Friday, December 30, 2011

Song of the week - Kottagaa Rekkalochena - Swarnakamalam

కొత్తగా రెక్కలోచ్చెనా 
ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)


ఇక ఈ వారం పాట:
కొత్తగా రెక్కలోచ్చెనా - స్వర్ణ కమలం 
Youtube Video Link for the Song
Movie       -     Swarna Kamalam
Director    -     Kasinadhuni Viswanath
Producer  -     Usha Kiron Movies
Music Director - Maestro Ilayaraja
Lyrics -             Sirivennela Seetarama Sastry
Singer (s)          - S.P.Balasubrahmanyam and S. Janaki

Song Lyrics
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా

కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
(2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది  
|| కొత్తగా || 

వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
 (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
 
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 
|| కొత్తగా || 

పాటకి ముందు వచ్చే scenes
విశ్వనాద్ గారి సినిమాలలో చాల వాటిల్లో సూక్ష్మంగా ఒక సందేశం ఉంటుంది, అదేమిటంటే మనసు పెట్టి ఏదైనా కళని ఆరాధిస్తే, అనుభవించి ఆ కళలో అంతర్లీనమిత మనిషికి వచ్చే ఆనందం వర్ణనాతీతం. అదే మాట అయన సినిమాల్లో అనేక పాత్రల చేత చెప్పిస్తారు.  ఈ సినిమా ఒక అత్యద్బుతమైన కళా సంపద, ప్రక్రుతి ప్రసాదించిన అందం, ఉన్న ఒక అమ్మాయి తన తండ్రి ప్రసాదించిన విద్యని తృణీకరించి, ఆ విద్య గొప్పతనం తెలియక వేరే ఆనందాల కోసం వెంపర్లాడితే, కళ విలువ తెలిసి, ఆ అమ్మాయి విద్య, గొప్పతనం తెల్సిన కథానాయకుడు, ఆ అమ్మాయికి నాట్యం విలువ, తద్వారా వచ్చే ఆత్మానందాన్నితెలియచేసి ఆ అమ్మాయిని సరియిన దారిలో పెట్టి, ఆ అమ్మాయిని స్వర్ణ కమలంగా మార్చిన కథ ఇది.

ఈ సినిమాలో అనేక సన్నివేశాలు కొన్ని హాస్యం కలుగ చేస్తే, ఇంకొన్ని మనల్ని అందులో involve అయ్యేటట్టు చేస్తాయి. కొన్ని హృద్యంగా ఉండి ఎక్కడో బలం గా తాకుతాయి. అందులో ఒకటి, త్యాగరాజ జయంతి నాడు హీరోయిన్ తండ్రి జట్కా బండి లో వెళ్తుంటే మిగితా ప్రపంచం అంతా అత్యంత వేగంగా వెళ్తుంటే హీరోయిన్ అనే మాట ఈ సినిమాలో హీరోయిన్ ఆలోచన విధానం ఏమిటో తెలియచేస్తుంది. కళల పట్ల తగ్గుతున్న ఆదరణ, ప్రస్తుత పరిస్తితుల్ని గురించి హెచ్చరిస్తుంది.
పాట సందర్భం 
హీరోయిన్ చేత బలవంతం గా నాట్య ప్రదర్సన చేయిస్తే, ఆమె చేసిన మూర్ఖత్వం వల్ల తండ్రిని కోల్పోతుంది, ఐన ఆమె మారదు. చివరికి ఆమె కోరుకున్నట్లే ఒక హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తాడు హీరో. అక్కడ అనుకోని పరిస్తితుల్లో నాట్యం చెయ్యాల్సి వస్తుంది. ఆ నాట్యం నచ్చక నాట్య కళ అభ్యసిస్తున్న ఒక విదేశి వనిత లేచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరో ని పిలిచి నాట్యం లో తప్పొప్పుల్ని తెలియచేస్తుంది. అంతే కాక ఒక నెలలో మరల వస్తాను, ఈ సారి సరిగ్గా ప్రదర్సన ఇస్తే అమెరికా తీసుకు వెళ్తాను అని ఇద్దరికీ చెప్తుంది. ఆ మాటలు విన్న హీరోయిన్ ఇంటికి వెళ్లి, తన అక్క, స్నేహితురాలు, హీరో, ఇలాగ అందరి మాటలు గుర్తుకు తెచుకొని ఆలోచలనలో పడి మనసు మార్చుకొని గజ్జెలు సంచి లో వేసుకొని సముద్రం ఒడ్డున నాట్య సాధన( విశ్వనాద్ గారు ప్రకృతికి చెందిన కళ ప్రక్రుతి తోనే ఎక్కువ సార్లు చూపిస్తారు తన సినిమాలలో, గానం చేసిన కాని, నాట్యం చేసిన కాని, బొమ్మ గీసిన గాని. ) మొదలు పెడ్తుండగా ఒక మూల నుంచి అద్బుతమైన గొంతు పాట పాడటం విని ఆగిపోయి, ఆశ్చర్యపోయి అటు వైపు చూస్తుంది.


పాట ప్రారంభం 
బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఆలాపన చేసిన తీరు అత్యంత మధురం గా ఉంటుంది, అలాగే అమృతం లాగ ఉంటుంది అయన గొంతు వింటే, అయన పాటని అద్బుతం గా అరంబించిన అనేక పాటల్లో, "వేవేల వర్ణాల" ( సంకీర్తన ), "కీరవాణి" ( అన్వేషణ ),  "చైత్రము కుసుమాంజలి" (ఆనంద భైరవి) ఇలాగ ఎన్నో ఎన్నెన్నో.

ఇళయరాజా , బాలసుబ్రహ్మణ్యం వీరి  బంధం ఎన్నెన్ని జన్మలదో కాని, వారిద్దరూ సమకాలీనులు కావటం, వారిద్దరి సంగీతం వినగలగటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఇంక జానకి గారి భావప్రకటన గురించి ఏమని వర్ణించ గలం?  


ఇంకా పాటలోకి వెళ్తే
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ 

ఈ పాటలో చాల ప్రయోగాలు సిరివెన్నెల చేసారు. అసలు పాట ప్రారంభమే అమోఘం. గువ్వ పిల్లకి కొత్తగా రెక్కలు రావటము అనే పద ప్రయోగంలో సినిమా మొత్తం చెప్పేసినట్టు ఉంటుంది. పక్షికి సహజంగా  రెక్కలు ఉంటాయి, ఆ పక్షి వాటితో ఎగురుతుంది, అది దాని లక్షణం. కాని ఆ పక్షి ఎగురకపోతే ఆ రెక్కలు ఉన్న లేనట్టే కదా. అలాగే హీరోయిన్ కి సహజంగా నాట్య కళ లభిస్తుంది, కాని ఆ కళని సంపన్నం చేసుకోలేదు, సార్థకత తీసుకు రాలేదు. ఇప్పుడు జరిగిన అనేక సంఘటనల ప్రభావమో కానీ, వచ్చిన  సదవకాశం ఉపయోగించుకొని అమెరికాకి ఎగిరి వెళ్ళాలనే తపన కాని,  ఏదైనా కారణం వల్ల కాని ఇప్పుడు ఆమె తనంతట తాను నాట్య సాధన కోసం గజ్జెలు తీసుకొని బయలు దేరిందంటే పక్షికి ఎగరటానికి రెక్కలు వచినట్లే ఇక్కడ హీరోయిన్ కి కూడా ఎగురటానికి రెక్కలు వచ్చినట్లే. రెక్కలు కొత్తగా రావటం అంటే, ఉన్న రెక్కలకి కొత్త శక్తి వచినట్లే. 

మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి 

మల్లె రేకులు నెమ్మదిగా విచ్చుకుంటే , ఒక్కొక్క రేకు పరిమళం వెదజల్లుతుంది. ఆ మల్లె కొమ్మ చాటున ఉన్న లేక పోయిన పరిమళం ఇస్తుంది. కాని కొమ్మ చాటున ఉన్న మల్లెకి అందులో కన్నె మల్లెకి అంటే వాడని పువ్వుల పరిమళం అని ఎందుకన్నారంటే, హీరోయిన్ ఇప్పటివరకు నాట్య కళని కొమ్మ చాటున అంటే ఇంటి పట్టునే తనలోనే దాచుకుంది, మంకు పట్టు పట్టి ముడుచుకుని కళ యొక్క పరిమళాన్ని తనలోనే దాచేసుకుంది. అటువంటిది, ఇప్పుడు తనకు తానె రెక్కలు విచ్చుకొని నాట్య సాధనకు వస్తే వచ్చేది పరిమళమే, నటనాభినయ సుగంధమే.

ఇదే విశ్వనాధ్ గారు సంభాషణ రూపం లో చెప్పిస్తారు. పాట గొప్పతనం అందరికి అర్థం అయ్యేలా చెప్పటానికి.
హీరోయిన్: గూళ్ళు ఏమిటి, గువ్వలేమిటి కొత్తగా రెక్కలు  రావటమేమిటి? ఏమిటండి ?
హీరో: మీరు మనస్పూర్తిగా ఆ గజ్జెలు కాళ్ళకు కట్టుకున్టున్నారంటే గువ్వపిల్లకి  కొత్తగా రెక్కలోచినట్లే కదండి!!
హీరోయిన్: మీకు కవిత్వం కూడా వచ్చా?
హీరో: మీ  కాళ్ళని చూస్తుంటేనే కవిత్వం వచేస్తుంది (ఇక్కడ హీరోయిన్ కళ్ళు తిప్పటం ఆమె కళ్ళకున్న అందాన్ని, ఆ కళ్ళల్లో చిలిపితనం, కొంటెతనం  చూపించటానికేనేమో!!!)
మీరు గంధం చెక్కలాంటి వారు, నేనేమో రాయిలాంటి వాణ్ణి మంచి గంధం తీయాలంటే ఏమి చేస్తారు? రాయి మీద ఆరగ తీస్తారు ఇప్పుడు మీరు సాధన చెయ్యటానికి వచ్చారు  కదా, ఈ  రాతిని ఉపయోగించుకోండి, మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది


ఇళయరాజా గారి స్వర కల్పన నిజం గానే పక్షి ఎగురుతున్నంత భావం కలిగిస్తారు తన స్వరాలతో. పదాలకి న్యాయమే కాదు, సన్నివేశానికి ఇదే సరి ఐన పాట గా తన ముద్ర వేస్తారు.

చరణం 1
కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు  
 (2) 
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి  (2)
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది


జోరు మీద ఉన్న వాగు గమనం చూస్తే ఎవరికైనా ఒక అద్బుతమైన అనుభూతి కలుగుతుంది. దారిలో వచ్చే అడ్డంకుల్ని దాటుకుంటూ, పరవళ్ళు తొక్కి ప్రవహిస్తుంటే, ఆ వంకర టింకర ప్రవాహంలో ఆ వాగు చేసే కులుకులు చూడవలసిందే. నది వాగ లా మారి అలాగ శబ్దం చేస్తూ ప్రవహిస్తుంటే, ఆ వాగు నీటికి పంటలు పచ్చగా పెరిగి ఊగుతుంటే, ఆ పచ్చదనం చూసిన వాళ్ళకి కనువిందే కదా. పంటలు పెరిగితే ఇంట్లో లక్ష్మి కళకళ లాడుతుంది.  మేఘాల రాగం మల్ల ఈ పాట లో కూడా వాడారు సిరివెన్నెల గారు.  హీరోయిన్ చేసే నాట్యాన్ని ఇలాగ ఒక వర్ణన అద్భుతమైన ప్రయోగం. వాగు జోరు మీద ప్రవహిస్తే వచ్చే ఫలితం, ఆమె నాట్యం చేస్తే వచ్చే ఫలితం కూడా ఒక్కటే, అందరికి కనువిందు కలగటం. అది ఎంత చక్కగా వివరించారో?

విశ్వనాద్ గారు గజ్జెలకి చాల ప్రాధాన్యతని ఇస్తారు. సప్తపది లో కాళ్ళ పట్టీలకి నది జలంతో అభిషేకిస్తే, ఇక్కడ గజ్జేలని నదిలో కడిగించి హీరో చేత కాళ్ళకి కట్టిస్తారు. 

చరణం 2
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
ఎదురులేక యెదిగింది మధురగాన కేలి 
  (2) 
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని 
  
అబ్బ... భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది 



ఇన్నాళ్ళు కుదురులేకుండా అటు ఇటు తిరుగుతున్న హీరోయిన్, ఇప్పుడు నాట్య సాధనకు కుదురుకుంది. ఆ పర్యవసానం ఎట్లా ఉంటుంది అంటే ఎలా చెప్పాలి? మళ్ళ ఇక్కడ వేణువునే వాడుకున్నారు. గాలి వెదురులోకి దూరితే వచ్చేది మధుర గానమే. ఆ రాగనుభూతి భాషకి అందని భావమే. ఇంతటి తో ఆగకుండా, హీరో/హీరోయిన్ ల మధ్య జరిగే భావాల్ని కూడా చెప్తారు. వాళ్ళలో రేగే ఆలోచనల ప్రతి రూపమే ఆ ముగింపు. హీరో మొదట గజ్జె కట్టి నాట్యం అభినయిస్తే, దాన్ని హీరోయిన్ సరిదిద్దుతుంది, ఆ సీన్ ఇక్కడ అక్కడ కంటే ఇక్కడ బాగుండేదేమో. లేకపోతె నన్ను ఉపయోగించు కొండి అన్న దానికి ముందు పెట్టారేమో, అతనిని సరిదిద్దుతూ తన నాట్య సాధనలోకి వెళ్ళిపోతుంది.


ఈ పాట సెలయేరు ప్రవాహం లాగ, కొంటె వాగు జోరు లాగ సాగుతుంది అనిపిస్తుంది, ఆ పద ప్రయోగం చూస్తే.  గాలి-కేళి,  జోరు-నీరు వెదురు-ఎదురు, ఒదిగింది-  ఎదిగింది,  మార్చింది- నేర్చింది, వాగు - యేరు ఈ పదాలు వింటుంటే ఇలాంటి పాటలు మరల రావేమో అనిపిస్తుంది. ఒక్కోసారి తెలుగు పాటా నీ ఆయుష్షు తీరిందా అని అడగాలనిపిస్తుంది .


ఆ ప్రశ్నవివరాలతో మరల వచ్చే వారం కలుద్దాం.

2 comments:

  1. I like this song very much. Thanks for reminding such a good song. Sirivennela garu the best. Bhanupriya is highlight of the movie.

    ReplyDelete
  2. చాలాబాగా వర్ణించారు పాటని :)
    నచ్చిన పాటల్లో ఇదొకటి .. భానుప్రియ గారి అభినయం . ఆ కళ్ళు తిప్పడం .. అమాయకత్వం ఎంతో బాగుంటుంది ఇంక వెంకటేష్ కూడా చాలా డీసెంట్ గా బాగా చేసారు :)

    ReplyDelete