Monday, December 19, 2011

Song of the week - తరలి రాదా తనే వసంతం - రుద్రవీణ

నా సంగీత ప్రపంచం లో కొన్ని వేల పాటలు విని ఉంటాను, అందులో చాల అలలు ఒడ్డుని తాకినట్లు వెళ్ళిపోగా, మరి కొన్ని గాలి లాగ స్పృశించి వెళ్ళిపోయాయి.  కొన్ని హృదయానికి హత్తుకోగా కొన్ని మదిలో అలా నిలచిపోయాయి. వాటిలో కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నాఏదో కొత్తదనం వాటిల్లో కనిపిస్తుంది. అలాంటి పాటలు వారానికి ఒకటి కాలం అనుమతి ఇస్తే నిక్షిప్త పరచుకోవాలనే చిన్న ఆశ ఎప్పటినుంచో ఉంది కాని బ్లాగ్ రూపం దాల్చటానికి ఇలా వీలు కుదురుతుంది అని ఎప్పుడు ఊహించలేదు. ఈ పాటల యొక్క వివరణ, విశ్లేషణ అంతా నా పరిమిత జ్ఞానం మాత్రమే. ఇది ఎటువంటి విమర్శా కాదు ఇటువంటి  ఆణిముత్యాలని ఇచ్చిన  పెద్దలని కించపరచాలని కాదు. ఏమైనా తప్పులుంటే పెద్ద మనస్సు తో మన్నించండి. ఇందులో వచ్చే పాటలు వరుస వాటి గొప్పతనానికి సూచన కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞాపకం, ఈ టైం కి కుదిరిన వీలు మాత్రమే.

ఇక ఈ వారం పాట
తరలి రాదా తనే వసంతం - రుద్రవీణ 
Youtube Link
Movie: Rudraveena
Director: K.Balachander
Music: Ilayaraja
Lyrics: Sirivennela Seetaramasastry
Singers: S.P Balasubramanyam
Year of Release: 1988 


అంజన productions బ్యానర్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవికి ఒక మైలురాయి గా నిలచిపోయే సినిమా. అత్యంత అద్బుతం గా తనలోని నటున్ని బయట పెట్టిన ఒక చిత్రం. సద్బ్రాహ్మణ కుటుంబం లో జన్మించి సంగీతమే తపస్సు గా భావిస్తూ ఆ సంగీతం అందరికి కాదు కొందరికే అన్న భావాలు ఉన్న తండ్రికి, సంగీత సరస్వతిని ఉన్నతమైన కుటుంబం లో పుట్టిన వాళ్ళకే కానీ అది వినటం కానీ నేర్చుకోవటానికి అర్హత లేదు అని భావించే తండ్రికి, తక్కువ కులం లో పుట్టిన వాళ్ళ జీవితాలకి విలువ ఇవ్వని తండ్రితో, ఒక కొడుకు మానవత్వం ముందు ఏది పెద్దది కాదు అని నమ్మే కొడుకు పడే స్వభావ సంఘర్షనే ఈ సినిమా. ఇందులో సూర్యం మనస్తత్వం తన పదాల ద్వార అడుగడున  ప్రతిబింబించిన సిరివెన్నెల సిని జీవితం లో ఈ సినిమా ఒక రత్నం, మనకి ప్రతి పదం అమృత తుల్యం. ఇళయరాజా ఆ పదాలకు అద్దిన మెరుపులు వర్ణనాతీతం. సందర్భం చెప్తే రసకందమైన రాగం ఇచ్చే ఇళయరాజా, సిరివెన్నెల ఇద్దరు కలసి మలచిన ఒక శిల్పానికి SPB గళం ప్రాణం.  ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని పించే ఒక అద్బుత కావ్యం.

ఈ పాటకు ముందు వచ్చే కొన్ని scenes లో ఒకటి లలిత ఎక్కడో కొండ మీద డాన్సు చేస్తుంటే ఎందుకు అలాచేస్తుందో తెల్సుకొని దేవుడిని ఆ కొండ మీదకు తీసుకు వస్తాడు సూర్యం. అది చూసి ఆశ్చర్య పోయిన లలితతో "దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదు అన్నారుగా అందుకనే   దేవుడిని మీ దగ్గరకు తీసుకు వచాను మీరు మొదలు పెట్టండి" అని అంటాడు. అది అతని స్వభావాన్ని తెలియచెప్పే ఒక సన్నివేశం.

సూర్యం సైకిల్ మీద వెళ్తూ ఉండగా కొంతమంది కట్టెలు కొడుతూ ఉంటారు, అందులో ఒక వృద్ధుడు అలసి సొలసి పోగా సూర్యం అతని దగ్గరికి వెళ్లి కట్టే తీసుకొని కట్టెలు కొట్టడం ప్రారంభిస్తే మిగితవాళ్ళు వచ్చి "మీరు గణపతి శాస్త్రి గారి అబ్బాయిగారు కదా, తాళం వేసే చేతులతో కట్టెలు కొడతార? అని ప్రశ్నిస్తారు, మళ్ళా "అయన కచేరి ఎలాగో మేము వినలేము మా కోసం ఒక పాట పాడండి అయ్యా ?? " అంటే శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం పాడితే వాళ్ళు అర్థం కాక నిరాశ చెంది తల గోక్కొని  "ఏదైనా మంచి పాట పాడండి"  అని అడుగుతారు. అప్పుడు సూర్యం విస్తుపోయి, వాళ్ళకి ఏమి కావాలో ఏది పాడాలో నిర్ణయించుకొని పాట పాడటం ప్రారంబిస్తాడు.



ఇక్కడ ఇళయరాజా సంగీత చాతుర్యం ఎంతో చక్కగా తెలుస్తుంది, పని వాళ్ళు తమ తమ చోటికి వెళ్లి పని చేసుకోవటం ఆరంబిస్తారు, అక్కడ నుంచే పాట అరంబిస్తుంది, వాళ్ళ గొడ్డలి చప్పుళ్ళతో, అక్కడనుంచి సిరివెన్నెల సందర్భోచితమైన పదచాతుర్యం మన ఎదల్ని తాకుతుంది, ఆలోచింపచేస్తుంది.


పల్లవి


తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం...
గగనలదాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా... || తరలి ||

సిరివెన్నెల గారి సరళమైన పదాల్లో సముద్రమంత లోతైన భావం ఉంటుంది. వెన్నెల వసంతం మధ్య బందం గాయకుడు శ్రోత కి ఉన్న బందం తో పోల్చి ఒక అద్బుతమైన పాటని ఆవిష్కరించారు. అలాగే వానని మేఘాల రాగం అని ఇంకో చక్కనైన పోలిక, ఈ పల్లవి కోసమే ఆ పని వాళ్ళ చేత ఆ dialog చెప్పించారేమో దర్శకులు, ఎంతైనా మీ నాన్న గారి పాట కచేరి వినలేము, మీరిన పాడండి అంటే, మీరు అడిగితె నేను వచ్చి పాడనా అని అత్యంత ఉదాత్తం గా సూర్యం మనసులో పలికే భావాలు తెలియ చెప్పారు. అలలు గగనాన్ని తాకటం జరగదు, అట్లాగే వాళ్ళు కచేరి వినలేరు, కానీ ప్రక్రుతి తన పని ఎలా చేస్తుందో తను కూడా అలాగే చెయ్యాలి అనే సంకల్పంతో వాళ్ళకి నచ్చే విధం గా పాడుతూనే తన మనసు లోని భావాలని పలికించటానికి ఆయుత్తం అవుతాడు.

ఇక్కడ ఇళయరాజా స్వరకల్పన అమోఘం..

చరణం 1
వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, (2 )
ఎల్లలు  లేని  చల్లని గాలి, అందరి కోసం అందును కాదా...
ప్రతి మదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం 
ఏది సొంతం కోసం కాదను సందేశం.. పంచె గుణమే పోతే ప్రపంచమే శూన్యం...
ఇది తెలియని మనుగడ కధ, దిశనెరుగని గమనము కద....   ||తరలి ||

నాలుగు వాక్యాలలో అనంతమైన, అందరికి అర్థం అయ్యే సందేశం ఇవ్వగలగటం నిజంగా ఒక వరం. సిరివెన్నెల గారు  ఈ నాలుగు వాక్యాలలో జీవిత పరమావధిని చెప్పగలిగారు. సూర్యం సినిమా లో సాధించింది కూడా అదే. ప్రపంచం లో ప్రక్రుతి అందరి సొంతం, గాలి, నీరు, మట్టి, వెలుగు ఎవరి సొత్తు కాదు. గాలికి కులం లేదు హద్దులు ఉండవు, వెన్నెలకి మతం లేదు, అలాగే సూర్య కిరణాలు మనిషిని బట్టి వెలుగు చూపవు. అలాగే సంగీతం కూడా. తన తండ్రి లాంటి వాళ్ళు పరిమితం చేసినట్టు ఆ సంగీతం అందరి సొత్తు అని సూర్యం మనస్సులోని భావాన్ని అత్యద్భుతం గా చెప్పగలిగారు.

ఇంకా మనకోసం మనం బతకడం కాదు, అందరికి మనకి ఉన్నది పంచకపోతే ఆనందం ఉండదు, ఆనందం లేకపోతె మనకి ప్రపంచం శూన్యమే, ఇది తెలియకుండా బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అనకుండా, అది తెప్పలేని నావ లాంటిది, మనం దారితెలియకుండ వెళ్తున్న ప్రయాణం లాంటిదే. ప్రతి పదం ఒక సమ్మోహనం.

సినిమా లో ఈ చరణం ముగించేటప్పుడు గణపతి శాస్ర్తి గారు వచ్చి చూసి సూర్యం చేసే పని నచ్చక వెళ్ళిపోతారు. 

చరణం 2  -  ( సినిమా CD లో ఈ చరణం లో లేదనుకుంట ఒక్క audio లోనే ఉన్నట్టుంది)
బ్రతుకున లేని శృతి కలదా, ఎద సడిలోనే లయ లేదా . (2 )
ఏ కళకైనా ఏ కలకైనా..జీవిత రంగం వేదిక కాదా 
ప్రజాధనం కాని కళావిలాసం ఏ ప్రయోజనం  లేని వృద్ధ వికాసం 
కూసే కోయిల పొతే కాలం ఆగిందా మారే ఏరే పాడే మరో పదం రాద, 
మురళికి గల స్వరమున కల పెదవిని విడి పలకదు కద     ||తరలి ||


మొదటి చరణం లో సంగీతం అందరిది అంటూనే ఇంక ఈ చరణం లో సంగీతం ఎక్కడ లేదు అన్న వర్ణన చేసారు సిరివెన్నెల.  మళ్ళ పదప్రయోగం ఒక రాగం లాగ సాగిపోతుంది. భగంతుడు సృష్టించిన ప్రతి వస్తువు ఒక సంగీతం, గుండె చప్పుడు ఒక లయ లాగ సాగుతుంది, జీవితంరంగం ఒక వేదిక, అందులోనే అన్ని కళలు (art ) కలలు ( dreams సాగుతాయి. అటువంటి ఏ కళ ఐన ప్రజలకి చేరకపోతే ఇంక దానికి విలువలేదు అని వివరిస్తారు కవి. ఎవరు ఉన్న లేకున్నా సంగీతం ఆగదు అని ముగించటం కవి ఊహాశక్తి కి నిదర్సనం.


పాట తరువాత శాస్త్రి గారు, సూర్యం మధ్య జరిగిన వాగ్వివాదం ఇలా సాగుతుంది అది పాట, సంగీతానికి వచ్చిన గ్రహపాట, సంగీతాన్ని మార్చేతంట పండితుడివయ్యావ? అది హంసధ్వని యా లేక హిమ్సద్వని యా, సంగీతం అంటే చౌక depot లో దొరికే చౌక ఉప్పుడు బియ్యం కాదురా అలగా జనానికి పంచటానికి ఇటువంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే, సంగీత జనం లేని వాళ్ళకి కొంచెం పంచితే తప్ప అని వాపోతాడు సూర్యం, అలగా జనాలకి కూడా అలుపు సొలుపు ఉంటాయి, పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని ఆ స్రమజీవులకి చేస్తే తప్పా? అమ్మ అందరికి అమ్మే అని నమ్ముకుంటున్న వాడిని అంటూ సమాధాన పరచటానికి సూర్యం శతవిధాల ప్రయత్నిస్తాడు,  వీరి వాగ్వివాదం ఇలా పతకానికి చేరి నిండగా మారుతున్నా సమయానికి మాటలు రాని సూర్యం అన్నయ్య అందుకున్న సన్నాయి రాగం వాళ్ళిద్దరిని అప్పటికి శాంతింప చేస్తుంది. ఇక్కడ బాలచందర్ గారి సృష్టి అత్యంత అద్భుతం.


ఈ సందర్భంలో , ఇటువంటి నేపధ్యం లో ఇంత కన్నా గొప్ప పాటని ఊహించలేము.


BTW Rudra Veena bagged 4 national awards - best regional feature film, best musical score (Illayaraja), best male playback (Yesudas), the Nargis Dutt award for national integration.

1 comment:

  1. One of my all time favorite!
    ilaanTi paaTaki Sastri gaariki national award raakapOvaDam chaalaa duradRshTakaram!

    And one small correction - best male playback was for SPB and not Yesudas :)

    ReplyDelete