Showing posts with label Song of the week. Show all posts
Showing posts with label Song of the week. Show all posts

Tuesday, September 10, 2019

Song of the week - Jaaligaa Jaabilamma


జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత


కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి

ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది

ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ

Friday, May 9, 2014

Song of the Week - Ramachakkani Seetaki

ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)

Movie Name:         గోదావరి 
Song Name :         రామ చక్కని సీతకి
Music Director:      K. M. రాధాకృష్ణన్
Singer(s):             గాయత్రి  
Lyrics:                  వేటూరి సుందర రామమూర్తి
Director:               శేఖర్ కమ్ముల
Producer :             G.V.G. రాజు
Year of Release:    2006

ఈ పాట తెలుగు సినీ చరిత్రలోని ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట. ఆ అధ్యయమే వేటూరి సుందర రామ మూర్తి గారు. ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి గారు, ఆయన రాసిన ఈ పాట. ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత తాదత్యం చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోత తో ఆనంద భాష్పాలు రాల్చే పాట.

ఇంకో పక్క చూస్తె, అర్థ వంతమైన పాటని అంతే అర్థవంతంగా సినిమాలో సందర్భం ప్రకారం ఉపయోగించుకొనే దర్శకులు మనకి బాపు విశ్వనాథ్ గార్లతో అంతమై పోయిందా అనిపించే పాట. అర్థవంతమైన పాటని ఎంతో  అందం గా చూపించ గలిగిన దర్శకులు జంద్యాల, వంశీ గార్లతోనే ముగిసిందా అనిపించే పాట  ఇది. ఎందుకంటే ఇంత అందమైన, అర్థవంతమైన పాట సినిమాలో నేపధ్యం లో వినపడి వినపడనట్టు వచ్చి వెళ్ళిపోతుంది. పాత్రల సంభాషణల్లో ఈ పాట  కొట్టుకుపోతుంది. ఇంకో పక్క దర్శకుడు ఈ పాటని సినిమాలో ప్రవేశ పెట్టినందుకు ఆనందం కూడా కలుగుతుంది, ఇందుకోసమైనా దర్శకుడు శేఖర్ కమ్ములని అభినందించక తప్పదు. సంగీతం అందించిన K.M . రాధాకృష్ణన్ మనకి వంద, యాభై సినిమాలకి సంగీతం అందించి శ్రోతల చేత తిట్టించుకునే కన్నా, ఇటువంటి చిరాయువు కలిగిన పాట చేస్తే సినిమా చరిత్ర లో చిరంజీవిగా నిలబడి పోగలుగుతాడు అని నిరూపిస్తాడు 

సీతారాముల మీద కవిత్వం రాయని కవి ఉండడు.అలాగే సీత రామ కథలని చెప్పని రచయిత ఉండడు. ఈ రెండు పాత్రలు భారతీయ సంస్కృతి లో ఎంతగా ఇమిడి పోయాయో చెప్పనలవి కాదు. రామ నామం వినగానే పరవసించని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రాముడు దేవుడయ్యింది అవతార పురుషుడు కాబట్టి అనే కంటే, అటువంటి పరిపూర్ణమైన పురుషుణ్ణి మనం ఇప్పటి వరకు చూడలేదు అంటే సరిపోతుంది ఏమో. అందుకనే ఏ పోలికైన రాముడి వైపు వెళ్తుంది, ఏ వర్ణన అయినా రాముడి వైపు వెళ్తుంది. అన్ని రకాలుగా అందరిని మెప్పించిన రాముడు దేవుడు అయ్యాడు. ఒక రాజు గా, ఒక కొడుకు గా, ఒక శిష్యుడి గా, ఒక స్నేహితుడిగా ఒక భర్త గా, ఒక అన్న గా, ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని విధాలా పరిపూర్ణమైన వాడు రాముడు. సీతా రామ జంట ఎంత కన్నుల పండుగా ఉంటుందో కవి ఊహా శక్తికి అందనటువంటి జంట. అందుకనే ప్రతి కల్యాణం సీతారామ కళ్యాణమే, అది తలచుకొంటే మనకి కలిగే ఆనందం అంతు లేనిది. వేటూరి గారు సినెమా లోని సీతా మహాలక్ష్మి ( సీత ), రామ్ ల జంట కోసం ఆ సీతారాముల మీద సరసం గా, సీతమ్మ వారి వేదనగా, విరహంగా, ఒక్కో వాక్యంతో రామకథని మనకి చెప్తారు. ఆ సమకూర్చిన సాహిత్యానికి అత్యద్భుతమైన సంగీతంతో  చక్కని తెలుగు తనం అడుగడునా ఉట్టిపడే పాటని అందించారు వేటూరి, రాధాకృష్ణన్ కలిసి. ఉడతా భక్తి గా తనవంతు సహకారం అందిస్తారు శేఖర్ కమ్ముల ఈ పాటని సినిమా ద్వారా అందించటంతో.

 అందించటంతో  సినిమా విషయానికి ఈ పాట సందర్భానికి వస్తే, శ్రీ రామ్ చాల నియమాలు కలిగి అవి పాటించి అందరి చేతా చులకలన పొందే వ్యక్తి. తన మరదలు తో పెళ్లి కోసం ఆశ పడతాడు కాని ఆమె తల్లి తండ్రులు రామ్ దగ్గర ఏమి లేదని ఒక ఐ పి ఎస్ ఆఫీసర్ కి ఇచ్చి భద్రాచలం లో పెళ్లి చెయ్యటానికి నిశ్చయిస్తారు. నిరాశ  తో ఆ పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక పోయిన తప్పని సరి అయి రాజమండ్రి నుంచి లాంచి లో వెళ్ళటానికి సిద్దమవుతాడు. ఇంకో పక్క సీతా మహాలక్ష్మి ( సీత ) జీవితం లో కలిగిన వైఫల్యాలతో విసిగి ( పెళ్లి కొడుకు సీతని తిరస్కరించటం, చేసే వ్యాపారం ముందుకు వెళ్లకపోవటం) విరామం కోసం అదే లాంచి లో భద్రాచలానికి వెళ్తుంది. ఆ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ ఆడ వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవటానికి లాంచి ఒక చోట ఆగుతుంది, అప్పుడు అందరి మధ్య జరిగే సంభాషణల నేపధ్యం లో వచ్చే పాట ఇది. అందరు బామ్మల లాగానే ఒక జంట పెళ్ళికి సిద్దం గా ఉన్నారంటే వాళ్ళ దృష్టి ఆ జంట మీదే ఉంటుంది. అందులో తనవాళ్ళు అయితే ఇంక వాళ్ళకి అడ్డే ఉండదు. ఈ సినెమా లో బామ్మ ,కూడా అంతే , మన ఇంట్లో బామ్మ/అమ్మమ్మ లాగ :)

ఈ పాటలోనే కాదు సినెమా మొత్తం గోదావరి అందాలు చెప్పనలవి కానివి. గోదావరితో  పరిచయం ఉన్నవాళ్ళకి అర్థం అవుతుంది ఇది మాటల్లో వివరించలేనిది అని. ఆ లాంచీ రేవు గోదావరి గట్టు, గోదావరి ప్రవాహం, నది మధ్యలో లంకలు, తెర చాపలు, చుట్టూ ఉండే పచ్చదనం, నది ఒడ్డులో పిల్లల ఈతలు, పాపి కొండల మెరుపులు, ఇవన్ని గోదావరి తో జీవితం ముడిపడి ఉన్న వాళ్ళ మధురానుభూతులు. వేదంలా ఘోషిస్తుంది, ఉప్పొంగి చేలల్లో పచ్చదనం తెచ్చి అందరిని అలరిస్తుంది, అందరి కష్టాలు తీరుస్తుంది, బ్రతుకు తెరువు కలిగిస్తుంది, అటువంటి గోదావరి తలచుకున్నప్పుడల్లా అనుభందం ఉన్న వాళ్ళ కళ్ళలో మెరుపు తప్పకుండా ఉంటుంది. ఇంక వేటూరి గారి పాటలోకి వెళ్దాము 

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

KM రాధాకృష్ణన్ ఈ పాటకి అడుగడునా న్యాయం చేకూర్చారు. గాయని, వాయిద్యం, నేపధ్యం అన్ని సరిగ్గా సమకూరాయి ఈ పాటలో. ప్రతి చరణం ముగించిన తీరు చాల బాగుంటుంది. ప్రశాంతం గా ఉండే గోదావరి లాగ ప్రారంభించి  మనసు తట్టి లేపి ఉప్పొంగిన గోదావరి లాగ కదిల్చి వేస్తుంది. నెమ్మది గా ప్రసాంతం గా సాగుతున్న నావ ఒక్క సారి జోరు అందుకున్నట్టు ప్రతి చరణం సాగుతుంది. మధ్యలో వచ్చే సంగీతం అలల్లాగా పలకరించి వెళ్లి పోతుంది.

సీతమ్మ వారి వర్ణన వింటాము పల్లవి లోని మొదటి రెండు వాఖ్యాలతో. నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన ( రమ ) ఘన విచలన అంటే నెమ్మది గా/ భారం గా నడిచేది అని, ఇక్కడ నెమ్మది  గా అంటే సున్నితంగా, వయ్యారంగా, దీన్నే మార్చి మంద గమన అంటారు చివర్లో. ధరణిజ అంటే భూదేవి కి కూతురు, మధుర వదన, ఇందు వదన అన్ని సీతమ్మ వారికి ఉపమానలే. నలిన నయన అంటే పద్మము వంటి కనులు కలదానా అని. సీతమ్మ వారి గురించి ఇంత వివరించి, అటువంటి మా సీతమ్మ సీత మనవి వినవా రామ అని పాట ప్రారంభిస్తారు వేటూరి గారు. సీతమ్మ మనవి ఏంటి అనేది మనకి తెల్సిందే రాముడిని కలవాలని, చూడాలని.

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట  || రామచక్కని సీతకి ||

తెలుగు నాట గోరింటాకు పెట్టుకోవటం ఒక చెప్పలేని అనుభూతి. ప్రతి వనిత ఎంతో కష్టపడి ఆకులు కోసి ఆ ఆకులని రుబ్బి, ఇష్టపడి చేతికి పెట్టుకొనేది గోరింటాకు. ఇది పెట్టుకోనని మారాము చేసిన కన్యల కోసమే అన్నట్టు గోరింటాకు పండిన విధానంకి ఆ కన్యకి రాబోయే వరుడికి ముడి పెట్టి ప్రోత్సహిస్తారు పెద్దలు. ఆ కన్య తన ఊహల్లో తనకి వచ్చే రాకుమారుడిని ఊహించుకుంటూ పండిన చెయ్యిని చూస్తూ మురిసిపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడ, గన్నేరు లా పూస్తే కలవాడు వస్తాడు, సింధూరం లా పూస్తే చిట్టి చేయ్యంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు అన్నారు. వేటూరి గారిక్కడ రాముడు మెచ్చిన, రాముడికి నచ్చిన సీతకి అరచేత గోరింటాకు పెడితే ఆ గోరింటాకు పండిన చెయ్యి మెరిసిపోతే చక్కని సీతకి మొగుడు గా ఎవరు వస్తారో అని అడుగుతూనే  రాముడు కాక ఇంకా ఎవరు వస్తారు అని చెప్పకనే చెప్తారు రామచక్కని సీత అంటూ. ఈ రెండు వాక్యాలతో సీత కళ్యాణం ముందు ఉన్న ఘట్టాలన్నీ అలాగే కల్యాణం ముందు సీత ఏమి ఊహించుకొని ఉంటుందో అన్న ఊహ లోకి తీసుకెళ్తారు వేటూరి గారు. ఈ పాట పాడిన గాయత్రి మొత్తం పాట అద్బుతం గా పాడినా అరచేత గోరింట అన్నప్పుడు గోరింట అన్నప్పుడు స్పష్టం గా ఉండదు. ఇంత చక్కని కవిత్వానికి చెయ్యగలిగిన న్యాయం ప్రతి మాట స్పష్టం గా వినపడేలా పాడటమే.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో           || రామచక్కని సీతకి ||

వేటూరి గారి కల్పనా శక్తి కి హద్దు అంటూ ఉండదా? ఈ మూడు వాఖ్యాలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రాముడు అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అని అందరికి తెల్సిందే. ఆ శక్తి ఎటువంటిదంటే సీతా స్వయంవరం అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరు ఎత్తలేని శివ ధనుస్సుని  ఎడమ చేత్తో ఎత్తటం రాముని ప్రతాపానికి ప్రతీక. ఇంక రాముడు సీత కోసం లంక కి వెళ్ళేటప్పుడు సముద్రం మీద వంతెన కడ్తున్నప్పుడు అందరూ శక్తి వంచన లేకుండా రామకార్యం అని తలచి చేతనైన సహాయం చేసారు. ఆ క్రమంలో ఒక ఉడత కూడా సహాయం చెయ్యటం చూసి సంతోషంతో ఉప్పొంగిన రాముడు ఆ ఉడతని ఆప్యాయంగా చేత్తో తీసుకొని వీపు మీద వేళ్ళతో నిమురుతాడు. అప్పుడు పడిన గీతలు ఉడత జాతి మీద ఉండి పోతాయి. ఈ రెండు ఉదంతాలు ఎంత అద్బుతమైన పదాలతో చెప్తారో వేటూరి గారు. ఈ రెండు వాఖ్యాలకే కళ్ళు చమ్మగిల్లితే ముగింపు వింటే ఆయన కవితా పటిమకి అబ్బుర పడవలసిందే. శక్తి వంతమైన రాముని చెయ్యి ఎడమ చేత్తో శివధనస్సు ఎత్తుతాడు, ఉడత వీపున వేలు విడుస్తాడు, అటువంటి రాముడు సీతని పెళ్లాడతాడు అన్న అర్థం వచ్చేలా చెప్తారు పుడమి అల్లుడు రాముడే అని. సీత అమ్మ వారు భూదేవి కూతురు, భూమి నుంచి పుడ్తుంది కాబత్తి. సీతకి భర్త అయితే భూమాతకి అల్లుడే గా. కాని ఎడమ చేత్తో సీత జడను ఎత్తగలడా అన్న ప్రశ్న  సంధిస్తారు ఇదే అయన ఊహ శక్తికి నిదర్సనం. ఎందుకంటే తాళి కట్టటానికి రెండు చేతులు కావాలి, మరి తాళి కట్టేటప్పుడు తనంతట తానే జడని ఎత్తటం ఎవరికీ కుదరదు ఎంతటి బలవంతుడి కైనా శక్తిమంతుడి కైనా. ఉన్న రెండు చేతుల తో తాళి కడతే జడ ఎత్తటం ఎలా సాధ్యం? ఇటువంటి అద్భుతమైన ధర్మ సందేహం కలగటం వేటూరి గారి చమత్కారం అది కూడా నిఘూడం గా.

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపోశైనాడు దేవుడు నల్లని రఘురాముడు    || రామచక్కని సీతకి ||

ఇప్పుడు లంకకి ఇటువైపు రాముడు ఉంటె, అటువైపు సీతమ్మ వారు. రాముడి జాడ తెల్సినా ఎప్పుడు వస్తాడో తెలియదు, కాని వస్తాడని నమ్మకం. సీతమ్మ వారిని ఎర్ర జాబిలీ తో పోలుస్తారు, ఇది ఇంకో చమత్కారం. ఎర్ర జాబిలి  చెయ్యి గిల్లటం ఏమిటి అని అనిపించక మానదు. బాద తో కూడిన ఉక్రోషం తో కూడి ఎర్రగా కందిపోయిన ముఖం ఎరుపు గానే ఉంటుంది. జాబిలి లాంటి సీతమ్మని రాముడు ఏడి అని అడుగుతుంటే మాట ఒకటి అంటే కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. మనం ఏదైనా చెప్పొచ్చు కాని కళ్ళు అబద్దాన్ని దాచవు అంటారు. కళ్ళు ఏమి చెప్తున్నాయో చెప్తే మనం గమనించొచ్చు. ఇక్కడ రాముడి జాడ లేదు కనపడకుండా పోయాడు, ఆ మాట పెదవితో చూడలేదు అని చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తాయి రాముడు ఎక్కడున్నాడో తెలియదు అని. నల్ల పూసై నాడు దేవుడు నల్లని రఘు రాముడే. నీల మేఘ శ్యాముడు రాముడే గా అందుకని నల్లని రఘురాముడు అన్న ప్రయోగం అలాగే మనతో ఉండి కనపడకుండా పోయిన వాళ్ళని నల్ల పోశ అయ్యావు అంటారు. ఇది వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో బాగా ప్రయోగిస్తారు. అమావాస్య తరువాత చంద్రుడు వచ్చినా కనపడడు, అలాగే రాముడు ఉన్నాడు కాని కనపడడు అని సీతమ్మ అనుకుంటోంది అని అందం గా చెప్తారు 

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా  || రామచక్కని సీతకి ||

వేటూరి గారు చక్కని చుక్క అని సీతమ్మ వారిని అంటారు కానీ ఇక్కడ రాముడి కోసం సీత పడే తపన ఈ చరణం. చుక్కలని, దిక్కులని అడిగా రాముడు ఏడని, ఇంక బాధతో కూడిన కన్నులని అడిగితె అవి నీటి తో చెమ్మగిల్లాయి, వాటి నిండా కన్నీరే, ఏదైనా చెప్పటానికి ఆ కన్నీరే అడ్డుపడింది, మనసు నిండా ఉన్న రాముడుని చూసుకోవటానికి అడిగితె చెప్పటానికి రాముడు కనపడటం లేదని బాధ తో ఉన్న మనసు నుంచి మాటలు రావటం లేదుగా - ఎంతో ఆర్తితో రాసిన వేటూరి గారు, అంతే  ఆర్తి ధ్వనిస్తుంది ఈ చరణం లొ. 

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

వేటూరి గారు ఇందువదన కుందరదన అన్న పదాలతో ప్రయోగం చేసిన పాట ( చాలెంజ్ సినిమా లో ) వింటే ఆ పాట కి ఈ పాట కి ఎంత వ్యత్యాసమో కదా. మరల అవే పదాలు అటు ఇటు మార్చి ఒకసారి సీతని వర్ణిస్తే ఇంకో సారి ప్రశ్నిస్తారు ఎందుకమ్మా నీకు ఇంత  వేదన, ప్రేమ వలెనే కదా అని. అది పదాల మీద ఆయనకి ఉన్న పట్టు. సీతమ్మ వారిని చందమామ తో పోలుస్తారు ఒక సారి ఎర్ర జాబిలి  అంటారు ఇంకోసారి చంద్రుని వదనం కల దాన అంటారు ఒక సారి మంద గమన అంటారు ఇంకో సారి ఘన విచలన  అంటారు. అతిలోక సుందరి సీతమ్మ వారు నడిస్తే అత్యంత వయ్యారం గా ఉంటుంది, ఆ నడక చూస్తే కందిపోతుందేమో సీతమ్మ పాదం అన్నట్టు ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్న సీతమ్మ నీకు ఎందుకమ్మా ఇంట విచారం, రాముని మీద ప్రేమ వలెనే కదా? అయినా సీతమ్మని వర్ణించాలంటే ఒక జీవితం సరిపోతుందా? ఈ మాటల మాంత్రికుడి చేతిలో పదాలు మారి అర్థం మారేది శ్రోతల్ని అలరించటానికే సుమీ అన్నట్టు ఉంటాయి.

కొసమెరుపు: వేటూరి గారు శేఖర్ కమ్ముల కి ఎంత సహాయ పడ్డారో శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తె తెలుస్తుంది, ఆనంద్ కాని, గోదావరి కాని, లీడర్ కాని, హ్యాపీ డేస్ కాని. ప్రతి సినిమాలో అద్బుతమైన పాటలని ఇచ్చారు. ఉప్పొంగెలే గోదావరి పాట గోదావరి అభిమానులకి కన్నుల పండుగ.

ఈ సినిమాకి మొదట మాధవన్ హీరో గా అనుకున్నారు శేఖర్ కాని, ఆయన లభ్యం కాకపోవటం తో సుమంత్ హీరోగా నటించటమే కాకుండా మంచి విజయం సాధించాడు. గోదావరి లో సినిమా తీయటం ఎంత కష్టం అయ్యిందో శేఖర్ కమ్ముల చాల సార్లు వివరించారు. డీజిల్ కి, జెనరేటర్ కి అనుకున్న దానికంటే ఖర్చు అయ్యింది అని చెప్తారు. గోదావరి ప్రవాహం బట్టి రంగు మారుతుంది ఆ రంగులు సినిమాలో చూపించాలంటే అన్ని రోజులు ఆగాల్సిందే. ఇంక లాంచి  సినిమా కోసం చేసిందే. తనికెళ్ళ భరణి పాత్ర కీలకమైన పాత్ర లాంచి మీద ఉన్నంత వరకు. ఇంక కుక్కలు  animation  అయినా  చిన్న తో మనల్ని అలరిస్తాయి. 

Thursday, April 17, 2014

Song of the Week - Siva Poojaku Chivurinchina

Song of the week -  శివ పూజకు చివురించిన (Siva poojaku Chivurinchina)

ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)
Movie Name:         స్వర్ణ కమలం  
Song Name :         శివ పూజకు చివురించిన
Music Director:      ఇళయరాజా  
Singer(s):             SP  బాలసుబ్రహ్మణ్యం , సుశీలమ్మ 
Lyrics:                  'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి 
Director:               K . విశ్వనాథ్
Producer :             K.S . రామారావు (క్రియేటివ్ కమర్షల్స్)
Year of Release:    1988



సిరివెన్నెల గారు స్వర్ణ కమలం సినిమాలో మనకి వజ్రాల్లాంటి పాటలు ఇచ్చారు. ఒక్కో పాట ఒక్కో అనుభూతి మిగులుస్తుంది. అందులో ఈసినిమా ఆయన సినీ జీవితం లో అత్యంత ఉన్నతమైన పాటలు కలిగిన సినిమాగా మిగిలిపోతుంది. ఈ పాట అయన రాసిన అన్ని పాటల్లో మొదటి పది వరుస క్రమం లో తప్పకుండ ఉండే పాట. ఇలాంటి పాట వింటుంటే అనిపిస్తుంది, ఒక పాటలో ఇంతో లోతైన భావం, సినిమాలోని పాత్రల ఆలోచనా సరళి, సందర్భోచితమైన సంఘర్షణ, నిగూఢమైన వేదాంతం, అనంత పద సౌందర్యం, అనిర్వచనీయమైన అనుభూతి మరల ఇంక తెలుగు శ్రోతకి ఉండవేమోఅని. శ్రోత మనసుకి, హృదయానికి, మెదడుకి పని కల్పించే పాట సిరివెన్నెల గారి తో అంతమైపోతుందేమో అని కూడా అనిపించటం సహజం.

విశ్వనాథ్ గారు కళా తపస్వి బిరుదుకి పూర్తి న్యాయం చేసిన సినిమాలలో ఇది ఒకటి అంటే మనకి ఆయన గురించి అర్థం అవ్వనట్టే. ఎంత ఐశ్వర్యం సంపాదించినా మనసు లగ్నం చేసి ఒక కళని నేర్చుకొని ఆస్వాదించి అనుభవిస్తే వచ్చిన ఆనందం,సంతృప్తి ఇంక ఎందులోనూ లభించదు అని నిరూపించిన చిత్రం.  ఈ సినిమా కథ మనకి అర్థం అవ్వాలంటే కథానాయకుని మనసు ద్వారా ఆలోచిస్తే మాత్రమే ఈ కథ అర్థం అవుతుంది. లేదంటే ఈ కథ ఒక సాధారణ కథగా మిగిలి పోతుంది. అలాగే కథానాయిక పొందిన అనుభవం, ఆలోచనలో మార్పు మనం లీనమైతే కాని అర్థం అవ్వదు. చాల మందికి ఈ సినిమాలో విదేశి వనిత (Sharon Lowen) ఉన్న సన్నివేశాలు కొంచెం అసహనానికి గురి చేస్తాయి అవి అర్థం కాకే అని అనుకోవచ్చు. కాని ఆమె ఈ సినిమాకి ప్రాణం, ఎందుకంటే దర్శకుడు ఆమె ద్వారా తను చెప్పదల్చుకున్నది చెప్పించారు.

ఈ  సందేశం కూడా ప్రతి మనిషి తను అనుభవిస్తే కాని అర్థం కాని విషయం. ప్రేక్షకులకి తేర మీద అర్థం అయ్యేలాగ చెప్పటం చాల చాల కష్టం. అది చెప్పటంలో సఫలీకృతం అవ్వటం విశ్వనాథ్ గారు దానికి పడ్డ తపన కష్టానికి తార్కాణం. అందుకనేనేమో ఈ సినిమా సినీ జీవిత చరిత్రలో చిరకాలం నిలచిపోయే సినిమాగా మిగిలిపోయింది.  ఈ సినిమాకి కళాభిరుచి కలిగిన నిర్మాత దొరకటం చాల అరుదు. సినిమా ని వ్యాపారం గా చూసే నిర్మతలున్న రోజుల్లో. కమర్షియల్ సినిమాలు తీసే కె ఎస్ రామారావు గారికి ఈ అవకాశం దొరకటం ఆయన చేసుకున్న అదృష్టం.

ఇళయరాజా సంగీతం ఈ సినిమాని ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లిందో మనం ప్రత్యక్షంగా చూస్తాము. ప్రతి పాటలో సంగీతం పాత్రలకి అనుగుణంగా ఉంటుంది. సిరివెన్నెల గారి ప్రతి పదానికి సరి అయిన న్యాయం చేకూర్చారు ఇళయరాజా. అందులో ఈ "శివ పూజకు" పాటని "కళావతి" రాగం లో సమకూర్చారు. ఇంతకన్నా సందర్భోచితం ఇంకేదైనా ఉంటుందా? ప్రతి సన్నివేశంకి అనుగుణంగా సంగీతం సమకూర్చటం ఇళయరాజా గారికే సాధ్యమేమో అనిపిస్తుంది. పాటలు మాత్రమే కాదు నేపధ్య సంగీతం కూడా అత్యంత ఉన్నతం గా ఉంటుంది. ఉదాహరణకి సావిత్రి అప్పడాలు ఎండ పెడ్తున్నప్పుడు ఆమె ప్రేమికుడు వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, పని మనిషి చేసే సరసమైన సంభాషణలు జరుగుతున్న నేపధ్యం లో వచ్చే సంగీతం ప్రణయాన్ని సూచిస్తుంది ఆ తరువాత మీనాక్షి ( భానుప్రియ ) స్నానం ముగించి తన గది లోకి వచ్చినప్పుడు చేసే పనుల మీదకి కెమెరా మారుతున్నప్పుడు సంగీతం అలా చక్కగా మారిపోతుంది. ఒక సంగీత దర్శకుడుకి ఉన్న పట్టు మనకి స్పష్టం గా కనపడుతుంది. ఇంక ఇలాంటి సన్నివేశాలు అనేకం ఈ సినిమాలో, తన సంగీతం తో మనకి ఆ అనుభూతి కలుగచేస్తారు ఇళయరాజా గారు

ఇంక సిరివెన్నెల గారి పదవిన్యాసం అత్యంత ఉన్నతం. ఆయన గురించి ఎలాగో మనము పాటలోమాట్లాడుకుంటాం. ఈ పాటకి, సంగీతానికి బాలు గారి గళం, ఆ గళం గురించి చెప్పాలనుకోవటం సముద్రం లోతు తెల్సుకోవాలని అనుకోవటమే. ఇలాగ ఈ నలుగురు బ్రహ్మ నాలుగు తలలుగా మారి సుశీల అమ్మవారితో కలిసి సృష్టించిన అద్బుతమే ఈ పాట.

విశ్వనాద్ గారు ఈ సినిమాలో కొన్ని శ్లోకాలు అర్థవంతంగా చొప్పిస్తారు సన్నివేశానికి అనుగుణంగా. విశ్వనాథ్ గారి దర్సకత్వ ప్రతిభ చెప్పే సన్నివేశాలు చాల ఉన్నా, ఈ సన్నివేశంలో ఆయన ఉపయోగించుకున్న శ్లోకం మనల్ని అలోచింపచేసి ఆనందపరుస్తుంది.

ప్రతి రోజు రాత్రి ఒక పాట పాడటం సావిత్రి ( కధానాయకురాలి అక్క ) అలవాటు. పక్కింటి ఆయన ఆ పాట  వినటం కోసం రావటం ఆ పాట గొప్పతనం చెప్పిస్తారు. విశ్వనాథ్ గారు. అక్కడ ఆయన ఎన్నుకున్న శ్లోకం దర్శకుని పరిణితి కి నిదర్సనం. ఆది శంకరాచార్య విరచితమైన ఈ శివ మానస పూజ నుంచి తీసుకున్న శ్లోకం, ఈ శ్లోకం అర్థం తెలిస్తే ఆ సన్నివేశానికి ఎంత ఉన్నతమైన ఎంపిక అనేది మనకి అర్థం అవుతుంది. సావిత్రి పాత్ర ఎంత చక్కగా రచించారో విశ్వనాథ్ గారు మనం సినిమా లో చూస్తాం.

ఆత్మా త్వం గిరిజా మతిహ్ పరిజనాహ్ ప్రాణాహ్ శరీరం గౄహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితిహ్
సంచారహ్ పదయోహ్ ప్రదక్షిణ విధిహ్ స్తోత్రాణి సర్వా గిరహ్
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం

ఇంకో శ్లోకం శివపూజకు పాట  చివర్లో వస్తుంది

శ్రేయాన్ స్వధర్మో  విగుణః  పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!! 

భగవద్గీత లోని శ్లోకం ఆధారం గా సినిమా వచ్చిందా లేక సినిమా కి ఈ శ్లోకం సరిగ్గా సరిపోయిందా అన్నది సగటు ప్రేక్షకునికి ప్రశ్నగా మిగులుతున్ది.  సినిమాలోని కథ నాయికకి, కథా నాయకుడు  ఈ సందేశం  అడుగడుగునా ఇస్తాడు. అసలు ఈ శ్లోకం ఒకటి ఉందనీ అది ఈ పాట  ద్వారా రెండు పాత్రల మధ్య కలిగే ఆలోచనల సంఘర్షణ కి అన్వయించవచ్చు అని తట్టడం దర్శకుని ఆలోచనా ప్రతిభకి తార్కాణం. అదే సమయంలో ఇలాంటి సినిమాలు మనకి ఎందుకు కరువు అవుతున్నాయో అర్థం కాని ప్రశ్న ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఇప్పటికి 26 సంవత్సరాలు మరి.

ఈ శ్లోకానికి అర్థం కొన్ని వందల రకాలుగా చెప్తారు వేదాంత పండితులు. అంతటి అర్థవంతమైన శ్లోకాన్ని ఒక పాటలో తద్వారా సినిమాలో చొప్పించడం ఇంక మన తెలుగు సినిమాలో చూడలేమేమో. ఈ శ్లోకం గురించి విశ్లేషణ పాటలోకి వెళ్ళినప్పుడు చూద్దాం.

అలాగే విశ్వనాధ్ గారి సినిమాల్లో మాటలు అత్యంత అర్థవంతంగా ఉంటాయో ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం  నిరూపిస్తుంది. మాటలు రాసిన సాయినాధ్ గారి జన్మ ధన్యం. పాత్ర గొప్పతనం మాటల్లోంచి వస్తుంది వాళ్ళ హావ భావల్లోంచి వస్తుంది, నేపధ్య సంగీతం లో వస్తుంది, ఇంకా అలా చెప్తూ ఉంటె అంతం కాని గొప్పతనం కలిగిన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి.

ఈ పాట గురించి మాట్లాడుకునే ముందర అక్కడి వరకు జరిగిన కథ, సన్నివేశాలు స్పర్సించుకోవటం సమంజసం. ఈ సినిమా అందరు చూసినదే అయినా ఒక సారి ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకుంటే ఈ పాట వివరణకి సహాయ పడతాయి. కథానాయకుడు ఒక అనాధ చిత్రకారుడు. ఇంకో చిన్న కుర్రాడి తో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి మీనాక్షి అనుకోని విధం గా కలవటం, అతను  ఆమె ఇంటి పక్కనే అద్దెకు రావటము, ఆమెలో నిక్షిప్తమైన సజీవ కళని  గుర్తించి ఆరాధించటం, తరువాత అవకాశం  దొరికినప్పుడు ప్రోత్సహించటం జరుగుతుంది. అలాగే ఆమె కుటుంబానికి దగ్గర అవ్వటం జరుగుతుంది. అలా ఆమెకి ఇష్టం లేకపోయినా ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చెయ్యటం. ఇష్టం లేని పని చేసాడని కోపం తో గజ్జెలు తెమ్పటం, అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక చాల కాలం తరువాత శర్మ గారు నాట్యం చేస్తూ హఠాత్తు గా ప్రాణం విడవటం జరుగుతుంది. ఆ తరువాత మీనాక్షి బాధ పడుతుంటే అక్క సావిత్రి మీనాక్షి కి నచ్చ చెప్తూ ఇంక ఎవరు నాట్యం చెయ్యమని అడగం కాబట్టి ఎవరో గజ్జెలు కావలి అన్నారు ఇచ్చేసి రా అని పంపుతుంది. మీనాక్షి అక్కడికి వెళ్ళకుండా చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుంది హోరు వానలో తడుస్తూ. చందు అప్పుడు ఏదో గీస్తూ ఉంటాడు మీనాక్షి వచ్చిన విషయం గమనించడు. అతను తన వైపు చూడటం కోసం ఒక్కో మువ్వ తెంపి విసిరేస్తుంది. అయినా చంద్రం ఒక్క మాట కూడా అనకుండా, తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి టీ  తాగుతారా అని కప్పు లో టీ  పోస్తాడు అన్ని వద్దు అంటూ, "ఈ మర్యాదలు కాదండి కావాల్సింది, ఒక మనిషిని మనిషి గా గౌరవించటం కావలి, వాళ్ళ ఇష్టా ఇష్టాలు తెలియాలి" అని అంటూ వెళ్ళ బోతుంది. చంద్రం ఆగమని తన రైన్ కోటు కప్పుతాడు, అప్పటి వరకు అన్ని విసిరి కసిరిన మనిషి ఆ కోటుని ఉంచుకొని మౌనం గా వెళ్ళటం రాబోయే రోజులకి, జరిగే పరిణామాలకి చిహ్నమా?? అవుననే చెప్తారు విశ్వనాధ్ గారు తన సినెమా ద్వారా.

ఇంక పాటలోకి వెళ్దాము 

అతడు: శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ.. (2)
సిరి సిరి మువ్వ..(2)
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా..
సిరి సిరి మువ్వ..(2)

సిరివెన్నెల గారు చాల సార్లు తన సినీ జీవితం లో అత్యంత కష్టపడి రాసిన పాట ఏది అంటే ఈ పాటే అని చెప్తారు. ఈ పల్లవి వింటేనే మనకి అర్థం అవుతుంది. ఇంతటి భావుకత ఉన్న పాట అత్యంత అరుదుగా ఉంటాయి.  సినెమా లోని సన్నివేశం చూస్తె ఈ పాట పల్లవి ఎంత అద్బుతమో మనకి అర్థం అవుతుంది. అది ఎందుకో ఎందుకో చూద్దాం. మీనాక్షి గజ్జెలు తెంపి వాటిని విసిరేసి వెళ్ళిపోయినప్పుడు అవి అన్ని ఏరి గజ్జలు చేతిలో పట్టుకొని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు విశ్వనాధ్ గారు చంద్రశేఖర్ మనసులోని భావాల్ని పాట రూపం లో మనకి అందిస్తారు. ఇటువంటి సందర్భాన్ని ఇచ్చి ఎటువంటి హద్దులు లేకుండా కవికి పాట రాయమంటే ఆ కవి ఎలా చెలరేగి పోతాడో ఈ పల్లవి మనకి నిదర్సనం. ఈ చరణం కాని పాట కాని చాల రకాలుగా రచన చెయ్యొచ్చు. కాని మనకు చరణం విన్నప్పుడు కలిగే అనుభూతి  అనిర్వచనీయం. ఒక్కో పదం ఒక్కో నిర్దిష్ట మైన భావం, అర్థం కలిగి ఉన్నాయి. 

చంద్రశేఖర్చే చేతిలో గజ్జెల మువ్వలు ఉన్నాయి, ఆ మువ్వలు దేనికోసం, నాట్యం కోసం. ఆ నాట్యం ఎవరికీ అంటే అత్యంత ప్రీతి శివునికంటే వేరే వారు లెరు. శివుణ్ణి ఎలాగ పూజించటం అంటే నాట్యం తోనే, ఆ నాట్యానికి గజ్జెలు ఆ గజ్జేలకి మువ్వలు తప్పక ఉండాలిగా. ఇక్కడ గజ్జెల మువ్వలు అని అన్నా నిజానికి ఆ మువ్వ మీనాక్షి. తన నాట్యం తో నటరాజుని పూజించటానికి పుట్టిన మువ్వ మీనాక్షి అని. అటువంటి మీనాక్షి నాట్యం ఎలా ఉంటుంది అంది చంద్రశేఖర్ భావం? మృదువు గా అత్యంత అందంగా పాదాల కలయిక ఒక అందమైన పువ్వు గా ఉంటుంది. పదం అంటే అడుగు లేదా మాట. మంజరి అంటే కూడిక, లేక పువ్వు. పువ్వు వాఖ్యం చివరన ఉంది కాబట్టి మీనాక్షి పాదాలతో చేసే నాట్యం మృదువైన అందమైన పువ్వు లాగ ఉంటుంది అని. ఆ పువ్వు ఇందుకోసం అంటే శివుని పూజ కోసం అని ఎంత అందం గా చెప్పారో సిరివెన్నెల గారు. అదే మాట విశ్వనాథ్ గారు సినిమా మొదట్లో చెప్తారు   " ఈ కళలన్నీ ఆ పరమేశ్వరుని పాదాలని అలంకరించిన స్వర్ణ కమలాలు" 

మీనాక్షి నాట్యం కోసమే పుట్టింది అన్న నమ్మకం చంద్రశేఖర్ కి కలిగి ఉండటం అడుగు అడుగునా చూస్తాం సినిమాలో అదే భావం పాట  లోని మొదటి రెండు పంక్తులలో చెప్తారు సిరివెన్నెల గారు. ఎంత చక్కని వివరణ??

యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా..
సిరి సిరి మువ్వ..(2)
నటనాంజలితో బ్రతుకును తరించనీవా..
సిరి సిరి మువ్వ..(2)

యతి రాజు అంటే శివుడే. శివుడు నిర్వ్యామోహి, దేని మీద వ్యామోహం లేని  వాడు. సన్యాసుల లో రారాజు శివుడు. వైరాగ్యానికి మారు పేరు శివుడు. బూడిద పూసుకొని స్మశానం లో తపస్సు చేసే అటువంటి శివుడికి దేని మీద ఇష్టం అంటే అది నాట్యమే. ఇక్కడ  యతిరాజు అనే పదం వాడటం వల్ల  ఎంత అందం వచ్చిందో ఈ వాఖ్యానికి మనం చెప్పలేం. ఏ పరిమళాలకి లొంగని శివుడు లొంగేది జతి స్వరాల తో కూడిన నాట్యానికే అని ఎంత అందం గా చెప్పారో కదా. ఓ మీనాక్షి నీకు సహజ సిద్దం గా వచ్చిన నాట్య ప్రతిభ తో, మీ తండ్రి గారి అత్యంత ప్రతిభ తో కూడిన విద్య నీకు నేర్పారు, భగవంతుడు నీకు అత్యంత అరుదైన అవయవ సౌష్టం ఇచ్చాడు, అటువంటి ఎవరికీ దక్కని వరం పొందిన నీవు నీ నాట్యం తో భగవంతుడికి పూజించి నీ బ్రతుకును తరింప చేసుకోవచ్చు కదా, అని అనుకుంటాడు చంద్రశేఖర్. బ్రతుకు తరించటం అని ఎందుకు అన్నారంటే, కళలు భగవంతుడిని ఆరాధించటానికి ఉపయోగించాలి, అది మనిషి ముక్తి పొందటానికి ఒక మార్గం అని మనకి చాల ఉదాహరణాలు ఉన్నాయి. 

అదే మాట విశ్వనాథ్ గారు ఈ సినిమాలో త్యాగరాజ అరాధనోత్సవానికి ఎడ్ల బండి లో వెళ్తుంటే మీనాక్షి సావిత్రి తో మన తోటి వాళ్ళందరూ BA లు , MAలు చదువుకొని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటి అక్క కూపస్థ మండూకాల్ల లాగ" అంటే అప్పుడు సావిత్రి " నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా" అని జవాబిస్తుంది, అప్పుడు శర్మ గారిని "ఈ కళ నే నమ్ముకొని జీవితాన్ని ధారా పోస్తున్నావు కదా, తిరిగి ఈ కళ  నీకేమి ఇచ్చింది నాన్న" అని అడిగితె ఆయన "ఈ కళలన్నీ ఇహం లోనే మోక్షం ప్రసాదించే సాధనాలమ్మా " అని క్లుప్తం గా ఈ సినిమా సారంశాన్ని చెప్తారు. సిరివెన్నెల గారు ఆ సందేశం ఇక్కడ నొక్కి  వక్కాణిస్తారు. 

ఈ పాట లో సిరివెన్నెల గారు మనకి మీనాక్షి, చంద్రశేఖర్ ఏమి అనుకుంటున్నారో చంద్రశేఖర్ మనస్సు లోంచి చెప్తారు. ఇద్దరి వాదనలు విన్న ప్రేక్షకుడు నిజమే కదా ఇద్దరు చెప్పేది అనుకుంటాం. ఇక్కడ ఒకరి ఆలోచన సరి ఇంకొకరి ఆలోచన తప్పు అనే భావం కలుగ నివ్వరు. చివరి నిర్ణయం మనకి తద్వారా దర్శకునికి వదిలేస్తారు, అదే సిరివెన్నెల గారి ప్రతిభ. 

ఆమె: పరుగాపక పయనించవె తలపుల నావ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!
పరుగాపక పయనించవె తలపుల నావ ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..

చంద్రశేఖర్ మీనాక్షి గురించి ఏమి అనుకుంటున్నాడో విన్నాం ఇంక అతని ద్వారా మీనాక్షి భావాలలోకి వెళ్దాము. అనేక సందర్భాల్లో అనేక పాత్రల ద్వారా మనకి చెప్తారు విస్వనాధ్ గారు. మీనాక్షి ఈ కళలు ఇహం లో ఎందుకు పనికి రావు. కడుపుకి ఇంత అన్నం కూడా పెట్టలేని ఈ కళల మీద సమయం ఎందుకు వృధా చెయ్యటం అని. మీనాక్షి కి ఏదో ఇష్టమో, దేనికి గంతులు వేస్తుందో, అని ఆమె స్నేహితురాలి ద్వారా చెప్పిస్తారు కూడా. అలాగే ఆమె కోరికలు ఎలాంటివో అనేక సందర్భాల్లో చెప్తారు. మీనాక్షి గురించి ఈపాటికి మనకి తెలిసి పోతుంది. 

చంద్రశేఖర్ చెప్పినదానికి పాటలో మీనాక్షి ఏమి అనుకుంటుందో ఆమె మనసు ద్వార చూస్తాం. ఆలోచనల్ని నావ తో పోల్చటం చాల సార్లు చూస్తాం. ఆలోచనలు ఎప్పుడు ఆపినా ఆగవు, అవి ఆలోచన యొక్క ధర్మము. అవి అలా పరిగెడుతూనే ఉంటాయి. మీనాక్షి తనలో తాను  అనుకుంటోంది అదే. తనకి తానూ నచ్చ చెప్పుకుంటోంది అదే. ఆమె ఆలోచన అంతా తన జీవితం ఎలా సుఖంగా ఉండాలా, తను ఎలా గొప్పగా జీవించాలి అనే. ఏమి చేస్తే జీవితం చక్కగా ఉంటుందో తెలియక పోయినా తన జీవితం ఎలా ఉండాలో నిర్దిష్టం గా తెలుసు, తన సోదరి, స్నేహితురాళ్ళతో చాల సార్లు చెప్తుంది. నావ ప్రయాణం ముందుకి జరగాలి అంటే ఎన్నో ఆటు పోట్లని జయించాలి, వచ్చే ప్రతి కెరటం నావ ప్రయాణానికి అడ్డే . వచ్చే అడ్డంకులకి తల ఒగ్గితే ప్రయాణం సంగతి సరే, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మీనాక్షి జీవితం కూడా నాట్యం చెయ్యాలి అనే అడ్డంకి  తన ప్రతి కలకి అడ్డమే. తన తండ్రి కాని, సోదరి కాని, చుట్టు  పక్కల వాళ్ళు కాని, ఆఖరికి చంద్రశేఖర్ కాని, ప్రతి ఒక్కళ్ళు సూచించేది నాట్యం గురించె. కాబట్టి ఇలాంటి అడ్డంకుల్ని దాటుకుంటూ తనకి కావాల్సింది దక్కించుకోవాలి అనుకోవటం మీనాక్షి ఆంతర్యం 

సిరివెన్నెల గారు మీనాక్షి కి కంటే  చంద్రశేఖర్ కి వాడిన గంభీరమైన పదాలు, భాష లోతు,  వాళ్ళ ఆలోచన అంతర్యానికి చిహ్నాలు. అందుకనే ఈ పాట అంత ప్రాచుర్యం పొందింది 

అతడు: పడమర పడగలపై మెరిసే తారలకై.. (2)
రాత్రిని వరించకే సంధ్యా సుందరి!!
తూరుపు వేదికపై, వేకువ నర్తకివై, (2)
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ!!
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ..(2)
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ!! || శివపూజకు ||

మీనాక్షికి అమెరికా లాంటి పరాయి దేశాలు వెళ్ళాలి అని కోరిక. అందుకేనేమో సిరివెన్నెల గారు, భారత దేశం తూర్పు వైపు ఉంటె అమెరికా పడమరన ఉంటుంది కాబట్టి పడమర పదం వచ్చే విధం గా రాసారేమో. అలాగ తూర్పు వేదిక అనే ప్రయోగం కూడా. అసలు ఈ చరణం వింటే ఒళ్ళు పులకరించ మానదు  ఎంత గొప్ప పదాలు వాడారు సిరివెన్నెల గారు. అందులో ఎంత లోతైన భావం ఉంది, నిఘూడమైన సందేశం ఉంది, వేదాంతం ఉంది, ఒక మనిషి కిఇంత కన్నా గొప్ప సందేశం ఉంటుందా?

ఓ మీనాక్షి నువ్వు పైపైన కనిపించే తలుక్కు లను, మెరుపులను చూసి మోహించి నక్షత్రాల కోసం ఎందుకు వెంట పడతావు? నువ్వే స్వయం గా ఆ నక్షత్రాలకి వెలుగునిచ్చే సూర్యుడి లాంటి దానివి. తూర్పున ఉదయించే సూర్యుడి కాంతి భూమి ని ఎలా మురిపిస్తుందో, ప్రతి సూర్య కిరణం ఒక్కో చైతన్యానికి ఎలాగ స్ఫూర్తి ఇస్తుందో, నిద్రించిన జీవ కోటికి ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుందో, అలాంటి సూర్య కాంతి లాంటి నీ నాట్యాన్ని వదిలేసి, చీకటి పడేటప్పుడు వచ్చే నక్షత్రాల కోసం రాత్రిని ఎందుకు ఎన్నుకుంటావు? శివుడి నాట్యానికి పరవసించని ప్రాణి ఉంటుందా? అలాగే నువ్వు ఎన్నుకునే దారి అంతా, నీ కోరికలన్నీ  పై పైన ఆనందం, క్షణిక ఆనందాన్ని ఇచ్చేవే కాని, శాశ్వత ఆనందాన్నిచ్చేవి కావు. నువ్వు చెయ్యల్సింది నీ జన్మ సార్ధకత చేస్కోవటం. నీలోని అత్యంత అమితమైన విద్యని నిరుపయోగం చెయ్యకు. ఎంత గొప్ప భావం ఇది? ఇటువంటి నిష్కల్మషమైన భావం ఒక మనిషికి కలగటం విశ్వనాథ్ గారి సినిమాల లోనే చూస్తాం. అందుకనేనేమో మీనాక్షి తండ్రి, తనకు కళ్ళు వచ్చిన తరువాత మీనాక్షి posters చూసి ఆనందం తో చంద్రశేఖర్ ని చూసి అంటాడు " అందరి లాగానే నువ్వు కూడా మా మీనాక్షి లోని చిలిపితనాన్నే చూస్తావనుకున్నాను కాని చాల అందంగా చూపించవయ్య ఆమెలోని నాట్య కళని " అని. 

ఆమె: తన వ్రెళ్ళే  సంకెళ్ళై కదలలేని మొక్కలా..
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా..
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా..
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా..
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా..
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా!!  || పరుగాపక పయనించవె || 

ఇప్పటి వరకు చూసింది చాలా ఉన్నా సిరివెన్నెల గారు మనల్ని తన పదాలతో ఆనంద పరవశులని చేసే పని ఆపరు. అప్పుడేనా ఇంకా చాల ఉంది అన్నట్టు ఈ చరణం లోని ఒక్కో పదం ఒక్కో అనుభూతి  ఇస్తుంది. యతి ప్రాసలు ఇష్టం వచ్చినట్టు వాడుతున్న ఈ కాలం లో ఇటువంటి పద ప్రయోగం అరుదుగా చూస్తూ ఉంటాము. "తన వ్రేళ్లు సంకెళ్ళు" , "అవధి లేని అందము ", "అవనికి నలుదిక్కులా", "ఆనందపు గాలి వాలు", "వెన్నెల కిన్నెర గానం" అనేవి అత్యంత అద్భుతమైన ప్రయోగాలు. 

ఒక మొక్క ఎందుకు కదల లేదు అన్న విషయం వేరే విధం గా ఎలా చెప్పారో ఇక్కడ చూస్తాము. వ్రేళ్లు సంకెళ్ళ గా మారితే ఇంక ఎక్కడకి వెళ్తుంది మొక్క, అయినా కాని ఎదగటం మానుతుందా? మానదు. అలాగే ఆమని ( ఆకులు చిగుర్చే కాలం) కోసం ఆగదు కదా. మనము చూడాలి కాని సరి అయిన కళ్ళతో చూస్తే ప్రక్రుతిలో అణువు అణువునా అందమే. ఆ అందానికి పరిధి పరిమితి లేదు, ఈ భూమి మీద అందం అనంతం. అట్లాంటి అందాల నుంచి వచ్చే ఆనందం మనిషి లో ఎంత ఉత్తేజం ఇస్తుందో చెప్పలేము,ఆ ఆనందపు ఆలోచనలు నడుపుతూ ఉంటె ప్రతి రోజు ఒక నవ చైతన్య వంతమైన రోజు కాదా, వెన్నెల్లో కిన్నేరుల గానం వింటే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి జీవితం కోసం నీ ప్రయాణం ఆపకుండా చూసుకో అని మీనాక్షి ద్వారా చెప్తారు. 

ఈ చరణం మళ్లీ  మళ్లీ  వినాలనుకోవటం లో తప్పులేదు. 

అతడు:   చలిత చరణ జనితం నీ సహజ విలాసం!!
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం..
నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం.. (2)
గగన సరసి హృదయంలో..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం!! 

ఇంక సిరివెన్నెల గారు పతాకానికి చెరుతారు. ఈ చరణం ఈ పాటని ముగించటానికి ఆయన ఎన్నుకున్న పదాలు మనల్ని అబ్బుర పరుస్తుంది. చంద్రశేఖర్ ఇంక మీనాక్షి గురించి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆమె కళ  గురించి ఊహించుకోవటంలొ. ఆమె నాట్యం ఎటువంటిదంటే చలించే చరణాలు ( పాదాలు) నుంచి ఉద్భవించిన, సహజసిద్ధమైనటువంటిది  ఆమె నాట్య విలాసం. ఇంక ఆమె సౌందర్య వికాసం జ్వలించే కిరణాలతో కూడినటు వంటిది, ఆమె అభినయం ఉషోదయం లాంటిది. అలాంటి నాట్యం చూసిన సూర్యుడి కన్నుల నుంచి వచ్చిన కాంతి తో ఆకాశం లోని సరస్సు హృదయం లో వికసించిన నూరు దళాలున్న స్వర్ణ మయమైన కమలం అని. ఇది పైకి చూసే అర్థం అయినా, ఇందులో నిఘూడమైన అర్థం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి కళ పరమేశ్వరుని పాదాలు అలంకరించటానికి అందించే స్వర్ణకమలాలే. ఇక్కడ మీనాక్షి తన నాట్యాన్ని రవి చూస్తె ఆ ఉత్తేజిత సూర్య కిరణాల నుంచి మరల గగన సరస్సులో కమలం వికసిస్తుంది అనేది  అధ్బుతమైన ఊహ. 

ఈ చరణం లో భానుప్రియ అభినయం అత్యంత అద్భుతం. ఆమె ప్రదర్శించిన హావ భావాలు, అభినయ సౌందర్యం, నాట్య ముద్రలు, ఇవన్ని చూడ చక్కగా ఉండటమే గాక చరణం లోని ప్రతి పదం అభినయించి చూపారు. వేరు వేరు రకాల ఆహార్యం దరించటం కూడా అభినందనీయం ( కూచిపూడి, ఒడిస్సీ, మోహిని ఆట్టం నాట్య శాస్త్రానికి సరిపడా దుస్తులు వాడటం ). ఈ నాట్యాన్ని రచించటానికి కారకులైన వాళ్ళు అభినందనీయులు. ఈ పాట లోని దృశ్యాలు తీసిన ప్రదేశాలు కూడా చాల హృదయం గా ఉంటాయి. ఒరిస్సా లో ఈ పాట చిత్రీకరణం ఎక్కువగా జరిగింది. 

పరుగాపక పయనించవె తలపుల నాన..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!

ఇలా మీనాక్షి పాడుతుంటే ఈ క్రింది శ్లోకం వస్తుంది ఈ శ్లోకం ముగియటం తో పాట కూడా ముగిస్తుంది. చంద్రశేఖర్, మీనాక్షి ని తన దారి వైపు తీసుకు వెళదామనుకుంటే మీనాక్షి చెయ్యి విడిపించుకొని తనకు నచ్చిన దారిలో వెళ్ళిపోతుంది. ఇది విశ్వనాథ్ గారు అద్భుతం గా చూపించారు. చూడటానికి మామూలు గా ఉన్నా ఎంతో నిగూఢమైన అర్థం చూపిస్తుంది. 

శ్రేయాన్ స్వధర్మో  విగుణః  పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!!

భగవద్గీత లోని ఈ శ్లోకం ముఖ్య సారంశం ఏమిటంటే ప్రతి మనిషి తన కోసం విదించిన ధర్మమే చెయ్యటం ఉత్తమం. ఎంతటి చిన్నదైన తన ధర్మమే ( కర్మ) చెయ్యటమే శ్రేయస్సు కరం. ఎంతటి గొప్పదైన పరుల ధర్మం వైపు వెళ్ళటం హానికరం. ఈ శ్లోకం క్షత్రియుడైన అర్జునుడు తను చెయ్యవలసిన పని వదిలేసి నేను  ప్రశాంతము గా అడవిలో బ్రాహ్మణుని వలె జీవిస్తాను అని శ్రీ కృష్ణుని తో అంటే అతనికి ఉపదేశించిన శ్లోకం. ఇక్కడ కృష్ణుడు చెప్పింది క్షత్రియ ధర్మం యుద్ధం చెయ్యటం, ధర్మాన్ని కాపాడటం అది వదిలేసి వేరే వాళ్ళ పని చెయ్యటం చాల హాని కరం. ఎంత కష్టమైనా, ప్రాణ హాని అయినా స్వధర్మం వీడకూడదు. పరాయి ధర్మం ఎంత  ఆకర్షించినా అది భయొత్పాతమైనది . ఇక్కడ మీనాక్షికి కూడా సహజ సిద్దమైన ధర్మం నాట్యం, అది వదిలేసి బయట ప్రపంచం లోని ఆకర్షణలకు లోనయ్యి నాట్యం వదిలెయ్యటం ఎంత హాని కరమో అని చెప్పటం చంద్రశేఖర్ ద్వారా ఈ పాట ద్వారా, దర్శకులు మనకి తెలియ చేస్తారు. 

కొసమెరుపు: 

ఈ సినిమా లో ప్రసిద్ధి పొందిన "అర్థం చేసుకోరు" అన్న డైలాగ్ అప్పటికి అప్పుడు మీనాక్షి సినిమా కోసం క్యూ లో నిల్చొని స్నేహితురాలితో మాట్లాడేటప్పుడు యాదృచ్చికం గా కుదిరినది అని విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు . మీనాక్షి తండ్రి గా వేసిన నటుడు స్వతహా గా నాట్యాచార్యులు, అలాగే మీనాక్షి బావగా వేసిన అయన కూడా వయోలిన్ వాద్యకారుడే. అందుకే వాళ్ళిద్దరూ సరిగ్గా సరిపోయారేమో. ఇంక మీనాక్షి అక్క సావిత్రికి గాత్ర సహాయం అందించింది SP శైలజ, మీనాక్షి బావగారికి గాత్రం అందించింది శుభలేఖ సుధాకర్. అప్పటికి సుధాకర్ కి శైలజకి వివాహం కాలేదు. బావి లో గజ్జెలు పడిపోయే సీన్ లోని బావి సహజమైన బావి కాదు, అది సినిమా కోసం చేసింది. అలాగే తొండం, కాదు తోక అన్న సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంకా ఇలాంటివి అనేకం.ఏది  ఏమైనా ఈ సినిమా చూసిన ప్రతి సారి ప్రేక్షకుడిని కట్టి పడేసి చివరి వరకు లీనం చేసే సినిమా. ఇది చదివిన తరువాత సినిమా కాని పాట  కాని చూడాలనిపిస్తే  రాసిన రాతకి సార్ధకం చేకురినట్టే. :) 

సిరివెన్నెలగారు చెప్పినట్టే ఈ మధ్య కాలంలో పాటలలో సాహిత్యం ఒక సంగీత వాయిద్యం గా మారిపోయింది. ఎందుకంటే పాట సమకూర్చే వాళ్ళు పదాలు కూరుస్తున్నారు కాని అర్థం మర్చి పోతున్నారు. పాట పదాల అల్లిక  అవుతోందే తప్ప అర్థవంతమైన హారం అవ్వటం లేదు. పాట ఆలోచనలు మాత్రమె కాదు భావాల్ని కూడా తెలియచెయ్యాలి. ఎందుకో ఇవి అన్ని లేని పాటలు వింటున్నాం. పాట బ్రతకాలి అంటే పాట జీవితం అవ్వాలి. విన్న ప్రతి శ్రోత తనకి అన్వయించుకోవాలి. అప్పుడే పాట జీవిస్తుంది, లేక పొతే ధ్వని లో తన ఉనికి కోల్పోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. 

PS: నేను విన్న అనేక సంఖ్య లోని పాటలలో ఎక్కువసార్లు విన్న పాట  ఇదేనేమో. విన్న ప్రతి సారి ఒక్కో అనుభూతి ఒక్కో అర్థం స్పురించటం ఈ పాట గొప్పతనం.  అందుకేనేమో అన్ని సార్లు వినగలగటము. విన్నప్పుడు తట్టిన భావాల్ని అక్షర రూపం కలిగించటమే నా ఈ రాత ఒక్క లక్ష్యం. అంతే  కాని దీన్ని అర్థం చెప్పాలనో, ఈ పాటని విశ్లేషించాలనో తాపత్రయం కాదు. ఎందుకంటే ఆ శక్తి నాకు లేదు అనే భావన. ఇందులో తప్పులు దొర్లితే పెద్ద మనస్సుతో సరిదిద్ద వలసినది  వినమ్ర ప్రార్ధన. 

Tuesday, July 10, 2012

Song of the week - Meluko Sri Rama

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)


Album Name:         శ్రీ రామ గానామృతం 
Song Name :          మేలుకో శ్రీ రామ 
Music Director:       KV మహదేవన్ 
Singer(s):              SP  బాలసుబ్రహ్మణ్యం 
Lyrics:                   ఆరుద్ర 
Year of Release:     ????

మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామ
మేలుకో మేలుకో మేలైన గుణ ధామ..


అల నీల గగనమ్ము అరునారుణం ఆయే..
కులదైవం ముదయాద్రి కొలువుండ పయనించే
కొలను తామర లల్లి పులకించి విరిచినవి
నలినాబ్జ ఇక నీదు నయనాలు విడవలెను.. || మేలుకో శ్రీ రామ ||


మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి 
నరసార్దూల నిన్ను నందించ వలయునా..
తరుణీ సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది,
తిరిగి శయనిన్చేవు మర్యాద కాదయ్య...     || మేలుకో శ్రీ రామ ||


పద యుగళి సేవించ ప్రణతులే యొనరించ 
వదనార విన్దమ్ము ముదమార పరికించ 
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న 
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య             || మేలుకో శ్రీ రామ ||

ప్రక్రుతి లో అణువణువునా సంగీతం ఉంది. ఈ సంగీతం ఎవరిని ఎలా కదిలిస్తుందో ఎవరికీ తెలియదు. మేఘ ఘర్జన లో. వాన చినుకులో, సెలయేటి సందడి లో, వాగు హోరులో,, నది జోరులో, సముద్రపు అలల లో, ఇంకా ఆకు కదలిక లో, పక్షి గొంతులో, ఇలా చెప్పుకుంటే ఎన్నో లయ బద్దం గా మనిషిని అలరిస్తాయి. సంగీతంకు మనిషిని ఏదైనా చెయ్యగల శక్తి ఉంది. అలాగే పాట కూడా. మనిషిని ఉల్లాసపరుస్తుంది,, ఉత్సాహపరుస్తుంది,, బాధ కలిగిస్తుంది,, ఆవేశ పరుస్తుంది,, ఆలోచింపచేస్తుంది,, మనసు ,కరిగిస్తుంది గుండె నిండా అన్ని భావాలతో నింపేస్తుంది.. అంతటి శక్తి ఉన్న వేల పాటలలో కొన్ని పాటలు విన్న మరుక్షణం మనిషి జీవితం లో ఒక స్థానం సంపాదిస్తుంది.. అటువంటి పాటలలో "శ్రీరామ గానామృతం"" లోని మేలుకో శ్రీ రామ ఒకటి.. ఆ పాటకి ఉన్న శక్తి ఏమిటో అర్థం అయ్యేలా చెప్పటం చాల కష్టం, అనుభవిస్తే తప్ప. దేవ గానం చేస్తూ గందర్వులు దైవ లోకం లో ఉంటారని వింటాం కాని మనకి వాళ్ళ గొప్పతనం ఏమిటో, వాళ్ళ గొంతు ఎలాగా ఉంటుందో తెలియదు. అలాగే అమృతం అంటే ఎవరి ఆలోచనా శక్తికి తగ్గ అది ఎలాగ ఉంటుందో ఊహించటమే కాని దాని రుచి ఏమిటో ఎవరికీ తెలియదు. అందుకే అత్యుత్తమ లక్షణాలు కలిగి ఉండి మనకు అత్యంత ప్రీతి కలిగించే లక్షణం ఉన్న దాన్ని అమృతం అంటాం. ఈ పాటలకి గానా అమృతం అనటం ఎంత సమంజసమో అవి వింటే అర్థం అవుతుంది.


రామ నామము భారత నాట అత్యంత తీయని నామముగా అందరికి సుపరిచితమే..రాముడు లాంటి ఒక మనిషి ఎప్పుడు పుట్టలేదు పుట్టబోడు ఎందుకంటే ఒక మనిషి ధర్మానుసారం ఎలా నడవాలో ఆచరించి చూపిన వ్యక్తి. అందుకే ఆ నామానికి ఆ వ్యక్తికీ అంతటి ఖ్యాతి. మనిషికి దేవుడు అనే వాడు ఒక ప్రశ్న. తమకి అంతు చిక్కని దేవుడిని దేవుడి లక్షణాలు ఉన్న వాళ్ళని దేవుడుగా భావిస్తాడు.. అందుకనే రాముడు దేవుడయ్యాడు. ఎందరో ఆ రాముని నామం జపిస్తూ తరించిన వారే.

పాట ఎటువంటిదైన సరిగ్గా పాడటం చాల కష్టం. ఎవరు పడితే వాళ్ళు పాడుకో వచ్చు కాని వేరే వాళ్ళు వినాలంటే పాటకి తగ్గ లక్షణాలు కావాలి. ఈ మధ్య అన్ని సినిమా పాటల్లో తప్పులు దొర్లటం ,చూస్తున్నాము అవి దురదృష్టకరమైనా క్షమించ దగ్గ తప్పులే వినటానికి ఇంపుగా ఉంటె వింటాము లేకపోతె వదిలేస్తాము.. కాని  భక్తి పాటలు తప్పులు దొర్లటానికి వీలు లేని పాటలు.. అపశ్రుతి, ఉచ్చారణ దోషాలు, భావ దోషాలు ఏవి వీలు కాని పాటలు. ఈ పాటలు ఎవరు పడితే వాళ్ళు పాడితే ఆ భక్తీ భావం లేక పొతే ఆ పాత సాధారణ పాటగా మిగిలి పోతుంది.. భక్తి పాట భక్తున్ని పరవసింప చెయ్యాలి. అప్పుడే ఆ పాటకి సార్ధకత చేకూరుతుంది. అందులో మంత్రాలు పాటలుగా పాడితే అందులో ఉచ్చారణ దోషాలు  ఉంటె మంత్రం వికటించే ప్రమాదం కూడా ఉంది.. అందుకే పాడేవాళ్ళు జాగ్రత్తగా పాడాలి. శంకర్ మహదేవన్ మంచి గాయకుడే కాని, తెలియక చేసినా తెలిసి చేసిన తప్పు తప్పే, గణేశ స్తుతి ( గణేశాయ ధీమహి ) పాడినప్పుడు అనేక ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. బాల చంద్రాయ కి "భాల" చంద్రాయ అని పాడతాడు.. గీత కి ఘీత, గజేశానాయ కి గజేషానాయ అని పాడటం ఇలాగ చూస్తె చాల ఉన్నాయి. ఒక భక్తి పాట కళ్ళు మూసుకొని వింటే తన్మయత్వం చెందాలి.. ఇలాంటి తప్పులు మనసు కలుక్కు మానకూడదు. అందుకే తెలుగు/సంస్కృతం  తెల్సిన వాళ్ళు, సరిగ్గా ఉచ్చారణ చేసేవాళ్ళు వాళ్ళు భక్తి పాటలు పాడితే అత్యంత సహజం గా ఉంది మనసులో హత్తుకు పోతాయి.. ఘంటసాల,, బాలు, బాల మురళి కృష్ణ  లాంటి గాన గంధర్వులు పాడిన పాటలు వినగలగటం మన అదృష్టం.. 

శ్రీ రామ గానామృతం  భక్తి పాటలు షుమారు 40 సంవత్సరాల క్రితం KV మహదేవన్ గారి స్వర కల్పనలో ఆరుద్ర గారి పద రచన లో(అన్నమాచర్య కీర్తనలు 1-2మినహా), బాలు,, సుశీలగారు పాడగా తెలుగు నాట బాగా ప్రాచుర్యం పొందాయి. కాని ఇవి ఇప్పటి తరం లో ఎంతమందికి తెల్సో అనేది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. కాని ఇందులోని పాటలు ఇప్పటికి ప్రాతః కాలం వింటే మనసుకి అదో ప్రసాంతత,, సంతృప్తి.. ఏదో తెలియని అనుభూతి,, ఎక్కడికో మనసుని పయనింప చేసే శక్తి. అందుకే,, ఇలాంటి పాటలు రాముడు ఉన్నంత వరకు జీవించి ఉంటాయి. మేలుకో శ్రీరామ అనేపాట మహదేవన్ గారు అత్యద్బుతం గా స్వరపరచిన పాట. ఆరుద్ర గారి ఊహా శక్తికి మించిన  సరళమైన భావం తో రాముడిని ఉదయాన నిద్రలేపటం ఎంతో రమణీయం గా ఉంటుంది.మహదేవన్ గారు ఈ పాటలో,, వీణ, ఫ్లూట్, వయోలిన్, అత్యంత రమణీయంగా రామ నామానికి సరిగా తోడు అవుతాయి. గొప్ప సంగీత దర్శకులు శ్రోతల్ని పాటలోకి తీసుకెళతారు, వాళ్ళని ముందు గా తయారు చేస్తారు పాటలోకి లీనం అవ్వటానికి. అలాగే ఈ పాట కూడా. పల్లవి కి ముందు వచ్చే సంగీతం తో రాముణ్ణి మేల్కొలిపే విధం గా తయారు అవుతాడు శ్రోత.

ఇంకా ఆలస్యం దేనికి ఆ రామున్ని మనం కూడా మేల్కొలుపుదాము పదండి. 

మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామ
మేలుకో మేలుకో మేలైన గుణ ధామ..

భగవంతుడిని మేల్కొలపటం అనేది అనాది గా మనిషి/భక్తుడు చేస్తున్న ఆచారం. అనేక మంది తర తరాలు గా పద్యాలు పాటలు, కవిత్వాలు రాసారు, పాడారు. సుప్రభాతం అనేది మన భారతీయ సంస్కృతీ. జగమేలే పరమాత్మకి నిద్ర ఏమిటి, మెలుకువ ఏమిటి. పరమాత్మ అయిన రాముడు మనిషి గా జన్మించి మనిషి గా కష్టాలు అనుభవించాడు కాబట్టి మనం కూడా రాముడు నిద్రపోతాడు,, మేలుకొల్పుదాం తప్పు లేదు.. ఉదయాన భానుడు ఉదయించే వేల రాముడు ఇంకా పడుకున్నాడు. అటువంటి రాముడిని భక్తుడు ఎలా నిద్ర లేపుతాడో అంటే,, బుజ్జగించి,, పొగిడి,, గొప్పతనం తెలియచేసి,, చెయ్యవలసిన పనులు గుర్తు చేస్తూ,, చుట్టూ పక్కల ఏమి జరుగుతోందో,, దేనికి అలస్యమైపోతోందో అని తెలియచేయటం,, ఇలాగ అనేక విధాలుగా ఒకరిని నిద్ర లేపొచ్చు. అన్ని విషయాలు తెల్సిన దేవుడికి నిద్రలేవాలన్న విషయం తెల్వదా అంటే,, అది భక్తుని సరదా, తన సొంతమైన భగవంతుడిని ఎలాగైనా చెయ్యొచ్చు, అది భగవంతునికి ఇష్టమే. ఎందుకంటే భగవంతుడు, భక్తునికి దాసుడైతే, భక్తుడు భగవంతునికి దాసుడు.. ఒకరి మీద ఒకరికి ఆ చమత్కారాలు ఆడుకొనే అధికారం, చనువు, చొరవ ఉంటాయి. అందుకే భక్తుడి ఊహకి తగ్గట్టుగా భగవంతుడు ఉండటం భగవంతుడి లక్షణం. ఇటువంటి తర్కాలన్నీ పక్కన పెడితే, ఇక్కడ ఆరుద్రగారు ఏమేమి చమత్కారాలు చేస్తారో చూద్దాం.

రాముడు లోకాభిరాముడు, నీల మేఘ శ్యాముడు. రాముడి శరీర ఛాయ నీల మేఘం రంగు. అందుకే ఆయనని నీల మేఘ శ్యాముడు అన్నారు. నీరద అంటే కూడా మేఘమే. ఎటువంటి మేఘం అంటే నీటితో నిండిన మేఘం. ఆ మేఘం వర్షిస్తే ఎంత వాన పడుతుందో, రాముడు కూడా కరుణిస్తే, అంటే ప్రేమ కురుస్తుంది. అటువంటి రాముడు మేల్కొని ఉంటె అందరికి మేలు జరుగుతుంది, ఎన్నో సుగుణాలు కలిగిన రాముడు అన్ని మేలైన గుణాలే ఉన్న వాడు. మేలైన గుణాలు ఉన్నవాళ్లు మేల్కొని ఉంటె చాల పనులు అవుతాయి. అందుకనే ఓ రామ తొందరగా మేలుకో..బాలు గారి గొంతులో మాధుర్యం చరణం పాడినప్పుడు అర్థం అవుతుంది. ధన్య జీవి బాలు గారు. ఎన్ని జన్మల ఫలమో ఆ వరం.!!!

అల నీల గగనమ్ము అరునారుణం ఆయే..
కులదైవం ముదయాద్రి కొలువుండ పయనించే
కొలను తామర లల్లి పులకించి విరిచినవి
నలినాబ్జ ఇక నీదు నయనాలు విడవలెను.. || మేలుకో శ్రీ రామ ||

పల్లవి లో నీల నీరదం, చరణం లో నీల గగనం అదే పద చమత్కారం. రాముడు నీల రంగులో ఉంటాడు. అందుకే బాపు గారు శ్రీ రామ రాజ్యం లో రాముణ్ణి  అలాగే చూపించారు. కాని మనకి రామున్ని వేరే రంగులో ఊహించుకోవటం వాళ్ళ రామున్ని అలా చూడటం చాల మందికి నచ్చలేదు. రాముడు అలాగే ఉంటాడు కాబట్టి బాపు గారు ఏమాత్రం వేరు గా చూపలేదు. స్వచ్చమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది, కాని ఉదయాన సాయం సంధ్యలో ఆకాశం అరుణకిరణం తో ఎర్రగా ఉంటుంది. ప్రతి కవి తను రాసే ముందు చాల కష్టపడతాడు, చాల విషయాలు తెల్సుకొని దానికి అనుగుణం గా తన కవితలు కాని పాటలలో కాని వాడుకుంటాడు. అందుకనే కవి పాట బట్టి కవి ప్రతిభ చెప్పొచ్చు.ఓ రామ సూర్య కాంతి తో ఆకాశం ఎర్ర గా మారింది. రాముని కులదైవం సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయాన కొలువుండే కొండ, ఉదయాద్రి. అలాగే సాయంత్రం అస్తమించే టప్పుడు కొలువుండే కొండ అస్త  అద్రి. సూర్యుడు తన పని చేస్తున్నాడు, తను ఉదయ కాంతితో కొలను లోని తామరలు పులకించి పోయి ఆనందం తో విచ్చుకొని విరబూస్తున్నాయి. తామర కన్నులున్న ఓ రామ మూసిన కళ్ళు తెరచి మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్య.

మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి 
నరసార్దూల నిన్ను నందించ వలయునా..
తరుణీ సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది,
తిరిగి శయనిన్చేవు మర్యాద కాదయ్య...     || మేలుకో శ్రీ రామ ||

కౌసల్య సుప్రజా రామ, పూర్వా సంధ్య ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి మేల్కొలపటానికి పాడిన సుప్రభాతం. వశిష్ట మహర్షి దసరద మాహారాజు కి రాజ గురువు. రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులకు అన్ని నేర్పిన రాజ గురువు. కాని యుద్ద విద్యలు నేర్పింది విశ్వామిత్రుడే. దశరధుడు ఒక రోజు కొలువు తీరి ఉండగా వచ్చి వరం పొందుతాడు విశ్వామిత్రుడు. అప్పుడు విశ్వామిత్రుడు తనతో పాటు రామ లక్ష్మణలను తన యాగా సంరక్షణ కోసం పంపమని అడుగుతాడు. దశరధుడు భయపడినా, వశిష్ట మహర్షి అంగీకారం తో వాళ్ళను పంపుతాడు దశరధుడు. విశ్వామిత్రుడు అందుకు ప్రతిఫలం గా వాళ్ళకి యుద్ద విద్యలను నేర్పటానికి సంసిద్దుదవుతాడు. రామలక్ష్మణలను నిద్ర పోతుండగా చూసి రాముణ్ణి  నిద్ర లేపటానికి సుప్రభాతం పాడతాడు. నరులలో శ్రేష్టి ఐన శ్రీ రామ ఆ విశ్వామిత్రుడిలాగ మరల నిన్ను లేపాలా? సీతమ్మ తల్లి అప్పుడు నిద్ర లేచి తన పనులలో మునిగి ఉంది, నువ్వు నిద్ర పోవటం సమంజసం కాదు మేలుకో శ్రీరామ మమ్మేలుకోవయ్య.!!!

పద యుగళి సేవించ ప్రణతులే యొనరించ 
వదనార విన్దమ్ము ముదమార పరికించ 
బంగారు వాకిళ్ళ పడిగాపులయి ఉన్న 
భక్త కోటిని వేగ పాలించ లేవయ్య             || మేలుకో శ్రీ రామ ||


ఉదయాన్నే దైవ దర్సనం చేసుకోవటం అన్నిటిలో మిన్న. అందులో ప్రత్యక్ష దైవం అయితే ఇంక తిరుగు ఉండదు. చరణారవిందాల దర్సనం అయ్యి, పాదాలకు నమస్కరిస్తే ఆ రోజు అన్ని శుభాలే. అందుకే ప్రతి రోజు భగవత్పాద దర్సనం లో దినం ఆరంబిస్తే అత్యంత శుభం కల్గుతుంది. రాముడు కోసం కొన్ని వేల మంది ఆ మనోహర రూపం మనసార చూసి తరించటానికి వేచి ఉంటారు. రాజులకి ఒక్క వాకిలి కాదు కదా అనేకం ఉంటాయి. రాముడు ఎందుకు నిద్ర లేవాలి అంటే, మొదటి కారణం, ఆ రామ పాదాలకు దండం పెట్టటానికి, దివ్య రూప దర్సనానికి, ఆ తరువాత భక్తులని కాపాడటానికి వేచి ఉన్న వాళ్ళ కోసం శీఘ్రం మేలుకొని పాలించ వయ్యా రామ. శ్రీ రఘు రామ అని ఊహ కి అందని దివ్య మనోహర రూపం మన కళ్ళ  ముందు ఉంచి అలాగా వదిలేస్తారు మహదేవన్ గారు, ఆరుద్ర గారు, బాలు గారు.

కొసమెరుపు:  రామ గానామృతం లాంటి ఆడియోలు అరుదుగా వస్తాయి. అందులో ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చినా ఇంకా మొదటి సారి విన్నప్పుడు కలిగిన అనుభూతి మిగుల్స్తుంది విన్న ప్రతి సారి. ఇటువంటి అరుదైన పాటలు ఇంక ముందు రావు రాబోవు. మొదట ఇటువంటి పాటలు అందించే వారే లేరు, ఒక వేళ  వచ్చినా ఇటువంటి పాటలు ఆదరించే వారు లేరు. ఉదాహరణ శ్రీరామ రాజ్యం సినిమా అవార్డులకు కాని జనాదరణ కి కాని నోచుకోకపోవటం మారుతున్న జనాభిరుచికి, రాబోయే తరాలకి ప్రతీక.ఇటువంటి పాటలు విని ఆనందించే వాళ్ళకి పాత తరం అందించిన జీవితానికి సరిపడా పాటలు ఉన్నాయి కాబట్టి అవి వింటూ సంతృప్తి పడటం మినహా చెయ్యగలిగింది ఏమి లేదు. ఈ పాటలు వెబ్ ప్రపంచం లో కూడా అంతగా ఆదరణ లభించలేదు. దాదాపు దశాబ్దం క్రితం ఇవి ఇంటర్నెట్ లో కూడా ఎక్కడ దొరకలేదు. తెలుగు పాటల తీయ్యదనం, గొప్పతనం తెలియచేసే ఇటువంటి పాటలని ఆదరించే రోజు మరల వస్తుంది అని ఆశిద్దాం.

Sunday, June 24, 2012

Song of the week - Chukkalu temmanna


ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)


Movie Name:          April 1 Vidudala
Producer:               K Sarada Devi
Director:                Vamsy             
Music Director:       Ilayaraaja 
Singer(s):              Mano, Chitra
Lyrics:                   Sirivennela Seetaramasastry
Year of Release:     1991



చుక్కలు తెమ్మన్నా తెంచుకురాన
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా (2)
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైన  || 
చుక్కలు తెమ్మన్నా||


షోలే ఉందా? - 
ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా? - తెలుగులో తీసారే బాలా !


ఖైది ఉందా? - ఇదిగో ఇందా
ఖైది కన్నయ్య కాదే ? - వీడికి అన్నయ్య వాడే ! 


జగదేక వీరుడి కధ - ఇది పాత పిక్చర్  కదా?
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద 
ఏ  మాయ చేసైనా ఒప్పించే తీరాలి 
|| చుక్కలు తెమ్మన్నా||


ఒకట రెండా? పదుల వందా ?
బాకీ ఎగవేయ్యకుండా బదులే తిర్చేది ఉందా ?
మెదడే ఉందా మతి పోయిందా?
చాల్లే నీ కాకి గోల వేళ పాలంటూ లేదా?


ఏమైంది భాగ్యం కథ?  - కదిలిందా లేదా కథ?
వ్రతమేదో చేస్తుందంట  అందాక ఆగాలాట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి || చుక్కలు తెమ్మన్నా||

సంగీతంకి ఉన్న శక్తి అమోఘం. ఒక్కోసారి గుండెల్ని పిండి మనసుని కరిగిస్తే, ఇంకోసారి మనసుకి సాంత్వనం చేకూరుస్తుంది. ఒక్కోసారి ఆహ్లాదం కలుగ చేస్తే ఒక్కోసారి ఉర్రూతలూగిన్స్తుంది. ఒక సారి ఉత్తేజ పరిస్తే ఇంకో సారి మనిషిని కదిలిస్తుంది. అటువంటి సంగీతానికి ఎటువంటి గొప్ప అమోఘమైన పరికరం అక్కర్లేదు, ఎటువంటి పరికరమైన లయ, తాళం, స్వరం చేరితే అదే సంగీతం అవుతుంది, అన్ని చేస్తుంది. అదే సరి అయిన పండితుని చేతిలో పది, దాని మాట అనే అలంకారం చేరితే, చిన్న మాట అయిన సంగీతం అవుతుంది ఆహ్లాద పరుస్తుంది. వీటన్నిటి కంటే మాధుర్యం చాల శక్తివంతమైనది. ఈ పాట మాధుర్యానికి పెద్ద పీట వేసిన పాట. లౌక్యం, హాస్యం, సందేశం, చాతుర్యం అన్ని సమ పాళల్లో  కుదిరి మనకి మంచి అనుభూతిని మిగుల్స్తుంది. 

ఇంక వంశి గారి గురించి, ఆయన భావుకత గురించి చెప్పే కన్నా ఆయన సినిమాలు చూడటం ఉత్తమం.అయన ప్రతి సినిమా ఒక అనుభూతి. ఆయన చెప్పేది మనకి అందితేనే కలిగితేనే నచ్చుతాయి, లేకపోతె ఏదో అర్థం కాని ఆహార్యం గా మిగిలిపోతుంది. ఈ పాటలో దివాకరం సైకిల్ చక్రాలకి వీడియో కాసేట్ట్  తగిలించటం, అలాగే సైకిల్ వెనకాల ఒక పెద్ద దొంతర పేర్చటం, ఆ సైకిల్ తొక్కుతూ దివాకరం పాట దానికి మధురమైన సంగీతం తోడు అయ్యి ఒక విచిత్రమైన అనుభూతి కలిగిస్తాయి.

ఈ పాట తమిళ్ పాట  చిత్తిర చెవ్వానం సిరిక్క కండేన్  అనే పాట ఆధారం గా చేసిన పాట. 1978 లో విడుదలైన కాట్రినిలే  వరుం గీతం అనే సినిమా కి సంగీతం సమకూర్చినది కూడా ఇలయరాజానే. వంశి-ఇళయరాజాకి ఉన్న అనుబందం, ఈ తెలుగు సినిమా ప్రపంచం లో ఏ దర్శకునికి సంగీత దర్శకునికి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాట  స్వర పరచిన ఇళయరాజా చాలానే మారుపులు చేసి ఏ పాటకి ఆ పాటే అన్నట్టు స్వరపరచారు. పాట లోకి వెళ్తే మనకి ఈ విషయాలు అర్థం అవుతాయి. వంశికి ఇళయరాజా తో ఉన్న అనుభందం తో అయన సమకూర్చిన అనేక పాటలు, BGM  ఆయన దగ్గరనుంచి సంపాదించి ఒక లైబ్రరీ గా చేసుకున్నారు. వంశి సినిమాలోని పాటలు ఎక్కువగా ఇళయరాజా ఏదో ఒక సినిమా కి చేసిన  BGM కాని పాత పాటలు తనకి అనుగుణం గా మార్చుకున్నవే. ఆయనని కొత్త పాటలు అడిగే కంటే ఇలాగ తనకి నచ్చినవి చేసుకోవటం ఇష్టమేమో. ఈ పాట సినిమాలో వాడుకున్న తీరు, దానికి సిరివెన్నెల రాసిన మాటలు మనకి తమిళ చాయలు ఎక్కడా కనపడకుండా చేస్తాయి. అందుకే ఈ పాట ఒక మధురమైన గీతం గా మిగిలిపోతుంది.

ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది వంశి చేసిన ఒక అద్బుతమైన ప్రయోగం. దివాకరం పాత్ర మనల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది. ఆటను ఎంత అల్లరి చిల్లరి గా తిరిగినా, ఎంత అబద్దాలు చెప్పిన ఒకరిని నష్ట పరిచేవి కాని, హాని చేసేవి కాని కాదు. కాని అతను అనుకోకుండా కెమెరా మాన్ గా వెళ్ళిన  ఒక పెళ్ళిలో భువనేశ్వరిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె ఉన్న ఊరికి బదిలీ అయ్యి వస్తుంది అని తెల్సుకొని ఆమె వివరాలు ఆమె మేన మామ ద్వారా తెల్సుకొని, ఆమెని పొందటానికి అన్ని సమకూర్చుకుంటాడు. ఈలోపల ఉత్తర  ప్రత్యుత్తరాలు చేస్తూ ఉంటాడు. భువనేశ్వరి తరపున ఆమె మేనమామ, దివాకరం రాసిన ఆ ఉత్తరాలకి జవాబులు ఇస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని దివాకరం భువనేశ్వరి రాజముండ్రి రాగానే తన ప్రేమ గురించి చెప్తాడు, అప్పటికే అతని గురించి తెల్సిన భువనేశ్వరి, అతనిని వదిలించటానికి ఏప్రిల్ 1 వరకు అబద్దం చెప్పకుండా ఉంటె అతనికి పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అప్పటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగి అబద్దాలు చెప్తూ ఉన్న అతనికి తన ప్రేమ మీద ఉన్న శ్రద్ద తో అన్ని నిజాలే చెప్పటం ఆరంభిస్తాడు. ఆ నిజాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయో, అవి అతనికి ఎలా హాని కలిగించాయో, చివరికి భువనేశ్వరి ప్రేమని పొందుతాడో లేదో సినిమా లో చూడవలసినదే. సినిమా ఎన్ని మలుపులు తిరుగుతుందో, సినిమాలో చూడాల్సిందే.


చుక్కలు తెమ్మన్నా తెంచుకురాన
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా (2)

నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైన  || 
చుక్కలు తెమ్మన్నా||

సిరివెన్నెల గారికి చుక్కలు తేవడం, ఆకాశం దిగి రావటం ( దించటం )  అంటే అత్యంత ఇష్టం అనుకుంట. ఈ ప్రయోగం కొన్ని పాటలలో చేసారు. నాకు గుర్తున్న పాట, నువ్వే నువ్వే లో " నా మనసుకేమయింది" పాట  లో చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకు ఉన్న ప్రేమ" అని అంటారు, అలాగే, నువ్వు నాకు నచ్చావ్ లో "ఒక్క సారి చెప్పలేవా" పాట లో  "చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా?" 


దివాకరం ఒక పెళ్ళికి వెళ్లి అక్కడ చురుకు గా తిరిగే భువనేశ్వరి ప్రేమలో పడతాడు. ఆమెని దక్కించు కోవాలంటే తను జీవితం లో స్థిరపడి, అన్ని సమకూర్చుకుంటే దక్కుతుంది అని ఆమె మేనమామ ద్వారా తెల్సుకొని అవి సంపాదించాలని నిశ్చయించుకొని తను పెరిగే శుభ గారి దగ్గర, ఒక గదిని మార్చి వీడియో షాప్ గా మారుస్తాడు. దానికి ఊరంతా అప్పులు చేసి ఆ అప్పులిచ్చిన వారినందరినీ పిల్చి వినూత్నం గా షాప్ ప్రారంబిస్తాడు. రిబ్బన్ వాడకుండా ఒక పెద్ద చెక్క కట్ చెయ్యటం, వంశి గారి ఈ హాస్యాలోచన నిజం గా చూసి ఆనందించ వలసినదేఆ ప్రారంభోత్సవ సందర్భం గా మొదలయిన పాత ఇది. అందరిని పిలిచి ఈ పాట  పాడుతూ ఉంటె, ఎవరికీ అర్థం కాక అలా వింతగా చూస్తూ ఉంటారు.  ఇళయరాజా గారి గొప్పతనం అనేది ఏ పాట  ఆరంభం ఎలా చేస్తారో వింటే తెలుస్తుంది. ఒక వైపు రంపపు శబ్దం, ఇంకో వైపు గడియారం గడుస్తున్న అనుభూతి, ఆ తరువాత నెమ్మది గా పాత మూడ్ సెట్ చేసి గాయకులని పాడించటం. ఇది అనితర సాధ్యమైన కళ. చుక్కలు తెమ్మన్న అంటున్నప్పుడు కోరస్ ఆమె కోసం పాడుతున్నట్టు, ఆమె వింటున్నట్టు అనిపిస్తుంది. 

షోలే ఉందా? - ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా? - తెలుగులో తీసారే బాలా !

ఖైది ఉందా? - ఇదిగో ఇందా
ఖైది కన్నయ్య కాదే ? - వీడికి అన్నయ్య వాడే ! 


జగదేక వీరుడి కధ - ఇది పాత పిక్చర్  కదా?
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద 
ఏ  మాయ చేసైనా ఒప్పించే తీరాలి 

|| చుక్కలు తెమ్మన్నా||

సరే షాప్ పెట్టేశాం ఇంక బిజినెస్ చెయ్యాలంటే వచ్చిన వినియోగదారులని మెప్పించి ఒప్పించాలి. సిరివెన్నెల గారి మాటల చాతుర్యం ఎంత సరళమైన మాటలైనా ఏదో ఒక సందేశం లేకుండా పాట  రాయటం చూడం. వీడియో casette business చెయ్యాలంటే తన దగ్గర ఉన్న casettes  అందరికి ఇవ్వాలి కాని వాళ్ళు అడిగినవి అన్ని ఇవ్వటం ప్రతి సారి కుదరదు కదా. రాళ్ళపల్లి పక్కనుంచి నిజం చెప్పాలని అనుకున్న, ఏదో ఒక మాయ చేసి వచ్చిన వాళ్లకి ఏదో ఒక కాసేట్టే అంట గట్టేయ్యటం పాత్ర  లక్షణం, దానికి తగ్గట్టు గానే పాత. ఇది వంశి, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు జత కూరితే మిగిలేది విందు భోజనం. మనకి ఏదో ఒకటి ఇచ్చెయ్యాలి అన్న తాపత్రయం వాళ్ళకి  ఉండదు. అడిగిన దానికన్నాఎక్కువ  ఇవ్వటం వాళ్ళకి అలవాటు. షోలే ని తెలుగు లో జ్వాల గా తీస్తే ఆ సినెమా, ఖైది లేకపోతె ఖైది కన్నయ్య, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇలాగ పేర్లు చాతుర్యమే కాని, చివరిగా ఏ మాయ చేసిన అందరిని ఒప్పించి, తను డబ్బులు సంపాదించి భువనేశ్వరిని ఒప్పించాలి అన్న పాత్ర స్వభావం కనిపిస్తుంది పాటలో. దివాకరం ఇలాగ అందరిని మాయ చేసి ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చు కోవటం చూస్తాం.

ఒకట రెండా? పదుల వందా ?
బాకీ ఎగవేయ్యకుండా బదులే తిర్చేది ఉందా ?
మెదడే ఉందా మతి పోయిందా?
చాల్లే నీ కాకి గోల వేళ పాలంటూ లేదా?

ఏమైంది భాగ్యం కథ?  - కదిలిందా లేదా కథ?
వ్రతమేదో చేస్తుందంట  అందాక ఆగాలాట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి || చుక్కలు తెమ్మన్నా||


ఇంక మిగితా పాత కూడా కథలోని విశేషాలే. చీటీ పాట  పాడి డబ్బులు తీసుకొని అవి ఎగ్గొడితే అందరు దివాకరాన్ని అడగటం, వాళ్ళని తన స్వభావనుసారం పక్కకి నేట్టేయ్యడం, చిన్న రావు ( బట్టల సత్యం), భాగ్యం మధ్య జరిగే కథలో చిన్నారావు తో దివాకరం చేసిన మతలబులు, ఇలాగ అన్నిలౌక్యం గా  చేస్తున్న, ఇవన్ని చివరికి తన సుఖం కోసమే అని భావించే దివాకరం మనస్తత్వానికి నిదర్శనం. అలా పాడుతూ ఊహల్లోకి వెళ్ళిపోయిన దివాకరానికి ఫోన్ రావటం తో పాట ముగుస్తుంది.

కొసమెరుపు:  ఈ సినిమా కోలపల్లి ఈశ్వర్, MI  కిషన్ రాసి చతుర మాస పత్రిక లో ప్రచురింప బడిన "హరిశ్చంద్రుడు అబద్దం ఆడితే" అనే నవల ఆధారం గా తీసిన  సినిమా. కాని ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే, వంశి గారి చిత్రానువాదం, నటి నటుల ప్రతిభ, LB  శ్రీరామ్ గారి సంభాషణలు, ఇళయరాజా గారి మధుర సంగీతం, వీటన్నిటి కంటే మధ్య తరగతి కుటుంబాలను ప్రతిబింబించే సన్నివేశాలు, ప్రదేశాలు అన్ని సరిగ్గా సమకూరి ఈ సినిమా జనరంజకం అయ్యింది. ఈ సినిమా మొత్తం రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో 2 వారలలో ఒకటే లొకేషన్, సింగిల్  షాట్ లో తీసిన సినిమా. 

Tuesday, June 5, 2012

Song of the week - Idele Tara taraala charitam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:     Peddarikam
Producer/Director:  AM Ratnam           
Music Director:        Raaj-Koti
Singer(s):                 KJ Yesudas, Swarnalata 
Lyrics:                       Bhuvanachandra
Year of Release:     1992
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే
జీవితాల కధనం      ||ఇదేలే ||

పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే
దూరమయ్యేనా
నిరాశే
నింగికెగసేనా
ఆశలే
రాలిపోయేనా
         ఇదేలే ||

ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా
చేసినదా ద్వేషము
కధ
మారదా బలి ఆగదా
మనిషే
పశువుగా మారితే
కసిగా
శిశువుని కుమ్మితే(2)ఆభమో శుభమో
ఎరుగని
వలపులు ఓడిపోయేనా         
||ఇదేలే ||

విరిసి విరియని పూదోటలో
రగిలే
మంటలు చల్లరవా
అర్పేదెలా
ఓదార్చేదెలా
నీరే
నిప్పుగ మారితే
వెలుగే
చీకటి రువ్వితే(2)పొగలో సెగలో
మమతల
పూవులు కాలిపోయేనా     
||ఇదేలే ||
సంగీతం శబ్దం అవుతున్న వేళ పాట మాటగా మారుతోంది. ఈ మధ్య కాలం లో సంగీతం, పాట వింత పోకడలు పోతోంది, సంగీతం అంటే కీబోర్డ్ నుంచి వస్తోంది అనే వాళ్ళు సంగీత దర్శకులు అవుతున్నారు, పాట అంటే ప్రాస కోసం తయ్యారం, కంగారం అని రాసే వాళ్ళు పాటల రచయితలు గా పసిద్ది చెందుతున్నారు, అవార్డ్స్ పొందుతున్నారు. శబ్ద ఘోష లో మాట కరువవుతోంది. ఇంక గాయకులూ వాళ్ళు ఏమి పాడుతున్నారో వాళ్ళకే తెలియదు, పాటలో ఏమి రాసుందో వాళ్ళకి అనవసరం. ఇంక పాటకి కావాల్సిన భావం లేక మాట, శబ్దం గా మారుతోంది. పెను తుఫాను తలొంచి చూసే తోలి నిప్పు కణం అతడే అన్న హీరో గురించి రాసిన పాట ఆ పాత్రని ఎంత ఎత్తుకి తీసుకు వెళ్తుందో మనం చూసాం కాని, ఫాన్స్ కోసం వాళ్ళకి నచ్చే విధంగా హీరో కి వీలు అయినన్ని నక్షత్రాలు ఇచ్చెయ్యటం చూస్తున్నాం. పాట  అంటే కథలోని కథానాయకుని పాత్రని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళాలి కాని అది నటించే నటున్ని కాదు అన్న నిజం మనవాళ్ళు ఎప్పుడు తెల్సుకుంటారో? ఇటువంటి వింత లక్షణాలు పాటలో చోటు చేస్కుంటున్న వేళల్లో ఇటువంటి పాటలు వింటే పాట అంటే ఏంటో అర్థం అవుతుంది. పెద్దరికం సినిమాకి ఈ పాట తలమానిక. పాట మనసులని కదిలించి కరిగిస్తుంది అంటారు, ఈ పాట ఆ కోవలోకి చెందుతుంది. ఏసుదాస్ గారి గురించి చెప్పాలంటే అర్హత ఉండాలి, ఆయన ఈ పాటకి ప్రాణం పోసారు, మన హృదయాన్ని ద్రవింప చేస్తారు.  ఇంక ఈ పాటకి ఏసుదాస్ గారు న్యాయం చేసినట్టు ఎవరు చెయ్యలేరు. అలాగే స్వర్ణలత మంచి సహకారం అందించారు. భావ యుక్తమైన పాటలు పాడటం లో పాత తరం వాళ్ళ దగ్గర ఈ తరం వాళ్ళు ఎంతైనా నేర్చుకోవాలి. ఒక  పాట మళ్ళి  మళ్ళి ఒక శ్రోత వినాలంటే ఏమేమి కావాలో ఈ తరం వాళ్ళ రాదు, తెలియదు. 

పాట అంటే అభిమానుల కోసమో లేక ఎవరినో సంతృప్తి  పరచటానికో  కాదు. కథలో ఇమడి పోవాలి, కథకి బలం చేకూరాలి, ప్రేక్షకులు ఆ పాటని అనుభవించాలి అప్పుడే ఆ పాటకి ప్రాణం వస్తుంది. ఆ పాటకి సంగీత దర్శకులు, గాయకులు న్యాయం చేకూరిస్తే ఆ పాటకి ఆయుషు  పోసినట్టు అవుతుంది. అప్పడే అది ప్రేక్షకులకి చేరుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు అత్యంత మనోహరమైనవి. రాజ్-కోటి ద్వయం చేసిన సినిమాలలో ఉన్నత  స్థానం కలిగిన సినిమాలలో ఒకటి గా నిలుస్తుంది. మిగితా పాటలు "ప్రియతమా ప్రియతమా", " ముద్దుల జానకి" అద్భుతమైన పాటలు. ఎన్ని సార్లు విన్న మరల వినాలనిపించే పాటలు.

ఈ సినిమా కథకి వస్తే  మలయాళ సినిమా "గాడ్ ఫాదర్" అనే సినిమా ఆధారం గా తీసిన సినిమా. ఇందులో నటించిన పాత్రలు అన్ని కలకాలం నిలిచి పోయే పాత్రలు. ఈ సినిమాలో నటించిన వాళ్లకి ఒక జీవితానికి సరిపోయే గుర్తింపు తెచ్చిన సినిమా. ఒక చిన్న సంఘటన వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన పగ ఆ రెండు కుటుంబాలు మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గు మనే స్తాయికి చేరి, ఒకరి నీడ ఇంకొకళ్ళ మీద పడకుండా చూసుకుంటారు. అడుగడుగునా అవతలి వారి మీద పగ ఎలా తీర్చుకోవల అని చూస్తూ ఉంటారు. ఒక కుటుంబానికి పెద్ద బసవ పున్నమ్మ కాగ ఇంకో కుటుంబానికి పర్వతనేని పరసురామయ్య. పరసురామయ్య ఇంట్లో స్త్రీ కి ప్రవేశం లేకుండా చేసుకుంటాడు ఎక్కడ స్త్రీ కుటుంబాన్ని విడగోద్తుందో అని. ఉన్న నలుగురు తనయులకి పెళ్లి చెయ్యకుండా పెంచుతాడు. వీళ్ళ కుటుంబాన్ని ఎలాగైనా చేదించాలి అని బసవపున్నమ్మ తన మనువరాలు జానకి ని కృష్ణ  మోహన్  (కథానాయకుని) మీదకి ప్రేమ నటించి తద్వారా అతను  ప్రేమలో పడితే వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం లభిస్తుంది కదా అని తన మనుమరాలిని ఉసి కోల్పుతుంది,. కాని జానకి నిజం గా కృష్ణమోహన్  ప్రేమ లో పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల నేపధ్యం లో ఈ పాత వస్తుంది. ఆ తరువాత వాళ్ళ ద్వేషాలు, పగలు ఏమవుతాయి, వాళ్ళ ప్రేమ ఏమవుతుంది అన్నది కథ. సినిమా చూసి ఆనందించ వలసినదే. హాస్యం, డ్రామా కలిపి వచ్చిన కుటుంబ కథా చిత్రం అందరిని ఆహ్లాద పరచింది ఈ సినిమా.

ఈ పాట గొప్పతనం ఏమిటంటే  అంతులేని అర్థం ఉన్న సరళమైన సాహిత్యం. ఆ సాహిత్యానికి అత్యంత ఉన్నతమైన సంగీతం తోడు అవ్వటం. చిన్న చిన్న  పదాలతో కథ మొత్తం చెప్పే పాట. ఎక్కడ గ్రాంధికం అయిన పదాలు కాని, కఠిన శబ్దాలు లేవు. కావి చివరికి ఒక శక్తిమంతమైన పాటగా మన ముందు ఉంటుంది. సంగీత ప్రియులకి ఇటువంటి పాటలు ఎదురయినప్పుడు ఇప్పుడు మనము ఏమి కోల్పోతున్నామో తెలుస్తుంది శబ్ద గోషలో పడి, కొత్తదనం అంటే ఏంటో తెలియకుండా ఆ కొత్తదనం కోసం వెంపర్లాడటం, తెలుగు పదాలు పలుకలేని వాళ్ళ చేత పాటలు పాడించటం ఇలాగ చెప్పుకుంటే పొతే అంతులేని తప్పులు చేస్తూ పోతున్నాం.

ఇంక మనం పాటలోకి వెళ్దాము.

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే
జీవితాల కధనం ||ఇదేలే ||

పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే
దూరమయ్యేనా
నిరాశే
నింగికెగసేనా
ఆశలే
రాలిపోయేనా


మన భారతీయ చరిత్ర చూస్తె ఎక్కడ చూసిన కుటుంబాల మధ్య మొదలుకొని గ్రామాలు, ఊర్లు రాజ్యాల ఇలాగ అనేక కథలు చూస్తాం వైరము, విద్వేషాలు, పగ ప్రతీకారాలతో అనేక జీవితాలు నష్టపోయిన సందర్భాలు .కొన్ని కుటుంబాల మధ్య పగలు చూస్తె, తర తరాల మధ్య అలాగా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు మొదలవుతాయో ఎందుకు పెరిగి అలా కొనసాగుతూనే ఉంటాయో మనకి అర్థం కాదు.. సీమ పగలు ఇవ్వాల్టికి ప్రత్యక్షం గా చూస్తాం. దీని వల్ల  అనేకమైన నష్టాలు కలుగుతాయి అని తెల్సిన కూడా పగ కొనసాగటం వాళ్ళ లక్ష్యం. అవతల వాళ్ళ కుటుంబం నష్టపోవటం కోసం ఏది చెయ్య టానికైన సిద్దపడటం అలాగే తమ వారసులని అదే దారిలో పెంచటం చూసాము,, చూస్తున్నాం. వీళ్ళ జీవితాలలో పగకి ఇచ్చిన ప్రాదాన్యం, ప్రేమ మీద ఉండదు, అలాగే వాళ్ళ జీవితాలు మాడి  మసి అయిపోయిన వాళ్ళకి ఏమి అనిపించదు ఆ పగ సాదించటం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అటువంటి వీళ్ళ జీవితం నాలుగు మాటలో క్లుప్తం గా చెప్పటం ఈ పాట గొప్పతనం.  ఈ సినిమాలో కూడా కొన్ని ఏళ్ళ చరిత్ర గల పగ బసవ పున్నమ్మ, పరసురామయ్య ల మధ్య చూస్తాం. అది వాళ్ళ జీవితాలను తగుల పెట్టి నాశనం చేసేసింది. అదే వీళ్ళిద్దరి చరిత్ర వాళ్ళ కథ. అవతల వాళ్ళ ఉనికినే సహించని వాళ్ళు తమ జీవితాలలో అనేకం కోల్పోయినా కూడా వాళ్ళకి పగ మీద ఉన్న ఆసక్తి, దాన్ని తమ వారసులలో పెంపొందించే ఆలోచనలతో సతమత మవుతు జీవితం లో ఆనందం కోల్పోయిన పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడు ఏదో కోల్పయిన నిరాశలో అందరిపట్ల ప్రేమ లేక బ్రతుకుతారు. ఈ విషయం వాళ్ళ పాత్రల ఔచిత్యం మనకి తెలియచెప్పటం లో సఫలీకృతం అవుతారు రచయిత. ఇక్కడవరకు చూస్తె మనం ఒకటి గమనించాలి పాటలో. ఏసుదాస్ గారి గళం లో ఉన్న మాధుర్యం, ఆ గొంతులో పలికిన భావం, ఆ తరువాత గాలానికి ఉన్న గాంభీర్యం అన్నింటికీ మించి మాటలో స్పష్టత. ఏ పదము ఎక్కడ వరకు పాడాలో ఎక్కడ ఆపాలో ఇవ్వన్ని చూస్తె ఈ పాత ఒక నిఘంటువు సంగీతం మీద ఆసక్తి ఉన్న వాళ్లకి, పాటలు పాడాలనే అభిలాష ఉన్నవాళ్ళకి. ఎక్కడ శబ్ద కాలుష్యం లేకుండా, సంగీత సహకారం అందిస్తారు రాజ్-కోటి. ఇటువంటి గాయకుల గొంతు వినే భాగ్యం మనకి లేదు అనే చెడు నిజం మనలోని నిరాశ  ఆకాశానికి అంటుకుంటుంది ఒక్కోసారి.

ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా
చేసినదా ద్వేషము
కధ
మారదా బలి ఆగదా
మనిషే
పశువుగా మారితే
కసిగా
శిశువుని కుమ్మితే(2)ఆభమో శుభమో
ఎరుగని
వలపులు ఓడిపోయేనా  

ఇక్కడ రచయిత మాటల పొందిక అత్యద్బుతం  మాటల గారడీ ఇంద్రజాలం. ఎక్కడ హంగులు ఆర్భాటాలు లేకుండా సరళ భాషలో అనంతమైన భావం నిండి ఉంటుంది. అందుకే ఇటువంటి భావ యుక్తమైన పాట  మనకి తయారు అయ్యింది, బసపున్నమ్మ గారి అత్యంత గారాల పట్టి జానకి. తనే దగ్గర ఉండి పెంచుకున్న మనువరాలిని తన పగ కోసం ఎరగా వేసి తన శత్రువు కుటుంబం లోని వ్యక్తీ మీదకి ఉసి కోల్పుతుంది. అంటే కాని తన మనువరాలి మనసు ఏంటి, అది ఆమె మీద ఎటువంటి పర్యవసానం కలుగుతుంది, ఇవన్ని ఆలోచించదు, ఎందుకంటే ఆమెకి తన మనుమరాలు కంటే తన పేజి ముఖ్యం కాబట్టి. పల్లవి లో తర తరాల చరితం అన్న రచయిత ఈ కథలు మారావా అని ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇది అనాది వస్తోంది కాబట్టి. పెద్దలు చిన్న పిల్లల్ని తమ పగ వైపు మరలించి వాళ్ళని అదే దారిలో పయనింప చేస్తారు కాబట్టి. ఇలాగ వాళ్ళ పగలు వాళ్లతో ఆపితే తమ పిల్లల్ని మార్చకపోతే ఈ చరిత్రలు ఇలాగ మారవు. ఈ కనువిప్పు ఎప్పటికి కలుగుతుందో జనాలకి. ఎంత తమ సొంతం ఐన, తమ పగ, ప్రతీకారం తమతోనే ఉంచితే ఎలాగ ఉంటుందో అందరు ఆలోచిస్తే అంతా  సంతోషం గా ఉంటారు అనటం లో సందేహం లేదు. ఇంకా ఈ పాట కి ముందు అందరు కొట్టుకుంటూ ఉంటారు, మధ్యలో వచ్చి ఆపెంతవరకు. మనిషి వేరే మనిషి ని కొట్టాలి అంటే మానవత్వం మరియు విలక్షణ కోల్పోయి పశువుగా మారితే తప్ప వేరే మనిషినికి హాని చెయ్యలేడు. ఇక్కడ అంట పెద్ద గొడవ అందులో నడి రోడ్డు మీద వివేకం కోల్పోయి కొట్టుకుంటే పసువుకాక మరేమిటి ? అందుకనే ఈ పదం వాడారు రచయిత. ఇక్కడ శిశువు అంటే కథానాయకుడే. ఇంకా ప్రపంచానుభవం లేని వాళ్ళు శిశువులే. వీళ్ళ గొడవలకి వాళ్ళ ప్రేమ వొడి పోయింది కదా హత విధి,,  ఈ క్షణం ప్రతి ప్రేక్షకుడి మనస్సు బాధ తో కలుక్కు మనటం  సహజం  

విరిసి విరియని పూదోటలో
రగిలే
మంటలు చల్లరవా
అర్పేదెలా
ఓదార్చేదెలా
నీరే
నిప్పుగ మారితే
వెలుగే
చీకటి రువ్వితే(2)పొగలో సెగలో
మమతల
పూవులు కాలిపోయేనా ||ఇదేలే ||

ప్రతి ఇల్లు ఒక పొదరిల్లె , ఒక పూదోటే . అందులోని చిన్న పిల్లలు విరిసి విరియని మొగ్గలె . అందమైన పొదరింటిలో కల్లోలం ఊహించలేము. అటువంటి ఇంటిలో ఈ మంటలు చల్లారక పోవటం అనేది బాధాకరమే. అందుకనే ఈ ఆలోచన కథానాయకుడు ఊహించటం పాట లో చూస్తాము. వీళ్ళిద్దరి ఆలోచనలు ఇక్కడ ఎంత చక్కగా రాస్తారో రచయిత. మనకి మంచి చేసి పెంచాల్సిన మన వాళ్ళే ఇలాగ మనకి అడ్డంకి గా మారితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? నీరు మంటలు ఆర్పుతుంది, చల్లదనం తెస్తుంది, అటు వంటిది నీరు నిప్పు రాజేస్తే ఆ మంటలు ఆర్పెదేలా? ఇంక వెలుగు జీవితం లో ఆనందం చేకూరుస్తుంది, కాని అది చీకటి గా మారితే మిగిలెడు నిరాశ , నిస్పృహలతో కూడిన దుఖం మిగుల్స్తుంది. ప్రేమ లో పడిన ఈ జంట పొదరింటిలో పరిమళం వెదజల్లే పువ్వులు, అటువంటి వాటిని ఈ పగ మంట, ద్వేషం అనే సెగ కాల్చేస్తే ఆ మంటల్ని ఎలాగా ఆపాలి, ఆ జంటని ఎలాగా ఓడర్చాలి ? ప్రేక్షకుడికి ఒక అద్భుతమైన అనుభూతి మిగిల్చి గుడ్నే కదిలించి కన్నీరు కారుస్తుంది ఈ పాట.

కొసమెరుపు: ఈ సినిమా సుకన్య కి  మొదటి సినిమా. అత్యంత పేరు ప్రఖ్యాతలు తెచిన సినిమా ఇది. ఇంక మళయాళ మాతృక అయినా రత్నం గారు తెలుగు తనానికి దగ్గరగా తీసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇంక పిళ్ళై గారు మళయాలం లోనే కాక తెలుగు లో కూడా అదే పాత్ర పోషించి అందరిని మెప్పించారు. జగపతి బాబు కి స్నేహితుడి గా నటించిన సుధాకర్ కి ఈ సినిమా ఒక మైలు రాయి. ఇలాగ అనేకమైన అలరించే లక్షణాలు కలిగిన ఈ సినిమా చిన్న సినిమా అయిన చాల పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి పాటల రచయిత ఎవరో ఆ వివరాలు అందుబాటులో లేవు. ఎవరికైనా తెలిస్తే ఈ-మెయిల్ చెయ్యగలరు. ( Thanks to Manohar, updated the information)