Song of the Week - ఆది భిక్షువు వాడినేది కోరేది
ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Producer: Geethakrishna Movie Creations
Director: K. Viswanath
Director: K. Viswanath
Music Director: K.V. Mahadevan/ Pugazhendi.
Singer: S.P. Balasubrahmanyam
Lyrics: Seetarama Sastry
Year of Release: 1987
Singer: S.P. Balasubrahmanyam
Lyrics: Seetarama Sastry
Year of Release: 1987
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు || ఆది భిక్షువు ||
పాటకి ముందు వచ్చే scenes
పాట సందర్భం
పాట ప్రారంభం
ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
ఈ పాట శివ భక్తుడైన సీతారామ శాస్త్రి గారు, తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన శివుని మీద రాసిన నిందా స్తుతి. ( వ్యాజ స్తుతి) అంటే తిడుతూనే పొగడటం అనిపిస్తుంది. లేదా స్తుతించటం కూడా negativeగా అనిపిస్తుంది. ఎంతైనా భగవంతుని మీద భక్తునికి సర్వాధికారాలు ఉంటాయి. భక్తుడికే దేవుణ్ణి తిట్టే అధికారం పొగడుకునే అధికారం అన్ని ఉంటాయి. వాళ్ళ బంధం అటువంటిది, అనుబంధం అటువంటిది.
KV మహదేవన్ గారు/పుహళేంది గారు మన తెలుగు వాళ్ళకి లభించిన గొప్ప వరం. తెలుగు భాష వాళ్ళు కాక పోయినా తెలుగు పాటకి ఎంతటి న్యాయం చేకుర్చాలో అంతంటి న్యాయం చేకూర్చిన మహానుభావులు. ఇంకా SP బాలసుబ్రహ్మణ్యం గారిని ఏమని పొగిడితే సరిపోతుంది? ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివితీరని పదవిన్యాసం సీతారామ శాస్త్రి గారిదైతే, దానికి పరిమళం అద్దిన మహదేవన్ జంట, ఆ పాటని తన మధుర గానామృతంతో మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి సాక్షాత్తు శివ సాక్షాత్కారం కలిగింప చేసిన ఆ మధుర గాయకుని గళానికి తెలుగు వాళ్ళు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలరు? కళ్ళు మూసుకొని ఈ పాట వింటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ అనుభూతి కలుగచేసిన అందరు ధన్యులే.
పాటకి ముందు వచ్చే scenes
ఒక కళ్ళు లేని అద్బుతమైన కళాకారుని జీవిత కథ ఈ "సిరివెన్నెల" సినిమా. ఆ కళాకారుడు గాయకుడు, వేణు విద్వాంసుడు. తనకు సహజం గా వచ్చిన ఈ కళలతో అందరిని అలరిస్తు వచ్చిన డబ్బులతో గడిపేస్తున్న "హరి ప్రసాద్" జీవితం లోకి అనుకోకుండా ఇద్దరు వనితలు ప్రవేశించి, ఆ జీవితాన్ని సిరివెన్నెల తో ఎలా నింపుతారో, కథ ఎన్ని మలపులు తిరిగి చివరికి అతని జీవితం ఏమి అవుతుందో అనేది ఈ సినిమా. ఈ సినిమాలో హరి కి కన్నులు ఉండవు, అతను కోరింది జ్యోతినే, అంటే కళ్ళు లేని అతను కోరుకునేది వెలుగునే, అంటే కళ్ళే, చివరికి ఆ జ్యోతి అతనికి వెలుగు ప్రసాదించి ఈ లోకంలోంచి నిష్క్రమిస్తుంది. పాత్రలకి పేరు పెట్టటం లో కూడా విశ్వనాధ్ గారి సూక్ష్మ ఆలోచన చాల తక్కువ మంది దర్శకుల్లో చూస్తాం.
హరి జీవితాన్ని మార్చిన జ్యోతి అంటే అతనికి ఎంతో గౌరవం. ఆ గౌరవం, అభిమానం గా మారి ఆ తరువాత ఆరాధన గా మారి చివరికి ప్రేమగా మారుతుంది. ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కాని ఆమె ఎక్కడికో ఎవరికీ తెలియకుండా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉందొ కూడా హరికి తెలియదు. ఈలోగా హరి ఒక ఊరికి వెళ్తూ ఉండగా సుభాషిని అనే మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. సుభాషిని మంచి చిత్రకారిణి, అలాగే శిల్పాలు కూడా చక్కగా చెక్కుతుంది. ఆ పరిచయం పెరిగి, ఆమె హరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. జ్యోతి విషయం తెలియని ఆమె తన అన్న ద్వార హరికి ప్రేమ వ్యవహారం తెలియచేయమంటుంది. అప్పుడు హరి మనసులో ఉన్న అసలు విషయం తెలుసుకొని, హరిని, జ్యోతి ని కలపాలని దేవుడిని ప్రార్ధించటానికి దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకుని వెళ్తుంది హరిని..
పాట సందర్భం
శివాలయానికి వెళ్లి జ్యోతి పూజారి గారితో హరికి జ్యోతి తో పెళ్లి జరిగేలాగా పూజ చెయ్యమని కోరుతుంది. కాని అది సరిగ్గా అర్థం కాక సుభాషినికి, హరికి పెళ్లి జరిగేల పూజ ప్రారంబిస్తాడు ఆ పూజారి. సుభాషిణి తన మూగ భాషతో సైగలతో, మొత్తానికి తన మనసులో ఉన్న భావం హరికి తెలియచేయగలగుతుంది. తనకి జ్యోతికి పెళ్లి చెయ్యమని నేను ఇప్పుడు శివుని వేడుకోవాల అని, పాట పాడటం మొదలు పెడతాడు.
పాట ప్రారంభం
ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది
శివుడు ఆది భిక్షువు, అన్ని వదిలేసి నిర్వికారుడుగా, నిర్వ్యమోహుడు గా ఎప్పుడు తప్పస్సు చేసుకునే దేవుడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి లో శివునికి ఆది భిక్షువు అని పేరు. ఎందుకంటే శివుడు కాలభైరవుడు. కాలభైరవుడు నరికిన బ్రహ్మ యొక్క ఐదో తల పుర్రె తో భిక్ష మెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. భిక్షమెత్తుకొనే వాళ్ళలో మొదటి వాడైన అట్లాంటి భిక్షకుని దగ్గర మన కోరికలు ఏమి అడుగుతాము? శివరూపం సాధారణం గా చూస్తె ఆ రూపం తో ఉన్న వాళ్ళు మనకోరికలు తీరుస్తారు అనుకోము కదా, ఒళ్ళంతా బూడిద రాసుకొని, పాము మెడకు చుట్టుకొని, స్మశానం లో నివసించే శివుని అడిగితే బూడిద తప్ప ఏమి రాలుతుంది? అంటే ఆ శరీరం నుంచి రాలేదు బూడిదే కదా, ఆ బూదిదనిచ్చే వాడినేది కోరేది? ఇది అయన రాసుకున్న పాటైన సినిమా లో ఎంత అద్బుతం గా సరిపోయింది అంటే, హరి తన జీవితంలో చీకటి నింపిన దేవుడు అంటే నిరసనే. అందుకనే మనం వెళ్తున్నది శివ ఆలయమా, మనం శివున్ని అడగాల అని ప్రతి సారి అంటాడు.
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
కొసమెరుపు:
శివుడు సృష్టికి కారకుడు కాకపోయినా శివ భక్తులకి శివుడే సర్వస్వం. అందుకనే ఈ లోకం లో ఏది జరిగిన, దానికి కారకుడు శివుడే, ఇక్కడ సృష్టి లో లోపాలను చెప్పి ఇలాంటి తప్పులను చేసిన వాడిని ఏమి కోరగలం మనం అనే నింద కనిపిస్తుంది. నలుపు మానవుకి నప్పని, ఇష్టపడని రంగు. అది చీకటిని, భయాన్ని తెలియచేస్తుంది కనుక. అంతే కాక అది కంటికి ఇంపుగా ఉండదు కూడా. తీయగా పాడే కోకిలమ్మ కు నలుపు రంగు ప్రసాదించిన ఆ దేవుడినా నేను కోరేది? ఇక్కడ తీయటి గొంతునిచ్చి, సుందర రూపం కూడా ఇస్తే చాల బాగుండేది కదా, అటు చూడటానికి, ఇటు వినటానికి అందంగా ఉండేది,. చక్కటి గొంతునిచ్చి, రూపం సరిగ్గా ఇవ్వకుండా అన్యాయం చేసిన దేవుడిని ఏమి కోరేది?
అట్లాగే మేఘాలు చేసే శబ్దాలు భయాన్నిస్తాయి, వినసొంపు గా ఉండక భయపెడ్తాయి. మేఘ గర్జన రాత్రి కనుక వస్తే ఆ ఘర్జన ఇంకా భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన శబ్దాన్ని ఇచ్చే మేఘాల మధ్య జరిగే ఘర్షణకి అందమైన మెరుపుని కూర్చిన వాడిని ఏమి కోరేది? ఏది సరిగ్గా చెయ్యడం రాదు ఇంకేమి అడుగుతాం? దేవుడి లీలలు సాధారణంగా అర్థం కానివి, సృష్టి రహస్యాలు అంతకన్నా అంతుపట్టనిది. కాని మానవుడు తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు అవి తెల్సుకోవటానికి. సీతారామ శాస్త్రి గారి భావ శక్తికి, పద సౌందర్యానికి అందరం దాసోహం కాక తప్పదు. అలాగే బ్రహ్మాండమైన జ్ఞానం, తత్త్వం, వేదాంతం కలిగి ఉన్న, సరళమైన పదాలతో లోతైన భావాల్ని తెలియచేయ గలగటం ఆయనకే సాధ్యమైంది.
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
ఇక్కడ కూడా అదే నింద కొనసాగుతుంది, పూలు ఎంతో రమణీయంగా ఉంటాయి, చూడటానికి ఆహ్లాదంగా ఉండి తన నిండ తేనే రూపం లో తియ్యదనం నింపుకున్న పూలకి తక్కువ ఆయుష్షు నిచ్చిన దేవుడిని ఏమి కోరేది? వెయ్యటానికి చిన్న ప్రశ్నఅయిన చాల ఆలోచింప చేసే ప్రశ్న ఇది. సృష్టినే ప్రశ్నించే ప్రశ్న. పూలు, పళ్ళు, ఆకులు వీటన్నిటికి ఆయుష్షు తక్కువే. అలాగే ఈ సృష్టి లో మనకి నచ్చేవాటి జీవిత కాలం చాల తక్కువ. కాని రాళ్ళు రప్పలు లాంటి ఎక్కువ పనికి రాని, చూడటానికి అందం లేని వాటికి కలకాలం ఉండేలాగా సృష్టించిన వాడినేమి అడుగుతాం? నాకు ఇది కావలి దేవా అని? చలనం లేక పడి ఉండే బండరాయికి జీవం ఉండదు, కాని ఆయుషు ఉంటే ప్రాణం లేకపోయినా జీవిన్చినట్టే. అటువంటి రాయికి మటుకు కలకాలం ఉండేలాగా ఆజ్ఞ ఇచ్చిన దేవుడిన మన ఇది కావలి అని అడిగేది?
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
గిరిజ అంతే పార్వతి. శివ పార్వతులని కలుపటానికి ప్రయత్నించిన మన్మధుడు ని మూడో కంటి తో భస్మం చేస్తాడు. ఇక్కడ కళ్యాణం ఎందుకన్నారో, ఆ కథ మనకి తెలియాలి. తారకాసురుడు శివుని కుమారుడి తో తప్ప చావు లేకుండా వరం పొంది ఆ వర గర్వముతో అందరిని హింసిస్తూ ఉంటాడు. తారకాసురినికి తెలుసు శివుడు అప్పటికి బ్రహ్మచారి, శివుడు విరాగి, ఇంక శివుడికి కుమారుడు కలుగడు అని. కానీ అతని కృత్యాలు మితి మీరితే, అందరు సతి దేవిని కోరితే, పార్వతి గా గిరి రాజైన హిమవంతుడి కుమార్తె గా పుట్టి, శివుని కోసం తపస్సు చేస్తుంది(అందుకే గిరి బాల అంటారు పాటలో ). కానీ శివుడు తన ధ్యానంలో తానూ మునిగి ఉంటాడు. శివుడిని పార్వతి పట్ల ఆకర్షించేది ఎట్లా? ఆ చిక్కుముడి విప్పటానికి విష్ణు కుమారుడైన మన్మధునికి ఆ పని అప్పచేప్తాడు ఇంద్రుడు. మన్మధుడు శివ దీక్షను భగ్నం చేసి పార్వతి మీద మనసు పడేలాగా మన్మధ బాణాలు వేస్తాడు, శివుని దీక్ష భగ్న అవుతుంది కాని శివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే మన్మధుడు బూడిద అవుతాడు. అప్పుడు శివుడు పార్వతిని చూసి పెళ్లి చేసుకొని కుమారుడుని కంటాడు. ఆ కుమారుడే కుమారస్వామి(కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి). అతను తారకాసురిని చంపి అందరికి శాంతి చేస్తాడు. ఇంత మంచి పని చెయ్యతలపెట్టిన మన్మధుడిని మసి చేసిన వాడినేమి కోరను తనకు తన జ్యోతిని ఇమ్మని? అంత పెద్ద కథని ఒక వాఖ్యం లో రాసేసారు సీతారామ శాస్త్రి గారు.
"దను" కుమారులు దానవులు కూడా వర గర్వము వలన ముల్లోకాలను పీడిస్తున్న వాళ్ళు అయిన వాళ్ళకి వరాలిచేస్తాడు. అంటే మంచి చేసిన వాళ్ళకు చెడు, చెడు చేసిన వాళ్ళకు మంచి చేస్తున్న దేవుడిని ఏమి కోరేది?
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు... వాడినేది కోరేది
ఇంక శివ నింద పరాకాష్ట కి చేరుతుంది, ఊరికే పొగడితే పొంగి పోయే దేవుడు శివుడు. శివ స్తుతి, తపస్సు చేస్తే వరాలిచ్చేసి అందరికి ఇబ్బంది కలుగ చేసినట్లుగా శివుని కథలు చాలానే ఉన్నాయి మనకి. వినాయక చరిత్ర గూడ అదే కదా. ముఖ ప్రీతికే ఊరికే పొంగిపోయే దేవుడుని ఏమి ఆలోచించ కుండానే వరాలిచ్చే దేవుడిని ఏమి కోరేది? శివుని కోపం గూర్చి అందరికి తెల్సిందే, ఊరికే కోపం వచ్చే దేవుళ్ళలో మొదట ఉండే దేవుడు శివుడే. అలాగే మూడు కళ్ళు ఉన్నది కూడా శివుడే. ఎప్పుడు పొంగి పోతాడో, ఎప్పుడు ఉబ్బి తబ్బిబ్బు అయి వరాలిస్తాడో ఎవరికీ అర్థం కాదు, అందుకే శివుడిని తిక్క శంకరుడు అని ముగిస్తారు సిరివెన్నెల. శివుడు మూడో కంటిని పార్వతి కారణం గా రెండు సార్లు తెరుస్తాడు. ఒకటి మన్మధుడి మీద కోపం తో భస్మం చేస్తాడు, ఇంకోసారి దక్ష యజ్ఞం లో జరిగిన అవమానానికి. కానీ శివుడు మూడో కన్ను తెరిచేది యుగాన్ని అంతం చెయ్యటానికే.
ఇన్ని లోపాలున్న శివుడిని ఏమి కోరతాము అన్న పాటని సందర్భానుసారం గా వాడుకుని, ఆ పాట వాడటం కోసం, సినిమా లో పాత్రల్ని, మంచి సందర్భాన్ని సృష్టించిన సినీ బ్రహ్మ K విశ్వనాధ్ గారు. అది సినిమాలో హరి పాత్ర పాడటం కూడా అంతే సమంజసం. ఎందుకంటే దేవుడి/శివుడు అతనికి అన్ని ఇచ్చి దృష్టి లేకుండా చేసిన దేవుడిని ఇలాగ ప్రశ్నించటం చాల సమంజసం.
ఈ పాట అంతులేని ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఒక పాటలో ఇంత మేధో మధనం ఉంటుందా, ఎంతో భావాన్ని ఇలాగ ఒక పాటలో రాయగలగటం అనేది ఒక అద్బుతమైన వరం. ఆ వరం పొందిన సరస్వతి పుత్రుడు సీతారామ శాస్త్రి గారు.
కొసమెరుపు:
ఈ సినిమా పాటలతో సీతారామశాస్త్రి గారు, "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు" అయ్యారు. సినిమాల్లో అవకాశం కోసం ఈయన రాసిన కొన్ని కవిత్వాలు/పాటలు ఈ సినిమా కి చాల రోజుల ముందుగా విశ్వనాధ్ గారికి పంపిస్తే, అయన దగ్గరనుంచి ఏమి పిలిపు రాలేదు, ఆయనని కలిసిన కూడా అవకాశం ఇవ్వలేదు సరి కదా పాటలు నచినట్లు గా చెప్పలేదు. కాని ఈ సినిమా కోసం విశ్వనాద్ గారు సీతారామశాస్త్రి గారిని పిలిస్తే, అవే పాటలు మరల పంపితే చాల బాగున్నాయి అని అవకాశం ఇచ్చి మొత్తం సినిమా లోని పాటలన్నీ రాయించుకున్నారు. ఈ విషయం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ లో చదివినట్లు గుర్తు. సిరివెన్నెల సినిమా కోసం ఈ పాటని విశ్వనాధ్ గారు సీతారామ శాస్త్రి గారు ఎప్పుడో రాసుకున్నది వాడుకున్నారు, కొంచెం మార్పులతో. సిరివెన్నెల గారు రాసి ప్రచురించిన "శివ దర్పణం" అనే పుస్తకం లో మొత్తం పాట ఉంటుంది.