Movie: Mutyaala Muggu
Presenter: M. Sukumar
Producer: Maddali Venkata Lakshmi Narasimha Rao (MVL)Banner: Sri Rama చిత్ర
Direction: బాపు గారు
Story, Screenplay & Dialogues: Mullapudi Venkata Ramana
Cinematography: Ishan Arya
Lyrics: Arudra
Music: KV Mahadevan
Singer(s): P. Suseela
Year of Release: 1975
ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు ముంగిల్లలోన
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ || ముత్యమంత ||
చరణం 1:
ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే వారి అరచేతనుండు (2)
తీరైన సంపద ఎవరింట నుండు
దిన దినము ముగ్గున్న లోగిల్లనుండు || ముత్యమంత ||
చరణం 2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్ళు || ముత్యమంత ||
చరణం 3:
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూలా గాలి ముత్యాల వాన (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం || ముత్యమంత ||
బాపు రమణీయం అంటే గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గు సినిమా అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం ఈ సినిమా. తెలుగు పదాలకి, సినిమాలో పాత్రల నిర్వచననానికి, ఆహార్యానికి, విలన్ పాత్ర సృష్టికి, ఆంజనేయస్వామిని కథ లో వాడుకున్న తీరు, సినిమా తీసిన ప్రదేశాలు, పాటలు ఇలా ఏది చూసిన తెలుగు తనం ఉట్టిపడేలా కుదిరిన సినిమా. భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలి అని నిర్వచించిన సినిమా ఇది. ఈ సినిమాని ఈ తరం ఉత్తర రామాయణం గా పోలుస్తారు విశ్లేషకులు. కథలోని సన్నివేశాలు అలా ఉంటాయి మరి. అంతే కాదు సినిమా ఆరంభం లో టైటిల్స్ పడుతున్నప్పుడు మంగళంపల్లి బాలమురళి గారు పాడిన "శ్రీ రామ జయ రామ సీత రామ" అన్న పాట సినిమా కి అంతులేని అందం తెచ్చింది. అసలు ఈ పాట అప్పుడు పెట్టటమే ఒక అద్బుతమైన ప్రయోగం. కథ కథనం, దర్శకత్వం అద్బుతంగా చేసి ఒక అందమైన దృశ్య కావ్యాన్ని అందించారు బాపు-రమణలు.
రమణ గారి మాటలు ఆణి ముత్యాలు. ఎన్నోసంభాషణలు కలకాలం గుర్తుండి పోయే లాగ రాసారు ఆయన. ముఖ్యంగా రావు గోపాల రావు గారికి రాసిన మాటలు చాల ప్రసిద్ది పొందాయి. ఇంక ఈ సినిమాలో అన్ని అద్బుతమైన పాటలే. సినారే, ఆరుద్ర గారు సినిమాకి అమరి ఒదిగి పోయే పాటలు రాసారు. మహదేవన్ గారు తెలుగు వారేనా అన్నట్లు సంగీతం సమకూర్చారు. ఇన్ని మేలు కలయికలు ఉన్న అందుకే ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా గా జాతీయ పురస్కారం లభించింది. బాపు-రమణ వీళ్ళిద్దరూ ఒకరు తనువు అయితే ఒంకొకరు మనసు, అందుకనే వీరి కలయికలో అనేక ఆణిముత్యాలు వచ్చాయి. వీరిద్దరి కలయిక లో వచ్చిన ఆఖరి సినిమా "శ్రీరామ రాజ్యం".
రమణ గారి మాటలు ఆణి ముత్యాలు. ఎన్నోసంభాషణలు కలకాలం గుర్తుండి పోయే లాగ రాసారు ఆయన. ముఖ్యంగా రావు గోపాల రావు గారికి రాసిన మాటలు చాల ప్రసిద్ది పొందాయి. ఇంక ఈ సినిమాలో అన్ని అద్బుతమైన పాటలే. సినారే, ఆరుద్ర గారు సినిమాకి అమరి ఒదిగి పోయే పాటలు రాసారు. మహదేవన్ గారు తెలుగు వారేనా అన్నట్లు సంగీతం సమకూర్చారు. ఇన్ని మేలు కలయికలు ఉన్న అందుకే ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా గా జాతీయ పురస్కారం లభించింది. బాపు-రమణ వీళ్ళిద్దరూ ఒకరు తనువు అయితే ఒంకొకరు మనసు, అందుకనే వీరి కలయికలో అనేక ఆణిముత్యాలు వచ్చాయి. వీరిద్దరి కలయిక లో వచ్చిన ఆఖరి సినిమా "శ్రీరామ రాజ్యం".
భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అంటే వారికి చాల మందికి తెలియదు కాని ఆరుద్ర గారు అంటే అందరికి తెల్సు. అయన రాసిన పాటలు గురించి చెప్పాలంటే అర్హత ఉండాలి. అయన రాసిన ఈ పాట ఎంత అద్భుతమైనదో ఈ పాటలోని భావమే చెప్తుంది. సరళ మైన పదాలతో తెలుగు పాటకి నిర్వచనం చెప్పినట్లు ఉంటుంది. సుశీల గారు ఈ పాట పాడిన తీరు పాటలు పాడటం నేర్చుకునే వారికి ఒక నిఘంటువు. ఎందుకంటే ప్రతి పదం అంత స్పష్టంగా ఉంటుంది, భావం అంత స్పష్టం గా ఉంటుంది, అదే రీతిన అంత తీయగా మనసులని తాకుతుంది. మామ మహదేవన్ గారి గురించి ఇంకా ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అయన తన శిష్యుడు పుహళేంది గారితో తెలుగు వాళ్ళకి లభించిన ఒక గొప్ప వరం.
ఇంక సినిమా కథలోకి వస్తే, జమిందారు, ధనవంతుడు, రాజ రావు బహద్దూర్ ( రామ దాసు ). ఆయన అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అందులో అతని కొడుకు అయిన శ్రీధర్ స్నేహితుడికి (హరి) ధన సహాయం చేసి చదివిస్తాడు. శ్రీధర్ కూడా అన్ని విధాల యోగ్యుడు, తండ్రి మాట కి విలువనిచ్చే కొడుకు. హరి తన చెల్లెలు లక్ష్మి పెళ్ళికి ఆహ్వానిస్తే, శ్రీధర్ వెళ్లి అనుకోని పరిస్తితి లో లక్ష్మి ని వివాహం చేసుకొని తన ఇంటికి తీసుకు వస్తాడు. తన కూతురు వివాహం శ్రీధర్ తో చెయ్యాలని అనుకున్న రాజ వారి బావ మరిది ఈ వివాహం నచ్చక ఒక కాంట్రాక్టర్ ( రావు గోపాల రావు) సహాయం తో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసి వాళ్లు విడిపోయేలా చేస్తాడు. విడిపోయిన లక్ష్మి ఇద్దరు కవలలు కానీ వారిని పెంచుతూ ఉంటుంది. చివరికి శ్రీధర్ లక్ష్మి ఎలా కలుస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎలా కలుపుతారు అన్నది కథ. ఈ సినిమా లో లక్ష్మి కూతురు ఆంజనేయస్వామి వారితో సంభాషణలు, రమణ గారి ఊహ శక్తికి నిదర్శనం. ఇంకా బాపు గారు కాంట్రాక్టర్ పాత్ర నడిపిన తీరు, అతనికి రమణ గారు రాసిన సంభాషణలు కల కాలం గుర్తుంది పోతాయి. సూర్యోదయం చూస్తూ, "సూర్యుడు నెత్తుటి గడ్డలా
లేదు? ఆకాసంలో మర్డర్ జరిగినట్లు లేదు?", "మడిసన్న తర్వాత కూస్తంత కళా పోసన ఉండాల" ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాలు జనాల నోట్లో నానాయి.
ఈ పాట సందర్భానికి వస్తే లక్ష్మి పెళ్లి ఐన తరువాత అత్త వారింటికి వచ్చి పొద్దున్న లేచి వాకిట కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతూ పాడిన పాట. లక్ష్మి ఈ పనులన్నీ చేస్తుంటే ఇంటిల్లి పాడి ఆశ్చర్య పోతూ చూస్తుంటారు. ఇంక పాట లోకి వెళ్తే.
ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు ముంగిల్లలోన
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ
పసుపు మన భారత దేశపు సొత్తు. పసుపు వల్ల కలిగే లాభాలు మనకి తెల్సినట్టు గా ఎవరికీ తెలియదు. అలాగ పసుపు మనం వాడినట్టు గా ఇంక ఎవరు వాడరేమో. అందులో తెలుగింటి ఆడపడుచులు పసుపు పాదాలకి ముఖానికి రాసుకోవటం చూస్తాం, దీని వల్ల ముఖానికి, చర్మానికి వన్నె పెరగటం సర్వ సాధారణం. ఈ పాట 1975 లో వచ్చింది కాబట్టి అప్పటి తరం వ్యవహార శైలి కి అద్దం పడుతుంది ఈ పాట. ఈ రోజుల్లో ఈ విషయం మనం చూడం కాబట్టి ఇప్పటి పద్ధతులకి ఈ పాట అన్వయించలేము. అలాగే కుంకుమ పెట్టుకోవటం ముత్తైదువ లక్షణం. ఆరుద్ర గారు ఇక్కడ అప్పటి పద్ధతులకి అన్వయిస్తూ రాసిన పాట అప్పటి వ్యవహార శైలికి అద్దం పడుతుంది. ముత్యమంత పసుపు రాసుకుంటే ముఖానికి ఎంత వన్నె తెస్తుందో, అలాగే నుదుట, పాపిట కుంకుమ పెట్టుకున్న తెలుగింటి ముత్తైదువ జీవితం కూడా అంతే అద్బుతంగా ఉంటుంది. ముత్యమంత పసుపు అని ఎందుకు అన్నారంటే ఆ మాత్రం పసుపు చాలు వన్నె తేవటానికి. అలాగే ముంగిళ్ళు ఆ రోజుల్లో ప్రతి ఇంటా సర్వ సాధారణం. ముంగిళ్ళ లో ముద్దు మురిపాలు ఉన్నాయి ఆంటే ఆ ఇల్లు ఆనందానికి ప్రతీక. మనుషులు కలిసి ఆనందిస్తున్నారు అనటానికి తార్కాణం. అటువంటి ఇంటిలో అరమరికలు ఉండవు, అపార్థాలు కోప తాపాలు ఉండవు. ఇటువంటి ఇంటిలో అన్ని ద్విగుణీ కృతం అవుతాయి. కాని ఇవి అన్ని ఇంటి ముత్తైదువ వల్లనే సాధ్యం. ఎక్కడ ఇంటి ఇల్లాలు ముఖం లో లేక జీవితం లో వన్నె ఉంటుందో ఆ ఇంట్లో అన్ని చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఒక ఇల్లు ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పారో కదా.
ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే వారి అరచేతనుండు (2)
తీరైన సంపద ఎవరింట నుండు
దిన దినము ముగ్గున్న లోగిల్లనుండు
ఆరని అయిదోతనం, అరుగులు అరచేతన అలకటం, లోగిళ్ళలో ముగ్గులు ఇవి తెలుగు తనానికి ప్రతీక. పల్లెటూర్లో ప్రతి ఇంటికి అరుగులు ఉండేవి. అలాగే అందరు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ప్రతి ఉదయం పేడతో అలికి కళ్ళాపి ( నీరు ) చల్లి ఆ నీళ్ళు ఆరిన తరువాత ముగ్గులు పెడ్తే ఆ వాతావరణ సౌందర్యం చూడటానికి కంటికి ఇంపుగా ఉండేది. అయిదోతనం ఆంటే సుమంగళి అయిన స్త్రీకి ఉన్న ఆభరణాలు. అవి ఏంటి ఆంటే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వకు ( చెవి ఆభరణాలు ). ఇవి అన్ని ఉంటె ఆ స్త్రీ ముత్తైదువ గా ఉన్నట్లే. సాధారణం గా మనం స్త్రీ భర్తని కలిగి ఉంటె సుమంగళి, కొంచెం పెద్ద వయసు కలిగిన వాళ్ళని ముత్తైదువ అంటాం. ఇంక పాట విషయానికి వస్తే ఆరని అయిదోతనం ఎవరి వల్ల సాధ్యం ఆంటే, ప్రతి రోజు అరుగులు అలికి తన కుటుంబం బాగా ఉండేలాగా చూసుకునే ముత్తైదువ చేతి లో ఉంటుంది. అలాగా ముగ్గు వలన అనేకమైన లాభాలు ఉన్నాయి. అవి ఇంటికి సౌందర్యం తీసుకు రావటమే కాక, ఎవరి ఇంటిలో ముగ్గు ఉంటుందో వారి ఇంటికి లక్ష్మి దేవి వస్తుంది అనే ప్రతీక ఉంది తెలుగు నాట. ఇది ఎందుకు ఆంటే ఆ ఇల్లు పద్దతి గా ఉండి అన్ని అవలక్షణాలు లేకుండా ఇంట్లో అందరు కష్టపడి పని చేస్తారు అని అర్థం. ఎవరు పని చేస్తే వల్ల ఇంట లక్ష్మి దేవి ఉండటం సహజం కదా. ఇన్ని వివరిస్తూనే వీటి అన్నిటికి కారణం ఇంటి ఇల్లాలే అని మల్ల చెప్తారు ఆరుద్ర గారు.
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరి కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్ళు
తెలుగు వాళ్ళు పసుపు కుంకుమ కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఆంటే ప్రాధాన్యం ఇంట్లో తులసికి ఉంటుంది. తులసి చెట్టుని దేవత లాగ పూజించడం తెలుగు వారి పద్దతి. తులసి లేని ఇల్లు తెలుగు నాట ఉంటుంది ఆంటే ఊహించలేము. ఇంట్లో పాటించే పద్దతులు ఈ తులసి మొక్క పెరుగుతున్న తీరు బట్టి చెప్పొచ్చు అంటారు. అందుక ఆరుద్ర గారు. కొందరు తులసిని కోటలో పెంచితే, కొందరు కుండీలలో పెంచితే, కొందరు సాధారణం గా ఇంటి ఆవరణలో పెంచితే, కొందరు పూజ మందిరం లో ఉంచుతారు. ఎవరు ఎలా పెంచినా, ఆ మొక్కకి ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఇంటిని చెప్పొచు. ఇంక తులసెమ్మ ఎంత కోరితే అంత ఇచ్చే దేవత. మన ఇంతో ఇంతే కొంగుకి ముదేసుకున్నట్టే, లక్ష్మి, బంగారం ఇచ్చే దేవతే మన ఇంట్లో ఉండే బంగారం. ఇంక తెలుగు వారు తరువాత పూజించేది ఆవుని. పల్లెటూర్లో ప్రతి వారింట పాడి తప్పని సరిగా ఉంటుంది. పాడిని శ్రద్దగా చూసుకుంటే పాలు/పాడి బిందెలు నిండా వస్తుంది. ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం అందరికి తెల్సినా అందం గా చెప్పటం ఆరుద్రా గారి గొప్పతనం.
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూలా గాలి ముత్యాల వాన (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం
మొగలి పూలా గాలి ముత్యాల వాన (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం
ఇంట్లో అన్ని సమకూర్చేది బాద్యత వహించేది ఇల్లాలు అయినా మగాడు ఆ ఇల్లలికి ఆదరణ, ప్రాముఖ్యత, ఆనందం ఇవ్వక పొతే ఇంటిలో ఆనందం వెల్లి విరియటం కష్టమే. అందుకే భర్త ఎంత మెచ్చుకుంటే ఇంట్లో అంత ఆనందం ఉంటుంది. ఈ విషయం మొగలి పూల గాలి, ముత్యాల వాన అని కవితా ధోరణి లో అందం గా చెప్పటం చూస్తాం. మొగలి పూలు చక్కటి సువాసనని ఇస్తాయి, సాయంత్రం ఈ పరిమళ ఆస్వాదిస్తే ఆ ఆనందం వివరించనలవి కాదు. అందుకనే ఇంటి ఆనందానికి ఆ పోలిక. అలాగే ముత్యాల వాన. చివరికి పాట ఇంటికి ఇల్లాలి యొక్క ప్రాముఖ్యత చెప్తూ ముగిస్తారు ఆరుద్ర. ఇల్లాలు సౌభాగ్యం గా ఉంటేనే ఇంటికి ఆనందం అని, అభివృద్ధి అని, సకల సంతోషాలు అని.
కొసమెరుపు: ఈ పాట ఎన్ని ఏళ్ళ తరువాత విన్న తెలుగు వారికి ఏదో తెలియని అనుభూతిని మిగులుస్తుంది. ఇటువంటి అనుభూతిని ఇచ్చిన బాపు, రమణ గారికి మనం ఏమాత్రం గౌరవించక పోవటం మన తెలుగు వారి దౌర్భాగ్యం. తెలుగు సాహిత్యానికి, తెలుగు కళకి విశేషమైన సేవ చేసిన వీరిలో ఒక్కరికైన కనీసం పద్మశ్రీ గా సత్కరించకపోవటం తెలుగు వారి కళల పట్ల నిరాదరణకి తాత్కారం. NTR గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు రమణ గార్లని తెలుగు వీడియో పాఠాలు చెయ్యమని చెప్తూ అవి ఎలా ఉండాలి ఆంటే, "ముత్యాల ముగ్గు" లోని తెలుగు తనం లా, అంత అందం గా ఉండాలి అని. ఈ ఒక్క నిదర్సనం చాలు వీరిద్దరూ ఏమిటి తెలుగు సినిమాకి ఆంటే.