Saturday, December 24, 2011

Song of the week - Tolisari mimmalni - Srivaariki Premalekha


నా సంగీత ప్రపంచం లో కొన్ని వేల పాటలు విని ఉంటాను, అందులో చాల పాటలు అలలు ఒడ్డుని తాకినట్లు వెళ్ళిపోగా, మరి కొన్ని చిరు గాలి లాగ మెల్లగ పృశించి వెళ్ళిపోయాయి.  కొన్ని హృదయానికి హత్తుకోగా కొన్ని మదిలో అలా నిలచిపోయాయి. వాటిలో కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్నాఏదో కొత్తదనం వాటిల్లో కనిపిస్తుంది. అలాంటి పాటలు వారానికి ఒకటి కాలం అనుమతి ఇస్తే నిక్షిప్త పరచుకోవాలనే చిన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. కాని ఆ కోరిక ఇట్లా బ్లాగ్ రూపం దాల్చటానికి ఇలా వీలు కుదురుతుంది అని ఎప్పుడు ఊహించలేదు. 
 
ఈ పాటల యొక్క వివరణ, విశ్లేషణ అంతా నా పరిమిత జ్ఞానం మాత్రమే. ఇది ఎవరి మీద ఎటువంటి విమర్శా కాదు. అలాగే ఇటువంటి  ఆణిముత్యాలని ఇచ్చిన  పెద్దలని కించపరచాలని కూడా కాదు. ఏమైనా తప్పులుంటే పెద్ద మనస్సు తో మన్నించండి. ఇందులో వచ్చే పాటల యొక్క వరుస వాటి గొప్పతనానికి సూచన కాదు, ఇది నాకు వచ్చిన జ్ఞాపకం, ఈ సమయానికి కుదిరిన వీలు మాత్రమే.

ఇక ఈ వారం పాట
తొలిసారి మిమ్మల్ని  చూసింది మొదలు - శ్రీవారికి ప్రేమలేఖ.
 
 

Movie -            Srivaariki premalekha
Director -         Jandhyala Subramanya Sastry
Production -     Usha Kiron Movies
Music Director - Ramesh Naidu
Lyrics -             Veturi Sundara Rama murthy
Singer -            S. Janaki


ఒక్కోసారి తెలుగు సినిమా పరిశ్రమ కొంత మంది పట్ల చాల క్రూరంగా ప్రవర్తిస్తుంది. అలాంటి వారిలో జంధ్యాల ఒకరు. అయన సకలకళ వల్లభుడు, కానీ ఆయనని హాస్య బ్రహ్మ గా ముద్రించి పరిమితం చేసేసారు. కాని ఆయనకి ఉన్న సంగీత సాహిత్య అభిరుచి చాల తక్కువ మందికి దర్శకులకి ఉంది.  ఆయన హాస్యం అందిరికి సుపరిచయమే, కానీ ఆయనలో రచన కౌసల్యం కొందరికే పరిచయం. నా దృష్టి లో అయన లోని సంభాషణ రచయిత మొదటి స్థానం సంపాదిస్తాడు. ఆ తరువాత స్థానం కథ రచయిత,  ఆ తరువాతే ఆయనలోని హాస్య దర్శకుడు, ఆ తరువాత అయన చేసిన ఇంకా చాల చాల పాత్రలు


ఇంక ఈ పాట లోకి వస్తే, ఈ సినిమా "చతుర"  మాస పత్రిక లో వచ్చిన కథని సినిమాగా తీసారు జంధ్యాల గారు. ఒక "Blind Love Letter" చుట్టూ తిరిగే కథ. దానికి జంధ్యాల గారు తనదైన శైలి లో హస్యత్మకంగా , సందేశఆత్మకంగా  తీసారు. అనేక సన్నివేశాలు ఎంతలా నవ్విస్తాయో, కొన్ని సన్నివేశాలు అంతేల ఆలోచింపచేస్తాయి. 

ఈ సినిమాలో కథానాయిక చాల చిలిపి, ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన భావాలు కల అమ్మాయి. నలుగురు స్నేహితురాళ్ళు కలసి ఒకరినొకరు ఆటపట్టిన్చుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భం లో "ఆడ పిల్ల ప్రేమలేఖ రాస్తే మురిసిపోని మగాడు ఉండడు, రాసే విధం లో రాస్తే ఎంతటి మొనగాడైన బొంగరాల్ల గిన్గరాలు తిరగాల్సిందే" అని    సరదాగా పందెం వేసుకొని, పేరు, ఊరు తెలియకుండా ఒకతనికి ప్రేమ సందేశం పంపిస్తే అతను వచ్చి తనకి జవాబు వచ్చి తీరుతుంది అని కథ నాయిక ప్రఘాడ నమ్మకం, తను రాసే ప్రేమలేఖ మీద, తన రచన కౌశల్యం మీద ఉన్న విశ్వాసం. అందులో మగాడి మనస్తత్వం పూర్తిగా చదివేసానన్న ఆత్మ విశ్వాసం. నేను ఉత్తరం రాసి మీకిస్తాను మీరు దాన్ని ఎవరికిష్టం వచ్చిన వాళ్ళకి పంపుతారో పంపుకోండి అని challenge చేసి ఉత్తరం రాయటం మొదలు పెడ్తుంది.
ఇటువంటి సన్నివేశానికి ఒక పాట రాయటం అంటే ఎంత కష్టమైనా పనో మనకి అర్థం అవుతుంది, ఎందుకంటే మొత్తం కథ అంత ఆ ఉత్తరం మీదే ఆధారపడి ఉంటుంది, వేటూరిగారు ఈ సన్నివేశం చెప్పినప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నారో పాట రాయటానికి తెలియదు కాని పాట వింటే అయన శ్రమ అర్థం అవుతుంది, అయనకి ఉన్న ఒకే ఒక్క బలం ఒక పాటని వెయ్యి రకాలు గా రాయగలగటం అని సిరివెన్నెల అనేక సందర్భాల్లో చెప్తారు, సినిమాలో నాయికా రాసి పేజీలు చింపేసినట్టుగా  ఆయనకూడా జంధ్యలగారికి నచ్చేంత వరకు రాసేసి ఉంటారు. ఏది ఏమైనా ఒక అత్యంత అద్బుతమైన పాట వచ్చింది, ఆ పాట వింటే అబ్బాయే కాదు ఎవరైనా మనసు పారేసుకుంటారు.


ఇంక రమేష్ నాయుడు గారు, జానకి ఈ పాటకి ప్రాణం పొయ్యటమే కాదు, చిరాయువుని ఇచ్చారు. జానకి గారి గొంతులో సహజమైన లాలిత్యం, శృంగారం, సుకుమారత్వం, మాధుర్యం , విరహం, తాపం అన్ని కలగలిపి ఈ పాట పాడగా ఎన్ని సార్లు విన్న మళ్ళ వినాలనిపిస్తుంది. అటువంటి గాత్రం పొందిన ఆవిడ దైవ స్వరూపమే.
  
ఇంక వేటూరి గారి పాటలోకి వస్తే,
శ్రీమన్మహారాజ  మార్తాండ  తేజా ప్రియానంద  భోజా మీ శ్రీచరణామ్భోజములకు
ప్రేమతో  నమస్కరించి మిము  వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములూ

అందరికి ఒక ప్రేమ లేఖ రాయాలంటే నిద్ర, ఆకలులు ఉండవు, కారణం ఏంటంటే ఎలా మొదలు పెట్టాలి అని, "First Impression is best impression"  అన్నట్టు ఎలా రాస్తే అవతలి వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు, మనని అర్థం చేసుకుంటారు అని. ఇంక ఆ తరువాత ఎలా సంబోధించాలి? ఇక్కడ అవతలి వారు ఎవరో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు, పేరు తెలియదు ఊరు తెలియదు, ఇంక ఎట్లా సంబోదించాలి? వేటూరి గారు ఆ కాల పరిస్తితులలో ఉత్తర ప్రత్యుత్తరాలకి అనుగుణంగా  అటు గ్రాంధికం గాను ఇటు వాచికం కాకుండా, మొదలు పెట్టారు ఆయన ప్రేమలేఖ అదే శ్రీవారికి ప్రేమ లేఖని. మహారాజశ్రీ, గౌరవనీయులు, చక్రవర్తి సమానులు అని మొదలు పెట్టటం 80's lo సామాన్యం. కానీ పల్లవిలోనే అయన మొత్తం రంగరించి పోసేసారు, మీ పాదాలకు నమస్కరించి, ఒక కన్నె పిల్ల ఎన్నో కలలు కంటూ వినయం తో విన్నపాలు చేస్తున్న అని మొదలు పెట్టారు, "సాయంగల" విన్నపములు అన్న ప్రయోగం గ్రందికం ఐన ఎంతో వన్నె తెస్తుంది. జంధ్యాల గారు ఈ పదాలకి అర్థం వివరించేలాగా అభినయిమ్పచేసారు. భయముతో అంటే హీరోయిన్ కన్నులు రెప్ప వెయ్యటం, పాదాలకి నమస్కరించటం ఇలాంటి చిత్రీకరణ పాటకి చక్కటి న్యాయం చెయ్యటమే.

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్నవేళ
 మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ  శుభ ముహూర్తాన 

వేటూరి గారు time and mood set  చేస్తున్నారు ఇక్కడ, "సంధ్య రాగం చంద్ర హారతి " అన్న ప్రయోగం ఎలా తట్టిందో వేటూరి గారికి, సంధ్య వేళలో మిమ్మల్ని చూసి మనసు పారేసుకున్నాను అని చెప్పటానికి ఇంతకన్నా అద్భుతమైన వివరణ ఉండదేమో.  జానకి గారి గొంతు లో ఈ రెండు వాఖ్యలు అమృతం లా వినిపిస్తాయి, మనసున్న వాళ్ళు ఎవరైనా దాన్ని పారేసుకుంటారు ఇలాంటి ప్రియురాలు ఉంటె. సరే ముహూర్తం చెప్పాం ఆ తరువాత ఏమి జరుగబోతోంది అన్న ఉత్సుకత కలిగిస్తుంది చదువుతున్న వారికి.

తొలిసారి  మిమ్మల్ని చూసింది  మొదలు
కదిలాయి  మదిలోన  ఎన్నెన్నో  కధలు ఎన్నేనేన్నో  కధలు
జో  అచ్యుతానంద  జో  జో  ముకుందా లాలి  పరమానంద  రామ  గోవిందా  జో  జో
ఇక్కడ వరకు వింటే ప్రేమలేఖలో జోల పాట ఏంటి అనుకుంటాం. అది వేటూరి గారి గొప్పతనం, మిమ్మల్ని చూసిన మొదలు నాకు కలవరం మొదలయ్యింది, ఇంక నిద్ర రావటం లేదు అన్నదాన్ని ఎంత అందం గా వివరించారో. ఎంత జోలపడుతున్న నిద్ర రావటం లేదు, మనసు మిమ్మల్ని కావాలని కోరుతోంది, దానికి తోడు వయసు చేస్తున్న తొందరని ఆపలేక ఇంక ఉండ బట్ట లేక రాసేస్తున్నా నావల్ల కాదు బాబు అంటూ నాయిక ఉన్న పరిస్థితిని అత్యద్భుతం గా వివరించారు వేటూరి గారు. ఇక్కడ రమేష్ నాయుడు గారు వేటూరి గారు రాసిన పాటకి ఎంతో గొప్పగా రాగం కట్టారు, జంధ్యాల గారు ఈ సన్నివేశాలకు చక్కటి న్యాయం చేసారు.

నిదుర  పోనీ కనుపాపలకు జోల పాడలేక ఈల  వేసి చంపుతున్న ఈడునాపలేక 
ఇన్నాళ్ళకు రాస్తున్నా హుహు  హుహు ప్రేమ లేఖ 

జంధ్యాల గారు వేకిలితనానికి, విసృనఖలానికి, విచ్చలవిడి తనానికి ఎక్కడ ఎప్పుడు తావునివ్వలేదు ఈడునాపలేక అన్నచోట్ల హావభావాలతో, కాలి కదలికలతో చెప్పిస్తారు. ఇటువంటి దర్శకులు తెలుగు సినిమాకి గర్వకారణం.

ఏ తల్లి కుమారులో తెలియదుగాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగదీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు 
వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి ||తొలిసారి ||

వేటూరి గారు ఇంక direct గా విషయం లోకి వచ్చేస్తారు. ఎవరైనా మనల్ని చాటు నుంచి గమనించి పొగడితే పడిపోకుండా ఉండలేము, ఇదే విషయం హీరోయిన్ ఈ పాటకి ముందు చెప్తుంది "ఏదైనా సరిగ్గా చెప్తే మనకి పడని
వాడు ఉండడు" అని. వేటూరి గారు, సరిగ్గా అదే చెప్తారు. అతనిని ఆకాశానికి ఎత్తేస్తారు. మీ గురించి కొంత తెలుసు గాని, ఆ తెలిసిన కొంత తోనే నన్ను మీ ప్రేమలో పడేసారు అని చెప్తే, ఇంక ఆ లేఖ చదివిన వాళ్ళు ప్రేమలో పడక ఏమి చేస్తారు. కవి ఎప్పుడు కాలాన్ని దృష్టి లో పెట్టుకొని రాస్తారు. అప్పట్లో అమ్మ్మాయి ప్రేమ విషయం లో చొరవ చూపించటం తక్కువే, అందుకని ఆ విషయం ప్రస్తావిస్తారు, అలాగే తప్పుల్ని మన్నించమని చెప్తూ, నేను మీకు అనుగుణం గానే ఉంటాను చప్పున బదులివ్వండి "reply at the earliest", అనే  request చేయిస్తారు  ఇక్కడ జంధ్యాల గారు హాస్యాన్ని కలగచేస్తారు సుత్తివేలు చేతిలో ఆ లేఖ పడితే వేలు చేసే చేష్టలతో. ఇంతటి చక్కని లేఖతో పరాచికాలు ఎంటా అనుకునేలోపల హీరో చేతిలో ఆ లేఖ పడేస్తారు, ఎంతైనా దర్శకుల ఆలోచనలు వేలకు వేలు...

తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే || ఆహ్  అబ్బా ||
సూర్యుడి చుట్టూ తిరిగే  భూమికి మల్లె నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే || ఆహ్ ఆహ్ ||
మీ  జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే 
ఇప్పుడే బదులివ్వండి ఇప్పుడే బదులివ్వండి ||తొలిసారి ||

ఒక్కోసారి కన్నె పిల్లైనా మల్లెని వదులుతుందేమో కానీ కవులు మల్లెని ఎప్పుడు విడువలేరు. తలలో మల్లెలు ఉంటె తుంటరి తలపులన్ని వస్తాయి, మల్లెకి ఉన్న శక్తి అటువంటిది, అప్పుడు కలిగే తాపంనుంచి వచ్చిన వేడిని, భూమి సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే వచ్చే వేడితో పోలిక వేటూరి గారికి తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదేమో, అలాగే సూర్యుని చుట్టూ తిరిగి వేడెక్కిన భూమికి చల్లతనం ఇచ్చే జాబిలితో అతనిని పోలిస్తే ఇంక అవతలి వాడు అక్కడికక్కడే జవాబు ఇవ్వక చస్తాడా,, మొదటి చరణం లో చప్పున బదులివ్వండి అన్న వేటూరి ఇక్కడ ఇప్పుడే ఇవ్వండి అంటారు. ఎందుకంటే ఈ చరణానికి ఉన్న మత్తు అలాంటిది.
ఇంక ఈ పాట తరువాత ఏమి జరుగుతుంది అంటే, ఈ సినిమా చూడాల్సిందే. ఇటువంటి అద్బుతమైన పాటని ఇచ్చిన అందరు అమరులు.
ఈ సినిమాలో అన్ని పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడతాయి. మనస తుళ్ళి పడకే అన్న పాట వేటూరి గారి కలంనుంచి జారువాలిన ఇంకో ఆణి ముత్యం. వీలున్నప్పుడు ఆ పాటని కూడా ఒకసారి విరించాలనే కోరిక. ఎప్పుడైనా కుదురుతుంది అని ఆశిస్తున్న.
Other Songs in this movie
  1. Lipileni Kanti Baasa (Lyrics: Veturi Sundararama Murthy; Singers: S. P. Balasubramanyam and S. Janaki)
  2. Manasa Thullipadake (Lyrics: Veturi; Singer: S. Janaki)
  3. Pelladu Pelladu (Lyrics: Veturi; Singers: S. P. Balasubramanyam and S. P. Sailaja)
  4. Raghuvamsa Sudha (Lyrics: Veturi; Singers: S.P. Sailaja and S. P. Balasubramanyam)
  5. Sarigamapadani (Lyrics: Veturi; Singer: S. P. Balasubramanyam)

1 comment:

  1. ఎంతో చక్కగా చెప్పారు.అద్బుతమయిన పాట !! జానకమ్మ , వేటూరి గారు , రమేష్ నాయుడు గారు ,జంధ్యాల గారు కలిసి చిలికిన అమృతం :)

    ReplyDelete