Saturday, March 10, 2012

Song of the Week - Koyila paata bagundaa

Movie:               Ninne Premistaa
Director:            RR Shinde
Producer:            RB Chowdary
Music:               SA Raj Kumar
Singer(s):           K.S Chitra, SP Balasubrahmanyam
Lyrics:              Sirivennela Seetarama Sastry
Year of Release:     2000

కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  ( 2 )
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్టుగా .. 
ఇప్పుడెందుకో అర్థ రాత్రి వేళలో ....గుర్తు కోస్తోంది కొత్త కోతగా 

నిదురించిన ఎద నదిలో అలలెగసిన అలజడిగా 
తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాది ఇదా 
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా 
కలలు కనే కన్నులలో కునుకెరగని కలవరమ
రేయిలోని పలవరమ హాయిలోని పరవశమ
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల || 

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది 
అల్లి బిల్లి మేఘమాల బాగుంది 
చిలకమ్మాబాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది

పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది

సాధారణంగా ఒక భాష లో తీసిన సినిమా వేరే భాష లో మరల తీస్తే ఆ సినిమా విజయవంతం కావొచ్చు కాకపోవోచ్చు కాని ఒరిజినల్ సినిమా అంత విజయవంతం అయిన సందర్భాలు తక్కువ. కాని ఈ సినిమా విజయ వంతం కావటానికి కారణం సినిమా లోని నటీ నటులే. నాగార్జున, రాజేంద్రప్రసాద్, సౌందర్య, శ్రీకాంత్ మొదలగు వారు అద్బుతం గా నటించి ఈ చిత్ర విజయానికి కారకులయ్యారు. RR షిండే అంతకు ముందు సహాయ దర్శకుని గా పనిచేసి ఈ సినిమాతో దర్శకుడు అయ్యాడు. కథనం, దర్సకత్వం లో వైవిధ్యం చూపిన ఆ తరువాత మరల సినిమాలు చేసే అవకాశం దక్కలేదు ఎందుకనో మరి. చిత్ర ఈ పాట కి ప్రాణం, ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే.

ఈ సినిమా కథకి వస్తే కళ్యాణ్ అనే ఒక బ్యాంకు ఆఫీసర్ తన అసిస్టంట్ (రాజేంద్ర ప్రసాద్) తో పట్టిసీమకి వస్తాడు ఉద్యోగ రీత్యా. అక్కడ గాలిపటంతో ఒక అద్బుతమైన సౌందర్యమైన  అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి (మేఘమాల )  కళ్యాణ్ ని అనుసరిస్తూ ఉంటుంది. అతని కళ్ళనే చూస్తూ ఉంటుంది. మేఘ మాల కళ్యాణ్ కోసం అన్ని పనులు చేస్తూ అన్నింటిలో సహాయం గా ఉంటుంది. ఆమె చేసే ఏర్పాట్లు అన్ని కళ్ళ కోసం అంటూ ఉంటుంది.  కళ్యాణ్ కి ఇవి ఏమి అర్థం కాకపోయినా మేఘమాల కోసం మనసు పారేసుకుంటాడు. తన తల్లి తండ్రులని సంబంధం కోసం పిలిచి మేఘమాల తల్లి తండ్రులతో సంప్రదిస్తాడు. అప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఊహించని విధం గా ఆ పెళ్లి తిరస్కరిస్తుంది మేఘమాల. అంత ఇష్టం గా అన్ని చేస్తూ ఇలా పెళ్లి తిరస్కరించేసరికి నిర్ఘాంత పోయి కారణం అడుగుతాడు కళ్యాణ్. మేఘమాల ఏమి సమాధానం చెప్తుంది, ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది తెర మీద చూడవలసిందే.

ఇంక పాట సందర్భానికి వస్తే, అప్పుడే ఊర్లోకి అడుగు పెట్టిన కళ్యాణ్ కి, రాజేంద్ర ప్రసాద్ కి మేఘమాల ఇంటి ఎదురుగా వసతి ఏర్పాటు చేస్తారు. బ్యాంకు నౌఖరు ఆ పాడు పడిన ఇంట్లో ఒక దయ్యం తిరిగేది అని రాజేంద్ర ప్రసాద్ ని భయపెడతాడు. వాళ్ళు రాత్రి నిద్ర పోయే సమయానికి సరిగ్గా అదే సమయం లో కరెంటు పోతుంది. రేడియో లో పాటలు విన్న వాళ్ళకి ఒక తీయటి గొంతుతో పాట వినపడుతుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతూ కళ్యాణ్ తో పాటు అందరు లాంతరు పట్టుకొని తిరుగుతూ ఉంటే మేఘ మాల వాళ్ళ ఇంటి మేడ మీద పాడుతూ ఉంటుంది. ఆ సమయం రాత్రి అందులో పౌర్ణమి, నిండు చంద్రుడు, ఇంటి మేడ మీద అన్ని మొక్కలు చుట్టు పక్కల అన్ని చెట్లు, ఒక తెలుగు ఇల్లు ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది వాతావరణం. ఒక పక్క పంజరం లో చిలుకలు, అక్కడక్కడ చిలుకలు, పావురాళ్ళు, కుందేళ్ళు, మేడ మధ్యలో తులసి కోట, పదహారణాల అచ్చమైన పల్లెటూరి తెలుగు ఆడపడుచు, ఆ గొంతులోని మాధుర్యం, తెలుగు పాటకి ఇంతకన్నా ఏమి కావాలి? సరే మేఘమాల పాట పాడుతోంది కాని కళ్యాణ్ వెతుక్కుంటున్నాడు మనమూ వెళ్దాము.


కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  ( 2 )
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

తెలుగు నాట ఇంట్లో కరెంటు పోవటం చాల సహజం, దానికి ఒక సందర్భం అంటూ ఉండదు. ఒకప్పుడు ఇళ్ళలో కరెంటు పొతే పిల్లలు అందరు ఆడుకోవటానికి ఒక చోట ఏకమైతే  పెద్ద వాళ్ళు అందరు కబుర్లతో కాలక్షేపం చేసే వారు. ఇప్పుడు ఇలాగ జరగటం చాల చోట్ల మనం చూడం. కాని ఇక్కడ మేఘ మాల ఊహల్లోకి వెళ్లి పాడుకోవటం దర్శకుని కథన ప్రతిభ. ఆ పాటకి సరి అయిన వాతావరణ  రంగులు అద్ది అన్ని హంగులు అమర్చటం సుందరం. ఈ పల్లవి ఆమె పాడుతున్న వాతావరణాన్ని వివరిస్తే, ఇంకో రకం గా తను అమితం గా ప్రేమించిన వ్యక్తి కళ్ళు వచ్చి కుశలం అడుగుతున్నట్టు ఊహించుకోవచ్చు. తను బాగున్నాను అని తననే ప్రశ్నించు కోవటం లాంటిది. కానీ చుట్టు పక్కల ఉన్న చిలుకల్ని, పౌర్ణమి నాటి తోటలోని పైర గాలిని అడుగుతుంది మేఘమాల. అది ఏమని, కమ్మగా పాడే కోయిల పాట, గాలికి అటు ఇటు ఒక లయలాగా ఊగే చెట్లు కొమ్మల శబ్దం, తన ఇంటి చుట్టు పౌర్ణమి కాంతులతో వెలిగే తన తోట, వెన్నెల కాంతి వెదజల్లుతూ చుట్టు ఉన్న కాంతి. ఇవన్ని బాగుండేవే. ఇంకా ఏమని అడుగుతోంది, మల్లె లాంటి స్వచ్చమైన తెల్లదనం తో అందం తో మెరిసిపోతున్న అమ్మాయి, అదే ఈ అల్లి బిల్లి మేఘమాల బాగుందా అని చిలకమ్మని, చిరు గాలిని. ఆ వాతావరణం ఎంత అందం గా ఉందొ, ఆహ్లాదం గా ఉందొ, తన మనసు కూడా అలాగే ఉంది అని అనుకుంటోంది మేఘమాల... దర్శకుడు చిరుగాలి అన్నప్పుడు గాలిని, చిలుకమ్మ అన్నప్పుడు చిలుకని ఈ పాటంతా చూపించటం బాగుంటుంది.

అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్టుగా .. 
ఇప్పుడెందుకో అర్థ రాత్రి వేళలో ....గుర్తు కోస్తోంది కొత్త కోతగా 
నిదురించిన ఎద నదిలో అలలెగసిన అలజడిగా 
తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాది ఇదా 
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

తెలుగు నాట పల్లెటూర్లలో అట్ల తద్ది అందరు కలిసి ఉత్సాహం గా జరుపుకునే పండుగ. ఇప్పటి వాళ్ళలో చాలామందికి ఈ పండుగ అంటే తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు నేటివిటి అంటాము అంటే ఇదే. మన పండుగలు, మన అలవాట్లు మన పద్దతులు వీలైనప్పుడు ఎక్కడో ఒక చోట స్ప్రుసిన్చటం కవులు, కళాకారుల లక్షణం. ఇక్కడ సిరివెన్నెల ధారాళం గా వాడారు ఈ పాటలో. గున్న మామిడి తోటలు మన తెలుగు నాట సర్వ సాధారణం. ఇవి కూడా ఎంత మందికి తెలుసో. గున్న మామిడి తోట అంటే చిన్న చిన్న మామిడి చెట్లున్న తోట. ఈ చెట్లకి ఊయ్యాలలు వేసి ఆడుకోవటం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటు లో లేనప్పుడు అందరు చేసే కాలక్షేపం. అట్లతద్ది నాడు పిల్లలు అందరు ఆడుకోవటం అది ఇలాంటి ఏకాంత సమయం లో గుర్తుకు వస్తోంది ఎందుకో కొత్త కొత్తగా, అది ఎందుకు అంటే, సినిమా కథ చెప్తుంది. తన శ్రీనివాస్ ని కోల్పోయిన తరువాత మర్చిపోయి ఉన్నప్పుడు ఈ కళ్యాణ్ అతని కళ్ళను గుర్తుకు చెయ్యటం, ఆమెలో అలజడిని రేపుతుంది. అందుకే మరచి పోయిన నదిలోని అలల్లాగా రేగుతున్న అలజడి అంటారు ఈ జ్ఞాపకం. ఒక పక్క శ్రీనివాస్ లేడన్న చేదు నిజం వేప పూవు లాగ చేదు గా ఉంటే, అతని కళ్ళ ద్వారా తిరిగి చూడటం ఒక కొత్త తీయదనం. ఈ రెండు భావాల కలయికని అన్ని రుచుల పండుగ ఉగాది తో పోల్చటం, ఆమె మనసులో జరిగే కోలాహలం కి సంకేతం, మనకి రాబోయే కథకి అంతర్లీనంగా సూచన. ఇంతటి భావం చెప్పటం సిరివెన్నెల చమత్కారం. ఈ చరణం చివర బాలు గారు పాడిన ఆలాపన చాల అద్బుతం గా ఉంటుంది.

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా 
కలలు కనే కన్నులలో కునుకెరగని కలవరమ
రేయిలోని పలవరమ హాయిలోని పరవశమ
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల || 

పల్లెటూర్లలో కొబ్బరి తోటలు ఉన్న వారికి తెలుసు కొబ్బరి చెట్లతో ఎలా ఆడుకోవాలో, ఆకులు రాకెట్లాగ, మట్టలు క్రికెట్ బాట్ లాగ, మరల ఆకులతో బొమ్మలు ఎలా చెయ్యాలో. కొబ్బరి ఆకుల తో అబ్బాయి, అమ్మాయి బొమ్మలు చేసి వాటికి పెళ్లి చెయ్యటం ఒకప్పటి పిల్లల ఆటలు. ఆ బొమ్మలకి రక రకాలు గా ముస్తాబు చెయ్యటం, వాటికి కథ అల్లటం, ఇవ్వన్ని తెలుగు వాళ్ళు మరిచి పోలేనివి. వీటిని పాటలో చక్కగా పొదగటం సిరివెన్నెల గారు చేసిన వెన్నెల జాలం. ఆ బొమ్మలు ఎంత అందం గా ఉంటాయో, మబ్బు చాటున ఉన్న చంద్రుడు కూడా అంటే అందం గా ఉంటాడు. అందుకే అంటారు చంద్రున్ని చూడాలంటె రెండు వెల్ల మధ్య కాని, ఆకుల చాటున కాని చూడాలి అని. ఈ పోలిక చెయ్యటం తో తప్పకుండ తెలుగు వారి హృదయాన్ని తాకుతారు సిరివెన్నెల. ఇంక మరల మేఘ మాల మీదకి ఆమె లోని పరవశం, కలవరం గురించి, కలలు కంటున్న కన్నులలో ఈ అలజడి కునుకు లేకుండా చేస్తుంటే అది నిద్రలోని పలవరమో, లేక ఆనందం వాళ్ళ వచ్చిన పరవశం ఏమో చిలకమ్మా, ఓ చిరుగాలి చెప్పండి అంటుంది మేఘమాల. పాట చిత్రీకరణ లో ఆహ్లాదం తో పాటు హాస్యం కూడా జత చేరుస్తారు షిండే రాజేంద్ర ప్రసాద్ రూపం లో.

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది 
అల్లి బిల్లి మేఘమాల బాగుంది 
చిలకమ్మాబాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది


ఇంక చివరిగా కళ్యాణ్ మనసు రూపంలో ప్రశ్నలకి సమాధానం చెప్పించి పాట ముగుస్తారు దర్శకులు. ఆమె పల్లవిలో అడిగినవన్ని బాగున్నాయి అంటూ. ఈ చరణం లో బాలు గారి గొంతు అమృతం. అయన గొంతు ఇలాంటి పాటలలో ఎంత అద్బుతం గా ఉంటుందో వింటే కాని అర్థం అవ్వదు, ఇలాంటి అంటే, పాట మొత్తం గాయని పాడగా చివర్లో ఆయన పాడినప్పుడు ఆయన పాట మొదలు పెట్టినప్పుడు ఒక్క సారి ఒళ్ళు జలదరిస్తుంది, రోమాలు నిక్కపోడుస్తాయి, అది ఆయన గంధర్వ గళం మహత్యం.


 SA రాజ్ కుమార్ అంటే అందరికి తెలసినది ఏమిటి అంటే, సాధారణం గా ఒకే పాట ట్యూన్ పట్టుకొని సినిమా మొత్తం వాడుకుంటారు అని ప్రసిద్ది. అదే పాట అదే ట్యూన్ అన్ని సినిమాలల్లో వాడుతూ ఉంటారు. కాని ఈ సినిమా కి అయన చేసిన సంగీతం బలం. పాటలు సినిమాకి ప్రాణం. ఇంకో పాట " గుడి గంటలు మ్రోగిన వేల" అనే పాట కూడా షిండే బాగా చిత్రీకరిస్తారు. 


కొసమెరుపు: వెన్నెల సిరి బాగుందా అని ఆడుతారు సిరివెన్నెల గారు పల్లవి లో కథానాయిక ద్వార, చివరికి కథానాయకుడి ద్వారా వెన్నెల సిరి బాగుంది అంటారు. ఇక్కడ మనం కూడా కొంచెం మార్చి సిరి (కురిపించే) వెన్నెల బాగుందా అంటే  మనం తప్పకుండా సిరి వెన్నెల గారు బాగుంది అండి అందాము.అయన రాసే పాటలు అయన కురిపించే సిరి. ఈ "నిన్నే ప్రేమిస్తా" సినిమాకి మాతృక 1999 లో తమిళం లో వచ్చిన "నీ వరువాయి ఏన" అనే సినిమా. ఇదే పాట తమిళం లో "పూన్కుయిల్ పాట్టు పుడిచ్చిరుకా". (కోయిల పాట నచ్చిందా) కాని ఆ పాటని మార్చి తెలుగుతనం ఉట్టి పడేలా రాయగలగటం సిరివెన్నెల మహత్యం.



No comments:

Post a Comment