Showing posts with label Song of the week. Show all posts
Showing posts with label Song of the week. Show all posts

Sunday, May 20, 2012

Song of the week - Manasuna Unnadi

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

పని భారం వల్ల కలిగిన ఒత్తిడిలో సమయం కుదరక చిన్న విరామము కలిగింది. విరామానికి క్షమార్హుణ్ణి. యదావిధిగా ఈ వారం మరల మీ ముందుకి రావటం జరుగుతోంది. ఇటువంటి విరామాలు కలుగకుండా ప్రయత్నిస్తాను.

Movie Name:          ప్రియమైన నీకు 
Producer:                     RB Choudhary
Director:                       Bala Sekharan
Music Director:            SA Rajkumar 
Singer(s):                     KS చిత్ర (Female version), SP బాలు  (Male Version)
Lyrics:                           సిరివెన్నెల సీతారామశాస్త్రి 
Year of Release:          2001


 

ఒక పాట వింటే సినిమా కధ  అర్థం అయ్యే పాటలు చాల తక్కువగా చూస్తాము. అటువంటి అరుదైన పాటల కోవలోకి చెందినదే ఈ పాట. సిరివెన్నెల గారు తనకంటూ ఒక స్థాయి నిర్ణయించుకొని ఆ స్థాయి తగ్గకుండా సినీ జీవితం లో పాటలు రాయ గలగటం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆ పరిధిలోనే పాటలు రాయటం మన అదృష్టం. ఈ పాట కి రెండు వెర్షన్స్ ( అంతరాలు ). ఒకటి కథా నాయిక తన మనసులోని భావం తెలియ చెప్పలేక పాట ద్వారా తెలియ చెప్పటం. అదే విధంగా కథానాయకుడు కూడా. ఇద్దరి భావాలు వేరు కాని ఇతివృత్తం ఒకటే. ఎలా చెప్పటం, చెప్పకపోవటం. ఈ పాటలను సందర్భోచితం గా చక్కగా వాడుకున్నారు చిత్ర దర్శకులు. సినిమా లోని రెండు భాగాలు విరామం ముందు, తరువాత ఈ పాటలు వస్తాయి, పాట యొక్క ఈ రెండు అంతరాలు వింటే సినిమాలో ఏమి జరిగి ఉంటుందో మనం సులభం గా ఊహించుకోవచ్చు. అలాగా అతి సుందరం గా అత్యంత అద్బుతం గా తెలియ చెప్పటం అంటే మనోహరం గా రాయటం సిరివెన్నెల గారి గొప్పతనం. ఈ  రెండు పాటలు రాయటానికి ఎంత ప్రయాస పడ్డారో ఆయనకే తెలియాలి. ఈ పాట విన్న ప్రతి సారి ఒక్కో కొత్త అనుభూతికి ప్రేక్షకుడు లోనవుతాడు అని అనటం లో అసలు సందేహం లేదు.
ప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభవం. మాటల్లో వర్ణించలేని భావం అని అందరికి తెలుసు. కాని ఆ భావాన్ని తన సొంతం చేసుకొని ఎంతో అద్బుతం గా వివరించి, ప్రేమ లో పడితే కలిగే భావాలు ఇలాగే ఉంటాయ అన్నంత అనుభవం తో చెప్తున్నట్టు ఉంటాయి కవుల కవిత్వాలు, పాటలు. అది వారి ఊహా శక్తి, కల్పనా శక్తి, పాండిత్యానికి నిదర్సనం. అంతే కాకుండా, సినిమా లోని పాత్రల మనస్తత్వాలు అర్థం చేసుకొని వాళ్ళ భావాలు తెలియచెప్పటం కొంత మంది కే సాధ్యం. దీని వల్ల కథకి ఎంత బలం చేకూరుస్తుందో ఈ చిత్రం మనకి చక్కటి ఉదాహరణ. చాల సార్లు చెప్పినట్టు, సాహిత్యం చక్కగా ఉంటె, దానికి ఆభరణాలు అవే కుదురుతాయి. ఆ ఆభరణాలు బాలు, చిత్ర మరియు రాజకుమార్. బాలు గారి గురించి పొగడాలంటే అర్హత ఉండాలి. ఇంక గాయనీ మణులలో మనకి ఒక పాటకి న్యాయం చేకూర్చే వాళ్ళలో చిత్ర గారు ఆఖరేమో ఆవిడ తరువాత మనకి ఇంక ఉండరేమో అని అనిపించటం సహజం.
ఇంక ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే, గణేష్ ఆడుతూ పాడుతూ గాలికి తిరిగే యువకుడు. చదువు సంధ్య లేకుండా స్నేహితుల తో తిరిగుతూ ఉండి తండ్రి చేత తిట్లు తింటూ ఉంటాడు. ఒక రోజు తండ్రి ఊరు వెళ్తూ షాపు చూసుకోమంటాడు. తప్పక ఒప్పుకొని వెళ్తే అక్కడ ఒక బీరువా లో డైరీ దొరకటం, ఆ డైరీ లో సంధ్య అనే అమ్మాయి తన గురించే రాయటం, ఆ డైరీ విషయాలు సినిమా లోని మొదటి భాగం. తన ఇంటి ఎదురుగా ఉన్న సంధ్య గణేష్ ని ప్రేమిస్తుంది, కాని ఆ విషయం చెప్పలేక పోతుంది. తన చెల్లెలు ద్వారా చెప్పించటానికి ప్రయత్నిస్తే చెల్లెలు ఆ విషయం అక్క గురించి కాకుండా తన గురించి చెప్తే గణేష్ తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన జరిగిన తరువాత సంధ్య వాళ్ళు హైదరాబాద్ బదిలీ అవ్వటం తో సినిమా మొదటి భాగం అవుతుంది. ఇంక గణేష్ సంధ్యని వెతకటానికి వెళ్తే, తన స్నేహితుడికి సంధ్య తో పెళ్లి కుదరటం, గణేష్ తన మనసులోని మాట సంధ్య కి చెప్పా లేక పోతాడు. ఇంక ఇద్దరు ఎలా కలుస్తారు అన్నది సినిమా.

ఈ నేపధ్యం లో కథ నాయిక కథ నాయకుడుకి రాసిన పాట వాళ్ళ మనసులో ఏముందో అని రాయటం, రెండు ఒకే లాగ ఉన్నట్టు ఉండి, అర్థం వేరు గా ఆ సందర్భాలకి సరిపడా రాసిన సిరివెన్నెల గారు రాసి ప్రేక్షకులని ఆశ్చర్య ఆనందాలకి లోను చేస్తారు. ఇంక మొదటి పాటలోకి వెళ్దాము. 



సంధ్య ఒక రోజు గణేష్ గిటార్ వాయించటం చూసి అతని సంగీతం మీదనే కాకుండా అతని మీద మనసు పారేసుకుంటుంది. అప్పటినుంచి అతనినే చూడటం మొదలు పెట్టి మనసులోని విషయం ఎలా చెప్పాలా అని ఆలోచనలో ఉంటుంది. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం గణేష్ స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి తన ఇంట్లో పడటం ఆ బంతి కోసం గణేష్ ఇంటికి రావటం. క్రికెట్ బంతి మీద ఐ లవ్ యు అని రాసి బంతి గణేష్ చేతిలో పెడ్తుంది. కాని అది చూడకుండా హలో హలో అనుకుంటూ బంతి తీసుకొని క్రికెట్ లో బంతి ప్యాంటు కు రుద్ది చేరిపేస్తాడు. కొంచెం బాధ పడినా అతని గురించి తన మనసులో ఉన్న మాట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన సందర్భం లోని పాట ఇది.

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు  రావే ఎలా
మాటున  ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదేలా
ఒక్కసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా           || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||


ఈ నేపధ్యం లో సీతారామ శాస్త్రి గారు రాసినట్టు అద్బుతం గా ఎవరు రాయలేరేమో అని మనకి అనిపించటం అత్యంత సహజం. సంధ్య మనసులో ఉన్నది చెప్పాలి కాని అతనిని చూసేసరికి మాటలు తడబడి ఏమి మాట్లాడ లేక పోవటం, ఇలా అయితే ఎలా అని మనసు తో సంభాషించుకోవటం సిరివెన్నెల గారి ఆలోచన శక్తికి నిదర్సనం. మాటలు కరువైతే అందరికి మనసే తోడు. అందుకనే అత్యంత సుందరం గా వాడుకుంటారు. సంధ్య పడే సంఘర్షణకి ఇది తార్కాణం. తనలోని సంగతి మంచిదే కాని ఆ సంగతి చెప్పే తప్పుడు ఉన్న బిడియం ఆగక పొతే చెప్పటం ఎలా కుదురుతుంది? బిదియ పడే స్త్రీ కన్నులు వాటంతట అవే రెప రెపలాడతాయి. దానికి సిగ్గు తోడయితే రెప్పలు వలిపోవటం సహజం. ఇవన్ని స్త్రీ కి సహజమైన లక్షణాలు, అవే సినిమాలో సంధ్య పాత్రలో చూస్తాము, శాస్త్రి గారి పాటలో వింటాం. ఇది ఒక రకం గా పాత తరం స్త్రీ గురించి చెప్పినవే అనుకోవాలి, అన్వయించుకోవాలి. ఎందుకంటే మారుతున్న కాలం లో స్త్రీ లక్షణాలు మారుతున్నాయి, వాళ్ళ పద్దతులు మారుతున్నాయి. ఇంక గణేష్ తన ఎదురుగా వచ్చాడు, అతనికి తనలోని అతని గురించిన ఆలోచనలు, జ్ఞాపకాలు తెలియచెప్పటం ఎలా? అది సరే ఒక్క సరి తన మనసులోని మాట, ఎద చేస్తున్న సందడి తెలుపకపోతే అతనికి తన ప్రేమ విషయం ఎలా తెలుస్తుంది? ఇంతకీ సంధ్య పడే తపన అదే, తన మనసు లో ఉన్నది చెప్పాలని ఉన్నా కాని మాటలు రావటం లేదు, ఏమి చెయ్యాలి? సంధ్యకి ఇటువంటి సంక్లిష్ట మైన పరిస్తితి రావటం సినిమా లోని ఆ పాత్ర పట్ల అందరికి సానుభూతి కలగటం సహజం. ఆ తరువాత జరిగిన సంఘటనలే కథకి మూలం. సరే ఈ పరిస్తితి ఇలా ఉంటె తరువాత శాస్త్రి గారు ఏమి చేసారో చరణం లో చూద్దాం.



చరణం  - 1
చింత నిప్పల్లే చల్లగా వుందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో

ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదకోత అని అడగాలని 

అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని
తెలపకపోతే ఎలా                                                        || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||


కవులందరూ ఏకగ్రీవం గా అంగీకరించే విషయం విరహం వల్ల కలిగే నిట్టుర్పుల వేడి రోహిణి కార్తె వేడి కంటే ఎక్కువ ఉంటుంది అని. ఆ వేడికి రాళ్ళే బద్దలు అవుతాయి అంటే అతిశయోక్తి కాదు. చింత నిప్పు , ఎంత నొప్పి అనే ప్రయోగం సరికొత్త అందాన్ని తెచ్చింది ఈ చరణానికి. అతనిని తలచుకోవటం వల్ల కలిగిన విరహ నిట్టూర్పుల వేడిలో అతని గురించిన ఆలోచనలో కలిగిన వేడి కూడా, ఎటువంటి నొప్పి కూడా తెలియటం లేదంటే అది అతని గురించిన ఆలోచన కాబట్టి. ప్రేమ అంటే బాధే ఎందుకంటే అది దొరికేంత వరకు బాదిస్తూనే ఉంటుంది కాని ప్రేమ లభిస్తుంది అనే ఆలోచన అతని చెంతన కలిగే ఆనందం ఆ బాధని అధిగామించేలాగా చేస్తుంది. అందుకనే ప్రేమ తీయని బాధే. ఆ భాద ఎంత బరువుగా ఉంటుందో లేత గుండెకే తెలసు. ఆ అనుభవం మొదటి సారి ప్రేమలో పడిన వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి స్త్రీ గుండె లేత గుండె అనటం శాస్త్రి గారి పద విన్యాసానికి హద్దులు లేవు అని మనకి నిరూపించటం. ఇంకా ప్రేమ సఫలీకృతం కాని వాళ్ళు పడే గుండె కోత గురించి చెప్పాలంటే కష్టం, అది అవతలి వాళ్ళకి చెప్పటం ఇంకా కష్టం, అటువంటి బాధ తనకి ప్రియమైన గణేష్ కి కనిపిస్తోందా అని అడగటం, తన మనసు అతని చుట్టూనే పరి పరి విధాలు గా తిరుగుతోంది, ఈ మనసు లోని విషయం నీకు తెలియచేప్పక పొతే ఎలా?


చరణం  - 2
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని
నిద్దరే కసురుకునే రేయిలో

మేలుకున్న ఇదే వింత కైపని వేల ఊహలో ఊరేగే చూపుని
కలలే ముసురుకొనే హాయిలో
వినపడుతోందా నా ప్రియమైన నీకు  ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని
తెలపకపోతే ఎలా                                                        || మనసున ఉన్నది చెప్పాలనున్నది ||


ఈ చరణం లో శాస్త్రి గారి కవితా విశ్వరూపం చూస్తాం. అయినా దీనికే ఇంతలా ఆశ్చర్యపోతే యింక ఆయన రాసిన అనేక పాటలకి ఏమయిపోవాలో? ఆయనకి వచ్చిన అద్బుతమైన భావనకి శతకోటి పాదాభి వందనాలు చెప్పటం తప్ప? సంధ్య నీలి కన్నుల్లో అంతటా అతని రూపం నిండిపోయి ఉంది. ఆ ఆలోచనలతో నిండా మునిగిపోయింది. నిద్ర కనుమరుగై పోయింది. అప్పుడు నిద్ర సంధ్యని నీ కళ్ళలో గణేష్ రూపం ఉంటె, నేను ఎలా నిద్రపోతాను అని అడగటం, నిద్ర రాత్రిలో సంధ్యని కసురుకున్తోంది అనటం అత్యంత అద్బుతమైన భావనని నింపుతుంది, రస హృదయుల మనసులో. ఈ పాట విన్న ప్రేక్షకుడు శాస్త్రి గారిని చూస్తె ఇదే పాట పాడుకోవచ్చేమో? అలాగే ఈ చరణం లో నిద్ర కసురుకునే రేయిలో, కలలే ముసురుకునే హాయిలో అని మనకి హాయి కలిగిస్తారు. సంధ్యకి ఎలాగో నిద్ర రాదు, అలాగే అతని గురించి ఆలోచనలు అనేకం ముసురుకుంటున్నాయి. ఆ కంటికి అనేకం ఊహలు, ఆలోచనలు కలలు ఇవన్ని హాయిని కలిగించేవే. అతని తలపులలో నిద్ర పట్టని వాళ్ళకి కాలం ఏమి తెలుస్తుంది, తిథి వార నక్షత్రాలు, చీకటి పగలు ఇవేవి తెలియవు. ఇన్ని ఆలోచనలు ఉన్నవి, అతనిని కలిసి తన మనసు లోని మాటని చెప్తాను అన్న ఆశ ఉంది, ఆ ఆశని రాగం అనటం చాల సార్లు చూస్తాం. నా ప్రియమైన నీకు ఇవన్ని వినపడుతోందా? నా మనసున ఒక మంచి మాటని నీకు చెప్పాలని ఉంది అది ఎలాగ అనటం ఎంతైనా సమంజసం.

కొసమెరుపు: ఈ సినిమాలో సంగీతం సాహిత్యం చాల ప్రాధాన్యత కూడుకొని ఉంటాయి. స్నేహ కి తెలుగులో మొదటి సినిమా. దర్శకుడు ఈ పాటతో సినిమా లో మొదటి భాగం కథ నడిపిస్తే రెండో భాగం వేరే పాటతో నడిపిస్తారు. ఆ పాట (మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదేలా) గురించి వచ్చే వారం చూద్దాం.

ఈ రోజు మే 20 సిరివెన్నెల గారి జన్మ దినం. ప్రతి పాటతో కొత్త జీవం పోసుకునే ఆయనకీ ప్రతి పాట ఒక జన్మదినమే. ఇటువంటి జన్మ దినాలు కొన్ని వేలు మనకి ప్రసాదించే వరం భగవంతుడు ఆయనకి ప్రసాదించాలి అని కోరుకుందాం.

Saturday, April 21, 2012

Song of the week - Mutyamanta Pasupu

Movie:            Mutyaala Muggu
Presenter:     M. Sukumar
Producer:     Maddali Venkata Lakshmi Narasimha Rao (MVL)
Banner:         Sri Rama చిత్ర
Direction:      బాపు గారు 
Story, Screenplay & Dialogues: Mullapudi Venkata Ramana
Cinematography: Ishan Arya
Lyrics:           Arudra
Music:            KV Mahadevan
Singer(s):      P. Suseela
Year of Release: 1975


ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు  ముంగిల్లలోన  
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ   || ముత్యమంత ||

చరణం 1:
ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే  వారి  అరచేతనుండు   (2)
తీరైన  సంపద  ఎవరింట  నుండు
దిన  దినము  ముగ్గున్న  లోగిల్లనుండు  || ముత్యమంత ||

చరణం  2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి  కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు

కోరినంత పాడి నిండు కడవళ్ళు               || ముత్యమంత ||
చరణం 3:
మగడు మెచ్చిన  చాన  కాపురంలోన
మొగలి  పూలా గాలి  ముత్యాల  వాన    (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత  వైభోగం                 || ముత్యమంత ||




బాపు రమణీయం అంటే గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గు సినిమా అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం ఈ సినిమా.  తెలుగు పదాలకి, సినిమాలో పాత్రల నిర్వచననానికి, ఆహార్యానికి, విలన్ పాత్ర సృష్టికి, ఆంజనేయస్వామిని కథ లో వాడుకున్న తీరు, సినిమా తీసిన ప్రదేశాలు, పాటలు ఇలా ఏది చూసిన తెలుగు తనం ఉట్టిపడేలా కుదిరిన సినిమా. భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలి అని నిర్వచించిన   సినిమా  ఇది. ఈ సినిమాని ఈ తరం ఉత్తర రామాయణం గా పోలుస్తారు విశ్లేషకులు. కథలోని సన్నివేశాలు అలా ఉంటాయి మరి. అంతే కాదు సినిమా ఆరంభం లో టైటిల్స్ పడుతున్నప్పుడు మంగళంపల్లి బాలమురళి గారు పాడిన "శ్రీ రామ జయ రామ సీత రామ" అన్న పాట సినిమా కి అంతులేని అందం తెచ్చింది. అసలు ఈ పాట అప్పుడు పెట్టటమే ఒక అద్బుతమైన ప్రయోగం. కథ కథనం, దర్శకత్వం అద్బుతంగా చేసి ఒక అందమైన  దృశ్య కావ్యాన్ని అందించారు బాపు-రమణలు.  


రమణ గారి మాటలు ఆణి ముత్యాలు. ఎన్నోసంభాషణలు కలకాలం గుర్తుండి పోయే లాగ  రాసారు ఆయన. ముఖ్యంగా రావు గోపాల రావు గారికి రాసిన మాటలు చాల ప్రసిద్ది పొందాయి. ఇంక ఈ సినిమాలో అన్ని అద్బుతమైన పాటలే. సినారే, ఆరుద్ర గారు సినిమాకి అమరి ఒదిగి పోయే పాటలు రాసారు. మహదేవన్ గారు తెలుగు వారేనా అన్నట్లు సంగీతం సమకూర్చారు.  ఇన్ని మేలు కలయికలు ఉన్న అందుకే ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా గా జాతీయ పురస్కారం లభించింది.  బాపు-రమణ వీళ్ళిద్దరూ ఒకరు తనువు అయితే ఒంకొకరు మనసు, అందుకనే వీరి కలయికలో అనేక ఆణిముత్యాలు వచ్చాయి.  వీరిద్దరి కలయిక లో వచ్చిన ఆఖరి సినిమా "శ్రీరామ రాజ్యం".

భాగవతుల సదా శివ శంకర  శాస్త్రి అంటే వారికి చాల మందికి తెలియదు కాని ఆరుద్ర గారు అంటే అందరికి తెల్సు. అయన రాసిన పాటలు గురించి చెప్పాలంటే అర్హత ఉండాలి. అయన రాసిన ఈ పాట ఎంత అద్భుతమైనదో ఈ పాటలోని భావమే చెప్తుంది. సరళ మైన పదాలతో తెలుగు పాటకి నిర్వచనం చెప్పినట్లు ఉంటుంది. సుశీల గారు ఈ పాట పాడిన తీరు పాటలు పాడటం నేర్చుకునే వారికి ఒక నిఘంటువు. ఎందుకంటే ప్రతి పదం అంత స్పష్టంగా ఉంటుంది, భావం అంత స్పష్టం గా ఉంటుంది, అదే రీతిన  అంత తీయగా మనసులని తాకుతుంది. మామ మహదేవన్ గారి గురించి ఇంకా ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అయన తన శిష్యుడు పుహళేంది గారితో తెలుగు వాళ్ళకి లభించిన ఒక గొప్ప వరం.

ఇంక సినిమా కథలోకి వస్తే, జమిందారు, ధనవంతుడు, రాజ రావు బహద్దూర్ ( రామ దాసు ). ఆయన అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అందులో అతని కొడుకు అయిన శ్రీధర్ స్నేహితుడికి (హరి) ధన సహాయం చేసి చదివిస్తాడు.  శ్రీధర్ కూడా అన్ని విధాల యోగ్యుడు, తండ్రి మాట కి విలువనిచ్చే కొడుకు. హరి తన చెల్లెలు లక్ష్మి పెళ్ళికి ఆహ్వానిస్తే, శ్రీధర్ వెళ్లి అనుకోని పరిస్తితి లో లక్ష్మి ని వివాహం చేసుకొని తన ఇంటికి తీసుకు వస్తాడు. తన కూతురు వివాహం శ్రీధర్ తో చెయ్యాలని అనుకున్న రాజ వారి బావ మరిది ఈ వివాహం నచ్చక ఒక కాంట్రాక్టర్ ( రావు గోపాల రావు) సహాయం తో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసి వాళ్లు విడిపోయేలా చేస్తాడు. విడిపోయిన లక్ష్మి ఇద్దరు కవలలు కానీ వారిని పెంచుతూ ఉంటుంది. చివరికి శ్రీధర్ లక్ష్మి ఎలా కలుస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎలా కలుపుతారు అన్నది కథ. ఈ సినిమా లో లక్ష్మి కూతురు ఆంజనేయస్వామి వారితో సంభాషణలు, రమణ గారి ఊహ శక్తికి నిదర్శనం. ఇంకా బాపు గారు కాంట్రాక్టర్ పాత్ర నడిపిన తీరు, అతనికి రమణ గారు రాసిన సంభాషణలు కల కాలం గుర్తుంది పోతాయి. సూర్యోదయం చూస్తూ,  "సూర్యుడు నెత్తుటి గడ్డలా లేదు? ఆకాసంలో  మర్డర్ జరిగినట్లు లేదు?", "మడిసన్న తర్వాత కూస్తంత కళా పోసన   ఉండాల" ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాలు జనాల నోట్లో నానాయి.

ఈ పాట సందర్భానికి వస్తే లక్ష్మి పెళ్లి ఐన తరువాత అత్త వారింటికి వచ్చి పొద్దున్న లేచి వాకిట కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతూ పాడిన పాట. లక్ష్మి ఈ పనులన్నీ చేస్తుంటే ఇంటిల్లి పాడి ఆశ్చర్య పోతూ చూస్తుంటారు. ఇంక పాట లోకి వెళ్తే.

ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు  ముంగిల్లలోన
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ 



పసుపు మన భారత దేశపు సొత్తు. పసుపు వల్ల కలిగే లాభాలు మనకి తెల్సినట్టు గా ఎవరికీ తెలియదు. అలాగ పసుపు మనం వాడినట్టు గా ఇంక ఎవరు వాడరేమో. అందులో తెలుగింటి ఆడపడుచులు పసుపు పాదాలకి ముఖానికి రాసుకోవటం చూస్తాం, దీని వల్ల ముఖానికి, చర్మానికి వన్నె పెరగటం సర్వ సాధారణం. ఈ పాట 1975 లో వచ్చింది కాబట్టి అప్పటి తరం వ్యవహార శైలి కి అద్దం  పడుతుంది ఈ పాట. ఈ రోజుల్లో ఈ విషయం మనం చూడం కాబట్టి ఇప్పటి పద్ధతులకి ఈ పాట అన్వయించలేము. అలాగే కుంకుమ పెట్టుకోవటం ముత్తైదువ లక్షణం. ఆరుద్ర గారు ఇక్కడ అప్పటి పద్ధతులకి అన్వయిస్తూ రాసిన పాట అప్పటి వ్యవహార శైలికి అద్దం పడుతుంది.  ముత్యమంత పసుపు రాసుకుంటే ముఖానికి ఎంత వన్నె తెస్తుందో, అలాగే నుదుట, పాపిట కుంకుమ పెట్టుకున్న తెలుగింటి ముత్తైదువ జీవితం కూడా అంతే అద్బుతంగా ఉంటుంది. ముత్యమంత పసుపు అని ఎందుకు అన్నారంటే ఆ మాత్రం  పసుపు చాలు వన్నె తేవటానికి. అలాగే ముంగిళ్ళు ఆ రోజుల్లో ప్రతి ఇంటా సర్వ సాధారణం. ముంగిళ్ళ లో ముద్దు మురిపాలు ఉన్నాయి ఆంటే ఆ ఇల్లు  ఆనందానికి  ప్రతీక. మనుషులు కలిసి ఆనందిస్తున్నారు అనటానికి తార్కాణం. అటువంటి ఇంటిలో అరమరికలు ఉండవు, అపార్థాలు కోప తాపాలు ఉండవు. ఇటువంటి ఇంటిలో అన్ని ద్విగుణీ కృతం అవుతాయి. కాని ఇవి అన్ని ఇంటి ముత్తైదువ వల్లనే సాధ్యం. ఎక్కడ ఇంటి ఇల్లాలు ముఖం లో లేక జీవితం లో వన్నె ఉంటుందో ఆ ఇంట్లో అన్ని చక్కగా అభివృద్ధి చెందుతాయి.  ఒక ఇల్లు ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పారో కదా. 


ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే  వారి  అరచేతనుండు   (2)
తీరైన  సంపద  ఎవరింట  నుండు
దిన  దినము  ముగ్గున్న  లోగిల్లనుండు



ఆరని అయిదోతనం, అరుగులు అరచేతన అలకటం, లోగిళ్ళలో ముగ్గులు ఇవి తెలుగు తనానికి ప్రతీక. పల్లెటూర్లో ప్రతి ఇంటికి అరుగులు ఉండేవి. అలాగే అందరు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ప్రతి ఉదయం పేడతో అలికి కళ్ళాపి ( నీరు ) చల్లి ఆ నీళ్ళు ఆరిన తరువాత ముగ్గులు పెడ్తే ఆ వాతావరణ సౌందర్యం చూడటానికి కంటికి ఇంపుగా ఉండేది.   అయిదోతనం ఆంటే సుమంగళి అయిన  స్త్రీకి ఉన్న ఆభరణాలు. అవి ఏంటి ఆంటే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వకు ( చెవి ఆభరణాలు ). ఇవి అన్ని ఉంటె ఆ స్త్రీ ముత్తైదువ గా ఉన్నట్లే. సాధారణం గా మనం స్త్రీ భర్తని కలిగి ఉంటె సుమంగళి, కొంచెం పెద్ద వయసు కలిగిన వాళ్ళని ముత్తైదువ అంటాం. ఇంక పాట విషయానికి వస్తే ఆరని అయిదోతనం ఎవరి వల్ల సాధ్యం ఆంటే, ప్రతి రోజు అరుగులు అలికి తన కుటుంబం బాగా ఉండేలాగా చూసుకునే ముత్తైదువ చేతి లో ఉంటుంది. అలాగా ముగ్గు వలన అనేకమైన లాభాలు ఉన్నాయి. అవి ఇంటికి సౌందర్యం తీసుకు రావటమే కాక, ఎవరి ఇంటిలో ముగ్గు ఉంటుందో వారి ఇంటికి లక్ష్మి దేవి వస్తుంది అనే ప్రతీక ఉంది తెలుగు నాట. ఇది ఎందుకు ఆంటే ఆ ఇల్లు పద్దతి గా ఉండి అన్ని అవలక్షణాలు లేకుండా ఇంట్లో అందరు కష్టపడి పని చేస్తారు అని అర్థం. ఎవరు పని చేస్తే వల్ల ఇంట లక్ష్మి దేవి ఉండటం సహజం కదా.  ఇన్ని వివరిస్తూనే వీటి అన్నిటికి కారణం ఇంటి ఇల్లాలే అని మల్ల చెప్తారు ఆరుద్ర గారు.



కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి  కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్ళు   

తెలుగు వాళ్ళు పసుపు కుంకుమ కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఆంటే ప్రాధాన్యం ఇంట్లో తులసికి ఉంటుంది. తులసి చెట్టుని దేవత లాగ పూజించడం తెలుగు వారి పద్దతి. తులసి లేని ఇల్లు తెలుగు నాట ఉంటుంది ఆంటే ఊహించలేము. ఇంట్లో పాటించే పద్దతులు ఈ తులసి మొక్క పెరుగుతున్న తీరు బట్టి చెప్పొచ్చు అంటారు. అందుక ఆరుద్ర గారు. కొందరు తులసిని కోటలో పెంచితే, కొందరు కుండీలలో పెంచితే, కొందరు సాధారణం గా ఇంటి ఆవరణలో పెంచితే, కొందరు పూజ మందిరం లో ఉంచుతారు. ఎవరు ఎలా పెంచినా, ఆ మొక్కకి ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఇంటిని చెప్పొచు. ఇంక తులసెమ్మ ఎంత కోరితే అంత ఇచ్చే దేవత. మన ఇంతో ఇంతే కొంగుకి ముదేసుకున్నట్టే, లక్ష్మి, బంగారం ఇచ్చే దేవతే మన ఇంట్లో ఉండే బంగారం. ఇంక తెలుగు వారు తరువాత పూజించేది ఆవుని. పల్లెటూర్లో ప్రతి వారింట పాడి తప్పని సరిగా ఉంటుంది. పాడిని శ్రద్దగా చూసుకుంటే పాలు/పాడి బిందెలు నిండా వస్తుంది. ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం అందరికి తెల్సినా అందం గా చెప్పటం ఆరుద్రా గారి గొప్పతనం. 

మగడు మెచ్చిన  చాన  కాపురంలోన
మొగలి  పూలా గాలి  ముత్యాల  వాన    (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత  వైభోగం  

ఇంట్లో అన్ని సమకూర్చేది బాద్యత వహించేది ఇల్లాలు అయినా మగాడు ఆ ఇల్లలికి ఆదరణ, ప్రాముఖ్యత, ఆనందం ఇవ్వక పొతే ఇంటిలో ఆనందం వెల్లి విరియటం కష్టమే. అందుకే భర్త ఎంత మెచ్చుకుంటే ఇంట్లో అంత ఆనందం ఉంటుంది. ఈ విషయం మొగలి పూల గాలి, ముత్యాల వాన అని కవితా ధోరణి లో అందం గా చెప్పటం చూస్తాం. మొగలి పూలు చక్కటి సువాసనని ఇస్తాయి, సాయంత్రం ఈ పరిమళ ఆస్వాదిస్తే ఆ ఆనందం వివరించనలవి కాదు. అందుకనే ఇంటి ఆనందానికి ఆ పోలిక. అలాగే ముత్యాల వాన. చివరికి పాట ఇంటికి ఇల్లాలి యొక్క ప్రాముఖ్యత చెప్తూ ముగిస్తారు ఆరుద్ర. ఇల్లాలు సౌభాగ్యం గా ఉంటేనే ఇంటికి ఆనందం అని, అభివృద్ధి అని, సకల సంతోషాలు అని.

కొసమెరుపు:  ఈ పాట ఎన్ని ఏళ్ళ తరువాత విన్న  తెలుగు వారికి ఏదో తెలియని అనుభూతిని మిగులుస్తుంది. ఇటువంటి అనుభూతిని ఇచ్చిన బాపు, రమణ గారికి మనం ఏమాత్రం గౌరవించక పోవటం మన తెలుగు వారి దౌర్భాగ్యం. తెలుగు సాహిత్యానికి, తెలుగు కళకి విశేషమైన సేవ చేసిన వీరిలో ఒక్కరికైన కనీసం పద్మశ్రీ గా సత్కరించకపోవటం తెలుగు వారి కళల పట్ల నిరాదరణకి తాత్కారం. NTR గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు రమణ గార్లని తెలుగు వీడియో పాఠాలు చెయ్యమని చెప్తూ అవి ఎలా ఉండాలి ఆంటే, "ముత్యాల ముగ్గు" లోని తెలుగు తనం లా, అంత అందం గా ఉండాలి అని. ఈ ఒక్క నిదర్సనం చాలు వీరిద్దరూ ఏమిటి తెలుగు సినిమాకి ఆంటే.

Saturday, April 7, 2012

Song of the week - Karige loga ee kshanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:     ఆర్య 2
Producer:                 Aditya Babu & BVSN Prasad
Director:                   Sukumar
Music Director:        Devi Sri Prasad
Singer(s):                 Kunal Ganjawala, Megha
Lyrics:                       Vanamali
Year of Release:      2009



కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ    (2)

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 

ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .

మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..                                || కరిగే లోగా ||

ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యి విజయవంతం అయితే అటువంటి ఇంకో సినిమా తీయటం చూస్తూ ఉంటాము. అటువంటి "సీక్వెల్" కోవకు వచ్చేదే ఆర్య - 2. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆర్య, అజయ్ చిన్న నాటి స్నేహితులు అనేకంటే ఆర్యని అజయ్ శత్రువుగా భావిస్తే, ఆర్య మటుకు అజయ్ కి ప్రాణం పెట్టే స్నేహితుడు. అనాధలైన ఇద్దరు ఒకే చోట పెరుగుతూ ఉంటే స్నేహితుడు కావాల్సి రావటం వాళ్ళ అజయ్ స్నేహితుడు అవుతాడు కాని అజయ్ మటుకు ఆర్యని శత్రువు గా నే చూస్తాడు. ఒక జంట వీరిలో ఒకరిని పెంచుకుందామని వస్తే, అజయ్ ని పంపిస్తాడు ఆర్య. కాలక్రమేనా అజయ్ మంచి స్తితిమంతుడిగా స్థిరపడి తనకంటూ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. ఆర్య అదే అజయ్ కంపెనీ లో ఒక ఒప్పందం మీద ఉద్యోగి గా స్థిరపడతాడు. అక్కడ పనిచేస్తున్న గీతని  ఇద్దరు ప్రేమిస్తారు. అజయ్ ఆడిన నాటకం వల్ల గీత అజయ్ ని ప్రేమిస్తుంది, కాని ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి చివరికి అజయ్ ఆర్య ల స్నేహం ఏమవుతుంది, ఆర్య గీతల  ప్రేమ కథ ఏమవుతుంది అన్నది సినిమా.

ఈ సినిమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. సినిమాలో మొత్తం పాటలు అన్ని జనాలని ఉర్రూతలు ఊగించింది. ఈ సినిమా తరువాత ఒకే సినిమాలో మొత్తం అన్ని పాటలు జనాదరణ పొందిన సినిమా ఇప్పటివరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. "రింగ రింగా" అనే పాట అయితే ఉత్తర భారత దేశం లో పండుగలప్పుడు విశేషాదరణ లభించింది. అంతే కాదు క్రికెట్ మాచ్ లోను, ఎక్కడ పడితే అక్కడ .  బాష తో సంబందం లేకుండా ప్రజా దరణ పొందింది. ఇటువంటి పాటలని అందించిన దేవి శ్రీ ప్రసాద్ మనకున్న ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు. అన్ని రకాల పాటలు అందరిని అలరించేలాగా అందించగల సమర్ధుడు. అందుకనేనేమో అందరి కథా నాయకుల తోనూ పనిచేసే అవకాశం లభించటం ఒక ఎత్తు అయితే అవి సద్వినియోగ పరచుకోగలటం దేవిశ్రీ  ప్రతిభకి నిదర్శనం.

కరిగేలోగా ఈ క్షణం పాట నేపధ్యం సినిమాలో ఆర్య తన ప్రేమని స్నేహితుడి కోసం వదులుకొని వాళ్ళని విదేశం పంపించాలని అనుకోవటం, వాళ్ళని ఒప్పించి స్నేహితుడి గా మిగిలి పోతున్న క్షణం లో వచ్చే పాట ఇది. తన ప్రాణమైన గీతని, అత్యంత ప్రాణం గా స్నేహించే అజయ్ కోసం ఒప్ప చెప్పటం ఆ ఆవేదన భరిత ఆలోచనలో సాగిన పాట ఇది.  వైవిద్యం ఏమిటంటే ఈ పాట ట్యూన్ కంపోసే చేసిన రీతి, వనమాలి గారు రాసిన విలక్షణ సాహిత్యం హృదయాన్ని స్పర్సిస్తుంది. ఆర్య ఈ సినిమా మొత్తం లో ఎవరికీ అర్థం కాక పోయినా, ఈ పాట అతని మనస్తత్వం తెలియచేస్తుంది, అతను  పడే సంఘర్షణ తెలియచేస్తుంది. 


అలాగే దేవి శ్రీ చేసిన ఒక విలక్షణ ప్రయోగం ఈ పాట. ఈ పాట మొత్తం సముద్రం, నది, అలలు అంటూ ఎలా సాగుతుందో, పాట కూడా అలాగే సాగుతుంది. ఇంక మొదలు ఎలా సాగుతుంది అంటే, ఒక అల ఒడ్డుని తాకేటప్పుడు ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది. ఆ వయోలిన్ సంగీతం. ఆ హెచ్చు తగ్గులు అలల్లాగా ప్రవహించి వేగం పెంచుతూ, శబ్దం హోరు పెరుగుతూ తగ్గుతూ కోరస్ తో పోటి గా సాగుతూ చివరికి అల ఒడ్డుకోచ్చేసరికి ఎలా వేగం పెరిగి పెరిగి ఒడ్డుని తాకుతుందో అలాగా సాగి ముగుస్తుంది. అప్పుడు పాట మొదలు అవుతుంది. ఈ పాటలో ఇంకో విలక్షణమైన ప్రయోగం ఏమిటంటే, అందమైన విరుపులు, ఒక రకమైన "different intrumentation" , పదాల తరువాత  సరళమైన  నిశ్శబ్దం సరికొత్త పరిమళం అందిస్తాయి. ఈ పాటకి రిథం కూడా సరికొత్తగా ఉంటుంది, ఇవ్వన్ని సరిగ్గా సమకూడి పాట విన్న తరువాత ఒక రకమైన మధురమైన  అనుభూతి కలిగించి మరల  మరల వినేలా చేస్తుంది.  ఇంతంటి అందమైన ప్రయోగం చేసిన దేవి శ్రీ ప్రసాద్ అభినందనీయుడు. ఇంక పాట సాహిత్యానికి వస్తే ఈ సినిమా లో కొన్ని పాటలు సినిమాలోని సందర్భానికి సరిపోయే లాగ సరిగ్గా సరిపోయాయి. కాని ఈ పాట మొత్తం సినిమాలో అన్ని పాటలకన్న శ్రేష్టమైనది. అది ఎందుకో చూద్దాం.

కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ (2)

మనిషి మనస్తత్వం ఎలాగా ఉంటుంది అంటే, ఏదైనా ఇష్టమైనది ఆనందం కలుగ చేసే సమయం ఉంటే, అది ఎప్పటికి తరగ కుండ ఉండాలని, ఆ సమయం అలాగే నిల్చి పోవాలి కలకాలం అని కోరుతుంది. అదే ఏదైనా దుఖం కాని, మనసుకి నచ్చనిది రాబోతోంది అంటే, ఆ క్షణం రాకుండా ఉండేలాగా వేయి విధాలుగా కోరుతుంది. ఈ పాట ఆరంభం లో ఆర్య మనసులోని ఆలోచన, ఈ పాట రూపం లో రాసారు వనమాలి గారు. తను ప్రేమించే గీత, తను విడిచి ఉండలేని స్నేహితుడు ఇద్దరు ఇంక తనకి కనపడరు అన్న చేదు నిజం ఒక వైపు, తను అమితం గా ప్రేమించే గీత ఇంక తనకి దక్కదు అన్న విషయం తెల్సిన తరువాత తన హృదయం స్పందించకుండా మిగిలిపోతుంది అనే సత్యం సాక్షిగా అజయ్, గీత చేతులు కలిపిన క్షణం లో ఇలాగే తన జీవితం గడిపేయాలి అన్న ఆలోచన ఆర్య కి కలగటం ఎంతైనా సమంజసం. ఇంక ఓటమి అనేది రెండు సార్లు కలిగితే ఆ ఆలోచనతో కలిగిన దుఖం కలుగుతుంది ఆర్య కి. ఒక మనిషికి కలిగే దుఖం పోల్చటానికి కన్నీరు కొలత ఐతే ఆ కన్నీరు సముద్రం అంత పొంగితే మనిషి లోని దుఖం ఎంతో మనం ఊహించుకోవచ్చు.  ఈ మానసిక స్థితిని ఎంతో అద్బుతం గా వర్ణిస్తారు. కన్నులలోంచి జారే కన్నీరు, సముద్రం అంత అయితే ఆ సముద్రం లోంచి వచ్చే అలలు, తన జ్ఞాపకాలు. గడచిన ప్రతి నిమిషం గాయం గా మిగిలిపోతే, ఆ గాయం గమ్యం అయితే ప్రతి గమ్యం గీత పట్ల తనకున్న ప్రేమ కి గుర్తుగా మిగిలిపోతుంది, అటువంటి ప్రయాణం, ఈ క్షణం మిగిలిన జీవితం అంత గడిపేయాలి అనుకుంటాడు ఆర్య. ఇంతటి మధురానుభూతి మిగిల్చిన వనమాలి గారు అక్కడితో ఆగకుండా పదాలతో తన ప్రయాణం చరణాల్లో కొనసాగిస్తారు.



పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||


వనమాలి గారు ఈ చరణం తో ఈ పాట విన్న వారిని ఆకట్టుకుంటారు అనటం లో సందేహం లేదు, ఆర్యకి తన జీవితం లో మిగిలనిది ఇద్దరు, ఒకడు తన ప్రాణం అయిన స్నేహితుడు అజయ్ ఒక వైపు, మరో వైపు ప్రేమించిన గీత. ఈ సంఘర్షణ ఈ చరణం. అదే అత్యంత అద్బుతమైన పోలిక తో వివరిస్తారు. నది ప్రవహిస్తూ ఉంటే నదికి రెండు వైపులా తీరం ఉంటుంది. ఆ నదికి ఏ తీరం కి దగ్గర అవుతుంది ఆంటే జవాబు దొరకదు, అలాగే ఆర్య కి అజయ్, గీతాలలో ఎవరికీ దగ్గర ఆంటే ఎలా చెప్తాడు, నదికి రెండు తీరాలు ఎలాగో ఆర్య కి అలాగే. ఇంక ఆర్య జీవితం కూడా ఒక కలే. అతనికి అజయ్, గీత తన జీవితం లో ప్రవేశించటం ఒక కల. నిద్ర దాటి వచ్చే కల మెలుకువగా ఉన్నప్పుడు ఏ కంటి లోంచి వచ్చిందో ఆ కంటి కి సొంతం అవుతాము ఆంటే జవాబు దొరకదు, ఎందుకంటే రెండు కళ్ళు మూసుకుంటేనే నిద్ర,. ఆ నిద్ర లో వచ్చేదే కల. ఇంక మెలుకువ వచ్చిన తరువాత ఈ కన్ను నాది ఆంటే ఏమని చెప్తాం? ఇంక తరువాత వాఖ్యాలు విన్న తరువాత వనమాలి పద సౌందర్యానికి అచ్చెరువు పొందాల్సిందే. ప్రేమ నేస్తం అవుతుంటే, తనలోని సగం  ప్రశ్న గానే మిగిలి పోతుంది కదా, ఆంటే ప్రేమ సఫలీకృతం అయితే ఆ ప్రేమ తనలో సగం అయ్యేది, అది అవ్వకుండా ప్రశ్న గా మిగిలిపోతుంది. అప్పుడు ఆ బంధం విడిపోకుండా ఉండటానికి వీలు లేకుండా ఉంటుందా అని ఆర్య అనుకోవటం సినిమా లో అతని పాత్ర గురించి ఇంత కన్నా చక్కని వివరణ ఉండదు.

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .
మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..      || కరిగే లోగా ||

ఇంక ఈ పాట కొనసాగుతూ చివరి చరణం లో పతాకానికి చేరుకుంటుంది. ఆర్య తన స్నేహితుని కోసం అన్ని చేస్తాడు, కాని తను అడుగడుగునా అతనికి బాధ కలిగే విషయాలే జరుగుతూ ఉంటాయి. పెదవుల పై నవ్వుని, పువ్వు తో పోల్చటం కవి ఆలోచన శక్తి కి నిదర్సనం. వికసించిన పువ్వులు ఎంత అందం గా ఉంటాయో ఆ చిరు నవ్వు కూడా అంతే అందం గా ఉంటుంది కాని కన్నీటి తో ఆ పువ్వులని పెంచటం అన్నది ఏందో అందమైన వర్ణన ఆర్య పాత్ర కి.  గీత మనసులో ఆర్య పట్ల కలిగే సానుభూతి కి జరిగే పరిణామాలకి ఈ వాఖ్యం నిదర్సనం. ఇక్కడ ఆలోచిస్తే గీతకే కాదు ప్రేక్షకుడికి కూడా ఆర్య పట్ల సానుభూతి కలుగుతుంది. ఇక్కడ వరకు గీత గురించి చెప్తే మరల ఆర్య దగ్గరకి, ఆ సన్నివేశానికి వచ్చేస్తారు వనమాలి,. గీత అజయ్ వెళ్లిపోతుంటే, ఆ దృశ్యం ఆర్య లో కలిగే ఆవేదన తో పోల్చటం ఆ తరువాత ఆ క్షణం అలాగ తన జీవితం అంతా ఉండిపోతే, ఎన్ని జన్మలైన ఇలాంటి క్షణాలు ఉండిపోతాయి అనటం అక్కడే పాట అంతం అయిపోవటం, అందరిలోనూ ఒక అందమైన అనుభూతి మిగిలి పోతుంది.

కొసమెరుపు:  ఆర్య -2 ఆడియో లో ఇదే పాట దేవి శ్రీ సోదరుడు సాగర్ ఇంకో వెర్షన్ పాడతాడు (D-Plugged). ఈ పాటకి సాగర్ గళానికి తోడుగా గిటార్ మాత్రమే ఉంటుంది.  ఈ పాట సినిమాలో వచ్చే పాట అంత వేగం గా, ఉండకపోయినా కొంచెం సున్నితం గా సాఫ్ట్ గా ఉండి విన్న వాళ్ళకి ఏమాత్రం తగ్గని అదే అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా లో ఎన్ని పాటలు జనాదరణ పొందినా, ఇటువంటి పాటలు హృదయానికి హత్తుకు పోతాయి. ఈ సినిమా లో మిగితా పాటలు ప్రాచుర్యం పొందినంత గా ఈ పాత కి గుర్తింపు లభించలేదేమో అనిపిస్తుంది . ఈ పాటకి తగ్గ గుర్తింపు లభిస్తే, వనమాలి, దేవిశ్రీ, గాయకులు పడిన శ్రమ కి ఫలితం దక్కినట్టే.


Monday, March 19, 2012

Song of the week - Vandemaatara geetham


ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name: వందేమాతరం
Producer: పోకూరి బాబురావు
Director: తొట్టెంపూడి కృష్ణ
Music Director: చక్రవర్తి
Singer(s): "వందేమాతరం" శ్రీనివాస్
Lyrics: C నారాయణ రెడ్డి
Year of Release: 1985


వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతర గీతం వరస మారుతున్నది (2 )
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది

సుజల విమల కీర్తనలో సుఫలాసయ వర్తనలో (2 )
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ సీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||

సస్యశ్యామల విభవస్తవ గితాలాపనలో (2 )
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
శుభ్రజ్యోత్స్న పులకిత సురుచిర యామినులలోన
రంగు రంగు చికట్ల గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||

పుల్లకుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు (2 )
చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషనలకేమి
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది (2 ) అక్కడనే ఉన్నది || వందే మాతరం.. వందే మాతరం..||

తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది


ఈ పాట శ్రీనివాస్ గారి సినీ జీవితం లో పాడిన మూడవ పాట. ఆయన పాడిన మొదటి పాట మాదాల రంగారావు గారి "స్వరాజ్యం" సినిమా. రెండోవ సినిమా నేటి భారతం అది కూడా టి. కృష్ణ గారిదే. ఈ పాట శ్రీనివాస్ గారు పాడిన మూడవ పాట. ఈ పాట నారాయణ రెడ్డి గారు రాసిన తరువాత ప్రజా నాట్య మండలి వాళ్ళు స్వరపరచి పాడుకుంటూ ఉండేవారు. ఆ సంస్థ కి చెందిన శ్రీనివాస్ గారు ఒంగోలులో జర్నలిస్ట్ శ్రీరాం గారి ఇంట్లో జరిగిన వివాహం సందర్భం గా పాడినప్పుడు, టి.కృష్ణ గారు ఆ పాట విని నచ్చి, పాట గురించి వివరాలు అడగటం, నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట అని శ్రీనివాస్ గారు చెప్పగా, టి కృష్ణ గారు సి. నారాయణరెడ్డి గారి తో సంప్రదించి, ఈ పాట, అదే బాణి తో యథా తథంగా సినిమా లో పెట్టు కోవటం జరిగింది. అంతే కాకుండా సినిమా పేరు, చివరికి శ్రీనివాస్ గారు వందే మాతరం శ్రీనివాస్ గా మారటం జరిగింది. అప్పటికే చాల మంది శ్రీనివాస్ లు సిని పరిశ్రమం లో ఉండటం వల్ల అలాగ స్థిరపడి పోయారు వందేమాతరం శ్రీనివాస్ గారు. ఒక ఇంటర్వ్యూ లో ఈ వివరాలన్నీ చెప్పారు వందేమాతరం శ్రీనివాస్ గారు.


టి.కృష్ణ గారు అతి తక్కువ కాలం లో అర్థ వంతమైన సినిమాలు తీసి ఈ ప్రపంచం నుంచి అంతే వేగం గా అంతర్థానం అయ్యారు. ఆయన సినీ జీవితం మూడు సంవత్సరాలైనా ఆయన సినీ చరిత్ర లో చిరాయువును పొందిన వాళ్ళలో ఒకరు. ఆయన తీసినవి అర్థవంతమైన, ఆయనకీ విప్లవ సినీ దర్శకుడు అనే ముద్రని ఇచ్చేసారు సినీ పండితులు/విమర్శకులు. విప్లవం అంటే పోరాటం. కాని మనలోని లోపాలని ఎత్తు చూపేవి విప్లవం కాదేమో. ఏది ఏమైనా టి.కృష్ణ గారు తన సినిమా తో సమాజ పరిస్థితులని అద్దం పట్టి చూపించే ప్రయత్నాలు చేసి మన్ననలను పొందారు. ఈ వందే మాతరం సినిమా కూడా అదే కోవకు చెందినదే.

వందే మాతరం 1882 లో బంకిం చంద్ర చట్టర్జీ రాసిన బెంగాలి-సంస్కృత పద్యం. ఇది ఆనంద మాత అనే నవలలో రాసుకున్నది. ఒరిజినల్ పాటలో ఆరు చరణాలు ఉండగా అందులో మొదటి రెండు పద్యాలు (చరణాలు) తీసుకొని భారత రాజ్యాంగ దినం సందర్భం గా జాతీయ గీతం గా మార్చ బడింది. దుర్గా మాత మీద రాసిన ఈ పాట లోని మొదటి రెండు చరణాలు భారత మాత మీద అన్వయించుకొని పాట లోని మిగితా పద్యాలు వదిలెయ్యటం జరిగింది. ఈ జాతీయ గీతం భారతీయులు అత్యంత గౌరవం తో పాడుకొనే పాట. మొదటి సారి రబీంద్ర నాథ్ టాగూర్ 1896 Indian National Congress సదస్సు లో పాడగా ప్రాచుర్యం పొందింది. భారత స్వాతంత్ర్యం ముందు ఈ పాట ఎందరినో ఉత్తేజ పరచింది. బ్రిటిష్ వారు ఈ వందేమాతరం పదాన్ని బహిష్కరించటం కూడా జరిగింది. కాని ఇందులో దుర్గా మాత మీద పాట కారణం గా ఇతర మతస్తులకి ఇబ్బంది కలుగుతుంది అని ప్రార్థన గీతం గా తిరస్కరింపబడి, జాతీయ గీతం గా మారింది. ఎంతో గౌరవం, ఎంతో చరిత్ర కలిగిన ఇటువంటి పాటలని మార్చటం భావ్యం కాదు. ఈ వందేమాతరం సినిమాలో సినిమా పాటగా మార్చి పిల్లల చేత మాష్టారు పాడించటం సహించలేక తనలోని ఆవేదనని, ఆవేశాన్ని ఈ పాట రూపం గా పాడతాడు, సమాజ పరిస్థితులని వేలు ఎత్తి చూపుతూ దేశం ఎలా గతి తప్పుతోందో ఈ పాట ద్వారా చెప్తాడు కథానాయకుడు. తను ఊహించిన భారత మాత, జాతీయ గీతం లో వివరించిన భారత మాత ఎలా మారిపోతోందో చూడలేక ఆవేదనని వెల్లకక్కుతాడు కథానాయకుడు.

సి. నారాయణ రెడ్డి గారు పరిచయం అవసరం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి. అయన ఈ పాట ఎంత ఆలోచనతో రాసారో, అదే భావాన్ని హృదయాలని తాకేటట్లు పాడతారు వందేమాతరం శ్రీనివాస్ గారు. ఈ పాట విన్న తరువాత ఒక్క క్షణం దేశం గురించి ఆలోచన రావటం అత్యంత సహజమైన భావం. కృష్ణ గారు సినిమాలో పాట స్వరం మార్చినట్టు చూపినా అసలైన భారత దేశం రూపు గతి మారిపోయింది అది ఎలా మారుతోంది అని చాల నిశితం గా ఎవరిని ఆరోపించకుండా సున్నితం గా రాసారు నారాయణ రెడ్డి గారు. జాతీయ గీతం లోని ప్రతి పదం వాడుకొని అది ఎలా మారిందో చెప్పే ప్రయత్నం చేసారు. అందుకే ఈ పాట వినే ముందు జాతీయ గీతం వినటం ఎంతైనా అవసరం,ఆ గీతం అర్థం అవ్వటం కూడా అవసరం. భారత దేశం ఒక్క గొప్పతనం ఎంతో సుందరంగా వర్ణించే వందేమాతర గీతం తరాలు మారుతున్న రీతి లో ఆ గొప్పతనం, సహజమైన సుందరం ఎలా కోల్పోతున్నదో ఎంతో ఆవేదనతో వివరించటం జరుగుతుంది. ఈ మార్పుకి ఎవరిని నిందించకుండా రాయటం వల్ల ఆ పాటకి వివాద రహితమైన ప్రాచుర్యం లభించింది. వందేమాతరం శ్రీనివాస్ గారి గళం సహజమైన వరం. ఆ గొంతులో అంతులేని ఆవేదన పలుకుతుంది. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు, అందరిని పలుకరిస్తారు, కాని అయన గొంతులో ఇంతటి ఆవేదన, విషాదం పలకటం ఆయనకి సహజ సిదం గా లభించిన కటాక్షం. అందుకే ఆయనకి ఎందరి గొంతుల్లో మారు మ్రోగిన వందేమాతరం ఇంటి పేరు గా మారటం అయన చేసుకున్న అనేక జన్మల సుకృతం.

ఇంక పాట లోకి వెళ్తే,


వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతరం.. వందే మాతరం..
వందే మాతర గీతం వరస మారుతున్నది (2 )
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది


సుకృతం. వందే మాతరం అంటే ఓ మాత నీకు వందనం. స్వాతంత్రం రాక ముందు ఈ పదం ప్రతి భారతీయుడి నోట పలికిన పదం ఇది. ఆంగ్లేయుని గుండెలో భయం నింపిన పదం ఇది. స్వరాజ్యం కాంక్షించే ప్రతి మనిషిని ఏకం చేసిన పదం ఇది. స్వరాజ్యం అంటే తెలియని వాళ్లకి అది ఎంతో తెలియ చెప్పిన పదం ఇది. అటువంటి పద గీతం వందేమాతరం గీతం. ఆ పాట స్వరం మారుతోంది, పాడే విధానం మారుతోంది, దానికి ఉన్న గొప్పతనం తగ్గిపోతోంది, తరాలు మారుతున్న మనం అనేక విధానాలు గా మారుతున్నాం. ఒక విధంగా చూస్తె వందేమాతర గీతం అంటే ఒకప్పుడు ఉన్న గౌరవం పోయింది. అట్లాగే కొత్త తరంకి ఈ పాట గురించి కాని, పాట ఒక్క చరిత్ర కాని, ఈ పాట ఎందుకు పాడాలి అనే విషయాలు తెలియవు. అంతే కాక  చాల మందికి ఈ పాట చూడకుండా పాడటం కూడా రాదు. ఈ పాట చాల బళ్ళలో పాడించటం కూడా తగ్గి పోయింది. వందేమాతరం పాట కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ విషయాలన్నీ పాట రీత్యా చూస్తె, కాని భారత మాత దృష్ట్యా చూస్తె పాటలో వర్ణించినట్లుగా భారత దేశ రూపు రేఖలు మారిపోతున్నాయి, ఎంతో గొప్పగా వివరించిన భారత మాత తన స్వరూపమే కోల్పోయింది, తరాల మార్పు తో . భారత దేశపు ఉన్నాయా విలువలు, భావాలు తెలియ చెప్పే లక్షణాలు అన్ని మాయం అయిపోతున్నాయి. అవి అన్ని రాను రాను కరువై పోతున్నాయి. అందుకే వందేమాతర గీతం భారత మాత గీతం, ఆ గీతం ద్వారా వివరించిన భారతమాత మారిపోతోంది, ఏది ఎలా మారుతోంది అనేది అసలు పాట మొత్తం విని ఆ పాట లో ఎలా వివరింప బడి ఉంది ఆ అంతరం ఎలా ఉంది అనే విషయాలు వివరిస్తారు సి. నా. రే.

సుజల విమల కీర్తనలో సుఫలాసయ వర్తనలో (2 )
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ సీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||


భారత దేశంలో ఉన్న నదులన్నీ ఒకప్పుడు దేశం మొత్తం పారుతూ అందాన్ని తేవటమే కాకుండా ఆ పారిన భూమి కి బలం తెచ్చి, పంటలు పండించి ఆహరం ప్రసాదించేవి. అందుకే భారత దేశం ఎప్పుడు  నీరు తో నిండు ఉండేది. ఆ ఆహారం అందరికి సరిపోయి జనాలకి బలం చేకూర్చేది. కాని కాల రీత్యా జరుగుతున్నామార్పుల వలన జనం పెరిగి, జాలం లేక, పొలం దున్నలేక, ఆహారం పండించలేక ఆహరం కొని తినే స్తోమత లేక జనాలు చిక్కి పోయి ఆకలి తో ఎండిపోతున్న దృశ్యం ఒక వైపు అయితే, నదీ జలాలు కరువయ్యి భూములు ఎండిపోతున్నాయి. భారత దేశం సస్య శ్యామల దేశం గా చరిత్ర చెపుతుంది, ఎప్పుడు ఆహార లేమి తెలియకుండా ఉండటం కూడా చరిత్ర లో చూస్తాం,  అనేక  రకాల ఆహార దినుసులు పండేవి కాని ఇప్పుడు పరిస్తితి అలాగ కాదు. మనకి వచ్చే ఋతు పవనాలు, చల్లటి  గాలులు ఇవ్వన్ని బాగున్నాయి అనిపించినా ,దేశాన్ని ప్రేమించిన వాళ్ళకి ఇవన్ని చూస్తె ఎంత ఆవేశం కలుగుతోందో  మనకి తెలుసు. ఎప్పుడైనా ఏదైనా దేశం అభివృద్ధి దిశగా పయనించాలి, కాని భారత దేశంలో జరుగుతున్న అరాచకాలు తెచ్చే మంట, కసి కోపం రగిలిస్తూ , దేశం ఒక్క అభివృద్ధి స్వరం మారుతోంది అంటారు సి  నా  రే .

సస్యశ్యామల విభవస్తవ గితాలాపనలో (2 )
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
శుభ్రజ్యోత్స్న పులకిత సురుచిర యామినులలోన
రంగు రంగు చికట్ల గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది || వందే మాతరం.. వందే మాతరం..||


భారత  దేశ  పల్లెటూర్ల పచ్చదనం మన దేశానికి బలం, అదే మన దేశ ఆయువు పట్టు, మన రైతులకి బలం, మనందరికీ ఆనందం. అలాంటిది, సరి ఐన నీరు లేక, నీరు ఉన్న పొలం కి సరిపడా నీరు అందించే యంత్రాలు అందుబాటులో లేక ఎదుగుతున్న పైరు కి నీరు అందించలేక మనం ఏమి చెయ్యక భూమి లో పండించే తాహతు లేక ఇలాగ అనేక కారణాల వల్ల భూమి బీడు గా మారి పోతోంది, భారత మాత అంటేనే సస్య శ్యామల మైన పొలాలు. అవి లేక భూమి పగిలి నోరు తెరచినట్లు విరిగి పోతోంది. అంటే కాక  పచని చేలు, నదీ జలాల మీద వెన్నెల పారుతుంటే ఆ చూపు తో పులకించిన భారత మాత రంగు మార్చి, చీకటి లో రంగు రంగు వ్యాపారాలకి గిరాకి పెరిగి పోతోంది. దేశం భ్రష్టు పట్టి పోతోంది, నదీ ప్రవాహాల హోయలలో, గాలికి ఊగుతూ పంట చేలు చేసే శబ్దాల తో పులకరించే భారత మాత అవి అన్ని కరువయ్యి గతి తప్పి వేరే దారి లో ప్రయాణం చేస్తుంటే తరం మారుతున్న భారత  దేశ  స్వరం మారుతోంది కదా.. 

పుల్లకుసుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు (2 )
చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషనలకేమి
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది (2 ) అక్కడనే ఉన్నది || వందే మాతరం.. వందే మాతరం..||


రాజకీయ నాయకులు నేతల మీద సున్నితంగా వేసిన విమర్సనాస్త్రం ఇది, సరిగ్గా చెప్పాలంటే మన దేశానికి పట్టిన చీడ రాజకీయం. అది వదలకుండా, ఏమి చేసిన పోకుండా అంటుకుపోయింది భారత దేశం లో.ఈ నేతలు చేసే వాగ్దానాలు వాళ్ళు చెప్పే తేనే పూసిన మాటలు, ఏదేదో చేస్తాం దేశాన్ని ఎక్కడికో తీసుకెళతాం, జనాలకి ఏదేదో హామీలు ఇచ్చి చేసే ఉపన్యాసాలు, అన్ని మధురంగా వినపడే మాటలు. ఇంక చేతలకోచ్చే సరికి ఎక్కడికి కదలవు, నేతలు వేసే ప్రణాలికలు వాటికి వేసే పునాది రాళ్ళు, రాళ్లలాగే ఉండి పోతున్నాయి, మళ్ళ ఎన్నికల సమయానికి  గాని గుర్తుకు రావు, అందుకే అంటారు సి నా రే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అని, టి.కృష్ణ గారు కూడా   పునాది రాయిని చూపిస్తారు. ప్రజల కోసం తమ జీవితం అంకితం అని చెప్పే నాయకులూ, సామాన్య ప్రజల బాధలు పట్టించుకోకుండా, వాళ్ళు అనేక తరాలకి సరిపడే సంపద కూడబెట్టుకుని ఆనందిస్తున్నారు. సామాన్య ప్రజలకి ఒరగపెట్టేది ఏమి లేదు. ఎంతో అందం గా అలంకరింపబడిన భారతమాత కు ఇలాంటి చీడ పట్టింది. రాజకీయం మాటున విషం మరుగుతోంది, అభివృద్ధి లేకుండా అక్కడే ఉంటోంది, అందుకే భారత గీతం స్వరం మారుతోంది అంటారు.

కొసమెరుపు: "కన్నతల్లినే ప్రేమించటం మర్చిపోయిన ఈ దేశంలో దేశ మాత గురించి ఇంతలా ఆవేదన పడుతున్న నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొన ఊపిరితో జీవించి ఉంది బాబు" అంటూ సినిమాలో కథానాయకుడిని పొగడుతూ చెప్పిస్తారు టి. కృష్ణ గారు. కన్న తల్లి, ఊరు, దేశం ఈ మూడిటికి, ప్రతి మనిదికి ఉండేది ఒకటే రాగం అది అనురాగం. అన్ని మర్చి పోయి స్వలాభం కోసం ఎవరికీ ఏమి చెయ్యలేక, చెయ్యటం ఇష్టం లేక, కారణం ఏదైనా కాని, దేశం ఎటు పోయిన పరవాలేదు, మనం బాగుంటే చాలు అనే ఆలోచన తో ఉన్నే ఈ తరం, ఒక్క క్షణం ఆలోచిస్తే, మనం ఏమి చెయ్యాలి అన్న ఆలోచనలో పడితే ఈ పాట సఫలీకృతం అయినట్టే. తమ కోసం అన్ని వదలుకొని ఈ వందేమాతరం అంటూ దేశ గీతాన్ని ఆలాపిస్తూ, దేశాన్ని ప్రేమించి, దేశం కోసం తమ జీవితాలు అర్పించి, మాత్రు భూమి శృంఖలాలు తెంచి బంధ విముక్తురాలుగా చేసిన అనేక మంది దేశ భక్తులకి ఆ ఆలోచనే మనం ఇచ్చే అసలైన నివాళి.  మన దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకు వెళ్ళటానికి, దానికి అడ్డుపడే, మనకు పట్టిన అన్ని చీడలు వదల్చుకొని, తిరిగి భారత దేశం సస్య  స్యామలమై , సుజలమై, మలయజ సీతలమై, కుసుమాలతో ప్రభవిల్లి, సుప్రజ్యోత్స్నా అయి, సుహాసిని అయి, సుఖద అయి, పులకించి, భరత మాత మురిసి మెరిసి పోయే రోజు raavali     అని  కళలు కంటూ ఆసిస్తూ, అందుకు కావలసిన  దానికి ఏమి చెయ్యాలో ఈ తరం ఆలోచించి ఆచరణలో మార్చి వందేమాతర గీతానికి స్వరం తిరిగి రాద్దాం.

Saturday, March 10, 2012

Song of the Week - Koyila paata bagundaa

Movie:               Ninne Premistaa
Director:            RR Shinde
Producer:            RB Chowdary
Music:               SA Raj Kumar
Singer(s):           K.S Chitra, SP Balasubrahmanyam
Lyrics:              Sirivennela Seetarama Sastry
Year of Release:     2000

కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  ( 2 )
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్టుగా .. 
ఇప్పుడెందుకో అర్థ రాత్రి వేళలో ....గుర్తు కోస్తోంది కొత్త కోతగా 

నిదురించిన ఎద నదిలో అలలెగసిన అలజడిగా 
తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాది ఇదా 
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా 
కలలు కనే కన్నులలో కునుకెరగని కలవరమ
రేయిలోని పలవరమ హాయిలోని పరవశమ
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల || 

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది 
అల్లి బిల్లి మేఘమాల బాగుంది 
చిలకమ్మాబాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది

పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది

సాధారణంగా ఒక భాష లో తీసిన సినిమా వేరే భాష లో మరల తీస్తే ఆ సినిమా విజయవంతం కావొచ్చు కాకపోవోచ్చు కాని ఒరిజినల్ సినిమా అంత విజయవంతం అయిన సందర్భాలు తక్కువ. కాని ఈ సినిమా విజయ వంతం కావటానికి కారణం సినిమా లోని నటీ నటులే. నాగార్జున, రాజేంద్రప్రసాద్, సౌందర్య, శ్రీకాంత్ మొదలగు వారు అద్బుతం గా నటించి ఈ చిత్ర విజయానికి కారకులయ్యారు. RR షిండే అంతకు ముందు సహాయ దర్శకుని గా పనిచేసి ఈ సినిమాతో దర్శకుడు అయ్యాడు. కథనం, దర్సకత్వం లో వైవిధ్యం చూపిన ఆ తరువాత మరల సినిమాలు చేసే అవకాశం దక్కలేదు ఎందుకనో మరి. చిత్ర ఈ పాట కి ప్రాణం, ఆమె గురించి ఎంత చెప్పిన తక్కువే.

ఈ సినిమా కథకి వస్తే కళ్యాణ్ అనే ఒక బ్యాంకు ఆఫీసర్ తన అసిస్టంట్ (రాజేంద్ర ప్రసాద్) తో పట్టిసీమకి వస్తాడు ఉద్యోగ రీత్యా. అక్కడ గాలిపటంతో ఒక అద్బుతమైన సౌందర్యమైన  అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి (మేఘమాల )  కళ్యాణ్ ని అనుసరిస్తూ ఉంటుంది. అతని కళ్ళనే చూస్తూ ఉంటుంది. మేఘ మాల కళ్యాణ్ కోసం అన్ని పనులు చేస్తూ అన్నింటిలో సహాయం గా ఉంటుంది. ఆమె చేసే ఏర్పాట్లు అన్ని కళ్ళ కోసం అంటూ ఉంటుంది.  కళ్యాణ్ కి ఇవి ఏమి అర్థం కాకపోయినా మేఘమాల కోసం మనసు పారేసుకుంటాడు. తన తల్లి తండ్రులని సంబంధం కోసం పిలిచి మేఘమాల తల్లి తండ్రులతో సంప్రదిస్తాడు. అప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఊహించని విధం గా ఆ పెళ్లి తిరస్కరిస్తుంది మేఘమాల. అంత ఇష్టం గా అన్ని చేస్తూ ఇలా పెళ్లి తిరస్కరించేసరికి నిర్ఘాంత పోయి కారణం అడుగుతాడు కళ్యాణ్. మేఘమాల ఏమి సమాధానం చెప్తుంది, ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది తెర మీద చూడవలసిందే.

ఇంక పాట సందర్భానికి వస్తే, అప్పుడే ఊర్లోకి అడుగు పెట్టిన కళ్యాణ్ కి, రాజేంద్ర ప్రసాద్ కి మేఘమాల ఇంటి ఎదురుగా వసతి ఏర్పాటు చేస్తారు. బ్యాంకు నౌఖరు ఆ పాడు పడిన ఇంట్లో ఒక దయ్యం తిరిగేది అని రాజేంద్ర ప్రసాద్ ని భయపెడతాడు. వాళ్ళు రాత్రి నిద్ర పోయే సమయానికి సరిగ్గా అదే సమయం లో కరెంటు పోతుంది. రేడియో లో పాటలు విన్న వాళ్ళకి ఒక తీయటి గొంతుతో పాట వినపడుతుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతూ కళ్యాణ్ తో పాటు అందరు లాంతరు పట్టుకొని తిరుగుతూ ఉంటే మేఘ మాల వాళ్ళ ఇంటి మేడ మీద పాడుతూ ఉంటుంది. ఆ సమయం రాత్రి అందులో పౌర్ణమి, నిండు చంద్రుడు, ఇంటి మేడ మీద అన్ని మొక్కలు చుట్టు పక్కల అన్ని చెట్లు, ఒక తెలుగు ఇల్లు ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది వాతావరణం. ఒక పక్క పంజరం లో చిలుకలు, అక్కడక్కడ చిలుకలు, పావురాళ్ళు, కుందేళ్ళు, మేడ మధ్యలో తులసి కోట, పదహారణాల అచ్చమైన పల్లెటూరి తెలుగు ఆడపడుచు, ఆ గొంతులోని మాధుర్యం, తెలుగు పాటకి ఇంతకన్నా ఏమి కావాలి? సరే మేఘమాల పాట పాడుతోంది కాని కళ్యాణ్ వెతుక్కుంటున్నాడు మనమూ వెళ్దాము.


కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా  ( 2 )
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

తెలుగు నాట ఇంట్లో కరెంటు పోవటం చాల సహజం, దానికి ఒక సందర్భం అంటూ ఉండదు. ఒకప్పుడు ఇళ్ళలో కరెంటు పొతే పిల్లలు అందరు ఆడుకోవటానికి ఒక చోట ఏకమైతే  పెద్ద వాళ్ళు అందరు కబుర్లతో కాలక్షేపం చేసే వారు. ఇప్పుడు ఇలాగ జరగటం చాల చోట్ల మనం చూడం. కాని ఇక్కడ మేఘ మాల ఊహల్లోకి వెళ్లి పాడుకోవటం దర్శకుని కథన ప్రతిభ. ఆ పాటకి సరి అయిన వాతావరణ  రంగులు అద్ది అన్ని హంగులు అమర్చటం సుందరం. ఈ పల్లవి ఆమె పాడుతున్న వాతావరణాన్ని వివరిస్తే, ఇంకో రకం గా తను అమితం గా ప్రేమించిన వ్యక్తి కళ్ళు వచ్చి కుశలం అడుగుతున్నట్టు ఊహించుకోవచ్చు. తను బాగున్నాను అని తననే ప్రశ్నించు కోవటం లాంటిది. కానీ చుట్టు పక్కల ఉన్న చిలుకల్ని, పౌర్ణమి నాటి తోటలోని పైర గాలిని అడుగుతుంది మేఘమాల. అది ఏమని, కమ్మగా పాడే కోయిల పాట, గాలికి అటు ఇటు ఒక లయలాగా ఊగే చెట్లు కొమ్మల శబ్దం, తన ఇంటి చుట్టు పౌర్ణమి కాంతులతో వెలిగే తన తోట, వెన్నెల కాంతి వెదజల్లుతూ చుట్టు ఉన్న కాంతి. ఇవన్ని బాగుండేవే. ఇంకా ఏమని అడుగుతోంది, మల్లె లాంటి స్వచ్చమైన తెల్లదనం తో అందం తో మెరిసిపోతున్న అమ్మాయి, అదే ఈ అల్లి బిల్లి మేఘమాల బాగుందా అని చిలకమ్మని, చిరు గాలిని. ఆ వాతావరణం ఎంత అందం గా ఉందొ, ఆహ్లాదం గా ఉందొ, తన మనసు కూడా అలాగే ఉంది అని అనుకుంటోంది మేఘమాల... దర్శకుడు చిరుగాలి అన్నప్పుడు గాలిని, చిలుకమ్మ అన్నప్పుడు చిలుకని ఈ పాటంతా చూపించటం బాగుంటుంది.

అప్పుడెప్పుడో గున్నమావి తోటలో అట్లతద్ది ఊయలూగినట్టుగా .. 
ఇప్పుడెందుకో అర్థ రాత్రి వేళలో ....గుర్తు కోస్తోంది కొత్త కోతగా 
నిదురించిన ఎద నదిలో అలలెగసిన అలజడిగా 
తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాది ఇదా 
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల ||

తెలుగు నాట పల్లెటూర్లలో అట్ల తద్ది అందరు కలిసి ఉత్సాహం గా జరుపుకునే పండుగ. ఇప్పటి వాళ్ళలో చాలామందికి ఈ పండుగ అంటే తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు నేటివిటి అంటాము అంటే ఇదే. మన పండుగలు, మన అలవాట్లు మన పద్దతులు వీలైనప్పుడు ఎక్కడో ఒక చోట స్ప్రుసిన్చటం కవులు, కళాకారుల లక్షణం. ఇక్కడ సిరివెన్నెల ధారాళం గా వాడారు ఈ పాటలో. గున్న మామిడి తోటలు మన తెలుగు నాట సర్వ సాధారణం. ఇవి కూడా ఎంత మందికి తెలుసో. గున్న మామిడి తోట అంటే చిన్న చిన్న మామిడి చెట్లున్న తోట. ఈ చెట్లకి ఊయ్యాలలు వేసి ఆడుకోవటం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటు లో లేనప్పుడు అందరు చేసే కాలక్షేపం. అట్లతద్ది నాడు పిల్లలు అందరు ఆడుకోవటం అది ఇలాంటి ఏకాంత సమయం లో గుర్తుకు వస్తోంది ఎందుకో కొత్త కొత్తగా, అది ఎందుకు అంటే, సినిమా కథ చెప్తుంది. తన శ్రీనివాస్ ని కోల్పోయిన తరువాత మర్చిపోయి ఉన్నప్పుడు ఈ కళ్యాణ్ అతని కళ్ళను గుర్తుకు చెయ్యటం, ఆమెలో అలజడిని రేపుతుంది. అందుకే మరచి పోయిన నదిలోని అలల్లాగా రేగుతున్న అలజడి అంటారు ఈ జ్ఞాపకం. ఒక పక్క శ్రీనివాస్ లేడన్న చేదు నిజం వేప పూవు లాగ చేదు గా ఉంటే, అతని కళ్ళ ద్వారా తిరిగి చూడటం ఒక కొత్త తీయదనం. ఈ రెండు భావాల కలయికని అన్ని రుచుల పండుగ ఉగాది తో పోల్చటం, ఆమె మనసులో జరిగే కోలాహలం కి సంకేతం, మనకి రాబోయే కథకి అంతర్లీనంగా సూచన. ఇంతటి భావం చెప్పటం సిరివెన్నెల చమత్కారం. ఈ చరణం చివర బాలు గారు పాడిన ఆలాపన చాల అద్బుతం గా ఉంటుంది.

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా 
కలలు కనే కన్నులలో కునుకెరగని కలవరమ
రేయిలోని పలవరమ హాయిలోని పరవశమ
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా  || కోయిల || 

పల్లెటూర్లలో కొబ్బరి తోటలు ఉన్న వారికి తెలుసు కొబ్బరి చెట్లతో ఎలా ఆడుకోవాలో, ఆకులు రాకెట్లాగ, మట్టలు క్రికెట్ బాట్ లాగ, మరల ఆకులతో బొమ్మలు ఎలా చెయ్యాలో. కొబ్బరి ఆకుల తో అబ్బాయి, అమ్మాయి బొమ్మలు చేసి వాటికి పెళ్లి చెయ్యటం ఒకప్పటి పిల్లల ఆటలు. ఆ బొమ్మలకి రక రకాలు గా ముస్తాబు చెయ్యటం, వాటికి కథ అల్లటం, ఇవ్వన్ని తెలుగు వాళ్ళు మరిచి పోలేనివి. వీటిని పాటలో చక్కగా పొదగటం సిరివెన్నెల గారు చేసిన వెన్నెల జాలం. ఆ బొమ్మలు ఎంత అందం గా ఉంటాయో, మబ్బు చాటున ఉన్న చంద్రుడు కూడా అంటే అందం గా ఉంటాడు. అందుకే అంటారు చంద్రున్ని చూడాలంటె రెండు వెల్ల మధ్య కాని, ఆకుల చాటున కాని చూడాలి అని. ఈ పోలిక చెయ్యటం తో తప్పకుండ తెలుగు వారి హృదయాన్ని తాకుతారు సిరివెన్నెల. ఇంక మరల మేఘ మాల మీదకి ఆమె లోని పరవశం, కలవరం గురించి, కలలు కంటున్న కన్నులలో ఈ అలజడి కునుకు లేకుండా చేస్తుంటే అది నిద్రలోని పలవరమో, లేక ఆనందం వాళ్ళ వచ్చిన పరవశం ఏమో చిలకమ్మా, ఓ చిరుగాలి చెప్పండి అంటుంది మేఘమాల. పాట చిత్రీకరణ లో ఆహ్లాదం తో పాటు హాస్యం కూడా జత చేరుస్తారు షిండే రాజేంద్ర ప్రసాద్ రూపం లో.

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది 
అల్లి బిల్లి మేఘమాల బాగుంది 
చిలకమ్మాబాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట  బాగుంది వెన్నెల సిరి  బాగుంది


ఇంక చివరిగా కళ్యాణ్ మనసు రూపంలో ప్రశ్నలకి సమాధానం చెప్పించి పాట ముగుస్తారు దర్శకులు. ఆమె పల్లవిలో అడిగినవన్ని బాగున్నాయి అంటూ. ఈ చరణం లో బాలు గారి గొంతు అమృతం. అయన గొంతు ఇలాంటి పాటలలో ఎంత అద్బుతం గా ఉంటుందో వింటే కాని అర్థం అవ్వదు, ఇలాంటి అంటే, పాట మొత్తం గాయని పాడగా చివర్లో ఆయన పాడినప్పుడు ఆయన పాట మొదలు పెట్టినప్పుడు ఒక్క సారి ఒళ్ళు జలదరిస్తుంది, రోమాలు నిక్కపోడుస్తాయి, అది ఆయన గంధర్వ గళం మహత్యం.


 SA రాజ్ కుమార్ అంటే అందరికి తెలసినది ఏమిటి అంటే, సాధారణం గా ఒకే పాట ట్యూన్ పట్టుకొని సినిమా మొత్తం వాడుకుంటారు అని ప్రసిద్ది. అదే పాట అదే ట్యూన్ అన్ని సినిమాలల్లో వాడుతూ ఉంటారు. కాని ఈ సినిమా కి అయన చేసిన సంగీతం బలం. పాటలు సినిమాకి ప్రాణం. ఇంకో పాట " గుడి గంటలు మ్రోగిన వేల" అనే పాట కూడా షిండే బాగా చిత్రీకరిస్తారు. 


కొసమెరుపు: వెన్నెల సిరి బాగుందా అని ఆడుతారు సిరివెన్నెల గారు పల్లవి లో కథానాయిక ద్వార, చివరికి కథానాయకుడి ద్వారా వెన్నెల సిరి బాగుంది అంటారు. ఇక్కడ మనం కూడా కొంచెం మార్చి సిరి (కురిపించే) వెన్నెల బాగుందా అంటే  మనం తప్పకుండా సిరి వెన్నెల గారు బాగుంది అండి అందాము.అయన రాసే పాటలు అయన కురిపించే సిరి. ఈ "నిన్నే ప్రేమిస్తా" సినిమాకి మాతృక 1999 లో తమిళం లో వచ్చిన "నీ వరువాయి ఏన" అనే సినిమా. ఇదే పాట తమిళం లో "పూన్కుయిల్ పాట్టు పుడిచ్చిరుకా". (కోయిల పాట నచ్చిందా) కాని ఆ పాటని మార్చి తెలుగుతనం ఉట్టి పడేలా రాయగలగటం సిరివెన్నెల మహత్యం.