Movie Name: April 1 Vidudala
Producer: K Sarada Devi
Director: Vamsy
Music Director: Ilayaraaja
Singer(s): Mano, Chitra
Lyrics: Sirivennela Seetaramasastry
Year of Release: 1991
చుక్కలు తెమ్మన్నా తెంచుకురాన
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా (2)
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైన ||
చుక్కలు తెమ్మన్నా||
షోలే ఉందా? -
ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా? - తెలుగులో తీసారే బాలా !
ఖైది ఉందా? - ఇదిగో ఇందా
ఖైది కన్నయ్య కాదే ? - వీడికి అన్నయ్య వాడే !
జగదేక వీరుడి కధ - ఇది పాత పిక్చర్ కదా?
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
|| చుక్కలు తెమ్మన్నా||
ఒకట రెండా? పదుల వందా ?
బాకీ ఎగవేయ్యకుండా బదులే తిర్చేది ఉందా ?
మెదడే ఉందా మతి పోయిందా?
చాల్లే నీ కాకి గోల వేళ పాలంటూ లేదా?
ఏమైంది భాగ్యం కథ? - కదిలిందా లేదా కథ?
వ్రతమేదో చేస్తుందంట అందాక ఆగాలాట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి || చుక్కలు తెమ్మన్నా||
సంగీతంకి ఉన్న శక్తి అమోఘం. ఒక్కోసారి గుండెల్ని పిండి మనసుని కరిగిస్తే, ఇంకోసారి మనసుకి సాంత్వనం చేకూరుస్తుంది. ఒక్కోసారి ఆహ్లాదం కలుగ చేస్తే ఒక్కోసారి ఉర్రూతలూగిన్స్తుంది. ఒక సారి ఉత్తేజ పరిస్తే ఇంకో సారి మనిషిని కదిలిస్తుంది. అటువంటి సంగీతానికి ఎటువంటి గొప్ప అమోఘమైన పరికరం అక్కర్లేదు, ఎటువంటి పరికరమైన లయ, తాళం, స్వరం చేరితే అదే సంగీతం అవుతుంది, అన్ని చేస్తుంది. అదే సరి అయిన పండితుని చేతిలో పది, దాని మాట అనే అలంకారం చేరితే, చిన్న మాట అయిన సంగీతం అవుతుంది ఆహ్లాద పరుస్తుంది. వీటన్నిటి కంటే మాధుర్యం చాల శక్తివంతమైనది. ఈ పాట మాధుర్యానికి పెద్ద పీట వేసిన పాట. లౌక్యం, హాస్యం, సందేశం, చాతుర్యం అన్ని సమ పాళల్లో కుదిరి మనకి మంచి అనుభూతిని మిగుల్స్తుంది.
ఇంక వంశి గారి గురించి, ఆయన భావుకత గురించి చెప్పే కన్నా ఆయన సినిమాలు చూడటం ఉత్తమం.అయన ప్రతి సినిమా ఒక అనుభూతి. ఆయన చెప్పేది మనకి అందితేనే కలిగితేనే నచ్చుతాయి, లేకపోతె ఏదో అర్థం కాని ఆహార్యం గా మిగిలిపోతుంది. ఈ పాటలో దివాకరం సైకిల్ చక్రాలకి వీడియో కాసేట్ట్ తగిలించటం, అలాగే సైకిల్ వెనకాల ఒక పెద్ద దొంతర పేర్చటం, ఆ సైకిల్ తొక్కుతూ దివాకరం పాట దానికి మధురమైన సంగీతం తోడు అయ్యి ఒక విచిత్రమైన అనుభూతి కలిగిస్తాయి.
ఈ పాట తమిళ్ పాట చిత్తిర చెవ్వానం సిరిక్క కండేన్ అనే పాట ఆధారం గా చేసిన పాట. 1978 లో విడుదలైన కాట్రినిలే వరుం గీతం అనే సినిమా కి సంగీతం సమకూర్చినది కూడా ఇలయరాజానే. వంశి-ఇళయరాజాకి ఉన్న అనుబందం, ఈ తెలుగు సినిమా ప్రపంచం లో ఏ దర్శకునికి సంగీత దర్శకునికి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాట స్వర పరచిన ఇళయరాజా చాలానే మారుపులు చేసి ఏ పాటకి ఆ పాటే అన్నట్టు స్వరపరచారు. పాట లోకి వెళ్తే మనకి ఈ విషయాలు అర్థం అవుతాయి. వంశికి ఇళయరాజా తో ఉన్న అనుభందం తో అయన సమకూర్చిన అనేక పాటలు, BGM ఆయన దగ్గరనుంచి సంపాదించి ఒక లైబ్రరీ గా చేసుకున్నారు. వంశి సినిమాలోని పాటలు ఎక్కువగా ఇళయరాజా ఏదో ఒక సినిమా కి చేసిన BGM కాని పాత పాటలు తనకి అనుగుణం గా మార్చుకున్నవే. ఆయనని కొత్త పాటలు అడిగే కంటే ఇలాగ తనకి నచ్చినవి చేసుకోవటం ఇష్టమేమో. ఈ పాట సినిమాలో వాడుకున్న తీరు, దానికి సిరివెన్నెల రాసిన మాటలు మనకి తమిళ చాయలు ఎక్కడా కనపడకుండా చేస్తాయి. అందుకే ఈ పాట ఒక మధురమైన గీతం గా మిగిలిపోతుంది.
ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది వంశి చేసిన ఒక అద్బుతమైన ప్రయోగం. దివాకరం పాత్ర మనల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది. ఆటను ఎంత అల్లరి చిల్లరి గా తిరిగినా, ఎంత అబద్దాలు చెప్పిన ఒకరిని నష్ట పరిచేవి కాని, హాని చేసేవి కాని కాదు. కాని అతను అనుకోకుండా కెమెరా మాన్ గా వెళ్ళిన ఒక పెళ్ళిలో భువనేశ్వరిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె ఉన్న ఊరికి బదిలీ అయ్యి వస్తుంది అని తెల్సుకొని ఆమె వివరాలు ఆమె మేన మామ ద్వారా తెల్సుకొని, ఆమెని పొందటానికి అన్ని సమకూర్చుకుంటాడు. ఈలోపల ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూ ఉంటాడు. భువనేశ్వరి తరపున ఆమె మేనమామ, దివాకరం రాసిన ఆ ఉత్తరాలకి జవాబులు ఇస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని దివాకరం భువనేశ్వరి రాజముండ్రి రాగానే తన ప్రేమ గురించి చెప్తాడు, అప్పటికే అతని గురించి తెల్సిన భువనేశ్వరి, అతనిని వదిలించటానికి ఏప్రిల్ 1 వరకు అబద్దం చెప్పకుండా ఉంటె అతనికి పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అప్పటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగి అబద్దాలు చెప్తూ ఉన్న అతనికి తన ప్రేమ మీద ఉన్న శ్రద్ద తో అన్ని నిజాలే చెప్పటం ఆరంభిస్తాడు. ఆ నిజాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయో, అవి అతనికి ఎలా హాని కలిగించాయో, చివరికి భువనేశ్వరి ప్రేమని పొందుతాడో లేదో సినిమా లో చూడవలసినదే. సినిమా ఎన్ని మలుపులు తిరుగుతుందో, సినిమాలో చూడాల్సిందే.
చుక్కలు తెమ్మన్నా తెంచుకురాన
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా (2)
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైన ||
చుక్కలు తెమ్మన్నా||
సిరివెన్నెల గారికి చుక్కలు తేవడం, ఆకాశం దిగి రావటం ( దించటం ) అంటే అత్యంత ఇష్టం అనుకుంట. ఈ ప్రయోగం కొన్ని పాటలలో చేసారు. నాకు గుర్తున్న పాట, నువ్వే నువ్వే లో " నా మనసుకేమయింది" పాట లో చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకు ఉన్న ప్రేమ" అని అంటారు, అలాగే, నువ్వు నాకు నచ్చావ్ లో "ఒక్క సారి చెప్పలేవా" పాట లో "చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా?"
దివాకరం ఒక పెళ్ళికి వెళ్లి అక్కడ చురుకు గా తిరిగే భువనేశ్వరి ప్రేమలో పడతాడు. ఆమెని దక్కించు కోవాలంటే తను జీవితం లో స్థిరపడి, అన్ని సమకూర్చుకుంటే దక్కుతుంది అని ఆమె మేనమామ ద్వారా తెల్సుకొని అవి సంపాదించాలని నిశ్చయించుకొని తను పెరిగే శుభ గారి దగ్గర, ఒక గదిని మార్చి వీడియో షాప్ గా మారుస్తాడు. దానికి ఊరంతా అప్పులు చేసి ఆ అప్పులిచ్చిన వారినందరినీ పిల్చి వినూత్నం గా షాప్ ప్రారంబిస్తాడు. రిబ్బన్ వాడకుండా ఒక పెద్ద చెక్క కట్ చెయ్యటం, వంశి గారి ఈ హాస్యాలోచన నిజం గా చూసి ఆనందించ వలసినదేఆ ప్రారంభోత్సవ సందర్భం గా మొదలయిన పాత ఇది. అందరిని పిలిచి ఈ పాట పాడుతూ ఉంటె, ఎవరికీ అర్థం కాక అలా వింతగా చూస్తూ ఉంటారు. ఇళయరాజా గారి గొప్పతనం అనేది ఏ పాట ఆరంభం ఎలా చేస్తారో వింటే తెలుస్తుంది. ఒక వైపు రంపపు శబ్దం, ఇంకో వైపు గడియారం గడుస్తున్న అనుభూతి, ఆ తరువాత నెమ్మది గా పాత మూడ్ సెట్ చేసి గాయకులని పాడించటం. ఇది అనితర సాధ్యమైన కళ. చుక్కలు తెమ్మన్న అంటున్నప్పుడు కోరస్ ఆమె కోసం పాడుతున్నట్టు, ఆమె వింటున్నట్టు అనిపిస్తుంది.
షోలే ఉందా? - ఇదిగో ఇందా
చాల్లే ఇది జ్వాల కాదా? - తెలుగులో తీసారే బాలా !
ఖైది ఉందా? - ఇదిగో ఇందా
ఖైది కన్నయ్య కాదే ? - వీడికి అన్నయ్య వాడే !
జగదేక వీరుడి కధ - ఇది పాత పిక్చర్ కదా?
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
|| చుక్కలు తెమ్మన్నా||
సరే షాప్ పెట్టేశాం ఇంక బిజినెస్ చెయ్యాలంటే వచ్చిన వినియోగదారులని మెప్పించి ఒప్పించాలి. సిరివెన్నెల గారి మాటల చాతుర్యం ఎంత సరళమైన మాటలైనా ఏదో ఒక సందేశం లేకుండా పాట రాయటం చూడం. వీడియో casette business చెయ్యాలంటే తన దగ్గర ఉన్న casettes అందరికి ఇవ్వాలి కాని వాళ్ళు అడిగినవి అన్ని ఇవ్వటం ప్రతి సారి కుదరదు కదా. రాళ్ళపల్లి పక్కనుంచి నిజం చెప్పాలని అనుకున్న, ఏదో ఒక మాయ చేసి వచ్చిన వాళ్లకి ఏదో ఒక కాసేట్టే అంట గట్టేయ్యటం పాత్ర లక్షణం, దానికి తగ్గట్టు గానే పాత. ఇది వంశి, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు జత కూరితే మిగిలేది విందు భోజనం. మనకి ఏదో ఒకటి ఇచ్చెయ్యాలి అన్న తాపత్రయం వాళ్ళకి ఉండదు. అడిగిన దానికన్నాఎక్కువ ఇవ్వటం వాళ్ళకి అలవాటు. షోలే ని తెలుగు లో జ్వాల గా తీస్తే ఆ సినెమా, ఖైది లేకపోతె ఖైది కన్నయ్య, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇలాగ పేర్లు చాతుర్యమే కాని, చివరిగా ఏ మాయ చేసిన అందరిని ఒప్పించి, తను డబ్బులు సంపాదించి భువనేశ్వరిని ఒప్పించాలి అన్న పాత్ర స్వభావం కనిపిస్తుంది పాటలో. దివాకరం ఇలాగ అందరిని మాయ చేసి ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చు కోవటం చూస్తాం.
ఒకట రెండా? పదుల వందా ?
బాకీ ఎగవేయ్యకుండా బదులే తిర్చేది ఉందా ?
మెదడే ఉందా మతి పోయిందా?
చాల్లే నీ కాకి గోల వేళ పాలంటూ లేదా?
ఏమైంది భాగ్యం కథ? - కదిలిందా లేదా కథ?
వ్రతమేదో చేస్తుందంట అందాక ఆగాలాట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి || చుక్కలు తెమ్మన్నా||
ఇంక మిగితా పాత కూడా కథలోని విశేషాలే. చీటీ పాట పాడి డబ్బులు తీసుకొని అవి ఎగ్గొడితే అందరు దివాకరాన్ని అడగటం, వాళ్ళని తన స్వభావనుసారం పక్కకి నేట్టేయ్యడం, చిన్న రావు ( బట్టల సత్యం), భాగ్యం మధ్య జరిగే కథలో చిన్నారావు తో దివాకరం చేసిన మతలబులు, ఇలాగ అన్నిలౌక్యం గా చేస్తున్న, ఇవన్ని చివరికి తన సుఖం కోసమే అని భావించే దివాకరం మనస్తత్వానికి నిదర్శనం. అలా పాడుతూ ఊహల్లోకి వెళ్ళిపోయిన దివాకరానికి ఫోన్ రావటం తో పాట ముగుస్తుంది.
కొసమెరుపు: ఈ సినిమా కోలపల్లి ఈశ్వర్, MI కిషన్ రాసి చతుర మాస పత్రిక లో ప్రచురింప బడిన "హరిశ్చంద్రుడు అబద్దం ఆడితే" అనే నవల ఆధారం గా తీసిన సినిమా. కాని ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే, వంశి గారి చిత్రానువాదం, నటి నటుల ప్రతిభ, LB శ్రీరామ్ గారి సంభాషణలు, ఇళయరాజా గారి మధుర సంగీతం, వీటన్నిటి కంటే మధ్య తరగతి కుటుంబాలను ప్రతిబింబించే సన్నివేశాలు, ప్రదేశాలు అన్ని సరిగ్గా సమకూరి ఈ సినిమా జనరంజకం అయ్యింది. ఈ సినిమా మొత్తం రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో 2 వారలలో ఒకటే లొకేషన్, సింగిల్ షాట్ లో తీసిన సినిమా.