Showing posts with label Song of the week. Show all posts
Showing posts with label Song of the week. Show all posts

Saturday, March 3, 2012

Song of the week - Ee Kshanam oke oka korika


ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:        ఎలా చెప్పను
Producer:                  స్రవంతి రవి కిషోర్
Director:                    BV రమణ
Music Director:          కోటి 
Singer(s):                  KS చిత్ర 
Lyrics:                      సిరివెన్నెల సీతారామశాస్త్రి 
Year of Release:       2003

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా 

ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంద
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది 
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది 
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక 
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||

రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి  తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం || 

ప్రతి మనిషి జీవితం లో మాటకు అందని భావోద్వేగాలు అనేకం. తను పడుతున్న ఉద్వేగం,ఆరాటం, తపన   కష్టం ఇవన్ని ఇతరులకి తెలియచేయటం చాల కష్టం. అటువంటి భాషకు అందని భావాలు సినిమాలో చూపించటం అసాధ్యమైన పని. ఇలాంటప్పుడే సాహిత్యం పాట రూపంలో తోడు అవుతుంది. అందుకే అంటారు మాట   కరువయినప్పుడు పాట ఆరంభం అవుతుంది అని. కాని ఒక్కోసారి పాట కూడా సరి అయిన భావం తెలియచేయ్యలేక పోవచ్చు, అటువంటి అప్పుడు సంగీతం ఆ భావాన్ని అంద చేస్తుంది. ఈ రెండు తోడయినప్పుడు ప్రేక్షకుడి హృదయం కరిగితే, సంగీతం, సాహిత్యం సఫలీకృతం అయినట్లే. అటువంటి సందర్భానుసారమైన పాటలలో ఈ పాట ఒకటి. పది సరళమైన వాఖ్యలతో మనిషిని అంతులేని భావోద్వేకనికి గురిచెయ్య గలిగిన ఈ పాట    విన్నప్పుడు తెలుగు ప్రేక్షకుడి కంట ఒక్క చుక్క కన్నీరు కారక మానదు.

సిరివెన్నెల గారు నిశీధి వేళలో పాటలు రాస్తారు అని చాల మందికి తెలుసు, అందుకనేనేమో సిరివెన్నెల అయ్యారు. చీకటి వేల వచ్చే చందమామ కురిసేది వెన్నెలే, అందులో పండు వెన్నెల కాంతి బంగారం. ఇటువంటి పాటల సిరులు వెన్నెల రూపం లో రాత్రి వేల కురిపించే సీతారామ శాస్త్రి గారికి సిరివెన్నెల ఇంటి పేరు అవటం చాల సమంజసం. ఎంతో అర్థత నిండిన సాహిత్యానికి కోటి స్వరాల కోటి, సందర్భానికి ఆ సాహిత్యం అర్థం  అయ్యి ఆ అర్థం ప్రేక్షకుడికి చేరేలా సంగీతం సమకూర్చటం ఈ పాటతో తెలుగు ప్రేక్షకుడికి లభించిన వరాలు కోటి.  ఇంక చిత్ర గారి స్వరం లో పలికిన భావం అనితర సాధ్యం అనిపిస్తుంది. పాత్రకి ఒదిగి పోయిన స్వరం అందరిని ఆకట్టుకుంటుంది అనటం లో సందేహం లేదు. 

ఈ సినిమా కి వస్తే శేఖర్ ( కథానాయకుడు ) IIM లో చదివి అవార్డు విన్నింగ్ బిసినెస్ మాన్. తక్కువ సమయం లో ఎంతో ఉన్నతమైన స్తితికి ఎదిగిన ప్రతిభావంతుడు. అతనికి అమర్ వర్మ అనే NRI  (జర్మనీ లో  వర్మ ఇండస్ట్రీస్ అధిపతి )  పరిచయం అవుతాడు. అమర్ శేఖర్ కి తన కంపెనీ లో ఉద్యోగానికి అవకాశం ఇస్తానని మాట ఇస్తాడు. కాని విధి వైపరీత్యం వల్ల, అనుకోని సంఘటనలో శేఖర్ చేసిన కారు ప్రమాదం లో      అమర్ వర్మ చనిపోతాడు. శేఖర్ స్నేహితుడు సునీల్ చేసిన సహాయం వల్ల శిక్ష లేకుండా బయట పడినా పశ్చాత్తాపం తో కుమిలి పోతాడు శేఖర్. ఇంక తన వల్ల కాక సునీల్ తో పాటు జర్మనీ బయలు దేరతాడు. అక్కడ అమర్ వర్మ ఇండస్ట్రీస్ అప్పుల్ల్లో కూరుకు పోయి మూట పడే స్తితి కి వస్తుంది. వర్మ ప్రేమించిన ప్రియ అమర్ ఇండస్ట్రీస్ నడుపుతూ అటు ప్రియుణ్ణి కోల్పోయి, ఇటు కంపనీ మూత పడే స్తితి లో నిస్సహాయమైన స్తితిలో చూసి శేఖర్ ఏమి చేస్తాడు, చివరికి కంపనీ, ప్రియ ఏమి అవుతారు అనేది కథ. ఆ ప్రమాదం విషయం ఎలా చప్పుడు అన్నది తేరా మీద అంశం.

BV రమణ ఈ పాట ద్వారా అమర్-ప్రియల ప్రేమని సినిమాలో తెలియ చేస్తారు, ఆ తరువాత ప్రియ పడే తపన, ఎడబాటు వల్ల ప్రియ లో కలిగిన ఆవేదన చూపించటానికి వాడుకున్నారు సినిమాలో. శేఖర్ జర్మనీ వెళ్లి అమర్ కంపనీ లో చేరిన తరువాత ఒక టెండర్ విషయం లో చొరవ తీసుకొని వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసేలా చేస్తాడు. ఆ సంతోష సమయం లో అమర్ గుర్తుకు వస్తాడు ప్రియకి, అప్పుడు అమర్ ఫోన్ నుంచి తనకు ఫోన్ చేసుకొని అమర్ ఫోటో చూస్తూ ఆ ఫోన్ రింగ్ కి అమర్ ని తలచుకుంటూ పాట ఆరంభిస్తుంది ప్రియ...

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా

తను అత్యంత ఇష్టం గా ప్రేమించిన మనిషి తాత్కాలికంగా దూరం అయిన ఎడబాటే అత్యంత కఠినం. అటువంటిది శాశ్వతం గా దూరం అయితే ఒక స్త్రీ పడే వేదన ఎంత కష్టమైనదో చూసే వాళ్ళకి అంత తొందరగా అర్థం      అవ్వదు స్వయం గా అనుభవిస్తే తప్ప. అటువంటి మానసిక స్తితిని వేరే వాళ్ళకి తెలియ చెప్పటం చాల కష్టం. ఈ పాట చూస్తె సిరివెన్నెల గారు కఠినమైన పదాలు ఎక్కడ వాడలేదు. కాని ఆ భావం అద్బుతం కళ్ళకి       కట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ప్రియకి తెలుసు అమర్ ఇంక ఈ ప్రపంచంలో లేడు అని, కాని జ్ఞాపకాలు మరచి  పోయటం  చాల కష్తమైన పని. ఎవరికైనా సంతోషం కాని దుఖం కాని వచినప్పుడు తనకు ప్రియమైన వాళ్ళని తలచుకోవటం సాధారణం గా చేసే పని. అలాగే కంపనీకి జరిగిన మంచి అమర్ కి చెప్తూ అతని నుంచి ఏదో వినాలని ప్రియ అనుకోవటం ఈ పాట ఆరంభం. అమర్ తిరిగి రావాలని అనుకోవటం అనే విషయం తరువాత అయిన ఇప్పుడు మాత్రం నీ తీయటి గొంతు వినాలని తప్ప వేరే ఏ కోరిక లేదు నాకు అని "ప్రియ" అనటం ఆ వాఖ్యానికి కోటి గారు, చిత్ర గారు అద్దిన సుందరమైన స్వరాల సుమాంజలి హృదయాలని కరిగించక మానవు. అనంత తీరాలకి వెళ్ళిన అమర్ ఎంత దూరం లో ఉన్నాడో తెలియదు. అయినా ఆ దారి తెలిస్తే అందరు తన వాళ్ళని వెతుక్కొని రావచ్చు     వాళ్ళని కలవచ్చు అందుకనే భగవంతుడు ప్రపంచం నుంచి తీసుకెళ్ళే వాళ్ళని మనకి తెలియని చోటికి తీసుకొని వెళ్తాడు, తెలిస్తే మనం వెళ్లి తెచ్చేసుకుంటాము అని. ఆ తెలియని దారులలో ఎంత దూరం వెళ్తే, వెళ్తే దూరం తరుగుతుంది? ఇది తెల్సిన "ప్రియ" మనసు ఆశగా ఎక్కడున్నాడో తన అమర్ అనుకుంటుంది. ఎంత అద్భుతమైన భావం? 


ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది 
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది 
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది 
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక 
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||

ఎడబాటు తెల్సిన వారికి తెల్సు నిమిషం గడవటం ఎంత కష్టమో, ఒక్కో క్షణం ఒక యుగం అవుతుంది. కలిసే వరకు నిమిషాలు లెక్క పెట్టుకోవటం మామూలే, కాని ఇలా తిరిగి రాని లోకాలకి వేల్లోపోయిన అమర్ కోసం ప్రియ  పడుతున్న మానసిక సంఘర్షణని అడుగడున తెలియచేస్తారు సిరివెన్నెల. రాదు అని తెల్సిన మనసు పడే ఆవేదన, తనని కలవచ్చు అనే ఆశ ఈ చరణం. తనను ఒంటరి గా వదిలి వెళ్లి పోయాడు అని అంగీకరించని మనసు, అతను తిరిగి వస్తాడు అని వేచి చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటోంది. కాని అది ఎంతసేపు అని చెప్పవేంటి? అయిన నువ్వు  నన్ను వదిలేసి వెళ్లి ఏంటో సేపు అవ్వలేదు గా, ఆరు నెలలు అయిన అది నిన్ననే జరిగినట్లు ఉంది, నిన్ను చూసే దాక నా మనసు స్తిమితం లేక ఆరాటం తో అటు ఇటు పరిగెడుతోంది, అందుకనే నీ స్వరం ఒక్కసారి వినిపించవు అని దీనం గా కోరుకోవటం చాల ఉదాత్తం గా ఉంటుంది. దర్శకుడు కూడా అమర్ తో ప్రియ గడిపిన క్షణాలని చూపించి ఆమె పడుతున్న సంగర్షణ ఆవేదన చూపిస్తారు సినిమాలో.

రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి  తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం || 

ఇంకా అదే ఆలోచనలతో కొనసాగుతుంది ఈ పాట. మరల తన మనసు ఏమను కుంటుందో అమర్ కి తెలియ   చెప్పే తపన. మనసు పడే ఆవేదన, ఆ ఆరాటాన్ని తగ్గించటం చాల కష్టమే. కలిసిన తీపి క్షణాలు, చిలిపి చేష్టలు, ఇవన్ని గురుతుకు వచ్చి మనసులోని ఆలోచనలు తగ్గటం లేదు, ఒక్క క్షణం కూడా తగ్గటం లేదు, నిద్ర పొతే ఆలోచనలు తగ్గుతాయి, కాని ఆలోచనలే ఆగనప్పుడు నిద్ర ఎలా పడుతుంది, అందులో ఏదో         చేసెయ్యాలి  అన్నప్పుడు నిద్ర దరిదాపుల్లోకి రాదు. అందుకనే ఈ దూరం వాళ్ళ కలిగిన ఎడబాటు లో ఏదో అమర్ వస్తే ఏదో చెప్పాలి, ఏదో పంచుకోవాలి అని ఆతర పడే మనసుకి విరామం ఒక్క అతను వచినప్పుడే     కలుగుతుంది. అందుకని వచ్చిన తరువాత నచ్చ చెప్తే, ఆ తరువాత మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తే కాని మనసు తేలిక పడదు, కాబట్టి నువ్వు వచ్చి నీ తీయని స్వరం వినిపించమని వేడుకుంటుంది "ప్రియ".

అద్బుతమైన భావం తో పాట రాసిన సిరివెన్నెల గారు, అత్యంత మధురం గా స్వరపరచిన కోటి గారు, ఈ పాటకి అంతే న్యాయం చేకూర్చిన చిత్ర, వీళ్ళు సిని చరిత్రలో ఈ పాటతో చిరాయువు ని పొందారు.

కొసమెరుపు: ఈ సినిమా మాతృక హిందీ సినిమా "तुम बिन". ఈ సినిమాకి బలం సంగీతం, మనసు కదిలించే పాటలు. సిరివెన్నెల, కోటి ఈ సినిమాకి గొప్ప వరం, పెద్ద బలం. ఈ సినిమాలో ఇంకో పాట అప్పుడప్పుడు కదిలించి వెళ్ళిపోయే పాట "మంచు తాకిన ఈ వనం".


Friday, February 24, 2012

Song of the week - Pandu Vennello ee venugaanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:        జానకి weds శ్రీరామ్
Producer:                  S. రమేష్ బాబు
Director:                    అంజి శ్రీను
Music Director:     ఘంటాడి కృష్ణ
Singer(s):                  టిన కునాల్
Lyrics:                       సిరివెన్నెల సీతారామశాస్త్రి

Year of Release:       2003

పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను  నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక      || పండు వెన్నెల్లో ||
కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి కరిగేలా
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా                                                                         || పండు వెన్నెల్లో ||

జానకి వెడ్స్ శ్రీరామ్, సినిమా లోని ఈ పాట సిరివెన్నెల గారు రాసిన సందర్భోచితమైన మరొక్క పాట. ఆయన ఏ పాట రాసిన సందర్భానికి సరిగ్గా సరిపోతుంది, అది ఆయన ప్రజ్ఞ. ఇంతకు ముందు ఇలాంటి కథలతో చాల సినిమాలు చూసి ఉంటాము. కథ క్లుప్తం గా చూస్తె, శ్రీరామ్, జానకి బావ మరదళ్ళు. ఉమ్మడి కుటుంబం లో ఉన్న వాళ్ళు కొన్ని కుటుంబ కారణాల వలన రెండు కుటుంబాలు విడిపోతాయి. విడి విడిగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాని వాళ్ళ మదిలో ఉన్న ప్రేమ అలా ఉంది పోతుంది. మిగిలిపోతుంది. అది తెలియటానికి కూడా వాళ్ళకి చాల సేపు పడుతుంది. ఈ లోపల వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు రావటం కథ అటు ఇటు అయ్యి చివరికి వాళ్ళు ఎలా ఒకటి అవుతారు అనేది సినిమా కథ.
సాధారణం గా మనం కోరుకునే వాళ్ళు చాల ఏళ్ళ తరువాత మనల్ని చూడటానికి వస్తుంటే మనసు వాళ్ళని ఎప్పుడు కలుస్తామా అని ఉవ్విల్లూరుతుంది. ఇంకా వాళ్లతో కలయిక ఎలా ఉండాలా అనే ఆలోచన తో సతమతం అవుతుంది. ఇదే ఇద్దరు ప్రియుల మధ్య ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. మది కలవరం చెందుతుంది, కంటికి  కునుకు ఉండదు, ఆలోచనలు అలలు పొంగినట్లు పొంగుతాయి, జలపాతలలా జారుతుంటాయి, అలాగే మది కూడా ఎక్కడికెక్కడో తిరిగి అలసి పోతుంది, క్షణం యుగం లాగ నడుస్తుంది, ఎవరు కనిపించిన ప్రియుడి లాగ కనిపించటం, ఊహల్లో కలల్లో వాళ్ళ తలపులు కలుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలు చాల చూసి ఉంటాము, ఇలాగ వాళ్ళలో కలిగే ఇన్ని భావాలని ఒక పాట లో రాయటం కష్టమే. ఇలాంటి పాటలు చాల చూసాం, కాని ఈ పాట విశిష్టత ఈ పాటదే  అలాగ రాయగలటం సిరివెన్నెల గారి ఆలోచన ద్రుక్పదానికి చిహ్నం. సాధారణంగా  సినిమాలలో ఎందుకనో ప్రేయసి ప్రియుడి కోసం పాడటం చూస్తాం కాని ఎప్పుడు ప్రియుడు ప్రేయసి కోసం వేచి చూస్తూ పాట పాడటం చూడం.
ఈ పాట మాధుర్య ప్రధానంగా అద్భుతంగా చేసారు ఘంటాడి కృష్ణ, అలాగే వింటూ ఉండిపోయే పాటకి అందమైన మాటల కూర్పు చేసారు సిరివెన్నెల. జానకి ఈ సినిమాలో రాజమండ్రిలో ఉండటం, తెలుగు ఆహార్యం ఎక్కువగా ధరించటం వలన తెలుగు తనం ఉట్టి పడుతుంది. సిరివెన్నెల పదాల అందాలు, గోదావరి జిల్లా అందాలు ఒకటికి ఒకటి పోటీ పడతాయి అంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు జానకి పాత్ర వేసిన గజాల ముఖంలోని అమాయకత్వం పాటకి సరికొత్త అందం తీసుకొని వస్తుంది. దర్శకుడు ఈ పాట చిత్రీకరణకి జన రంజనం కోసం కావాల్సిన హంగులు అన్ని సమకూర్చారు. పాట పాడిన టినా కునాల్, గొంతులో మాధుర్యంతో పాటకి న్యాయం చేసిన, అక్కడక్కడ తెలుగు మాటలు పలుకటంలో స్పష్టత కనిపించకపోవటం(నేస్తం,అన్నప్పుడు), ఉచ్చ స్థాయి లో పాడినప్పుడు కష్టపడినట్లు అనిపించినా, ఈ  పాట మల్లి మల్లి వినాలి అనుకున్నప్పుడు మనల్నిపెద్దగా ఇబ్బంది పెట్టవు.   ప్రియరాలు తన ప్రియున్ని పదే పదే తలచుకొని పాడే పాట ఇది. ఇంక పాటలోకి వెళ్దాం.
పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం

ప్రేమికులకి వెన్నెలకి విడతీయలేని అనుభంధం ఉంటుంది. ఆ వెన్నెల రాత్రుల్లో ఏకాంతం గా వాళ్ళిద్దరూ చేసే చిలిపి ముచ్చట్లు, ఆడే చిలిపి చేష్టలు, ఒకరికొకరు చెప్పుకునే కబుర్లు, సేద తీరుతూ చేసే సరసమైన సంబాషణలు ఇవన్ని వాళ్లకు తరువాత మిగిలే తీపి జ్ఞాపకాలు. అలాంటి వెన్నెల రాత్రుల్లో తన ప్రియుని మాట వేణు గానం లాగ హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారి మాటలు తీయగానే వినిపిస్తాయి ఎప్పుడైనా. అందుకనే అనేకమైన తియ్యనైన జ్ఞాపకాలు తిరిగి నెమరు వేసుకుంటే ఆ జ్ఞాపకాలు తీయ్యదనం నింపుకున్న జలపాతల్లా మదిలో జారుతూనే ఉంటాయి. మౌనంగా ఎదురు చూస్తున్న ఆమె మనసు చేసే సంగీతం ఎలా ఉంటుంది అంటే తన ప్రియమైన అతని పేరు వినిపించే కమ్మని వేణుగానం లాగ, ఆ వేణు గాన సంగీతం ఏమిటి అంటే అది అతని మాట అతని జ్ఞాపకం. అవి ఒక జలపాతం లాగ పారుతూ ఉంటె నీ కోసం నా తనువూ మనసు వేచి చూస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాయి ఓ ప్రియ నేస్తం అనే అద్బుతమైన భావం తో పాటని ఆరంభిస్తారు సిరివెన్నెల. ఈ మాటలకు అదే భావం కలిగేలాగా స్వరం నింపుతారు ఘంటాడి కృష్ణ.

ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక || పండు వెన్నెల్లో ||

కవులకు ప్రియమైన జంటలు చిలుకా గోరింకలే. ఇక్కడ కూడా కథ నాయకుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనిని తన దగ్గరకు తీసుకొని రావాలి, ఆ భావం అద్భుతం గా చెప్తారు సిరివెన్నెల. ఏ పక్షి అయినా ఎప్పటికి ఎగిరి పోలేదు గా, ఎగిరి ఎగిరి అలసి పోయి ఎక్కడో అక్కడ వాలి పోవాలి. తన గూటికి చేరలేకపోతే. కాని అన్ని పక్షులు తిరిగి గూటికే చేరాలి. ఇక్కడ కూడా కథ నాయిక భావం అతని గూడు తన మనసే కదా, ఎక్కడ తిరిగిన తన దగ్గరకే రావాలి అనే భావం తో ఈ పల్లవి సుందరం గా చెప్తారు. ఒకవేళ దూరం గా వెళ్ళిపోయినా, నేను నిన్ను నా దగ్గరకు రాప్పించుకుంటాను, అది ఎలా చెయ్యాలో నాకు తెలుసు, నిన్ను ప్రేమిస్తున్ననేను నిన్ను ఎలా వదులుకుంటాను అన్న విషయం ఎంత అద్భుతం గా వివరిస్తారో ఈ చరణం చూస్తె తెలుస్తుంది. ఓ గోరింకా నువ్వు ఎగిరిపోయవు సరే, కాని అలా ఎగిరి ఎంతసేపు ఉంటావు ఎంత దూరం పోతావు, ఎగిరి ఎగిరి నీ రెక్కలు అలసి పోయి గూడు చేరుకొనే సమయం దగ్గర పాడినప్పుడు నా గుండె కదా నీ గూడు అది పోల్చుకొని తిరిగి వస్తావు కదా. ఇక్కడ ఆమె లో ధీమా కనిపిస్తుంది, అతని మీద తనకున్న విశ్వాసం కూడా కనపడుతుంది. అతనికి ఈమె ప్రేమ విషయం తెలియకపోయినా అది తెల్సుకొని వస్తాడు లే అనే విశ్వాసం కనిపిస్తుంది ఈ పదాలలో.అంటే కాదు ఒకవేళ నీకు తెలియక పోయిన, అది గుర్తించటానికి గుర్తులు లేకపోయినా నేను నీకు నా ప్రేమ కు దారి చూపి నిన్నునా దగ్గరకు రాప్పించుకోనా అన్న ఆమె భావాన్ని, గోరింక తో పోల్చి మనకి అందమైన భావం మిగులుస్తారు సిరివెన్నెల. అందుకే ఓ గోరింకా నీ గూడు ( తన మనస్సు ) కి తిరిగి వచ్చే దారి మర్చి పొతే, నేను దగ్గర ఉంది దారి చూపిస్తూ నా దగ్గరకు రప్పించు కోనా అని మొదటి చరణం అద్బుతం ముగిస్తారు సిరివెన్నెల.

కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
ఇంక రెండవ చరణం లోకి వస్తే సినిమా లో జానకి శ్రీరాం అనేవి పాత్రల పేర్లు, అది కాక అందరికి  ఆదర్శం అయిన సీతారాములే కవుల వర్ణనలకి ఆదర్శం. సీతారాముల కథని అందం గా సినిమా కి అల్లుకోవటం, వర్ణించటం మనకి అంతులేని మధురమైన భావనని మిగులుస్తుంది. సీతమ్మ వారి పెళ్లి కథ ఒక రమణీయమైన గాధ. అలవోకగా శివధనుస్సు కదిపిన సీతమ్మ వారికి అది ఎత్తిన వారికి సీతమ్మ వారితో పెళ్లి అన్న చాటింపు ఏడు లోకాలకి వెళ్తుంది. అదే సందర్భాన్ని తన చరణం లో వాడుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయిస్తారు అవి భూలోకం లో జరుగుతాయి అంటారు, అలాగే సీత తనకోసమే పుట్టింది అని శ్రీరామునికి తెలియదా? సినిమా కథ లో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ జానకి ఆ శ్రీరాం కోసమే పుట్టింది అని అతనికి తెలియదా అని ఆమె అనుకోవటం సమంజసమే. 

వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి విరిగేల
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా
ఈ రెండు వాఖ్యాలు రాసిన సిరివెన్నెల ఊహ శక్తికి, పదాల పొందికకు ఆయనలోని సరస్వతికి శత కోటి నమస్సుమాంజలులు. ఇద్దరి మధ్య ఎడబాటు వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం వల్ల ఇద్దరికీ విరహం కలిగితే ఆ విరహమే శివధనుస్సు అయ్యింది. వాళ్ళిద్దరూ కలవాలి అంటే ఆ విరహం కరగాలి అది ఎలా అంటే ఆ విరహం విల్లువై విరిగితే కాని వరమాల సీతమ్మ వారి మెడలో పడదు. ప్రాయాన్ని పాలతో పోలుస్తారు ఎందుకంటే ఆ పొంగుని ఆపటం కష్టమే. పొంగటం ఆరంబిస్తే ఆగవు, అలాగే కడలి అలలు అవి వస్తూనే ఉంటాయి. ఆ రెండిటికి ముడి వెయ్యటం సిరివెన్నెల గొప్పతనం. ఇంక సినిమా లో కథ నాయికా, నాయకులు శారీరికంగా ఇద్దరు దూరమైనా వాళ్ళ మనస్సులు, ఆలోచనలతో ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు, అది చెప్పటానికే విడిపోని బంధం అంటారు. ఇంతకన్నా గొప్పగా ఎవరైనా ఆలోచించగలరా ??? శివధనస్సు విరిగి సీతమ్మ వారి మేడలో వరమాల పడితే వారి విడిపోని బంధం కలిసి, వయసు లో ఉన్న వాళ్ళిద్దరి కలయిక పాల సముద్రం అలల లాగ పొంగుతాయి కదా. ఈ ఊహ కథానాయిక ద్వారా మనకి కలుగ చేయటం అయన తో పాటు మన జన్మ ధన్యం.

కొసమెరుపు: ఘంటాడి కృష్ణ, ఇంజనీరింగ్ చదివినా, సంగీతాన్ని తన వ్రుత్తి గా మార్చుకొని సినిమా రంగం లోకి అడుగు పెట్టిన తెలుగు సంగీత దర్శకుడు. సిని పరిశ్రమలో ఎంతో ఎత్తు ఎదగలేక పోయిన, తనకంటూ ఒక ముద్ర తో సిని రంగం లో గుర్తింపు పొందాడు. ఈ మధ్య టీవీకి పరిమితం అయిపోయిన, ఇటువంటి కొన్ని మంచి పాటలు అందించాడు మంచి అభిరుచి గల సంగీత దర్శకుడిగా మిగిలిపోయాడు . ఇతను చేసిన పాటలలో 6teens నుంచి "దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే" బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట కుమార్ షాను తో పాడించాడు ఎందుకో మరి.

Wednesday, February 15, 2012

Song of the week - Chinukulaa Raali

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:            నాలుగు స్తంభాలాట
Producer:                           N Krishnam Raju
Director:                   జంధ్యాల 
Music Director:                   రాజన్-నాగేంద్ర 
Singer(s):                            బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
Lyrics:                                  వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:                 1982

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా     || చినుకులా రాలి ||

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే                                                         || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||
నాలుగు స్తంబాలాట ఈ రోజుల లో చాల మందికి తెలియదు కాని ఒక 20-30 సంవత్సరాల క్రితం, పల్లెటూర్లలో మండువా లోగిలి ఇళ్ళలో, ఉమ్మడి కుటుంబం లో సాదారణం గా పిల్లలు ఆడే ఆట. ఈ సినిమా కి ఈ పేరు ఎందుకు పెట్టారో, సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఆట తెల్సిన ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది. సినిమా గురించి తెలియాలంటే ఆట  గురించి తెలియల్సిందే. ఈ ఆట ఎలా ఆడతారంటే, నాలుగు స్తంబాలు, అయిదు ఆట ఆడేవాళ్ళు ఉండాలి, నలుగురు స్తంబాలకి అంటి ఉంటె, చివరి ఆటగాడు మధ్యలో ఉంటాడు( దొంగ అంటారు కొన్ని చోట్ల). ఆ నాలుగు స్తంబాలకి అంటి ఉన్న ఆటగాళ్ళు మధ్యలో ఉన్న ఆటగాడికి అంటకుండా స్తంబాలు మారాలి. ఎవరైనా స్తంబానికి అంటుకోకుండా దొరికి పొతే అతను స్థలం మారి మధ్యలోకి వస్తాడు. ఆట మరల కొనసాగుతుంది. సినిమా లో కూడా నాలుగు పాత్రలు, వాళ్ళు రెండు జంటలు, వీళ్ళతో ఆడే ఆ ఐదో ఆటగాడే విధి. ఆ విధి ఆడిన ఆటలో ఎవరి జీవితాలు ఎలా మారతాయి అన్నదే ఈ కథ.

జంధ్యాల గారు తెలుగు సిని పరిశ్రమకి దొరికిన ఒక వైడూర్యం. అయన తీసిన సినిమాలలో ఆయన తీసిన హాస్య చిత్రాలే గుర్తుండి పోయినా మనకి ఆయన లోని సృజనాత్మకత, సాహితి సంపద, సంగీత ప్రజ్ఞ్య చాల ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. ఈ "నాలుగు స్తంబాలాట" సినిమాతో అయన చాలా మందిని సినీ పరిశ్రమకి పరిచయం చేసారు. ఈ సినిమా ఆ రోజులలో యువతని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ పాట యువతకి జాతీయ గీతం లాగ కొన్ని సంవత్సరాలు మారు మ్రోగింది. సినిమా ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. ఇందులో దర్శకుడు, పాట రచయిత, సంగీత దర్శకుడు ఒకే భావం తో ఏకమైతే ఎలాగా ఉంటుందో తెలియ చెప్పే పాట. బాలు గారు, సుశీల గారు పాట పాడిన, పాత్రలు పాడాయా అనిపిస్తాయి. వాళ్ళ గాత్రం అంత తీయగా, హాయిగా, ప్రేమగా పలకరిస్తాయి. దానికి తోడు  ఈ పాట చిత్రీకరణ అడుగడుగునా పాట లోని ప్రతి పదానికి అర్థం ఇదే అన్నట్టు చిత్రీకరించిన పాట. రాజన్-నాగేంద్ర జంట సంగీతం సమకూర్చిన ఈ పాటకి వేటూరి గారు కాక ఇంకెవరు రాయగలరు? వేటూరి గారు ప్రేమకి నిర్వచనం. ఆయన వర్ణించినట్లు ప్రేమని మనం ఎక్కడ వినం, అనుభవించం. ప్రేమ గురించి ఆయన చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరేమో. అంత అత్యద్భుతమైన పాట ఇది. ప్రేమికులకి గొప్ప వరం అప్పటికి ఎప్పటికి ఏ నాటికి. భావుకత తన శరీరమంతా నింపుకున్న పాట ఇది. అంత భావం ఉన్న ప్రేమ పాటలు చాల తక్కువగా చూస్తాం. ఈ రోజుల్లో ఇంతటి తీయని మెలోడి ఇంక వినలేమేమో, ఇలాంటి స్వచమైన తెలుగు పాటలు మరల రావేమో..

ఇంక పాటలోకి వస్తే, అక్షరాలూ అత్యంత అద్బుతం గా పేర్చి కూర్చిన ప్రేమ మాల ఇది. జలపాతం లా సాగి మదిని అటు ఇటు కదిలించి ఊహ లోకం లో విహరింప చేసే పాట. చరణం లో అన్ని వాఖ్యలు "లే" తో అంతం అవుతాయి, ఇంక చరణం "మ" తో అంతం అవుతుంది. ఏదో ప్రాస కోసం రాసినట్టుగా లేకుండా అత్యంత అర్థవంతమైన అక్షరాలు పొదిగి మన్మధ బాణం విసురుతారు రసజ్ఞుల మీద. ఇంక ప్రేమ అనేది నిర్వచనం లేని అనుభూతి, వివరింపలేని అనుభవం. అందుకనే మనం అనేక రకాల వివరణలు చూస్తాం వింటాం. ఇన్ని రకాల సినిమాలు చూడగలుగుతున్నాం.  కొంత మంది (వేటూరి గారు) ప్రేమని వివరిస్తుంటే ఆ వివరణ ఒక మంచి అనుభూతి మిగులుస్తుంది. అందుకే కథానాయికా నాయకుడు ఒకరి దగ్గరకు ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు మనం కూడా పాటలోకి వెళ్ళిపోదాం.

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
పాట ఆరంభం లో రాజన్-నాగేంద్ర గారు మొదలు పెట్టిన తీరు చాల బాగుంటుంది. జంధ్యాల గారి చిత్రీకరణ సంగీతానికి తోడవుతుంది. చాల మంది నమ్మే ప్రేమ ఎప్పుడైనా ఒకరి చూపులు ఇంకొకరివి కలిసి, ఆ చూపులు భావాలు గా మరి, ఆ భావాలు మాటలు గా మారి, మాటలు అనుభూతులు గా మారి, అనుభూతులు అనుబందాలు గా మారి, చివరికి ఒకరి మనసు ఇంకొకరిది అయితే అదే ప్రేమ. కలకాలం నిలిచే అనుబందం. శరీరాలకి అతీతంగా మిగిలేది నిజమైన ప్రేమ. అందుకనే ఈ ప్రవాహాన్ని వేటూరి గారు ప్రక్రుతి సహజమైన తీరుతో పోలుస్తూ ఈ పాట రూపొందించారు. సముద్రం పురుషుడైతే, నది స్త్రీ  అవుతుంది. అందుకే స్త్రీ పురుషుడి కలయిక అలా పోలుస్తారు. పాట లో కూడా నేను సముద్రం అయితే నువ్వు నదివి అది మర్చిపోకు అని చేతి లో చెయ్యి వేయించుకుంటాడు కథానాయకుడు. నీ మమత తో నన్ను నీలో చేర్చుకొని ఆనందం తో ఉప్పొంగి పోయేలా చెయ్యి అంటాడు. నీరు ఆవిరై మబ్బు వాన గా మారినట్టు, ఆలోచనలు ఆవిరై అవి చూపులు అయినట్టు ప్రేమ చినుకులా రాలి, ఆ వాన నీరు నది లాగ మారి నది వరదై, సముద్రం లో నది కలిస్తే , సముద్రం ఆనందం తో ఉప్పొంగితే అదే ప్రేమ అంటారు వేటూరి. నా ప్రేమ కి వేరే నిర్వచనం లేదు నీ పేరు తప్ప, నా ప్రేమ అంటే నువ్వే. ఎంతటి చక్కటి నిర్వచనం చెప్తారు వేటూరి గారు ప్రేమ గురించి? జంధ్యాల గారు, నదిని సముద్రాన్ని చూపించారు కాని వానని చూపించలేదు ఎందుకనో?

ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

మరల ప్రకృతినే ఆశ్రయిస్తారు వేటూరి గారు ప్రేమికులకి ప్రేమిస్తున్నాము అని ఒకరికి ఒకరు అర్థం అయ్యేసరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్తితికి వస్తారు. ఆ విరహం లో ఆ ఆలోచనల వేడిమి లో కలిగే తాపం లో వచ్చే నిట్టూర్పులు ఎంత వేడిగా ఉంటాయి అంటే, ఆకులు రాలే కాలం లో వేసవి గాలి వేడి అంత.  మరి అంత వేడి, తాపం తగ్గేది ఎలా అంటే కుంకుమ పువ్వు పూసే పొద్దున్న లాగ ఉండాలి అని. కుంకుమ పువ్వు చాల తక్కువ కాలం ఉంటాయి అవి కూడా చల్లని ప్రదేశాలలో మాత్రమె పూస్తాయి. మరల కొంచెం వేడి తగిలినా ఆ పూలు పాడయిపోతాయి. అలాంటి చల్లదనం తో వచ్చే కుంకుమ పువ్వు తనకి ఇచ్చే బలం అతనికి ఓదార్పు కావాలి. ఎక్కడినించి ఎక్కడికి వెళ్లారు వేటూరి గారు? ఇంకా జన్మ జన్మల బందం మన ప్రేమ. నీ కోసం వేచి ఉంటాను అనటం సాధారణం గా ప్రేమికులు వాడే పదమే. కాని ఆ జన్మలు ఎలా ఉండాలి? ప్రేమలు కొరేవి గానే ఉండాలి. అందులోనే నీకోసం వేచి ఉంటాను అంటూనే, ఆ జన్మల తో సంభందం లేకుండా, అవి దాటి నీ దానిని అవుతాను అంటుంది కథానాయిక. సినిమాలో జంధ్యాల గారు కథానాయిక వేచి ఉండటం చూపిస్తారు. 
 హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా  

మరల ప్రేమ ప్రవాహం గురించి చెప్తారు ఈ సారి వేరే విధంగా, అది కూడా మల్ల ప్రకృతిని ఉదాహరణ గా తీసుకొని. మంచు కరిగి నదులు గా మారతాయి అని మనకి తెలుసు, అనేక నదుల ఉద్భవం హిమాలయాల మీద ఉన్న మంచు, అవి కరిగి నదులు అయ్యి, ప్రవహిస్తే, మొక్కలకు పువ్వులు పూస్తే, ఆ పువ్వుల నవ్వులు మనకి ఋతువులు గా కవ్విస్తే, ఆ పువ్వులనుంచి తేనే పొంగితే వచ్చే సహజ సౌందర్యం, ఆహ్లాదం ఆనందం నీ నా ప్రేమ. అది శరీరం శిధిలమైన కాని, కష్టాలు వచ్చిన కాని ఒకరికొకరి దూరం గా పోకుండా, ఒకరిని ఇంకొకరు విడిచి పెట్టకుండా ఉండేలాగా ఉండిపోవాలి అని కోరుకుంటారు ప్రేమికులు. ఈ పద ప్రవాహం కమనీయ సుందర కావ్యం, అదే వేటూరి సుందర కావ్యం.

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే   

మండు వేసవి తరువాత వచ్చే మొదటి వాన కోసం భూమి పరితపిస్తుంది, అలాగే మొక్కలు, చెట్లు, చేలు, ఆ వాన పడగానే అవి పులకరించి పోతాయి పరవశించి పోతాయి. మన్ను సువాసన వెదచల్లుతుంది. అలాంటి వాన అన్నింటి లో కొత్త శక్తిని నింపుతుంది. నేను కూడా అలాగే ఒక తొడిమ పువ్వు పూయటం కొరకు వాన కోసం వేచి చూసే లాగ నీ కోసం వేచి ఉంటున్నాను అంటుంది కథ నాయిక. నింగి నెల కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్య సమయాన రెండు ఎకమైనట్టు ఉంటాయి. నిన్న ఇవ్వాళ అయితే అదే రేపటికి వెన్నంటి ఉంటుంది ఇవ్వాళ. నీడ అవుతుంది అంటే సినెమా లో ఇక్కడ నీడ చూపిస్తారు జంధ్యాల గారు. రేపటికి నీడలా వెంటాడి ఆ పొద్దు సమయం లో నా ముద్దు తీరుతుంది లే అనే ఆశ అందుకనే ఇద్దరు కలిస్తే తీరం చేరినట్టే.   ఆ తీరాలు చేరాలిలే అని ఇద్దరినీ పాటలో కలిపేస్తారు.


మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి అనగానే, ఇద్దరినీ ఒక బోర్డు దగ్గర నిలబెడతారు జంధ్యాల గారు అందులో "Those who in love tell each other a thousand things without talking " అని చూపిస్తారు. నిజమే ప్రేమికుల చూపులలో కొన్ని వేల సందేశాలు, మాటలు దాగి ఉంటాయి, అవి వాళ్ళకే అర్థం అవుతాయి. మౌనమే గానము అవుతుంది ఆ గానం తో ఒకరిని ఒకరు పిలుచుకొంటే, ఆ తరువాత వచ్చే కళలు ఉప్పెన లా ఎగసి, ఆ అలల అలజడికి మనసి అలసి పొతే, ఆ అలసటని తీర్చటానికి నీ నా ప్రేమ తారడితే, ఈ ప్రపంచం అంటే మనమే, మన ప్రేమ తో నిండిపోయి అంతటా మనమే కదా అని ముగుస్తారు వేటూరి గారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు తనదైన శైలి లో.

కొసమెరుపు: ఈ పాట మొదట "రాజన్-నాగేంద్ర" గార్లు 1977కన్నడ సినిమా "Bayaludari" లో ఈ పాట చేస్తే కొంచెం మార్చి 1982 లో "నాలుగు స్తంభాలాట" కి మరల చేసారు. ఇదే పాటని 1992 హిందీ లో "ऐसी दीवानगी" అనే పాట గా    కాపీ కొట్టిన నదీం శ్రావణ్ కి ఫిలిం ఫెయిర్ అవార్డు రావటం విచిత్రం.

ఈ సినిమా తో సుత్తి అనే పదానికి సృష్టి కర్త అయ్యారు జంధ్యాల గారు, ఆ పదం ఇంటి పేరు గా మారింది, వేలు గారికి వీరభద్ర రావు గారికి.

Friday, February 3, 2012

Song of the week - Kaliki Chilakala koliki

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:             సీతారామయ్యగారి మనవరాలు
Producer:                             V.M.C. Productions
Director:                   క్రాంతి కుమార్
Music Director:                   కీరవాణి MM
Singer(s):                            చిత్ర
Lyrics:                                  వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:                 1991
కలికి చిలకల కొలికి మాకు  మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)

అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి 
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి) 

ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి  కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి) 

మసకబడితే నీకు మల్లెపూదండ 
తెలవారితే  నీకు  తేనే నేరెండ
ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు 
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)

 గడచిన వారం సీతారామయ్య గారి మనవరాలు సినిమా లోని పూసింది పూసింది పున్నాగ గురించి రాయటం జరిగింది. ఈ సినిమా లో వేటూరి సుందరరామ మూర్తి గారు రాసిన అన్ని పాటలు మణి మాణిక్యాలే. అయన రాసిన ఈ "కలికి చిలకల కొలికి" పాట ఆడవాళ్ళ హృదయాలనే కాదు అందరి హృదయాలను కదిలుస్తుంది. ఆయన రాసిన తీరు చూస్తె అందరిని సున్నితం గా మందలించటమే కాదు, ఒక కోడలు ఎలా ఉంటుందో, ఆమె అత్త వారింట్లో పడే కష్టం, పుట్టింటి కోసం వాళ్ళు ఎప్పుడు ఎలా ఎదురు చూస్తారో తెలియచెప్తుంది. అంతే కాదు సీత ఎవరిని ఎలా అడగాలో, ఎలా అడిగితె తన అత్తయ్య ని తనతో పంపిస్తారో అలా అడిగిన విధానం మహాద్భుతం గా చెప్పటం జరుగుతుంది. ఇంతలా ఒక్కొక్కరిని కదిలించి రెండు కుటుంబాలు తిరిగి కలిసే లాగ చేస్తుంది. సినిమా లో సీత పాత్రని చాల గొప్పగా చూపించటానికి ఈ పాట చాల దోహద పడుతుంది. సీత సీతారామయ్యగారి మనవరాలి గా సాధించిన అనేక విజయాలలో ఇది ఉత్తమ స్థానం లో నిలిచి పోవటానికి దోహద పడుతుంది.

సినిమా లో ఈ పాట ముందు జరిగిన సన్నివేశాలు చూస్తె, సీతారామయ్యగారికి, ఆయన వియ్యంకుడికి ఏదో స్థలం విషయం లో వివాదం మొదలు అవుతుంది. గ్రామ పెద్దగా ఆ స్థలం ఇవ్వటానికి సిద్ధపడరు సీతారామయ్య గారు. కాని అదే కావాలని మంకు పట్టు పట్టిన వియ్యంకుడు గర్భవతి అయిన తన కోడలు, సీతారామయ్యగారి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెల్లిపోవటానికి సిధపడతాడు. అప్పుడు ఆ అమ్మాయిని ఆపకుండా, పెళ్లి అయిన తరువాత ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటమే సమంజసం అని పంపించేస్తారు సీతారామయ్య gaaru. ఆ మాట పట్టింపుతో రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళకుండా ఉండి పోతారు. అమ్మాయిని కూడా తన పుట్టింటికి వెళ్ళకుండా కట్టడి చేస్తారు. ఈ విషయలేమి తెలియని సీత వాళ్ళింటికి వెళ్ళటానికి సీతారామయ్య గారి అనుమతి తీసుకొని కాశితో కారులో బయలుదేరుతుంది. దారిలో ఈ విషయాలన్నీ సీతకి చెప్తాడు కాశి.  ఆ ఇంట్లో అందరి తోనూ కలసి పోయి సరదాగా మాట్లాడుతూ తన అత్తయ్య తో పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది సీత, ఆ ప్రశ్నకి బాధతో నాకు రావాలనే ఉందమ్మ, కాని అత్త మామలు అంటూ సమాధానం చెప్పకుండా దాటేస్తుంది అత్తయ్య. కాని విషయం తెలిసిన సీత ఆ ఇంట్లో అందరిని అత్తయ్యని తన ఇంటికి పంపమని కోరుతూ పాట ఆరంభిస్తుంది. 

కీరవాణి గారికి చాల పేరు తెచ్చిన సినిమా ఇది. అలాగే చిత్ర కి కూడా. సినిమా లో పాత్ర నిజం గా పాడుతున్నట్టు ఒదిగిపోతుంది ఆమె గాత్రం. ఈ పాటకి చిత్ర కి రాష్ట్ర పురస్కారం లభించింది. ఈ పాట లో చిత్ర గారు పాడిన విధానం చాల అద్భుతం. అందుకనేనేమో సినిమాలో అన్ని పాత్రలు కరిగి కోడలిని పుట్టింటికి పంపించేస్తారు. ఇంక ఈ పాట ని చిత్రీకరించటం లో సఫలం అవుతారు దర్శకులు. పాటకి దగ్గరగా ఉంటుంది ఈ చిత్రీకరణ.

ఈ పాటను చిత్రీకరించిన ఇల్లు చూస్తె తెలుగు వారి ఇంటికి ప్రతీక. అందుకే ఈ పాట ఎప్పుడు చూసిన అందరికి ఏవో అనుభూతులు తిరిగి గుర్తు రాకుండా ఉండవు. ఒకరికి ఒకరు జడలు వెయ్యటం, రోట్లో దంచటం, వేలు నలిగితే నోట్లో పెట్టుకోవటం, పూలు దారం తో మాలగా చెయ్యటం, మండవా లోగిలి, స్తంబాలు, ముఖ్యం గా ఊయల. తెలుగు తనం అడుగడుగునా నిండి ఉన్న పాట. పాట పక్కన పెడితే ఇప్పుడు ఇవ్వన్ని ఏమయిపోతున్నాయో అనే ఆలోచన మిగిల్చే పాట.
ఇంక పాటలోకి వెళ్తే వేటూరి గారు వేసిన పాటల పందిరి లో మనం కూడా కొంచెం సేపు అటు ఇటు నడిచి కొంత  ఆహ్లాదం పొందుదాము.

కలికి చిలకల కొలికి మాకు  మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి 
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి)  
ఎప్పుడైనా ఇంటికి పెద్ద తో మొదలు పెట్టటం సాంప్రదాయం. ఇంటికి పెద్ద ఎవరు, ఆ మామయ్య కి తండ్రి అయిన తన తాత గారు. కాబట్టి ఆయనతోనే మొదలు పెడితే సరి. కాని ఆయన్ని ఎలా అడిగేది? దానికి సమాధానం కూడా చెప్తారు వేటూరి గారు. తన అత్తయ్య ఎలాంటిదో ముందు ఆయనకి చెప్పి కొంచెం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి, మా అత్తయ్య కూడా తక్కువేమీ కాదు మా ఇంటికి పంపించవయ్య అనటం లో వేడుకోలు ఉంది, లాలిత్యం ఉంది, సున్నితత్వం ఉంది, పొగడ్త ఉంది. ఇన్ని కలబోసి మొదలు పెడతారు వేటూరి గారు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, అంటే తన అత్తయ్య వనితలకే తల మాణికం, అందునా మీ లాంటి కలవారి కోడలు, సీతారామయ్య గారి కూతురు సాక్షాత్తు లక్ష్మి దేవి, ఇంత మంచి ఉన్నతురాలైన అత్త మామలని దైవం గా కొలుస్తూ, అందరికి అణిగి మణిగి ఉంటూ ఆ ఇంటికే మహాలక్ష్మి అయిన అందమైన మా అత్త, పుట్టిల్లు ఎరుగదు. వేటూరి గారి పదాల అల్లిక ఎంత అందం గా మారుతుందో అత్తయ్య ని వివరించటానికి వాడిన పదాలు చూస్తె తెలుస్తుంది, కలికి చిలకల కొలికి, కనకమాలక్ష్మి, అందాల అతివ, పసి పంకజాక్షి. ఇంత ఉన్నతమైన స్త్రీ మీకు సేవ చేస్తోంది, ఐన మీరు ఆమెకి పుట్టిల్లు ఎరుగకుండా చేస్తున్నారు మీకు భావ్యమేనా అనే ప్రశ్న వేస్తున్నట్టు ఉంటుంది. ఇంక సీత అడుగుతోంది అత్తయ్య తరుపున, మీకు నేను ఏమి ఇచ్చుకోలేను, మేనాలు తేలేను, ఆడ కూతురిగా అడుగుతన్నాను ఆ ఇంటి కోడలి గా అడుగుతున్నాను, సీతమ్మ లాంటి మా అత్త మీ ఇంట్లో ఉంటోంది, వాల్మికినే మించిన వాడివి తాతయ్య, ఇంకా ఆ అమ్మని మా ఇంటికి పంపించవయ్యా,, అంత ఉదాత్తం గా అడుగుతుంటే ఎవరి గుండె కరుగదు? వేటూరి గారి కవిత్వానికి చలించని హృదయాలు ఉంటాయ? ఉండలేవు. ఇక్కడ వేటూరి గారు మేనకోడలి కోసం మేనాలు అని వాడారో, మేనాలు కోసం మేనకోడలిని వాడారో కాని ఎంతో అందం గా ఉంటుంది ఆ వాఖ్యం.
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి  కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి)  
సరే తాత గారు అయ్యారు ఇంకా ఇంట్లో రెండొవ పెద్ద అత్తకి అత్తగారు, సరే ఇంక అక్కడికి వెళ్తారు వేటూరి గారు. దర్శకులు కూడా పాటకి అనుగుణంగా సాగుతారు. ఒక్క సారి ఇంట్లోకి కోడలు అడుగు పెడితే పని అంతా కోడలిది, పెత్తనం అంత అత్తగారిది. అప్పటి వరకు ఇంటికి కావాల్సినవి అన్ని చేసిన అత్త గారి పనులన్నీకోడలు చెయ్యటం మొదలు అవుతుంది. అలాగ అత్తగారి రెండు చేతులు అయి మసలుకుంటుంది కోడలు. కాని ఏ మాట వచ్చిన ముందు అనేది పెద్ద కోడలినే. చిన్న కోడళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం కనికరం ఉంటుంది. అందుకే పెద్ద కోడలు పని చాల కష్టం ఎవరింట్లో ఐన. మొత్తం కుటుంబం లో జరిగేవి అంత సుళువుగా చెప్పేస్తారు వేటూరి గారు. అలా చెప్తూ చిన్నగా మందలిస్తూ ఆలోచన రేకేత్తిస్తారు అత్తగారికి. ప్రపంచం లోని అత్త కోడళ్ళ మద్య ఉన్న కలహాలు కాని మనస్పర్థలు కాని, వేటూరి గారు చెప్పిన ఈ ఒక్క విషయం పాటిస్తే చాల తగ్గుతాయేమో. ఒక అత్త తను కోడలిగా  ఎంత అనుభవించిందో అది గుర్తు ఎరిగి మసలు కుంటే, తర తరాలు మధ్య అంతరాలు తగ్గుతాయేమో. నేటి అత్తమ్మ నాటి కోడలివే, తెచుకో మాయమ్మ నీవు ఆ తెలివి అని ఎంత సున్నితం గా హేచ్చరిస్తారో ( ఇక్కడ దర్శకుడు ఆ పాత్ర ఆలోచన లో పడినట్టు చూపిస్తారు), అల అంటూనే మా అత్త నీ తలలో నాలిక లాగ ఉంది, అంటే అత్త మనసు ఎరిగి మెదిలే కోడలు మా అత్త, నీ ఆలోచనలని తన మాటలతో చేతలతో నిన్ను తల్లిలాగా చూసుకుంటోంది. అలాగే పూలు ఎన్ని ఉన్న దండ కావాల్సి వస్తే దారం కావాలి, ఇంక కుటుంబం లో ఎంత మంది ఉన్న ఆ కుటుంబం సవ్యం గా నడవాలి అంటే మా అత్త లాంటి కోడలు కావాలి, మా అత్త అంత కంటే సేవ చేస్తోంది మీ కుటుంబానికి. తన కాపురం చేసుకుంటున్న తన అత్త మమల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటోంది, ఇంక మీకు ఏమి కావాలి, ఆ అత్త ఎంత ఎదిగిన మాకు ఇంకా మా ఇంటి పాపే, అలాగ ఇన్ని సుగుణాలున్న మా అత్తని ఇంకా ఏమైనా తప్పులుంటే మన్నించి మా ఇంటికి పంపించు అని హృద్యం గా అడుగుతుంది సీత. 

మసకబడితే నీకు మల్లెపూదండ 
తెలవారితే  నీకు  తేనే నేరెండ
ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు 
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)
ఇంక వేటూరి గారు మిగిలిన మామ దగ్గరకి వెళ్తారు, మనం కూడా వెళ్దాం, అడుగుదాం. ఏమని అంటే వేటూరి గారు ఏమంటే అదే. మగవాడు పగలు ఎంత బెట్టు చూపించినా ఎంత పట్టు చూపించిన చీకటి పడితే అంతా మారిపోతుంది. శృంగార విషయం సున్నితమైన, చాటుగా చెప్తారు, ఎంతైనా అల అడుగుతున్నది అమ్మాయి కదా, అందుకనే ఆ పదాలు, మల్లె పూదండ, తేనే నీరెండ వాడతారు. భార్యకి ఉన్నలక్షణాలు అన్ని మా అత్త లో ఉన్నాయి,  ఏడు మల్లెలు సరి తూగుతుంది మా అత్త అంటే, అంత స్వచ్చమైన, సున్నితమైన మా అత్త, నీకు ఎన్నో జన్మల నోముల పంట. ఎంత పేరు తెచ్చుకున్న, ఆడదాని మనసు ఎప్పుడు పుట్టింటి కోసమే పరితపిస్తుంది. ఈ విషయం తెలుసుకో రాముడి లాంటి మామ, అనటం లో మా అత్త సీతమ్మ లాంటిదే అని చెప్పటమే. ఇంకో విషయం ఇక్కడ మామ కి సలహానే ఇస్తుంది కాని పంపించ మని అర్థించటం ఉండదు ఈ చరణం లో. అదే వేటూరి గారి చమత్కారం. ఒక కుటుంబం లో ఎవరిని ఎలా అడగాలో అన్న విషయం కూడా చెప్పినట్టు అయ్యింది. ఇంటికి పెద్దాయనని అడగొచ్చా అంటూనే అడుగుతారు, ఇంక అత్తగారిని మన్నించమని అడుగుతారు, చివరిగా మామకి సలహా మాత్రమె. ఇంతటి ఆలోచనలతో కూడిన పాటని రాయటానికి ఎంత సమయం తీసుకున్నారో? మొత్తం కథ, కథనం తెలిస్తే కాని, అది తెలిసి సందర్భోచితం గా రాయటం సామాన్యమైన విషయం కాదు.

ఇంతటి సందర్భోచితమైన పాట అందున ఇంతటి ఉన్నతమైన భావం, సరళమైన పదజాలం తో అందరిని ఆకట్టుకునేల చేయ్యగాలటం ఒక్క వేటూరి గారికే సాధ్యం అనిపిస్తుంది. వేటూరి గారు రాసిన కొన్ని పాటలతో ఆయనే మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న వాళ్ళు చాల మంది ఉన్నారు కాని, ఇలాంటి పాటలు వింటుంటే అందరు అనేది నిజమే, ఆయన కాలానికి అన్ని వైపులా పదునే. సిని విలాకాసంలో ఒక చంద్రుడే. 


కొసమెరుపు 
ఈ  సినిమా లో ఇంక మిగితా పాటలు కూడా ఒకదానికి ఇంకోటి పోటి పడతాయి. వెలుగు రేఖల వారు, సమయానికి తగు పాట, కూడా ఎంతో అద్భుతం గా రాసారు. ఇంక మాయాబజారు లోని "సుందరి నీ వంటి" కి పెరోడి గా " సుందరి నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన లేదు కదా" అన్న కామెడీ పాట కూడా అదే సుందరం గా రాసి తన నామదేయానికి సార్థకత చేకూరుస్తారు వేటూరి సుందరరామమూర్తి గారు.

Thursday, January 26, 2012

Song of the Week - Poosindi Poosindi Punnaga

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:             సీతారామయ్యగారి మనవరాలు
Producer:                         V.M.C. Productions
Director:                   క్రాంతి కుమార్
Music Director:                 కీరవాణి MM
Singer(s):                         S.P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
Lyrics:                               వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:              1991
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ

పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే
కలలొచేటి నీ కంటి పాపయిలే కధ చెప్పాయిలే

అనుకోని రాగమే అనురాగ గీతమై వలపన్న గానమే ఒక వాయులీనమై పాడే మది పాడే  ||పూసింది పూసింది||

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై, పసిమొగ్గ రేకులే పరువాల చూపులై , పూసే విరబూసే  ||పూసింది పూసింది||
సీతారామయ్యగారి మనవరాలు, ఈ సినిమా చూసి స్పందించని తెలుగు వాడు ఉండదేమో, సీతారామయ్య గారిని, అయన మనవరాలిని తమలో ఊహించని తాత మనవరాళ్ళు మన తెలుగు నాట ఉండరేమో. అంతగా అందరిని కదిలించిన సినిమా ఇంకోటి లేదు. ఒక తండ్రి, కొడుకు మధ్య ఉండే బంధం ఎంత మధురమైనదో, మనస్పర్ధలు వస్తే ఎంత కఠినం గా ఉంటుందో వారిద్దరూ ఎంత నరకం అనుభవిస్తారో చెప్పిన సినిమా ఇది. అక్కినేని, మీనా ఈ పాత్రల్లో జీవించడం మాత్రమే కాదు ప్రాణం పోసారు. అడుగు అడుగున తెలుగుతనం ఉట్టిపడే ఈ సినిమా కల కాలం నిలిచి పోయింది. కొడుకు అంటే అంత్యంత ఇష్టమైన తండ్రికి ఆ కొడుకు లేడు అనే నిజం చెప్పలేక పడిన సంఘర్షణలో హీరోయిన్ గా మొదటి సినిమా లో ఎంతో అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న మీనా తెలుగింటి ఆడపడుచు గా అందరి మన్ననలు పొందింది.

ఇందులోని అన్ని పాటలు వేటూరి సుందర రామ మూర్తి గారు రాసారు. ఒక్కో పాట ఒక్కో మణి హారం. ఒక సుందర కావ్యం. గోదావరి తీరమంత సుందరం. తెలుగుతనం లో తీయనిదనం అడుగడునా ఉట్టి పడే ఆ సాహిత్యం వింటే వేటూరి గారి లోని సాహితి సరస్వతికి ఎన్ని కోట్ల సార్లు నమస్కరించిన సరిపోదు. కీరవాణి గారు ఆ సాహితి సంపద కి అద్దిన సొగసులు చెప్పనలవి కాదు. ఇంక గాయని గాయకులు సంగీత సాహిత్యం కలిసి చిలుకగా వచ్చిన అమృతాన్ని దేవతలు గా మారి మన చెవిలో పోసారు.

ఈ సినిమా లో గణేష్ పాత్రో గారు రాసిన మాటలు కూడా హృదయాన్ని బలం గా తాకుతాయి. సినిమా కథ అంతటి మూలం మొదట వచ్చే ఒక సన్నివేశం. ఆ సన్నివేశం లో " నా మాటకి విలువలేదు, తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు, మంచిదే, కాని 25 సంవత్సరాలు గా ప్రపంచములోని భాషంత నా తో మాట్లాడటానికే పని పెట్టుకున్న నా బిడ్డ, తన మనసులో ఏముందో నాతొ మాట వరుసకైన చెప్పక పోవటం నా మీద గౌరవం కాదు తిరస్కరణ" ఈ ఒక్క సంబాషణ చాల చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పట్ల తల్లి తండ్రుల స్పందన ఇలాగె ఉంటుంది ఏమో. ఇట్లాంటి సన్నివేశాలు ఎన్నో. ఆ సన్నివేశాలు పండించిన తీరు, దర్శక నిర్మాతలకి ఒక మంచి సినిమా తీసాము అని వాళ్ళ జీవితానికి సరిపడే సంతృప్తిని ఇస్తాయి.

ఇంకా ఈ పాట కి వస్తే, సీతారామయ్య గారింట్లో పెళ్ళికి అమెరికా నుంచి మనవరాలు వస్తుంది. ఆ పెళ్లి జరిగేలోపు అందరితోను కలిసి పోయి ఆత్మీయురాలవుతుంది. ఆ విషయం నిద్రపోయే ముందు ఈ లోకం లో లేని తండ్రికి ఉత్తరం రాసి, పొద్దున్నే "Jogging" కి  వెళ్తుంది. అక్కడ కాశి బావ ఎదురయితే సరదాగా మాట్లాడుతుంది. పొలం కి వ్యవసాయం కాదు తాతకి సాయం చెయ్యటానికి వెళ్తున్న బావ తో, నువ్వు అక్కడే ఉంటావు గా  ఏదో సమయం లో పొలంకి వస్తాను అక్కడే ఉండు అంటుంది.  కాశి పొలం పంపు దగ్గర పని చేస్తూ ఉండగా, ఎక్కడ నించో కమ్మటి violin వాయిద్యం వినిపిస్తే ఆశ్చర్య పోయి చూస్తాడు. అక్కడ ఇంతకీ తన మరదలు సీత. మరదలిని పొగడిన తరువాత పిల్లోడు చెప్పిన పైత్యం అదే కవిత్వం గురించి విని సరదాగా పందెం మొదలు అవుతుంది, అదే పాట అవుతుంది.

తెలుగు తనం అంత రంగరించిన సన్నివేశం లో పాట ఆవిష్కరిస్తుంది. పచ్చటి పొలం ఒక వైపు, గల గల పారే పొలానికి సాగు నీరు ఒక వైపు, ఇంకో వైపు బావ, పరికిణి కట్టుకొని పొడవాటి జుట్టు తో జడ వేసుకొని ఆ జడ కి జడ కుప్పెలు పెట్టుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఇంకో వైపు, ఆ అమ్మాయి ఆ బావకి మరదలు అయితే అంతకన్నా ఆహ్లాదమైన వాతావరణం వారికి ఇంకోటి ఉండదు. అటు వంటి వాతావరణం లో ఇద్దరికీ పోటి జరిగితే ఇద్దరిది గెలుపే. అందుకనేనేమో వాళ్ళ సంగీత సాహిత్య సమరం సగంలో ఆగిపోతుంది ఎందుకంటే అక్కడ గెలుపు ముఖ్యం కాదు.  కీరవాణి/వేటూరి గారు పోటి పడి సంగీత సాహిత్యం సమకూరిస్తే, బాలు, చిత్ర వీనుల విందు చేస్తారు. అందమైన పల్లె వాతావరణం, చెవులకి ఇంపైన చక్కని సంగీతం, చూడ చక్కని జంట, వాళ్ళకి వంకలు పెట్టి నవ్వించే ఒక పిల్లవాడు, అన్నింటికీ మించి సాహిత్యం, ఇంతకంటే విందు భోజనం ఏముంది, కళ్ళు, చెవులకి?

సరే ఇంక అమ్మాయి ట్యూన్ మొదలు పెట్టింది, మనం పాటలోకి వెళ్దాం, మొదటి ట్యూన్ కి వేటూరి గారు రాసిన సాహిత్యం,
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేల లాగేసే సల్లంగ దాని సన్నాయి జెళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ

ఒక్కో వాక్యం అమ్మాయి వాయించిన ఒక్కో ట్యూన్ కి సరిపోయే అందమైన పద సమీకరణ. ఆకలి రాజ్యం లో ఇటువంటి పాట మొత్తం ఉంటుంది, కాని ఈ సినిమా లో పల్లవి కే సరిపెట్టేసారు. అది ఎందుకో మరి. వేటూరి గారి పదం సరళమైన దాని అర్థం లోతైన సముద్రం అంత. ఎందుకంటే ఈ పల్లవి లోని అర్థం అటువంటిది. ఇక్కడ చూస్తె "పూసింది పున్నాగ" "సన్నాయి జడ", జడ కుప్పెలై"  "సందేల లాగేసె" ఈ పదాలు చూస్తె ఎలా అల్లెసారో అది అనితర సాధ్యమేమో అనిపిస్తుంది. పున్నాగ పువ్వు చిన్నగా తెల్లగా ముడుచుకొని ఉంటుంది మొగ్గ గా ఉన్నప్పుడు. అమ్మాయి ని పున్నాగ పువ్వు అంటే స్వచ్చమైన తెల్లదదనంతో ( ముత్యమంత తెల్లదనం) అమ్మాయిని పోల్చిన వేటూరి గారు, ఆ అమ్మాయి నవ్వు ఆ పున్నాగ పువ్వు వికసిస్తే ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది అంటారు. అంటే మొత్తం తెల్లదనం తో నిండి స్వచ్చం గా ఉండటమే కాదు అంత ఆహ్లాదం గా ఉంటుంది. అసలు మనలో చాల మందికి ఆ పున్నాగ పువ్వు ఎలా ఉంటుందో కూడా తెలియదు, అలాంటి పువ్వుని అమ్మాయి నవ్వు తో పోల్చటం కవి ఊహ శక్తికి నిదర్శనం. అయిన కవి కి తెలియని భాష ఉండదు, భావం ఉండదు, కవి ఊహా శక్తికి అంతు  అంటూ ఉంటుందా?. ఇంత పోలికకే మనం ఆశ్చర్యపోతే, ఇంకా ముందు ఉంది.  సన్నాయి జడ అంటే రెండు రకాలు గా చెప్పుకోవచ్చు, ఒకటి దట్టమైన నలుపు, సన్నాయి అంత పొడవు అని కూడా చెప్పొచ్చు, అంతటి జడలో సంపెంగ పెట్టుకుంటే సంధ్య వేల చల్లదనం ఉన్నట్టు హాయిగా ఉండదా? సంపెంగలు సాయంత్రం సువాసనలు వెదజల్లుతాయి, ఆ సువాసన చల్లదనం లాగ నీ నవ్వు అంత హాయిగా ఉండదా??? ఇంక మనం ఇప్పుడు చూడటం లేదు కాని జడ కుప్పెలు పెట్టుకోవటం తెలుగు వాళ్ళకి చాల సరదా. పిల్లలకు ఉన్న లేకపోయినా పెద్దవాళ్ళకు అంతులేని సరదా. జడ కుప్పెలు పెడితే మూడు ఉంటాయి. వేటూరి గారు, ఆ మూడిటిని ముల్లోకాలు గా ఊహించడం ఆ జడకుప్పేలు అమ్మాయి నడుస్తూ ఉంటె అటు ఇటు  లయ బద్దం గా నాట్యం ఆడటం చూస్తె మగ వారి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే వరస కుదిరిన మరదలు అయితే? ఈ పల్లవి ఇంత అత్యద్భుతం గా రాయటం వేటూరి గారికి తప్ప ఇంక ఎవరికీ సాధ్యం కాదేమో. ఇక్కడ నుంచి పాట మలుపు తిరిగి పోటి ఆగిపోయి ఎవరికీ వారు పాడేసుకుంటారు. ఇంకా కొనసాగితే వేటూరి గారు మనల్ని ఎక్కడి తీసుకు వెళ్ళేవారో?  ( సినిమా లో హీరోయిన్ కి మూడు కుప్పెలు పెట్టకుండా వదిలేసారెందుకో దర్శకులు?

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా

కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే
కలలోచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే

అమ్మాయిలకి చిలుక ప్రియమైన స్నేహితురాలు,  ఆ చిలుకపలుకులు చాల బాగుంటాయి, చిలుక పలికే ప్రతి పలుకు బంగారమే. అలాంటి బంగారం లా ఉన్నాయి నీ పలుకులు అంటూ అమ్మాయి చిలుకని పొగడుతూ అతని సాహిత్యం, మాట అంత గొప్పగా ఉన్నాయి అని అబ్బాయిని పోగాడితే, అతను మాత్రం తక్కువ తింటాడ? మల్ల వేటూరి గారు కవితా శక్తి అబ్బుర పరుస్తుంది. అష్ట పదులు అంటే రాధ కృష్ణుని ప్రేమ ని పాడే ఎనిమిది పదాలు ఉన్న పాట. అది ప్రేమ కి చిహ్నం. అలాంటి పదాలు పలుకుతుంది నీ వయ్యారమైన నడక అంటాడు అబ్బాయి. మనిద్దరం కలిసోచ్చేటి కాలం లో జరిగే ఆలోచనలలో కలలు వస్తున్నాయి అంటే నీ కళ్ళలోని మెరుపు ఆ కథ నాకు చెప్తున్నయిలే అంటాడు అబ్బాయి. అంత వివరం గా చెప్తూనే, ఒకరిని ఒకరు పరిచయం, అర్థం చేసుకోవటం, మెచ్చుకోవటం జరుగుతుంది.

అనుకోని రాగమే అనురాగ గీతమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే మది పాడే                                || పూసింది పూసింది ||
అనుకోని రాగం అనేది వేటూరి గారు రేపల్లియ ఎద ఝల్లున పాట లో అనగల రాగం, అనలేని రాగం అన్నట్టు, ఇక్కడ అనుకోని రాగం అంటారు, ఎందుకంటే, కథ లో సన్నివేశం చూస్తే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది అనుకోని రాగమే, అది అనురాగ గీతం గా మారింది, ఇద్దరు వయసు లో ఉన్నారు, ఆ వలపు వరసైన వారికి సహజం. ఆ ప్రేమ గానం వాయులీనం ఐతే వాళ్ళు పాడే పాట ఇద్దరి మనసులు పాడే పాటే....
 పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కల్యాణిగా

అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై పసిమొగ్గ రేకులే పరువాల చూపులై పూసే విరబూసే  || పూసింది పూసింది ||
మరల వాళ్ళిద్దరి మధ్య అంతర్లీనం గా జరిగే సంబాషణ, చాల ఆసక్తి గా మారుతుంది. ఒకే పదాన్ని ఒకే వాఖ్యం లో వేరే అర్థాలు చెప్పటం లో దిట్ట వేటూరి గారు. నా పదం, నీ పదం, ఇక్కడ రెండు పదాలే కానీ ఒకటి కవిత లాంటి మాట, ఇంకోటి అడుగు.  తన పాదాల అడుగులకి అబ్బాయి కవితా పదాలు పారాణి గా పట్టుకుంటే, అమ్మాయి సంగీతం, అబ్బాయి కవిత్వానికి కల్యాణి రాగం లాగ మారి కట్టుకున్నావు గా, ఇలా ఇద్దరు ఒకరిని ఒకరు పొగడుతూ ఉంటె, ఇంక కొనసాగిస్తారు, ఆభేరి రాగం అరువివ్వటం ఎంట అని అనుకులే లోపల ఆ రాగానికే స్వరమిచ్చావు అని ఆశ్చర్య పరుస్తారు వేటూరి గారు, అసలు ఈ పోలికలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. గోదారి గంగమ్మ కి అలలు ఇవ్వటం, ఎంకి పాటలు ఎంత అద్భుతం గా ఉంటాయో, అవే మన చుట్టూ ఉన్న పూల మొక్కలు అటు ఇటు గాలికి ఊగుతూ ఉంటె అవి ఎంకి పాటలు లాగ ఉంటె, ఆ తోట లో పసి మొగ్గలు ఇద్దరి పరువాల చూపులకి పూసి విరబూస్తే ఎలాగా ఉంటాయి? అమ్మాయి నవ్వు లాగ, ఆ అమ్మాయి జడలోని సంపెంగ లాగ, ఆ జడ ఆడే నాట్యం లాగ.. 

ఈ పాట రాసి వేటూరి గారు మనల్ని వేరే ప్రపంచం లోకి తీసుకు వెళ్తారు తన పద మాయ జాలం తో. అసలు ఇటువంటి సాహిత్యం వినగలగడం మన అదృష్టం. ఇంకో అద్రుష్టం ఏమిటి అంటే, తెలుగు భాష కి ఉన్న అందం ఇటువంటి సాహిత్యం తెలియ చెయ్యగలగటం. ఆ తీయని తనాన్ని ఆస్వాదించటం మనకు తెలుగు వాళ్ళకు లభించే ఒక గొప్ప వరం.ఇప్పటి వరకు మంచి సాహిత్యాన్ని మంచి సంగీతం కుదరక పోవటం జరగలేదు, ఈ పాటకి కూడా కీరవాణి అంతే న్యాయం చేకూర్చారు.

కొస మెరుపు:
ఈ పాటతో సినిమా లో సీత కి కాశికి ఒక మంచి బంధంకి పునాది వేసినా ఆ తరువాత వాళ్ళ మధ్య ఏమి సన్నివేశాలు ఉండవు,. చివర్లో మరల సీతకి పెళ్లి ప్రస్తావన వచ్చినా అది అక్కడతో ఆగిపోతుంది. అయిన కథ, కథనం వీళ్ళ మీద కాదు కదా. ఏది ఏమైనా మనకి ఇంకో అధ్బుతమైన పాట వేటూరి గారి ద్వారా లభించింది. ఈ సినిమా మాతృక ఒక మలయాళం సినిమా(సాంత్వనం). కాని తెలుగుతనం ఉట్టి పడే ఈ సినిమాకి మాతృక ఏది అయితే మనకి ఏంటి?

ఈ సినిమా లో నాకు నచ్చిన మిగితా పాటలతో వచ్చే వారం కలుద్దాం---

Thursday, January 19, 2012

Song of the week - Aakasam Digivachi

 Song of the week - ఆకాశం దిగివచ్చి

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              నువ్వు నాకు నచ్చావ్
Producer:                   స్రవంతి  రవి  కిషోర్
Director:                    విజయభాస్కర్ 

Music Director:           కోటి
Singer:                      S.P. బాలసుబ్రహ్మణ్యం
Lyrics:                       సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Year of Release:         2001


 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే ||ఆకాశం దిగివచ్చి||
చరణం 1
చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా ||ఆకాశం దిగివచ్చి||
చరణం 2
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
సినిమా గురించి కొన్ని మాటలు:

ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమాలలో "నువ్వు నాకు నచ్చావ్" ఒకటి. దానికి కారణం సరళమైన కథ, చక్కని ఆరోగ్యకరమైన హాస్యం, "One Line Punches" తో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు ఎన్ని సార్లు చూసిన నవ్వు తెప్పిస్తాయి. ఆ పాత్రలు వేసిన వాళ్ళు అంతటి నవ్వు తెప్పిస్తారు. త్రివిక్రమ్ మాటలు రాయటం లోని నైపుణ్యం, అతని ప్రతిభ ఈ సినిమా లో కనిపిస్తుంది. జంధ్యాల గారి తరువాత ఆయనంత కాకపోయినా కొంతలో కొంత మంచి సంభాషణలు అందించగలిగిన వారిలో ఒకరు. వెంకటేష్ చక్కగా తన పాత్ర లో వొదిగి పోయి నటించిన సినిమాలలో ఇది ఒకటి.

పాట సందర్భం:
హీరో తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. గాలికి తిరిగే తన కొడుకుని ఉద్యోగానికి సహాయం కోసం తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అక్కడ తండ్రి స్నేహితుని ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అవుట్ హౌస్ లో ఉంటున్న అతను ఒకసారి ఏదో పని మీద వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ అందరు చాల సీరియస్ గా హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ బాబాయ్ పెళ్లి పనులు మనం ఏమి చెయ్యక్కర్లేదు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చేస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు, మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెళ్లి చూసి అక్షంతలు వెయ్యటమే అంటాడు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ హీరో ని అడిగితె అతని నుంచి మెచ్చుకోలు ఎదురు చూసిన బాబాయ్ కి చుక్కెదురు అవుతుంది. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ సినిమాలో చూడాల్సిందే. అప్పుడు చివరికి బాబాయ్ హీరో ని పందిరి ఎలా ఉండాలి అని అడిగితె, హీరో పాట మొదలెడతాడు.

తెలుగు వారింట పెళ్లి అంటే అదో చెప్పరాని అనుభూతి. అందులో శాస్త్రోక్తం గా చేసే పెళ్లి చూడాల్సిందే. అది తెలియని వాళ్ళకి చెప్పటం అనేది కత్తి మీద సాము వంటిదే. ఎందుకంటే అది వివరించటానికి పెళ్లి లో జరిగే తంతులు ఒకటా రెండా, కోకొల్లలు. ఆ సరదాలు సంగతులు వేలకు వేలు. కాని ఏ సందర్భం అయిన అవలీలగా పాట రాసెయ్య గలిగిన సీతారామ శాస్త్రి గారికి ఒక లెక్ఖ?, ఈ పాట వింటే పెళ్లి అవని వాళ్ళకి ఆ అనుభవం కావాలని, అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్లి నాటి ముచ్చట్లు గుర్తుకు రాక మానవు.

మంచి సాహిత్యానికి మంచి ట్యూన్ దానంతట అదే వస్తుందేమో, కోటి సమకూర్చిన రాగం, బాలు గారు పాడిన వైనం ఎన్ని సార్లైనా మరల మరల వినాలనిపించేలా చేస్తుంది. అసలు ఈ పాత ప్రతి పెళ్లి లోను వినపడేలాగా చిరాయువు కలిగింది. అదే ఈ పాట ప్రత్యేకత. బాలు గారి గొంతులోంచి ఈ పాట వింటే ఊహ లోకం లో విహరించి పాట అయిపోతే తిరిగి రావటం చాల కష్టం అవుతుంది. అటువంటి అనుభూతి మిగిల్చిన కోటి గారు , బాలు గారు, సీతారామశాస్త్రి గారు అందరికి శత "కోటి" వందనాలు.

పాట ప్రారంభం:

 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

ఆకాశం అంత పందిరి భూదేవి అంత అరుగు అనటం అందరికి తెలుసు, కాని అలా అంటే సీతారామ శాస్త్రి గారెందుకు అవుతారు. మన కోసం ఆకాశంనే తీసుకు వస్తారు. అసలు అంత పెద్ద పందిరి, అంత అరుగు ఎందుకు అంటే, తెలుగు వాళ్ళ పెళ్లి అంటే అందరి సాక్షిగా జరుగుతుంది, మనకి ఎంత మంది తెలిస్తే అంత మందిని పిలిచి చేసే తతంగం. అందులో ప్రతి వాళ్ళకి పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండే లాగ జరిగే ఒకే ఒక రోజు, ఒక జ్ఞాపకం. అందరి ఆశీర్వాదం తీసుకోవటం మన వాళ్ళ ప్రత్యేకత.. వధు వరులని ఆశీర్వదించటానికి వచ్చిన వాళ్ళకి మరి ఆకాశం అంత పందిరి, వెయ్యాల్సిందే. కాని పందిరి ఎలా ఉండాలి అంటే, ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరి అవ్వాలనే సుందరమైన భావన. అలాగే అందరు చెప్పుకునేవి ముచ్చట్లు అన్నారు కాని పెళ్లి ఘనం గా జరిగింది అనలేదు సీతారామశాస్త్రి గారు. మనం పెళ్లి లో కలివిడి గా ఉంటేనే ముచట్లు ఉంటాయి. ఆ విధం గా అందరు చేసి చెప్పుకునేటట్లు ఉండాలనేదే అందరు కోరుకునేది. ఎంత అందమైన వివరణ??

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే
ఈ పదాల అల్లిక, వాటి కలయిక అమోఘం. ఆ పద ప్రవాహం అపురూపం. పెళ్లి అంటే ఏంటి అనేది ఇంతకన్నా అందమైన వర్ణన ఉంటుందా?? రెండు గా ఉన్న మనసులు, చెరో సగమై ఒక మనస్సై కలవమని వదు వరుల మధ్య తెర జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత తీసేస్తారు, అంటే ఆ సమయం ఇద్దరు ఒకరిలో ఒకరు అయ్యే సమయం అదే పెళ్లి సమయం. ఈ పెళ్లి లో సాధారణం గా మనకి తెలియని భంధువులు కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి, ఆ ఆనంద సమయం లో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు అటువంటి సమయం ఎటు వంటిదంటే, అటు ఇటు తిరుగుతూ అందరు హడావిడి గా ఉంటారు. అటువంటి పెళ్లి కి పిలుపులు ఎలా ఉండాలో వివరిస్తారు వినూత్నం గా సీతారామ శాస్త్రి గారు. ఇంటికి మావిడి ఆకు తోరణాలు కట్టామంటే ఆ ఇంట్లో జరిగేది శుభ కార్యమే, మామూలు తోరణాలు కాదు లేత మావిడాకు తోరణాలు. అవి కట్టమంటే అందరికి తెలుస్తుంది, ఆ తెలియటమే శుభలేఖ. మా లేత ఆకులనుంచి వచ్చే సుగంధం గాలి లో ప్రయాణం చేసి అందరిని పలుకరిస్తుంది ఆ దారిన పోయే వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు, ఇంకేముంది శుభ కార్యం వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వెయ్యండి అని.. ఇంత సరళమైన పదాలతో విన్యాసాలు చెయ్యటం ఆయనకే సొంతమైన విద్య.

చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా

అద్బుతమైన పద గారడీ చేస్తారు సిరివెన్నెల. పెళ్లి కూతురు పడే యాతన , పెళ్లి కొడుకు పడే తపన వివరిస్తారు. పెళ్లి అనగానే సిగ్గు పడే అమ్మాయి, ఆ అమ్మాయి కోసం నానా పాట్లు పడే అబ్బాయి, ఏ పెళ్లి తెర చాటున అయిన జరిగే కథ ఇది. ఎన్నో పూజలు చేసుకుంటే కాని ఇలాంటి మంచి అమ్మాయి దొరకదు అని వింటూ ఉంటాం. పూజ చేస్తే వచ్చే వరాలతో వచ్చిన ఈ అమ్మాయి, అత్యంత మనోహరమైన ఇంద్ర ధనుస్సు లాంటి అమ్మాయి వధువు గా మారి పెళ్లి పందిరి లో ఒదిగి తెర చాటున కూర్చుంటే పెళ్లి అత్యంత కమనీయం గా జరుగుతున్న శుభ ముహూర్తాన, ఆ సమయం ఎలాంటిదంటే, తన పక్కనే కులుకలతో కూర్చున్నకాలువకి కానుక ఏమి ఇవ్వటం?  తన మనసు లో ఉవ్వెత్తున ఎగసే అలజడి తప్ప? ఆ పదాలు అలా అల్లుకు పోతుంటే ఒక స్వప్న లోకం లో విహరిస్తున్నట్టు ఉంటుంది.

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
మనం సాధారణం గా పెళ్ళిళ్ళలో ఎవరు పట్టించుకోని వాళ్ళు సనాయి వాళ్ళు వాళ్ళని చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఒక మూలన కూర్చొని ఏదో వాయిస్తారు కానీ వారి సంగతి పట్టించుకునే నాథుడే ఉండడు. వారు ఏమి వాయిస్తున్నారో వినేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరి పనులలో వారు ఉంటారు ఎవరి గొడవలలో వాళ్ళు ఉంటారు  కాని సీతారామశాస్త్రి గారు అస్సలు ఎవర్ని అల వదిలేయరు. అందుకనే అంటారు, సన్నాయి మేళం వారిని వినేవారు ఎవరు ఉన్నారు పెళ్లి లో? అది కూడా ఎందుకంటే వియ్యాల వాళ్ళు ఏదో ఒక కారణంతో కోపంతో విస విస లాడుతూ ఉంటారు. ఇంకో పక్క మగవాళ్ళ లో చాల మంది పేక ఆటతో ఎక్కడో ఒక చోట సర్దుకు పోయి ఉంటారు. ఇంకా మిగిలింది వంటసాల, అక్కడ పెళ్లి భోజనాలతో సువాసనలతో సందడి సందడి గా ఉంటుంది. ఇంకా ఆడవారు డ్రెస్ గురించో, లేక నగల గురించో ఇదిగో చూసారా అంటూ తమ గొప్పతనం అందరికి చూపించటానికి హడావిడి గా తిరుగుతూ జరుగుతున్న సందడి గా ఉన్న పెళ్లి ఆకాశం తన మబ్బులతో దిగి వచ్చి పందిరి వెయ్యదా??

అప్పుడు బాలు గారు "చూడగా" అంటూ మరల పల్లవి లోకి వచ్చి పాట ముగిస్తే అప్పుడే అయిపోయిందా, ఈ పాటకి ఇంకో చరణం ఎందుకు రాయలేదా అనిపించటం ఖాయం విన్న నా లాంటి వాళ్ళకి. ఎందుకు ఇంకో చరణం పెట్టలేదో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి.. సీతారామశాస్త్రి గారైతే ఇంకో నాలుగు చరణాలు రాసెయ్య మన్న రాసేస్తారు, మరి పెళ్లి తతంగం ఇంతేనా ఇంకా చాల ఉంది గా, ఇక శాస్ర్తి గారు ఎంత రాస్తే అంత కోటి గారు రాగం కట్టేస్తారు,  బాలు గారు పాడేస్తారు, మనము వినేస్తాము.............

కొసమెరుపు:
ఈ పాట చిత్రీకరణ చాల వినోదం గా సందడి గా సాగుతుంది. అసలు ఈ పాట ఏ సినిమాలో అయిన సందర్భం సరిపోతుంది, కాని పాట వల్ల సినిమాకి చిరాయువు వచ్చింది, సినిమా చూడని వాళ్ళు పాట వింటే, సినిమా చూస్తె అది ఎలాగో నచ్చుతుంది కాబట్టి. ఈ సినిమా లో పెళ్లి ని ఒక వివిధమైన వివరణ ఇస్తూ కథ రాసారు సినిమా తీసారు, వాళ్ళు ఏది చేసిన మనకి ఒక అద్బుతమైన పాట ఇచ్చారు. అంటే చాలు.