Thursday, January 19, 2012

Song of the week - Aakasam Digivachi

 Song of the week - ఆకాశం దిగివచ్చి

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:              నువ్వు నాకు నచ్చావ్
Producer:                   స్రవంతి  రవి  కిషోర్
Director:                    విజయభాస్కర్ 

Music Director:           కోటి
Singer:                      S.P. బాలసుబ్రహ్మణ్యం
Lyrics:                       సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Year of Release:         2001


 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే ||ఆకాశం దిగివచ్చి||
చరణం 1
చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా ||ఆకాశం దిగివచ్చి||
చరణం 2
విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
సినిమా గురించి కొన్ని మాటలు:

ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమాలలో "నువ్వు నాకు నచ్చావ్" ఒకటి. దానికి కారణం సరళమైన కథ, చక్కని ఆరోగ్యకరమైన హాస్యం, "One Line Punches" తో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు ఎన్ని సార్లు చూసిన నవ్వు తెప్పిస్తాయి. ఆ పాత్రలు వేసిన వాళ్ళు అంతటి నవ్వు తెప్పిస్తారు. త్రివిక్రమ్ మాటలు రాయటం లోని నైపుణ్యం, అతని ప్రతిభ ఈ సినిమా లో కనిపిస్తుంది. జంధ్యాల గారి తరువాత ఆయనంత కాకపోయినా కొంతలో కొంత మంచి సంభాషణలు అందించగలిగిన వారిలో ఒకరు. వెంకటేష్ చక్కగా తన పాత్ర లో వొదిగి పోయి నటించిన సినిమాలలో ఇది ఒకటి.

పాట సందర్భం:
హీరో తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. గాలికి తిరిగే తన కొడుకుని ఉద్యోగానికి సహాయం కోసం తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అక్కడ తండ్రి స్నేహితుని ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అవుట్ హౌస్ లో ఉంటున్న అతను ఒకసారి ఏదో పని మీద వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ అందరు చాల సీరియస్ గా హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ బాబాయ్ పెళ్లి పనులు మనం ఏమి చెయ్యక్కర్లేదు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చేస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు, మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పెళ్లి చూసి అక్షంతలు వెయ్యటమే అంటాడు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ హీరో ని అడిగితె అతని నుంచి మెచ్చుకోలు ఎదురు చూసిన బాబాయ్ కి చుక్కెదురు అవుతుంది. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ సినిమాలో చూడాల్సిందే. అప్పుడు చివరికి బాబాయ్ హీరో ని పందిరి ఎలా ఉండాలి అని అడిగితె, హీరో పాట మొదలెడతాడు.

తెలుగు వారింట పెళ్లి అంటే అదో చెప్పరాని అనుభూతి. అందులో శాస్త్రోక్తం గా చేసే పెళ్లి చూడాల్సిందే. అది తెలియని వాళ్ళకి చెప్పటం అనేది కత్తి మీద సాము వంటిదే. ఎందుకంటే అది వివరించటానికి పెళ్లి లో జరిగే తంతులు ఒకటా రెండా, కోకొల్లలు. ఆ సరదాలు సంగతులు వేలకు వేలు. కాని ఏ సందర్భం అయిన అవలీలగా పాట రాసెయ్య గలిగిన సీతారామ శాస్త్రి గారికి ఒక లెక్ఖ?, ఈ పాట వింటే పెళ్లి అవని వాళ్ళకి ఆ అనుభవం కావాలని, అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్లి నాటి ముచ్చట్లు గుర్తుకు రాక మానవు.

మంచి సాహిత్యానికి మంచి ట్యూన్ దానంతట అదే వస్తుందేమో, కోటి సమకూర్చిన రాగం, బాలు గారు పాడిన వైనం ఎన్ని సార్లైనా మరల మరల వినాలనిపించేలా చేస్తుంది. అసలు ఈ పాత ప్రతి పెళ్లి లోను వినపడేలాగా చిరాయువు కలిగింది. అదే ఈ పాట ప్రత్యేకత. బాలు గారి గొంతులోంచి ఈ పాట వింటే ఊహ లోకం లో విహరించి పాట అయిపోతే తిరిగి రావటం చాల కష్టం అవుతుంది. అటువంటి అనుభూతి మిగిల్చిన కోటి గారు , బాలు గారు, సీతారామశాస్త్రి గారు అందరికి శత "కోటి" వందనాలు.

పాట ప్రారంభం:

 ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

ఆకాశం అంత పందిరి భూదేవి అంత అరుగు అనటం అందరికి తెలుసు, కాని అలా అంటే సీతారామ శాస్త్రి గారెందుకు అవుతారు. మన కోసం ఆకాశంనే తీసుకు వస్తారు. అసలు అంత పెద్ద పందిరి, అంత అరుగు ఎందుకు అంటే, తెలుగు వాళ్ళ పెళ్లి అంటే అందరి సాక్షిగా జరుగుతుంది, మనకి ఎంత మంది తెలిస్తే అంత మందిని పిలిచి చేసే తతంగం. అందులో ప్రతి వాళ్ళకి పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండే లాగ జరిగే ఒకే ఒక రోజు, ఒక జ్ఞాపకం. అందరి ఆశీర్వాదం తీసుకోవటం మన వాళ్ళ ప్రత్యేకత.. వధు వరులని ఆశీర్వదించటానికి వచ్చిన వాళ్ళకి మరి ఆకాశం అంత పందిరి, వెయ్యాల్సిందే. కాని పందిరి ఎలా ఉండాలి అంటే, ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరి అవ్వాలనే సుందరమైన భావన. అలాగే అందరు చెప్పుకునేవి ముచ్చట్లు అన్నారు కాని పెళ్లి ఘనం గా జరిగింది అనలేదు సీతారామశాస్త్రి గారు. మనం పెళ్లి లో కలివిడి గా ఉంటేనే ముచట్లు ఉంటాయి. ఆ విధం గా అందరు చేసి చెప్పుకునేటట్లు ఉండాలనేదే అందరు కోరుకునేది. ఎంత అందమైన వివరణ??

చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇల్ల లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్లి శుభలేఖలే 
అక్షింతలేసి ఆశీర్వదించమను  పిలుపులైనవి గాలులే
ఈ పదాల అల్లిక, వాటి కలయిక అమోఘం. ఆ పద ప్రవాహం అపురూపం. పెళ్లి అంటే ఏంటి అనేది ఇంతకన్నా అందమైన వర్ణన ఉంటుందా?? రెండు గా ఉన్న మనసులు, చెరో సగమై ఒక మనస్సై కలవమని వదు వరుల మధ్య తెర జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత తీసేస్తారు, అంటే ఆ సమయం ఇద్దరు ఒకరిలో ఒకరు అయ్యే సమయం అదే పెళ్లి సమయం. ఈ పెళ్లి లో సాధారణం గా మనకి తెలియని భంధువులు కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి, ఆ ఆనంద సమయం లో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు అటువంటి సమయం ఎటు వంటిదంటే, అటు ఇటు తిరుగుతూ అందరు హడావిడి గా ఉంటారు. అటువంటి పెళ్లి కి పిలుపులు ఎలా ఉండాలో వివరిస్తారు వినూత్నం గా సీతారామ శాస్త్రి గారు. ఇంటికి మావిడి ఆకు తోరణాలు కట్టామంటే ఆ ఇంట్లో జరిగేది శుభ కార్యమే, మామూలు తోరణాలు కాదు లేత మావిడాకు తోరణాలు. అవి కట్టమంటే అందరికి తెలుస్తుంది, ఆ తెలియటమే శుభలేఖ. మా లేత ఆకులనుంచి వచ్చే సుగంధం గాలి లో ప్రయాణం చేసి అందరిని పలుకరిస్తుంది ఆ దారిన పోయే వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు, ఇంకేముంది శుభ కార్యం వచ్చి ఆశీర్వదించి అక్షింతలు వెయ్యండి అని.. ఇంత సరళమైన పదాలతో విన్యాసాలు చెయ్యటం ఆయనకే సొంతమైన విద్య.

చంపలో విరబూసే అమ్మాయి  సిగ్గు దొంతరలు 
ఆ సొంపులకు  ఎరవేసే అబ్బాయి  చూపు తొందరలు 
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో ..
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో 
తన  సరసను  విరిసిన  సిరిసిరి  సొగసుల  కులుకల  కలువకు  కానుకగా 
ఎద  సరసున  ఎగసిన  అలజడి  అలలే  తాకగా

అద్బుతమైన పద గారడీ చేస్తారు సిరివెన్నెల. పెళ్లి కూతురు పడే యాతన , పెళ్లి కొడుకు పడే తపన వివరిస్తారు. పెళ్లి అనగానే సిగ్గు పడే అమ్మాయి, ఆ అమ్మాయి కోసం నానా పాట్లు పడే అబ్బాయి, ఏ పెళ్లి తెర చాటున అయిన జరిగే కథ ఇది. ఎన్నో పూజలు చేసుకుంటే కాని ఇలాంటి మంచి అమ్మాయి దొరకదు అని వింటూ ఉంటాం. పూజ చేస్తే వచ్చే వరాలతో వచ్చిన ఈ అమ్మాయి, అత్యంత మనోహరమైన ఇంద్ర ధనుస్సు లాంటి అమ్మాయి వధువు గా మారి పెళ్లి పందిరి లో ఒదిగి తెర చాటున కూర్చుంటే పెళ్లి అత్యంత కమనీయం గా జరుగుతున్న శుభ ముహూర్తాన, ఆ సమయం ఎలాంటిదంటే, తన పక్కనే కులుకలతో కూర్చున్నకాలువకి కానుక ఏమి ఇవ్వటం?  తన మనసు లో ఉవ్వెత్తున ఎగసే అలజడి తప్ప? ఆ పదాలు అలా అల్లుకు పోతుంటే ఒక స్వప్న లోకం లో విహరిస్తున్నట్టు ఉంటుంది.

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు 
సన్న సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు 
సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులూ....
పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ 
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ||ఆకాశం దిగివచ్చి||
మనం సాధారణం గా పెళ్ళిళ్ళలో ఎవరు పట్టించుకోని వాళ్ళు సనాయి వాళ్ళు వాళ్ళని చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఒక మూలన కూర్చొని ఏదో వాయిస్తారు కానీ వారి సంగతి పట్టించుకునే నాథుడే ఉండడు. వారు ఏమి వాయిస్తున్నారో వినేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరి పనులలో వారు ఉంటారు ఎవరి గొడవలలో వాళ్ళు ఉంటారు  కాని సీతారామశాస్త్రి గారు అస్సలు ఎవర్ని అల వదిలేయరు. అందుకనే అంటారు, సన్నాయి మేళం వారిని వినేవారు ఎవరు ఉన్నారు పెళ్లి లో? అది కూడా ఎందుకంటే వియ్యాల వాళ్ళు ఏదో ఒక కారణంతో కోపంతో విస విస లాడుతూ ఉంటారు. ఇంకో పక్క మగవాళ్ళ లో చాల మంది పేక ఆటతో ఎక్కడో ఒక చోట సర్దుకు పోయి ఉంటారు. ఇంకా మిగిలింది వంటసాల, అక్కడ పెళ్లి భోజనాలతో సువాసనలతో సందడి సందడి గా ఉంటుంది. ఇంకా ఆడవారు డ్రెస్ గురించో, లేక నగల గురించో ఇదిగో చూసారా అంటూ తమ గొప్పతనం అందరికి చూపించటానికి హడావిడి గా తిరుగుతూ జరుగుతున్న సందడి గా ఉన్న పెళ్లి ఆకాశం తన మబ్బులతో దిగి వచ్చి పందిరి వెయ్యదా??

అప్పుడు బాలు గారు "చూడగా" అంటూ మరల పల్లవి లోకి వచ్చి పాట ముగిస్తే అప్పుడే అయిపోయిందా, ఈ పాటకి ఇంకో చరణం ఎందుకు రాయలేదా అనిపించటం ఖాయం విన్న నా లాంటి వాళ్ళకి. ఎందుకు ఇంకో చరణం పెట్టలేదో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి.. సీతారామశాస్త్రి గారైతే ఇంకో నాలుగు చరణాలు రాసెయ్య మన్న రాసేస్తారు, మరి పెళ్లి తతంగం ఇంతేనా ఇంకా చాల ఉంది గా, ఇక శాస్ర్తి గారు ఎంత రాస్తే అంత కోటి గారు రాగం కట్టేస్తారు,  బాలు గారు పాడేస్తారు, మనము వినేస్తాము.............

కొసమెరుపు:
ఈ పాట చిత్రీకరణ చాల వినోదం గా సందడి గా సాగుతుంది. అసలు ఈ పాట ఏ సినిమాలో అయిన సందర్భం సరిపోతుంది, కాని పాట వల్ల సినిమాకి చిరాయువు వచ్చింది, సినిమా చూడని వాళ్ళు పాట వింటే, సినిమా చూస్తె అది ఎలాగో నచ్చుతుంది కాబట్టి. ఈ సినిమా లో పెళ్లి ని ఒక వివిధమైన వివరణ ఇస్తూ కథ రాసారు సినిమా తీసారు, వాళ్ళు ఏది చేసిన మనకి ఒక అద్బుతమైన పాట ఇచ్చారు. అంటే చాలు.

No comments:

Post a Comment