాముడే గా అందుకని నల్లని రఘురాముడు అన్న ప్రయోగం అలాగే మనతో ఉండి కనపడకుండా పోయిన వాళ్ళని నల్ల పోశ అయ్యావు అంటారు. ఇది వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో బాగా ప్రయోగిస్తారు. అమావాస్య తరువాత చంద్రుడు వచ్చినా కనపడడు, అలాగే రాముడు ఉన్నాడు కాని కనపడడు అని సీతమ్మ అనుకుంటోంది అని అందం గా చెప్తారు 

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా  || రామచక్కని సీతకి ||

వేటూరి గారు చక్కని చుక్క అని సీతమ్మ వారిని అంటారు కానీ ఇక్కడ రాముడి కోసం సీత పడే తపన ఈ చరణం. చుక్కలని, దిక్కులని అడిగా రాముడు ఏడని, ఇంక బాధతో కూడిన కన్నులని అడిగితె అవి నీటి తో చెమ్మగిల్లాయి, వాటి నిండా కన్నీరే, ఏదైనా చెప్పటానికి ఆ కన్నీరే అడ్డుపడింది, మనసు నిండా ఉన్న రాముడుని చూసుకోవటానికి అడిగితె చెప్పటానికి రాముడు కనపడటం లేదని బాధ తో ఉన్న మనసు నుంచి మాటలు రావటం లేదుగా - ఎంతో ఆర్తితో రాసిన వేటూరి గారు, అంతే  ఆర్తి ధ్వనిస్తుంది ఈ చరణం లొ. 

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

వేటూరి గారు ఇందువదన కుందరదన అన్న పదాలతో ప్రయోగం చేసిన పాట ( చాలెంజ్ సినిమా లో ) వింటే ఆ పాట కి ఈ పాట కి ఎంత వ్యత్యాసమో కదా. మరల అవే పదాలు అటు ఇటు మార్చి ఒకసారి సీతని వర్ణిస్తే ఇంకో సారి ప్రశ్నిస్తారు ఎందుకమ్మా నీకు ఇంత  వేదన, ప్రేమ వలెనే కదా అని. అది పదాల మీద ఆయనకి ఉన్న పట్టు. సీతమ్మ వారిని చందమామ తో పోలుస్తారు ఒక సారి ఎర్ర జాబిలి  అంటారు ఇంకోసారి చంద్రుని వదనం కల దాన అంటారు ఒక సారి మంద గమన అంటారు ఇంకో సారి ఘన విచలన  అంటారు. అతిలోక సుందరి సీతమ్మ వారు నడిస్తే అత్యంత వయ్యారం గా ఉంటుంది, ఆ నడక చూస్తే కందిపోతుందేమో సీతమ్మ పాదం అన్నట్టు ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్న సీతమ్మ నీకు ఎందుకమ్మా ఇంట విచారం, రాముని మీద ప్రేమ వలెనే కదా? అయినా సీతమ్మని వర్ణించాలంటే ఒక జీవితం సరిపోతుందా? ఈ మాటల మాంత్రికుడి చేతిలో పదాలు మారి అర్థం మారేది శ్రోతల్ని అలరించటానికే సుమీ అన్నట్టు ఉంటాయి.

కొసమెరుపు: వేటూరి గారు శేఖర్ కమ్ముల కి ఎంత సహాయ పడ్డారో శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తె తెలుస్తుంది, ఆనంద్ కాని, గోదావరి కాని, లీడర్ కాని, హ్యాపీ డేస్ కాని. ప్రతి సినిమాలో అద్బుతమైన పాటలని ఇచ్చారు. ఉప్పొంగెలే గోదావరి పాట గోదావరి అభిమానులకి కన్నుల పండుగ.

ఈ సినిమాకి మొదట మాధవన్ హీరో గా అనుకున్నారు శేఖర్ కాని, ఆయన లభ్యం కాకపోవటం తో సుమంత్ హీరోగా నటించటమే కాకుండా మంచి విజయం సాధించాడు. గోదావరి లో సినిమా తీయటం ఎంత కష్టం అయ్యిందో శేఖర్ కమ్ముల చాల సార్లు వివరించారు. డీజిల్ కి, జెనరేటర్ కి అనుకున్న దానికంటే ఖర్చు అయ్యింది అని చెప్తారు. గోదావరి ప్రవాహం బట్టి రంగు మారుతుంది ఆ రంగులు సినిమాలో చూపించాలంటే అన్ని రోజులు ఆగాల్సిందే. ఇంక లాంచి  సినిమా కోసం చేసిందే. తనికెళ్ళ భరణి పాత్ర కీలకమైన పాత్ర లాంచి మీద ఉన్నంత వరకు. ఇంక కుక్కలు  animation  అయినా  చిన్న తో మనల్ని అలరిస్తాయి. 

4 comments:

  1. Please continue sir enthamandi chaduvtharo theledu kaani I read and follow always thanks for the effort .

    ReplyDelete
  2. @vinokvarma garu, thanks for your feedback and encouraging words. This blog is known and intended for limited people only, so they do read this.

    ReplyDelete
  3. Sir, chala opika gaa ento genuince gaa rastunnaru, hats off to you, Veturi lanti vallu cine kavulayina, telugu to chala prayogalu chesaru, ippati taraniki sabdaalu kavali kaani bhaava yuktamaina sandhharbochitamaina paatalu akkarledu, ee rakam gaa naina ituvanti paatalu konta mandiki cherite chalaa santosham. Keep up your fantastic work, will wait eagerly for more such articles from you..

    ReplyDelete
  4. Chala Baaga raasaru ��
    Baalu gaaru uppongi poyindi Godavari pataku oopiri poste... Kaani daana prananiki karanam veturi gaaru.
    Can u write a review of the song in ur song of the week ? I wanna know ur thoughts on that song.

    ReplyDelete